సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురువారం తొలిసారి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్‌ను రూ. 2,91,159 కోట్లుగా ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర అప్పు 6 లక్షల 71 వేల 757 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 35,118 కోట్ల అప్పు తీసుకోగా , రూ. 42 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు.
రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు భారీగా రూ. 10 వేల కోట్లు కేటాయించారు. ఇందులో మెట్రో వాటర్ వర్స్ కోసం రూ. 3,385 కోట్లు, జీహెచ్‌ఎంసీకి రూ. 3,065కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు.
పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, శంషాబాద్ విమానాశ్రయం కోసం రూ. 100 కోట్లు, హెచ్‌ఎండీేఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు. మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఎంఎంటీఎస్ రూ. 50 కోట్లు కేటాయించారు.
ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌ను మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట వేశామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోందని, అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment