‘నో అబ్జెక్షన్’ తిప్పలు
మురళీనగర్ చెందిన ఓ యువకుడికి ఇటీవల ఎల్‌అండ్‌టీ కంపెనీలో సూపర్‌వైజర్ ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులందరూ సంబరపడ్డారు. కంపెనీవారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురమ్మన్నారు. రెండు నెలలుగా మీసేవ, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగినా నిరాశ ఎదురైంది. దీంతో ఉద్యోగం పోయింది.
తాటిచెట్లపాలేనికి చెందిన యువకుడు ఐటీఐ పూర్తి చేశాడు. ఇటీవల ఉపాధి శిక్షణకు ఎంపికయ్యాడు. ఆరు నెలల కోర్సు. శిక్షణ అనంతరం వారే ఉద్యోగం కల్పిస్తారు. ఎంతో సంతోషపడిన అతడికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ రూపంలో నిరాశ ఎదురైంది. మీసేవ, పోలీస్‌స్టేషన్, స్పెషల్ బ్రాంచి పోలీసులను కలిసినా ప్రయోజనం లేకపోయింది
నేడు యువతను పీడిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఎప్పుడో తీసే ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీత మైన పోటీ. దీంతో చిన్నో పెద్దో ప్రైైవేట్ ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్రెంటిస్, ప్రైవేట్ పరిశ్రమలు, సంస్థల్లో స్టయిఫండ్‌తో కూడిన శిక్షణ, చిన్న తరహా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. అ యితే అప్రెంటిస్, ఉపాధి లభించిన వారికి భంగపాటు తప్పడం లేదు. అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఓసీ) లేదా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పక సమర్పించాలని ఆంక్షలు విధించడంతో ఖంగుతింటున్నారు. పోలీస్‌స్టేషన్లలో సర్టిఫికెట్లు లభ్యం కాకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
నిలిచిన సేవలు
గతంలో పోలీస్‌స్టేషన్ హౌస్ అధికారి సంతకంతో క్లియరెన్స్ సర్టిఫికెట్ మంజూరు చేసేవారు. గతేడాది ఆగస్టు నుంచి సర్టిఫికెట్ మం జూరులో ఆంక్షలు విధించారు. సేవలు మీ-సేవకు అప్పగించారు. మీ-సేవ నుంచి చేరిన దరఖాస్తులు కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం పరిశీలించేది. అక్కడి నుంచి అభ్యర్థి వివరాల పరిశీలన కోసం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందేది. దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు వాస్తవం అని తేలితే సర్టిఫికెట్ మంజూరయ్యేది. గతేడాది డిసెంబర్ నుంచి మీ-సేవలో ఈ సేవలకు బ్రేకులు పడ్డాయి. సర్టిఫికెట్ల బాధ్యత స్పెషల్ బ్రాంచి పోలీసులకు అప్పగించారు. జనవరి నుంచి స్పెషల్ బ్రాంచి ద్వారా సేవలు లభించడం లేదు.
కమిషనర్ చొరవ చూపాలి
క్లియరెన్స్ సర్టిఫికెట్ల విషయంలో నగర పోలీస్ కమిషనర్ చొరవ చూపాలని నిరుద్యోగులు కోరుతున్నారు. చేతికి అందివచ్చిన ఉపాధి అవకాశాలు చేజారిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. పోలీస్ సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగాల్లో చేర్చుకోవడం లేదని వాపోతున్నారు. రోజు పదుల సంఖ్యలో నిరుద్యోగులు సర్టిఫికెట్ కోసం స్థానిక పోలీస్‌స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కమిషనర్ ఆదేశాలు లేకుండా సర్టిఫికెట్ ఇచ్చే అధికారం తమకు లేదని ఓ పోలీస్ అధికారి చెప్పారు.