govt jobs
-
ఒక గృహిణి.. 4 సర్కారీ నౌకరిలు
చేవెళ్ల /మొయినాబాద్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగ సాధన కత్తిమీద సాము లాంటిదే. కానీ పట్టుదలకు శ్రమ తోడైతే సాధించలేనిది ఏదీ లేదని పలువురు నిరూపిస్తున్నారు. మొయినాబాద్ మండలం చిలుకూరుకు చెందిన గడ్డం సౌమ్యారెడ్డి ఏడాది కాలంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకుంది. గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎల్‌తో పాటు గత బుధవారం విడుదలైన ఫలితాల్లో గెజిటెడ్ హోదా కలిగిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై ంది. 2014లో వివాహం జరిగిన అనంతరం భర్త శ్రీధర్‌రెడ్డితో కలిసి చిలుకూరులో ఉంటూ డిగ్రీ, పీజీ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసింది. 2022లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల పోషణను చూసుకుంటూనే పట్టుదలగా చదివి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.ఉద్యోగం చేస్తూనే..చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన సుదర్శన్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2018లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన ఆయన.. ప్రస్తుతం గచ్చిబౌలి పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ ఫ్రొఫెసర్ కావాలనే తల లక్ష్యాన్ని మరవలేదు. జాబ్ చేస్తూనే చదువు కొనసాగిస్తూ 2022లో ఉస్మానియా యునివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నాడు. ఈక్రమంలో తెలంగాణ సాహితీవేత్తలు, హృదయ ఘోష, స్వాతంత్య్ర సమరయోధుడు అడ్డూరి అయోధ్య రామయ్య అనే పుస్తకాలు రచనలు చేశాడు. గెజిటెడ్ అధికారిగా ఎదగాలనే ఆలోచనతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసిన జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాసి, జేఎల్‌గా ఎంపికయ్యాడు. సామాన్య పేద కుటుంబానికి చెందిన తనను తల్లిదండ్రులు జంగమ్మ, పర్మయ్య చాలా కష్టపడి చదివించారని తెలిపాడు. లెక్చరర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉందని, ప్రొఫెసర్ కావాలనే తన కల సాకారానికి మొదటి అడుగు పడిందని చెప్పాడు. -
CJI DY Chandrachud: అర్హతా ప్రమాణాలను మధ్యలో మార్చలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో అర్హతా ప్రమాణాలు మార్చడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ మధ్యలో అవసరాన్నిబట్టి నిబంధనల్లో మార్పులు చేస్తామని ముందుగా సమాచారం ఇవ్వకుండా నిబంధనలను మార్చకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. గురువారం తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసును జడ్జీలు సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హృషీకేశ్‌రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. రాజస్థాన్ హైకోర్టు 2007 సెప్టెంబర్ 17వ తేదీన 13 అనువాదకుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. తొలుత ముందుగా రాత పరీక్ష నిర్వహి స్తామని, అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేపట్టడం ద్వారా నియామక ప్రక్రియ ముగుస్తుందని పేర్కొంది. ఆ పరీక్షకు మొత్తం 21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో మూడు ఉద్యోగా లకు ముగ్గురిని ఎంపిక చేశారు. కనీసం 75 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులనే ఉద్యోగాలకు ఎంపిక చేశామని హైకోర్టు తన ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే నోటిఫికేషన్లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే విషయాన్ని స్పష్టంచేయలేదు. నిబంధనలు సవరించిన తర్వాత ఆ ముగ్గురిని మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేశారని మిగతా అభ్యర్థులు ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందంటూ బాధిత అభ్యర్థులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2010 మార్చిలో ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు గత ఏడాది జూలై 18వ తేదీన తీర్పును రిజర్వ్‌చేసి గురువారం వెలువరిచింది. ‘‘ ఏదైనా నియామక ప్రక్రియ అనేది దరఖాస్తుల స్వీకరణకు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ప్రకటనతో మొదలవుతుంది. పోస్టుల భర్తీతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో నియమాలను మార్చడానికి వీల్లేదు. ఒకవేళ మార్చాల్సి వస్తే నోటిఫికేషన్ వెలువ డటానికి ముందే మార్చాలి. లేదంటే మధ్యలో మార్చాల్సి రావొచ్చేమో అని విషయాన్ని నోటిఫికేషన్లోనే ప్రస్తావించాలి. అలాంటివేవీ చెప్పకుండా హఠాత్తుగా అభ్యర్థులను హుతాశులను చేసేలా ఆట నియమాలను మార్చొద్దు. ఒకవేళ మారిస్తే అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను, వివాదాలను తట్టుకుని నిలబడగలగాలి’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన పాత ‘‘ కె మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు’ తీర్పును కోర్టు సమర్థించింది. దీంతోపాటు సుభాష్‌చంద్ మార్వా కేసునూ కోర్టు ప్రస్తావించింది. ‘‘ సెలక్ట్ జాబితా నుంచి ఉద్యోగుల ఎంపికను మార్వా కేసు స్పష్టంచేస్తే, సెలక్ట్ జాబితాలోకి ఎలా చేర్చాలనే అంశాలను మంజుశ్రీ కేసు వివరిస్తోంది’’ అని పేర్కొంది. -
పల్లెల్లో సర్కారీ కొలువులపై అనాసక్తి.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: సర్కారీ ఉద్యోగం వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కొందరు అభ్యర్థులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. టీజీపీఎస్సీ ద్వారా రాష్ట్ర నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా 687 మంది ఎంపిక కాగా, 674 మంది మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన 13 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు దూరంగా ఉండటం ద్వారా ఉద్యోగావకాశాన్ని వదులుకున్నారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఈ నెల 25 నాటికి పోస్టింగ్ పొందిన చోట రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా, మంగళవారం నాటికి కేవలం 310 మంది మాత్రమే రిపోర్టు చేశారు. గత నెల 26న నియామక పత్రాలు అందజేయగా, రిపోర్టు చేయడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలున్నాయి. యువ ఇంజనీర్లకు తొలి పోస్టింగ్‌ను గ్రామీణ ప్రాంతాల్లోనే ఇస్తామని, ఎలాంటి ఒత్తిళ్లను తీసుకురావద్దని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారికి పోస్టింగ్ ఇచ్చే సమయంలో స్పష్టం చేశారు. హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ పరిధిలో 10 మంది ఏఈఈలకు పోస్టింగ్ ఇస్తే ఇప్పటికి 9 మంది రిపోర్టు చేశారు. మహబూబ్‌నగర్ సీఈకి 48 మందిని కేటాయిస్తే కేవలం 8 మంది, నల్లగొండ సీఈకి 76 మందిని కేటాయిస్తే 49 మంది, సూర్యాపేట సీఈకి 32 మందిని కేటాయిస్తే కేవలం ఇద్దరు, ఆదిలాబాద్ సీఈకి 24 మందిని కేటాయిస్తే 15 మంది, వనపర్తి సీఈకి 53 మందిని కేటాయిస్తే 16 మంది, వరంగల్ సీఈకి 30 మందిని కేటాయిస్తే ఏడుగురు, గజ్వేల్ సీఈకి 72 మందిని కేటాయిస్తే 12 మంది, కరీంనగర్ సీఈకి 45 మందిని కేటాయిస్తే 14 మంది మాత్రమే ఇప్పటి వరకు విధుల్లో చేరారు.చదవండి: మొక్కుబడిగా వాహనాల స్క్రాప్ పాలసీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ సారూ!నియామక పత్రాలు పొందిన 674 మందిలో 10 మంది ఐఐటీ డిగ్రీ, 21 మంది ఐఐటీ పీజీ, 50 మంది ఎన్ఐటీ డిగ్రీ, 33 మంది ఎన్ఐటీ పీజీ చేసిన వారున్నారు. మొత్తం 114 మంది ఐఐటీ, ఎన్ఐటీ ఇంజనీర్లు ఉండగా, వీరిలో అధిక శాతం సర్కారీ కొలువుల్లో చేరేందుకు ఆసక్తి చూపకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
ఏపీ నిట్‌లో 125 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఉద్యోగాల జాతర త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. అర్హులైనవారు అక్టోబరు 10లోపు దరఖాస్తులు సమర్పించాలి. కేంద్ర ఉన్నత విద్యా శాఖ విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన ఆమోదాలు, పరిపాలనా పరమైన ఆమోదాలు దాటి ఫ్యాకల్టీల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–10కు సంబంధించి 48 పోస్టులను భర్తీ కానున్నాయి. వీటిలో అన్ రిజర్వ్డ్ కోటాలో 20, ఓబీసీలకు 13, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, ఈడబ్ల్యూఎస్ కింద 5 కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–11కు సంబంధించి భర్తీ చేయనున్న 20 పోస్టుల్లో అన్ రిజర్వ్‌డ్‌కు 9, ఓబీసీకి 5, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒకటి, ఈడబ్ల్యూఎస్‌కు 2 పోస్టులు కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్–13 ఏ2 కేటగిరీకి సంబంధించి 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అన్ రిజర్వ్‌డ్‌కు 12, ఓబీసీకి 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్‌కు 3 పోస్టులను కేటాయించారు. ప్రొఫెసర్ 14ఏ గ్రేడ్‌కు సంబంధించి 7 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో అన్ రిజర్వుడ్‌కు 4, ఓబీసీకి ఒకటి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి పోస్టులను రిజర్వు చేశారు. బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, ఎంఎంఈ, స్కూల్ ఆఫ్ సైన్సెస్, ఫిజిక్స్, మ్యా«థ్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ విభాగాల్లో కొత్తగా తీసుకొనే ఫ్యాకల్టీలను నియమించనున్నారు. -
‘లాటరల్ ఎంట్రీ’ బహుజనులపై దాడే కేంద్రంపై రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులను లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా ఎంపిక చేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు, ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ తదితరుల నుంచి రిజర్వేషన్లను లాక్కుని ఆర్ఎస్ఎస్ వాదులతో నింపేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ఆయన సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని నాశనం చేయడం, బహుజనులకు రిజర్వేషన్లు లేకుండా చేయడం ద్వారా బీజేపీ దేశాన్ని తనదైన శైలిలో రామరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లాటరల్ ఎంట్రీ విధానం అమలును ఆయన జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులను స్పెషలిస్టుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులతో లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా భర్తీ చేసేందుకు యూపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌పై రాహుల్ ఇలా స్పందించారు.ప్రభుత్వోద్యోగాల్లో కోటా ఉండాల్సిందే: చిరాగ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్) చీఫ్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కుండబద్దలు కొట్టారు. లాటరల్ ఎంట్రీ విధానం అమలుపై కేంద్రంతో మాట్లాడతానన్నారు. ‘ప్రభుత్వ నియామకమేదైనా సరే రిజర్వేషన్ నిబంధనలను అమలు చేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావుండరాదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు. ప్రభుత్వం కూడా రిజర్వేషన్లను అమలు చేయకుంటే ఎలా? లాటరల్ ఎంట్రీ విషయం ఆదివారం నా దృష్టికి వచ్చింది. ఇది చాలా తీవ్రమైంది. దీనికి మేం అంగీకరించం. ప్రభుత్వంలో భాగస్వామిగా ఈ అంశాన్ని లేవనెత్తుతా’అని అన్నారు. -
కూటమి సర్కార్ కొత్త కుట్ర పేదలపై పెత్తనం
-
పేదరికాన్ని జయించి.. ప్రభుత్వ కొలువులు సాధించి..
పేదరికం.. చదువుకు అడ్డుకాదని నిరూపించారు. విద్యే ఆయుధంగా చేసుకొని జీవితంపై పోరాడారు. చదువులు పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమై ముగ్గురు కూడా.. ఒకరి తర్వాత మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారే హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్. తండ్రి హమాలీ కారి్మకుడిగా పడిన కష్టానికి న్యాయం చేకూర్చారు. పట్టణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హుస్నాబాద్: పట్టణానికి చెందిన చేర్యాల మైసయ్య, స్వరూప దంపతులు. వీరికి రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్ సంతానం. పెద్ద కుమారుడు రాజ్‌కుమార్ అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. కూతురు శ్వేత గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది. చిన్న కుమారుడు శ్రీకాంత్ నెల రోజుల క్రితం ఫైర్‌స్టేషన్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కాల్ లెటర్ రాగానే జూలైలో ఫైర్ కానిస్టేబుల్‌గా శిక్షణ పొందనున్నాడు. తండ్రి మైసయ్య రోజు వారి హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సంకలి్పంచారు. భవిష్యత్‌లో తన పిల్లలు ఉన్నతమైన స్ధానంలో ఉండాలని ఆకాంక్షించారు. కష్టాన్ని పంటి కింద భరిస్తూనే కూలీ పనులు చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించారు. అనంతరం ఉద్యోగులు సాధించాలని భావించాడు. తండ్రి కష్టాన్ని చూసిన వారు కూడా ఆయన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. -
సంచలనం.. 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
Layoffs in Argentina: ప్రైవేట్ కంపెనీల్లో గత కొన్ని నెలలుగా లేఆఫ్‌ల గురించి వింటున్నాం. ముఖ్యంగా ఐటీ సంస్థలు లేఆఫ్‌ల పేరుతో వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం సంచలంగా మారింది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే నెలల్లో 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దూకుడు వ్యూహాన్ని ప్రదర్శించారు. ఈ తొలగింపులు అర్జెంటీనాలోని 35 లక్షల మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే తక్కవే అయినప్పటికీ కార్మిక సంఘాల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదరుకావచ్చిన భావిస్తున్నారు. అర్జెంటీనా దేశంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం మార్చి 31తో ముగియనుంది. గతేడాదే కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అన్యాయమైన తొలగింపులను సహించబోమని యూనియన్ నాయకులు హెచ్చరించారు. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. BREAKING: Bloomberg reports that Argentina's President Javier Milei is planning to fire 70,000 government workers — The Spectator Index (@spectatorindex) March 27, 2024 -
వాచ్‌మెన్‌గా ఉంటూనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు పట్టేశాడు!
మనం ఎక్కడినుంచి వచ్చాం.. మన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది కాదు.. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించామా లేదా అన్నదే ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో వాచ్‌మెన్‌గా పనిచేస్తూనే లక్ష్యం వైపు గురి పెట్టాడు. పేదరికం ప్రతిభకు ఆటంకం కాదని నిరూపించాడు మంచిర్యాల జిల్లాకు చెందిన గొల్లె ప్రవీణ్. ప్రభుత్వ ఉద్యోగమనే కలను నెరవేర్చుకోవడం, మరో వైపు కుటుంబానికి భారం కాకుండా స్వయం ఉపాధి పొందడం ఇదే ప్రవీణ్ కళ్ల ముందున్న లక్ష్యాలు. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రిసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ)లో నైట్ వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. రాత్రి సమయంలో వాచ్‌మేన్‌గా పని చేస్తూ పగలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాడు. ఎట్టకేలకు అతని కష్టం ఫలించింది. కేవలం పదిరోజుల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. ప్రవీణ్ టీజీటీ, పీజీటీ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను సాధించాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తనలాంటి ఎందోమంది కొత్త ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. కాగా ప్రవీణ్ తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పని చేస్తుండగా ప్రవీణ్ తండ్రి పెద్దులు రోజుకూలీగా పనిచేస్తున్నారు. -
మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మహిళలకు హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పాయింట్ల పట్టికలో ఎలాంటి ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 (33.3) శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గతంలో జీఓ ఎంఎస్ 3ను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఉద్యోగాల భర్తీ క్రమంలో నిర్దేశించిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేనిపక్షంలో వాటిని క్యారీఫార్వర్డ్ చేసే పద్ధతి (ఖాళీని అలాగే ఉంచడం) ఇకపై ఉండబోదు. దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996 లోని రూల్ 22, 22ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది. తాజా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు 33.3 శాతం రిజర్వు చేస్తున్నప్పటికీ.. కమ్యూనిటీ రిజర్వేషన్ల కేటగిరీల్లో అర్హులైన మహిళా అభ్యర్థులు లేనప్పుడు ఆయా ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓఎంఎస్ 35 జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, ఉద్యోగ నియామక సంస్థలైన టీఎస్పీఎస్సీతో పా టు ఇతర బోర్డులకు పంపించారు. దీంతో ఏదైనా నోటిఫికేషన్లో నిర్దేశించిన అన్ని ఖాళీలను అదే సమయంలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు లేని సందర్భంలో, అదే కమ్యూనిటీకి చెందిన పురుషులతో భర్తీ చేయ డం వల్ల పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉత్పన్నం కాదు. మహిళలకు నిర్దేశించిన పోస్టులు పురుషులతో భర్తీ చేస్తే... మహిళలకు దక్కాల్సిన 33.3% దక్కకుండా పోతాయనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నియామకాల ప్రక్రియలో దీర్ఘకాలికంగా ప రిస్థితిని పరిశీలిస్తే మహిళలకు అతి తక్కువ సంఖ్య లో పోస్టులు దక్కుతాయనే వాదన వినిపిస్తోంది. -
గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్ కావాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసినా.. బాలికలు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 26 రాష్ట్రాల్లో సర్వే చేసి.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతున్నవారితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవసాయం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది. లెక్కలు, ఇంగ్లిష్‌లో వెనుకబాటు తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే. ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు ‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ -
ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా.. బెస్ట్ ఫ్యాక్టలీతో కోచింగ్
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం డిసెంబర్లో వచ్చిన SI of Police నోటిఫికేషన్‌కి సంబంధించిన ప్రాథమిక పరీక్షను పూర్తి చేసుకున్న ఎస్సై అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్ష(PT)లకు సన్నద్దమౌతున్నారు. అలాగే, త్వరలోనే ఈ దేహదారుఢ్య పరీక్షలు(PT) ప్రారంభం కానున్నాయి. ఎస్సై ఫైనల్ పరీక్షలు కూడా అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్నారు. కావున ఎస్సైకి పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) ఆధ్వర్యంలో.. ప్రీమియర్ అకాడమీ సంస్థకు చెందిన బెస్ట్ ఫ్యాకల్టీతో కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ క్లాసులు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వారి ఆధ్యర్యంలో నిర్వహించనున్నారు. ఉద్యోగం వచ్చే వరకు.. క్లాసులో పరిమితి సంఖ్యలో విద్యార్థులతో.. ప్రతి విద్యార్థిపైన ప్రత్యేక ఫోకస్ పెడుతూ.. ఉద్యోగం వచ్చే వరకు బాధ్యత వహిస్తూ.. SSC, RRB, Bank, Police పరీక్షల్లో కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా.. ఇప్పుడే అభ్యర్థులు 9000096096 ఫోన్ నెంబర్‌ను సంప్రదించండి.. అలాగే CH V Subrahmanyam, Director, PREMIER ACADEMY, 2 /1, BRODIPET, GUNTUR అడ్రస్ కు మీరు డైరెక్ట్‌గా వచ్చి సంప్రదించండి. ఇది కూడా చదవండి: జేఈఈ–2024కి ఎన్నికల గండం! -
సీఎం మమత కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వం ఉద్యోగం!
కోల్కత్తా: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో దాదాపు 275 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వివరాల ప్రకారం.. ఒడిషా రైలు ప్రమాదంలో బెంగాల్‌కు చెందిన ప్రయాణీకులు ఎక్కువ సంఖ్యలో మరణించడంతో పాటుగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం మమత సోమవారం మాట్లాడుతూ.. ప్రస్తుతం బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారు. వీరంతా ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇక, బాధితుల్లో 33 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారంతా కటక్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే, రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదు సాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం భువనేశ్వర్, కటక్ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నట్టు మమత స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సీఎం మమతతో పాటుగా మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు తనతో పాటుగా వస్తున్నారని తెలిపారు. బుధవారం బాధిత కుటుంబాలను కలిసి ఎక్స్‌గ్రేషియో చెక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సైతం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే రైలు ప్రమాదం గురించి మరోసారి స్పందించారు. ఈ ప్రమాదం గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదన్నారు. అలాగే, గతంలో జరిగిన రైలు దుర్ఘటనలపై సీబీఐ విచారణ సందర్భాలను మమత గుర్తు చేశారు. వీటిపై ఏళ్లు గడిచినా ఎలాంటి ఫలితం రాలేదన్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్ సత్వరమే అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, రైలు ప్రమాద ఘటనపై కేంద్రం సీబీఐ విచారణ చేపట్టినట్ట విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్ చివరి మాటలు.. -
గుడ్‌న్యూస్..కేంద్రంలో దాదాపు 10 లక్షల ఉద్యోగ ఖాళీలు!
న్యూఢిల్లీ: కేంద్రంలో పలు విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని ప్రభుత్వం బుధవారం తెలిపింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘2021 మార్చి 1 నాటికి అన్ని శాఖలు, విభాగాలు, సంస్థల్లో 9.79 లక్షలకుపైగా ఖాళీలున్నాయి. రైల్వేశాఖలోనే 2.93 లక్షలున్నాయి. రక్షణ శాఖలో 2.64 లక్షలు, హోం శాఖలో 1.43 లక్షలు, రెవెన్యూలో 80,243, ఆడిట్–అకౌంట్ విభాగంలో 25,934, అణు ఇంధన శాఖలో 9,460 ఖాళీలున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించాం’’ అన్నారు. -
'శిక్షణ' కాలం.. సర్కారు కొలువుల కోసం సిద్ధమవుతున్న యువత
సాక్షి, హైదరాబాద్: వరుసగా ప్రభుత్వ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు వెలువడటం, మరికొన్ని పోస్టులకూ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఇటీవలే డిగ్రీ పూర్తిచేసిన వారి నుంచి ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారిదాకా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా జాబ్ కొట్టాలన్న లక్ష్యంతో వ్యక్తిగతంగా సిద్ధమవడం కంటే కోచింగ్ సెంటర్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో తెరిచిన చిన్నపాటి శిక్షణ కేంద్రాలు మొదలు.. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత కోచింగ్ సెంటర్ల దాకా అన్నీ అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. కొందరు నిర్దిష్ట సబ్జెక్టులను ఎంచుకుని శిక్షణ తీసుకుంటుండగా.. మరికొందరు ప్యాకేజీ రూపంలో అన్నిరకాల కోచింగ్ పొందుతున్నారు. ఈ అవసరాలను గుర్తిస్తున్న కోచింగ్ సెంటర్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆదరాబాదరాగా తరగతులు.. చాలాచోట్ల గ్రూప్–1 మెయిన్స్ శిక్షణ ఇప్పటికే ప్రారంభమైంది. మా ఇన్స్టిట్యూట్లో దాదాపు 40 శాతం సిలబస్ పూర్తిచేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. వాస్తవానికి వేగంగా సిలబస్ పూర్తి చేయాలన్న తొందర కోచింగ్ సెంటర్ నిర్వాహ కుల్లో కనిపిస్తోంది. ఆదరాబాదరాగా సిలబస్ పూర్తి చేస్తున్నట్టు అనిపిస్తోంది. పరీక్షలు ప్రారంభమయ్యే వరకు శిక్షణ ఇస్తామని, రివిజన్ కూడా ఉంటుందని అంటున్నారు. – పి.అనూష,గ్రూప్–1 మెయిన్స్ అభ్యర్థి లోతైన అవగాహన అవసరం గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు ప్రత్యేక కోచింగ్ ఏమీ తీసుకో లేదు. మెయిన్స్ కోసం వారం రోజులుగా శిక్షణ æకేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఫీజు అధికంగా చెప్తుండటంతో కాస్త ఆలోచనలో పడ్డాను. రెండు సబ్జెక్టులకు నిపుణుల వద్ద శిక్షణ తీసుకుంటున్నా.. పూర్తిస్థాయి శిక్షణకు కోచింగ్ కేంద్రాల కోసం చూ స్తున్నాను. చాలాచోట్ల లోతైన అవగాహన లేకుండా సాధారణ పద్ధతిలోనే శిక్షణ ఇస్తుండగా.. కొన్నిచోట్ల అంశాలను వివరిస్తూ చదువుకోవాలని సూచిస్తు న్నారు. ఏ విధానం సరైనదో అర్థంగాక గందరగోళంగా ఉంది. – షెహనాజ్, గ్రూప్–1 మెయిన్స్ అభ్యర్థి ఎక్కువగా గ్రూప్–1 అభ్యర్థులు ప్రస్తుతం గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్.. మెయిన్స్ పరీక్షలకు 25 వేల మందిని ఎంపిక చేసింది. ఈ అభ్యర్థుల్లో 65 శాతం మంది కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నట్టు అంచనా. గ్రూప్–1 మెయిన్స్ శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లు సగటున రూ.50 వేల ఫీజు వసూలు చేస్తున్నాయి. ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లలో ఈ ఫీజు మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అడ్మిషన్లు పూర్తిచేసి శిక్షణ మొదలుపెట్టిన మెజారిటీ కోచింగ్ సెంటర్లు.. కొత్తగా అడ్మిషన్లు తీసుకోవడం లేదు. కొన్నిచోట్ల ఇంగ్లిష్ మీడియం శిక్షణ ప్రారంభిస్తామని చెప్తున్నప్పటికీ స్పష్టత లేదని అభ్యర్థులు అంటున్నారు. కొన్ని సెంటర్లు ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్లైన్ శిక్షణకు అనుమతిస్తున్నాయి. మెటీరియల్ కోసమూ ఖర్చు మరోవైపు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా చాలా కోచింగ్ సెంటర్లు ఎలాంటి స్టడీ మెటీరియల్ ఇవ్వడం లేదు. దీనితో అభ్యర్థులు బయటే కొనుక్కోవాల్సి వస్తోంది. గ్రూప్–1 మెయిన్స్ మెటీరియల్ కోసం ఒక్కో అభ్యర్థి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేస్తుండగా.. గ్రూప్–2, ఇతర పరీక్షల మెటీరియల్ కోసం రూ.10 వేల నుంచి రూ.18వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదనంగా నోట్స్ కోసం మరో రూ.5 వేల వరకు వ్యయం అవుతోంది. సబ్జెక్టుల వారీ శిక్షణకూ డిమాండ్ గ్రూప్–2, గ్రూప్–3 కేటగిరీల్లో 2వేలకుపైగా ఉద్యోగ ఖాళీలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్–4 కేటగిరీలో అయితే 8 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో గ్రూప్–2కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు గ్రూప్–3తో పాటు గ్రూప్–4 కొలువులకూ కోచింగ్ తీసుకుంటున్నారు. ఒకే తరహా సిలబస్ అన్నింటికీ వర్తించనుండటమే దీనికి కారణం. ప్రధాన శిక్షణ కేంద్రాలు కూడా గ్రూప్–2 శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. గ్రూప్–2 శిక్షణలో అన్ని సబ్జెక్టులకు ప్యాకేజీ రూపంలో సగటున రూ.25 వేల మేర ఫీజు వసూలు చేస్తుండగా.. కొన్నిచోట్ల రూ.30–40 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫీజులు ఎక్కువగా ఉండటంతో కొందరు అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా శిక్షణ తీసుకుంటున్నారు. ప్రధాన కేంద్రాలు మినహా మిగతాచోట్ల ఇలా సబ్జెక్టు వారీ శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. చదవండి: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం! -
పండుగ నాటికి 12,000 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో భాగంగా ఇప్పుడు గురుకుల కొలు వులకు సమయం ఆసన్నమైంది. గత నెల రోజు లుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంహెచ్ఎస్ ఆర్బీ) ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక టనలు జారీ అయ్యాయి. ఉద్యోగాల భర్తీకి రాష్ట్రంలో నాలుగు ప్రధాన నియామక సంస్థలుండగా.. మూడు సంస్థల ద్వారా నోటిఫికేషన్లు వెలువ డ్డాయి. కానీ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. వాస్తవానికి 9 వేల కొలువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల అనుమతులు జారీ చేసింది. దీంతో సంబంధిత గురుకుల సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో వాటికి శాశ్వత ప్రాతిపదికన పోస్టులు మంజూరయ్యాయి. దీంతో వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇస్తే ఒకేసారి ప్రకటనలు విడుదల చేయవచ్చని గురుకుల నియామకాల బోర్డు సూచించింది. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా మంజూరైన పోస్టులకు ప్రభుత్వ అనుమతులు రావడంలో ఇప్పటివరకు జాప్యం నెలకొంది. దీంతో కొలువుల ప్రకటనల జారీ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఆనుమతులు దాదాపుగా వచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగ ప్రకటనల జారీకి టీఆర్‌ఈఐఆర్‌బీ కసరత్తు వేగవంతం చేసింది. పండుగ నాటికి ప్రకటనల జారీ.. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుక బడిన తరగతులు సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో 9,096 కొలువుల భర్తీకి ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపింది. తాజాగా బీసీ గురుకులాల్లో మరో 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో దాదాపు 69 కేటగిరీలకు చెందిన కొలువులున్నాయి. ఈ పోస్టుల భర్తీకిగాను గురు కుల సొసైటీలు జోనల్, మల్టీజోనల్, జిల్లా కేడర్లు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు తదితర పూర్తిస్థాయి సమాచారంతో రూపొందించిన ప్రతిపాదనలను గురుకుల నియామకాల బోర్డుకు సమర్పించాయి. బోర్డు అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకు న్నాక ప్రకటనలు జారీ చేయనున్నట్లు అధికా రులు చెబుతున్నారు. పరిశీలన ప్రక్రియతో పాటు బీసీ గురుకుల సొసైటీకి సంబంధించిన కొన్ని పోస్టులకు పూర్తిస్థాయి అనుమతులు జారీ అయ్యేందుకు మరో రెండ్రోజుల సమయం పడుతుందని సొసైటీ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న వారం, పది రోజుల్లో అంటే సంక్రాంతి పండుగ నాటి కల్లా టీఆర్‌ఈఐఆర్‌బీ నుంచి ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని గ్రూప్–4 ఉద్యోగాల భర్తీపై గందరగోళం మరింత పెరిగింది. ప్రకటించిన తేదీనాటికి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఆందోళనలో ఉన్న అభ్యర్థులకు.. డిసెంబర్ 30న అర్ధరాత్రి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో పెట్టిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటం అయోమయంగా మారింది. నిజానికి డిసెంబర్ ఒకటిన టీఎస్పీఎస్సీ 9,168 గ్రూప్–4 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కానీ 8,039 పోస్టులతోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. వాయిదాతో గందరగోళం మొదలై..: టీఎస్పీఎస్సీ డిసెంబర్ ఒకటిన శాఖల వారీగా ఖాళీలను ప్రకటించింది. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలతో డిసెంబర్ 23న పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని తెలిపింది. కానీ ఆ రోజున పూర్తిస్థాయి నోటిఫికేషన్ రాలేదు. దరఖాస్తుల స్వీకరణ చేపట్టలేదు. మరోవైపు ఇతర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల అవుతూ వచ్చాయి. దీనితో అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది. టీఎస్పీఎస్సీ 30న అర్ధరాత్రి దాటాక 8,039 ఖాళీలతో పూర్తి నోటిఫికేషన్‌ను వెబ్సైట్లో పెట్టి.. దరఖాస్తుల నమోదు ఆప్షన్‌ను ఇచ్చింది. పంచాయతీరాజ్‌లో తగ్గిన పోస్టులు: టీఎస్పీఎస్సీ వెబ్‌నోట్‌లో ప్రకటించిన పోస్టులతో పోలిస్తే ఇప్పుడు 1,129 ఉద్యోగాలు తగ్గిపోయాయి. కొన్ని విభాగాల పోస్టుల సంఖ్యలో స్వల్పంగా మార్పులు జరిగినా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఏకంగా 1,208 పోస్టులు తగ్గాయి. వాస్తవానికి గతేడాది సీఎం అసెంబ్లీలో వెల్లడించిన జాబితా ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో 1,245 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్లో ఈ శాఖలో 37 పోస్టులు మాత్రమే చూపారు. మొత్తంగా 1,129 కొలువులు తగ్గాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన సమాచారం, రోస్టర్ వివరాలు ఇవ్వకపోవడంతో టీఎస్పీఎస్సీ ఆ మేరకు పోస్టులు తగ్గించి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. టీఎస్పీఎస్సీ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. చదవండి: TSPSC: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు -
TSPSC: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల కొనసాగుతూనే ఉంది. ఏడాది చివరిరోజైన శనివారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చింది. కళాశాల విద్య కమిషనరేట్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లతోపాటు ఇంటర్ విద్య విభాగంలో లైబ్రేరియన్ పోస్టులు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు, రవాణాశాఖ పరిధిలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కొలువులకు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది. ఇందులో అన్నిపోస్టులకు దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యే తేదీలను కమిషన్ ప్రకటించింది. ఏఎంవీఐ పోస్టులకు ఏప్రిల్ 23న పరీక్ష ఉంటుందని.. మిగతావాటికి త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. రవాణాశాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు.. రాష్ట్ర రవాణాశాఖ పరిధిలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మలీ్టజోన్–1 పరిధిలో 54, మల్టీజోన్–2 పరిధిలో 59 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 23న రాత పరీక్ష ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. వాస్తవానికి ఈ పోస్టులకు ఇదివరకే ప్రకటన జారీ చేసినా అభ్యర్థుల అర్హతల్లో మార్పులు చేయడంతో రద్దు చేశారు. తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేశారు. చదవండి: ఇదేమైనా బాహుబలి సినిమానా? -
10 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి: ప్రధాని మోదీ
గాంధీనగర్: దేశంలోని యువతకు 10 లక్షల ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. యువతకు ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు. రాబోయే నెలల్లో జాతీయ, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిల్లో మరిన్ని ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామన్నారు. గుజరాత్ ప్రభుత్వం శనివారం గాంధీనగర్‌లో ‘ఉద్యోగమేళా’ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపించారు. ధంతెరాస్ సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఉద్యోగమేళాలో 75 వేల మందికి నియామక పత్రాలను అందజేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. 2022లో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా సాధించిందని చెప్పారు. ఈ మేళా సందర్భంగా గుజరాత్ పంచాయతీ సర్వీస్ బోర్డు నుంచి 5 వేల మందికి, సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 8 వేల మందికి సీఎం భూపేంద్ర పటేల్ నియామక పత్రాలను అందజేశారు. చదవండి: గుజరాత్లో పంజాబ్ ఫార్ములాను ఫాలో అవుతున్న కేజ్రీవాల్.. -
ఎంఎల్‌హెచ్‌పీలకు జోన్–2లోనే ఎక్కువ ఖాళీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో సేవలు అందించడానికిగాను 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 9 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోన్న క్రమంలో 4 జోన్ల వారీగా ఖాళీలను వైద్య శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాలను కవర్ చేసే జోన్–2లో 643 బ్యాక్లాగ్, 15 జనరల్ ఖాళీలు కలిపి 658 పోస్టులు భర్తీ చేయనుంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కవర్ చేసే జోన్–3లో 452 బ్యాక్లాగ్, 42 జనరల్ ఖాళీలు కలిపి 494 ఖాళీలున్నాయి. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూల్ జిల్లాలతో కూడిన జోన్–4లో 245 బ్యాక్లాగ్, 51 జనరల్ ఖాళీలు కలిపి 296 పోస్టులున్నాయి. జోన్–1లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 222 బ్యాక్లాగ్, 11 జనరల్ ఖాళీలతో కలిపి 233 పోస్టులున్నాయి. hmfw.ap.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు ఈ నెల 22 వరకు గడువు ఉంది. ఈ నెల 24 నుంచి 30 వరకు హాల్ టికెట్లు జారీ చేసి సెప్టెంబర్ మొదటి వారంలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీ హాల్‌టికెట్‌లో తెలియజేస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలుంటాయి. చదవండి: మునుపెన్నడూ ఇటు చూడని పారిశ్రామిక దిగ్గజాలు.. ఇప్పుడు ఏపీకీ వస్తున్నారు -
నిరుద్యోగులకు ప్రైవేటు కొలువులిప్పిస్తున్నాం
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలే నని, అందువల్ల నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కలిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం బీసీ స్టడీ సర్కిల్‌ను కేటీఆర్ సందర్శించి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లా ఆస్పత్రిలో పిల్లల వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ.. రాష్ట్రంలో తమ తొలి విడత ఐదేళ్ల పాలనలో 1.32లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, ప్రస్తుత రెండో దఫా పాలనలో 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో 35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ప్రధాని మోదీ కేవలం 10 లక్షల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగార్థులందరూ సెల్‌ఫోన్ పక్కనపెట్టి అంకితభావంతో చదివితే రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మరో 134 స్టడీసర్కిళ్లను సీఎం మంజూరు చేసినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతిభ ప్రాతిపదికనే ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అభ్యర్థులు అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ చోదకశక్తిగా ఎదిగింది.. తెలంగాణ తలసరి ఆదాయం, జీఎస్డీపీ రెట్టింపు అయిందని.. దేశాన్ని సాదుతున్న రాష్ట్రంగా, ఆర్థిక చోదకశక్తిగా ఎదుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉంటే.. ఇప్పుడు రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. ఇవి ఆర్బీఐ చెప్పిన లెక్కలని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లలో దేశానికి ట్యాక్సుల రూపంలో రూ.3,65,797 కోట్లు రాష్ట్రం నుంచి ఇచ్చామన్నారు. కేంద్రం నుంచి రూ.1,68,000 కోట్లు తిరిగి తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన కేంద్రం అడుగడుగునా వివక్ష చూపతోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి ప్రజాస్వామ్య వేదికపై గలమెత్తుతామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. -
కొలువు కొట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లు ముఖ్యంగా హైదరాబాద్‌లోని శిక్షణా కేంద్రాలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులతో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రముఖ కోచింగ్ సెంటర్లయితే కిక్కిరిసి పోయాయి. కొందరు ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్, సిటీ లైబ్రరీలతో పాటు రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో సరైన బోధనా సిబ్బంది లేరని, హాస్టల్ గదుల్లో కనీస సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. అయినా సరే.. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనుండటంతో, ఎలాగైనా ఉద్యోగం సాధించి తీరాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే..: గ్రూప్స్‌తో సహా దాదాపు 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభ్యర్థులు హైదరాబాద్‌లో మకాం వేశారు. కొంతమంది హాస్టళ్ళల్లో, ఇంకొంతమంది చిన్న చిన్న గదులు అద్దెకు తీసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే నగరంలో ఉండి సివిల్స్ కోసం శిక్షణ పొందుతున్న కొందరు అభ్యర్థులు పనిలో పనిగా గ్రూప్–1పై దృష్టి పెట్టారు. ఓ కోచింగ్ సెంటర్ అంచనా ప్రకారం గడచిన రెండు నెలల్లోనే దాదాపు 30 వేల మంది హైదరాబాద్‌కు కోచింగ్ కోసం వచ్చారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వెలువరిస్తే ఈ సంఖ్య రెట్టింపును మించిపోయే అవకాశముందని భావిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో శిక్షణ పొందేవారు వీరికి అదనం. ఇదే చివరి అవకాశం! ఎప్పుడో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. చిన్నా చితక ఉద్యోగాలు చేసే వాళ్ళు వాటిని మానేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వాళ్ళయితే సమయాన్ని ఏమాత్రం వృధా చేయడం లేదని ఓ కోచింగ్ సెంటర్లో మేథ్స్ బోధిస్తున్న ఫ్యాకల్టీ మెంబర్ సత్య ప్రకాశ్ తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయని ఆశిస్తున్న కొందరు నిరుద్యోగులు తిండి, నిద్రను కూడా పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. అభ్యర్థులకు వల హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా భావిస్తున్నారు. ఊళ్ళల్లో అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసిన కోచింగ్ సెంటర్లు హంగులు, ఆర్భాటాలు, ప్రచారంతో అభ్యర్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో దాదాపు వెయ్యికి పైగా గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం కోచింగ్ ఇచ్చే సెంటర్లు ఉన్నట్టు అంచనా. ఇందులో పేరెన్నికగల సెంటర్లు దాదాపు 50 వరకూ ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా హాస్టల్, అభ్యర్థులకు నెట్ సదుపాయం అందిస్తున్నాయి. మంచి ఫ్యాకల్టీని ముందే ఏర్పాటు చేసుకున్నాయి. మిగతా కోచింగ్ సెంటర్లు ప్రత్యేకంగా ఏజెంట్లను పెట్టుకుని అభ్యర్థులకు వల వేస్తున్నాయి. అభ్యర్థిని ఎలాగైనా ఒప్పించి, ఎంతో కొంత ఫీజు ముందే చెల్లించేలా చేస్తున్నాయి. ఆ తర్వాత ఫ్యాకల్టీ, వసతులు ఎలా ఉన్నా సర్దుకుపోవడం తప్ప గత్యంతరం ఉండటం లేదు. ప్రభుత్వ ప్రకటనకు ముందు తమ కోచింగ్ సెంటర్‌కు 300 మంది మాత్రమే వచ్చే వారని, ఇప్పుడు వెయ్యి మంది వస్తున్నారని ఆశోక్‌నగర్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. అయితే కొన్ని కోచింగ్ సెంటర్లలో గది సామరŠాధ్యనికి మించి అభ్యర్థులను కూర్చోబెడుతున్నారు. గాలి వెలుతురు లేని గదుల్లో నరకం చూస్తున్నామని, అయినా కోచింగ్ కోసం తప్పడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. అదును చూసి దండుకుంటున్నారు..! గత రెండు నెలలుగా కోచింగ్ కేంద్రాల్లో ఫీజులు పెరిగిపోయాయి. గ్రూప్–1కు కోచింగ్ తీసుకునే వారికి గతంలో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ ఉండేది. ఇప్పుడు రూ. 60 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తున్నారని అభ్యర్థుల ద్వారా తెలిసింది. ఇతర గ్రూప్స్ కోచింగ్, ఉద్యోగాల శిక్షణకు రూ.40 నుంచి రూ.60 వేల వరకూ వసూలు చేస్తున్నారు. గ్రూప్–1కు ఆరు నెలలు, ఇతర పరీక్షలకు కనీసం 4 నెలలు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కేంద్రాలు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తున్నాయి. అనుభవజ్ఞులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నాయి. అభ్యర్థుల్లో లోపాలను గుర్తించి సరిదిద్దడంతో పాటు వారిలో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కొన్ని కోచింగ్ సెంటర్లలో సరైన శిక్షణ అందడం లేదు. నిర్వాహకుల బంధువులు మిత్రులతో గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేస్తున్నారని, లోపాలు సరిదిద్దే ప్రక్రియ సరిగా సాగడం లేదని అభ్యర్థులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి కోచింగ్‌కు పంపారు నేను డిగ్రీ పూర్తి చేశా. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో హైదరాబాద్ వచ్చా. ఎంక్వైరీ చేస్తే కోచింగ్ ఫీజు రూ.50 వేలు అన్నారు. హాస్టల్‌కు అదనంగా నెలకు రూ.6 వేలు. అయినా సరే వ్యవసాయం చేసే మా నాన్న అప్పు చేసి మరీ డబ్బులిచ్చారు. కోచింగ్ సెంటర్లో చేరి కష్టపడుతున్నా. అక్కడ భోజనం సరిపడక బయట తినాల్సి వస్తోంది. అదనంగా నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చవుతోంది. గ్రూప్స్ సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నా. – జునుగారి రమేష్, ముంజంపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్ డబ్బుల్లేక సొంతంగానే చదువు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. నేను ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నా. కోచింగ్ తీసుకుంటే తప్ప గ్రూప్స్‌లో పోటీ పడలేమని చాలామంది చెప్పారు. కాస్త పేరున్న కోచింగ్ సెంటర్లకు వెళ్లి అడిగితే రూ.70 వేల వరకూ అడిగారు. అప్పు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్న కోచింగ్ సెంటర్లలో చేరినా లాభం ఉండదని స్నేహితులు చెప్పారు. దీంతో ఓయూ హాస్టల్లోనే ఉంటూ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎక్కువ గంటలు కష్టపడుతున్నా. –మేడబోయిన మమత, ఇస్కిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా తాకిడి బాగా పెరిగింది ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటన తర్వాత కోచింగ్ తీసుకునే అభ్యర్థుల సంఖ్య రెట్టింపు అయింది. మేలో ఇది గణనీయంగా పెరిగే వీలుంది. అయితే నగరంలోని కొన్ని కోచింగ్ సెంటర్లు మాత్రమే అభ్యర్థులకు ఆశించిన విధంగా శిక్షణ ఇస్తున్నాయి. కొందరు అభ్యర్థులను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం దురదృష్టకరం. మా దగ్గరకొచ్చే అభ్యర్థులకు ప్రతిరోజూ నిర్విరామంగా శిక్షణ ఇచ్చేందుకు మంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేశాం. అభ్యర్థులకు మెరుగైన రీతిలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. – కృష్ణప్రదీప్ (నిర్వాహకుడు, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ) -
Telangana: కొలువుల భర్తీకి కొత్త రోస్టర్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో కీలకమైన రోస్టర్ పట్టిక ఒకటో నంబర్ నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్ పాయింట్లు సైతం మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉన్నాయి. జిల్లా, జోన్లు ఆధారంగా నియామకాలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం రోస్టర్‌ను ఒకటో నంబర్ నుంచి అమలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో అప్పట్లో ఆ విధానాన్ని ఎంచుకోగా... ఇప్పుడు నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో మరోమారు రోస్టర్ పాయింట్లు క్రమసంఖ్య ఒకటి నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ చేసిన పాయింట్ల ఆధారంగా రోస్టర్‌ను కొనసాగించే వీలు లేకపోవడం, ఈడబ్ల్యూఎస్‌కు పదిశాతం కోటా ఇవ్వాల్సి రావడంతో కొత్తగా రోస్టర్ పాయింట్ల అమలు దిశగా ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన జోనల్ విధానం ప్రకారం ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత రాగా, కొత్త నియామకాల విషయంలో రోస్టర్ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మారిన కేడర్... కొత్త రోస్టర్ రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమలుతో ఉద్యోగ కేడర్లలో భారీ మార్పులు జరిగాయి. తెలంగాణ ఏర్పాటైన సమయంలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉండగా.. ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. ఇదివరకు జిల్లా స్థాయిలో ఉన్న పోస్టుల్లో కేవలం నాల్గోతరగతి, సబార్డినేట్ పోస్టులు మాత్రమే జిల్లా కేడర్‌లోకి వచ్చాయి. మిగతా పోస్టులు జోనల్ స్థాయిలోకి చేర్చారు. అదేవిధంగా ఇదివరకు జోనల్ స్థాయిలో ఉన్న పోస్టులు మల్టీ జోనల్ కేడర్‌లోకి చేర్చారు. దీంతో ఇదివరకున్న కేడర్‌తో నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. అదీగాక రోస్టర్ పాయింట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా నంబర్లను ఖరారు చేయాలి. ఆ తర్వాత ఖరారైన రోస్టర్‌ను ఒకటో క్రమ సంఖ్య నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలు 65వేలు? కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తవడంతో ఖాళీలపై ఒక అంచనా వచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 65వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్రత్యక్షంగా భర్తీ చేసే ఉద్యోగాలు, పదోన్నతుల ద్వారా నింపే ఉద్యోగాలపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యక్షంగా భర్తీ చేసే నియామకాలకు నోటిఫికేషన్లను నియామక బోర్డుల ద్వారా చేపట్టాలి. ఇందుకోసం ఆయా శాఖలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదంతో ఆయా బోర్డులకు సమర్పించాలి. అయితే కొత్త రోస్టర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఏమిటీ రోస్టర్? ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు క్రమపద్ధతిలో అమలు చేసే విధానమే రోస్టర్. రోస్టర్ పాయింట్లు ఒకటి నుంచి వంద వరకు ఉంటాయి. ఒకటో క్రమసంఖ్య జనరల్ మహిళతో మొదలవుతుంది. జనరల్ మహిళ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, ఎస్టీ మహిళ, ఎస్టీ జనరల్, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలో మహిళలు, జనరల్, డిజేబుల్ మహిళ, డిజేబుల్ జనరల్ కేటగిరీలకు ఒక్కో క్రమసంఖ్యను రోస్టర్ పాయింట్లలో ఖరారు చేశారు. ఈ పాయింట్ల ఆధారంగా కొత్త నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకసారి రోస్టర్ అమలు చేసి ఎంపిక పూర్తి చేస్తే... ఏ పాయింట్ దగ్గర నియామకాలు పూర్తవుతాయో... తిరిగి నియామకాలు చేపట్టినప్పుడు ఆ పాయింట్ నుంచే క్రమసంఖ్యను కొనసాగించి నియామకాలు చేపడతారు. దీంతో రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి. -
‘ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లు రద్దు చేయాలి’
షిమ్లా: ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తి రద్దు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు శాంత కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కుల ఆధారిత కోటా వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి, కుటుంబ ఆదాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లపై దేశంలో 80 శాతం మంది విసుగెత్తిపోయారని అన్నారు. రిజర్వుడ్ కులాల్లోని పేదలు రిజర్వేషన్లతో పూర్తి లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పారు. ఈ కేటగిరీలోని సంపన్నులు రిజర్వేషన్లతో లాభపడుతున్నారని శాంత కుమార్ ఆక్షేపించారు. రిజర్వేషన్ల నుంచి క్రీమీలేయర్‌ను మినహాయించాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉందని గుర్తుచేశారు. రాజకీయ పార్టీల్లోని రిజర్వుడ్ కేటగిరీ నేతలు క్రీమీలేయర్ కిందకు వస్తారని వివరించారు. క్రీమీలేయర్ వర్గానికి రిజర్వేషన్లు వర్తింపజేయరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. ‘అంతర్జాతీయ ఆకలి సూచిక’లో 130 దేశాల్లో భారత్ 117 స్థానంలో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. దేశంలో 19.40 కోట్ల మంది ఆకలితో నిద్రిస్తున్నట్లు ఆ నివేదిక చెప్పిందన్నారు. వీరిలో 12 మంది కోట్ల మంది రిజర్వుడ్ కేటగిరీ ప్రజలేనని వివరించారు. కుల రిజర్వేషన్లతో ఆ వర్గంలోని పేదలు ప్రయోజనం పొందడం లేదన్న వాస్తవం అర్థమవుతోందని చెప్పారు. చదవండి: అంబేడ్కర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలి! 50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ -
హమాలీ పనికి మించిన ఉపాధి ఏముంది?: మంత్రి నిరంజన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్: ‘కొనుగోలు కేంద్రాల కాడ సగటున 100 మందికి పనివస్తుంది. వానాకాలం, యాసంగిలో రెండున్నర నెలలు ఎవరి పనులు వారు చేసుకుంటూ కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేసుకునే వెసులుబాటు తెలంగాణలో గ్రామగ్రామాన వచి్చంది. ఇంతకు మించిన ఉపాధి ఏముంది? ఉపాధి అంటే ఇది. సదువుకుంటే సర్కారీ నౌకరి వస్తది.. అయితే, సదువుకున్న అందరికీ సర్కారీ నౌకరి రాదు’అని నిరుద్యోగులను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన ‘దిశ’సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను తప్పుబట్టారు. ఇతర రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉండి ఉద్యోగాలను తొలగించి, ప్రైవేట్‌పరం చేస్తున్న పారీ్టలు ఇక్కడ ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు చర్చ చేయకుండా చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలంటే వీలుపడుతుందా అని ప్రశ్నించారు. మీడియా వక్రీకరించింది: నిరంజన్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌లో తాను మాట్లాడిన మాటలను మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచింది. ఉద్యోగం అంటేనే ఉపాధి. అది కలి్పంచడం ప్రభుత్వ విధి’ అని తానన్న వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నానన్నట్టుగా ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని మంత్రి తెలిపారు. -
తెలంగాణలో మొత్తం ఖాళీ పోస్టులు 56,979
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి అవకాశముందో ఆర్థిక శాఖ తేల్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 44,022, ఆయా శాఖల పరిధిలోని గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర సంస్థల్లో 12,957 కలిపి మొత్తం 56,979 డైరెక్ట్ రిక్రూట్మెంట్ (డీఆర్) పోస్టుల భర్తీకి అవకాశముందని స్పష్టం చేసింది. ఈ మేరకు నివేదికను బుధవారం కేబినెట్‌కు సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం పోలీసు శాఖలో ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉండగా, అతి తక్కువగా సమాచార శాఖలో కేవలం నాలుగంటే నాలుగు పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఇలా మొత్తం 28 శాఖల వివరాలను కేబినెట్‌కు సమర్పించగా, 8 ప్రభుత్వ శాఖల్లో 100కన్నా తక్కువ ఉద్యోగ ఖాళీలు చూపెట్టారు. సంక్షేమ గురుకులాల్లో పోస్టుల సంఖ్యను చూపెట్టినా, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 18 వేల పోస్టులను మాత్రం నివేదికలో ప్రస్తావించలేదు. కానిస్టేబుళ్ల పోస్టులు 19,251 పోలీసు శాఖలో 21,507 డీఆర్ పోస్టులు నింపేందుకు అవకాశముందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇందులో 88 డీఎస్పీ (సివిల్), 368 ఎస్ఐ (సివిల్), 19,251 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి అవకాశం ఉందని తెలిపింది. అలాగే 515 ఫైర్‌మెన్, 380 ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, 174 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. సంక్షేమ గురుకులాల్లో.. సంక్షేమ గురుకులాల్లో 7,701 పోస్టుల భర్తీకి అవకాశముందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇందులో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ పరిధిలో 3,400, ఎస్సీ గరుకుల సొసైటీలో 1,784, ఎస్టీ గురుకులాల్లో 1,124, మైనార్టీ గురుకులాల్లో 1,393 పోస్టులు చూపెట్టారు. పలు శాఖల్లో ఇలా... వైద్య శాఖ విషయానికి వస్తే 3,353 స్టాఫ్ నర్సులు, 1,216 ఏఎన్ఎంలు, 1,085 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అవకాశముంది. ఉన్నత విద్యలో 1,062 డిగ్రీ లెక్చరర్లు, 900 వరకు జూనియర్ లెక్చరర్ పోస్టులున్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. రెవెన్యూ శాఖ విషయానికి వస్తే 305 ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, 59 ఏసీటీవోలు, 48 సీటీవోలు, 169 జూనియర్ అసిస్టెంట్లు (పన్నుల శాఖ), 210 మంది డిప్యూటీ సర్వేయర్లు, 50 డ్రాఫ్ట్‌మెన్, 42 డిప్యూటీ కలెక్టర్లు, 95 నాయబ్ తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 894 జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 121 ఎంపీడీవోలు, 195 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల భర్తీకి అవకాశముంది. నీటì పారుదల శాఖలో 721 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 221 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, 184 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, అటవీశాఖలో 856 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా, మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ సూపర్వైజర్లు గ్రేడ్–1 కింద 181, గ్రేడ్–2 కింద 433 ఖాళీలున్నాయి. వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికారులు 200, పశువైద్య విభాగంలో 244 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, 103 వెటర్నరీ అసిస్టెంట్లు, రవాణా శాఖలో 108 మంది అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు పోస్టుల భర్తీకి అవకాశముందని ఆర్థిక శాఖ వెల్లడించింది. -
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం
సాక్షి, అమరావతి: అమరావతి : దేశంలో ఎక్కడా, ఎవరూ చేపట్టని రీతిలో గత రెండేళ్లలో 6,03,756 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాజాగా 10,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను శుక్రవారం (నేడు) ఆయన విడుదల చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్న సీఎం.. నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుడుతున్నారు. 2021–22లో భర్తీకి నిర్ణయించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే నెల నుంచే విడుదల కానున్నాయి. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అత్యంత పారదర్శకంగా, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అత్యంత పారదర్శకంగా భర్తీకి ఏర్పాట్లు ప్రభుత్వ పోస్టులను ఎలాంటి అవినీతి, అక్రమాలకు, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శక విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో బాగంగా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రూప్–1, గ్రూప్–2తో సహా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు ఐఐటీ, ఐఐఎంల సహకారంతో విప్లవాత్మక విధానాన్ని రూపొందించనున్నారు. పోస్టుల భర్తీలో కొత్త చరిత్ర దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు 6,03,756 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1,84,264, కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్ సోర్సింగ్ పోస్టులు 3,99,791 ఉన్నాయి. కేవలం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇన్ని పోస్టులు భర్తీ చేయించిన ఘనత వైఎస్ జగన్‌దే. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. -
2008 ఎస్సై ఉద్యోగాలు: జార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు
రాంచీ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై జార్ఖండ్ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని ఆదేశించింది. అలా చేయకపోతే అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ప్రతిభ ఆధారంగా కొలువులు కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు 2008లో ఎస్సై నియామకాలపై దాఖలైన కేసులో రాంచీ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జార్ఖండ్‌లో 2008లో ఎస్సై ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయగా తుది ఫలితాల అనంతరం 382 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే తమకు మెరిట్ ఉన్నప్పటికీ తుది జాబితాలో పేర్లు లేవని 43 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. విచారణ చేసిన ఆ కమిటీ తుది ఫలితాల్లో తప్పిదాలను గుర్తించి 43 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని సూచించింది. ఈక్రమంలో కమిటీ నిర్ణయం ద్వారా ఉద్యోగం దక్కని మిగతావారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన హైకోర్టు తొలుత ప్రకటించిన 382 మందికే ఉద్యోగాలు ఇవ్వాలని, కమిటీ సూచించిన ఆ 43 మంది పేర్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరలా ఆ 43 మంది హైకోర్టు తలుపు తట్టగా.. జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, ఇందిరా బెనర్జీతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ మేరకు ఎస్సై నియమాలకు సంబంధించి 43 మంది మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేసింది. మెరిట్ ఉన్నప్పటికీ పోస్టు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం కిందకు వస్తుందని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నియామకాల్లో పొరపాట్లకు పాలక సంస్థలదే బాధ్యత అని వ్యాఖ్యానించింది. -
ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.4 కోట్లకు టోకరా
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడిని బుధవారం కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్‌లో హాల్లో కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన దోమల రమేశ్(30)ని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హుజురాబాద్‌లోని డీసీఎంఎస్ కాంప్లెక్స్‌లో సివిల్ పంచాయతీలు పరిష్కరించే కార్యాలయం తెరిచాడు. జిల్లా సివిల్ కోర్టు విజిలెన్స్ అధికారిగా తనను వరంగల్ జిల్లా జడ్జి నియమించినట్లు ఉత్తర్వులు సృష్టించుకొని అమాయలను బురిడికొట్టించాడు. స్కూల్‌అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు నకిలీ అర్డర్లు సృష్టించి విద్యాశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, వివిధ న్యాయస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేస్తున్నాడు. అందరిని నమ్మించేందుకు రెండు కార్లు కొని వాటికి జ్యుడిషియల్ శాఖకు చెందిన స్టిక్కర్లు అతికించి డిస్ట్రిక్ సివిల్ కోర్టు జ్యుడిషియల్ విజిలెన్స్ ఆఫీసర్‌గా, సౌత్‌సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్‌గా తిరుగుతున్నాడు. రూ.4 కోట్ల వసూళ్లు జల్సాలకు అలవాటుపడ్డ రమేశ్ పలువురి వద్ద నుంచి రూ.4 కోట్లు వసూలు చేశాడు. గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు కైత రాంచంద్రంను పరిచయం చేసుకొని అతడి కొడుకుకు జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా, రాంచంద్రం స్నేహితుడు దశరథం బంధువుకు విద్యుత్‌శాఖలో ఉద్యోగం, వారి బంధువుల్లో మరొక మహిళకు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేశాడు. రాంచంద్రం వద్ద అప్పు రూపంలో మొత్తం సుమారుగా రూ.4 కోట్ల వరకు తీసుకొని మోసం చేశాడు. అతడి వద్ద అప్పు తీసుకునే క్రమంలో రామగుండంలో అతడికి డబుల్బెడ్రూం ఇళ్లు ఉన్నట్లు రామగుండం తహసీల్దార్ పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు సృషించి నమ్మించాడు. గోదావరిఖనిలో స్క్రాప్ బిడ్డింగ్ తనకే వచ్చిందని, ఫైనాన్షియల్ సర్వీస్ అథారిటీ రీజనల్ కార్యాలయం ద్వారా రూ.5.34 కోట్లు వచ్చాయని, వరంగల్ జిల్లా జడ్జి తనకు జ్యుడిషియల్ ఆఫీసర్‌గా జీతం ఇస్తున్నట్లు రూ.2.75 లక్షల ఫేక్‌చెక్, జూనియర్ లెక్చరర్‌గా మంచిర్యాలలో అపాయింట్ అయినట్లు ఫేక్ అపాయింట్మెంట్, ఆర్బీఐ అకౌంట్ నుంచి రూ.5 కోట్లు వచ్చినట్లు ఫేక్ లెటర్, గోదావరిఖనిలోని ఎస్బీఐ(అప్పటి ఎస్బీహెచ్) బ్యాంకు అకౌంట్లో కోటి ఉన్నట్లు తప్పుడు పత్రం, జేపీహెచ్‌ఎస్ రామకృష్ణపూర్లో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సాలరీ సర్టిఫికెట్, ఐడీకార్డులు తయారు చేసి రూ.4కోట్లు వసూలు చేయగా రెండున్నర కోట్లు జల్సాలకే ఖర్చుచేసినట్లు , మిగతా ఒకటిన్నర కోటి పలువురి వద్ద అప్పుగా తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. మోసం చేసి రెండోపెళ్లి..విడాకులు 2011లో గోదావరిఖనికి ఎలకపల్లికి చెందిన యువతిని ప్రే మించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు తెలియకుండా 2014 మే 18న కేశవపట్నం మండలంలోని ఒక గ్రామానికి చెందిన అ మ్మాయిని రెండోవివాహం చేసుకున్నాడు. అనుమానం వచ్చి న రెండో భార్య కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా రమేశ్, అతడి కుటుంబసభ్యులను అరెస్టు చేయగా తర్వాత రెండోభార్య రమేశ్‌తో విడాకులు తీసుకుంది. పక్కా ప్రణాళికతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ దోమల రమేశ్ ఆగడాల గురించి సమాచారమందుకున్న కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ బుధవారం ఉదయం హుజురాబాద్‌లో పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. అతడిని విచారించగా మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుత సమాచారంతో ఎల్ఎండీ, హుజురాబాద్, గోదావరిఖని వన్‌టౌన్‌లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం నాలుగు రోజుల కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిపారు. రమేశ్‌వల్ల నష్టపోతే కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు లేదా సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రష్మిపెరుమాల్, టాస్క్‌ఫోర్స్ సీఐలు ప్రకాశ్, శశిధర్‌రెడ్డి, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కారీ కొలువులు లేవు..
ఇస్లామాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూడవద్దని సర్కారీ కొలువులు లేవని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో కీలక మంత్రి ఫవాద్ చౌధరి స్పష్టం చేశారు. పాలక పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఎన్నికల హామీకి విరుద్ధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కోసం ప్రభుత్వం నుంచి ఆశలు పెట్టుకోవద్దని తేల్చిచెప్పారు. ఇంజనీరింగ్ సంస్థల డీన్స్ అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పాక్ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని చేతులెత్తేశారు. పాకిస్తాన్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కుచించుకుపోతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రజలు గ్రహించడం ముఖ్యమని, మనం ఉద్యోగాల కోసం ప్రభుత్వం వైపు చూస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని అన్నారు. 1970 ప్రాంతాల్లో ప్రభుత్వం ఉద్యోగాలు సమకూరుస్తుందనే వైఖరి ఉండేదని, ఇప్పుడు ప్రైవేటు రంగం ఉపాథి అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. -
ఏపీలో కొలువుల జాతర... 1,26,728 పోస్టులకు నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి. శనివారం ఉ.11 గంటల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థను కొత్తగా ఏర్పాటుచేసి, ప్రతి సచివాలయంలో పనిచేసేందుకు 10 నుంచి 12 మంది చొప్పున నియమించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేస్తున్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్ తదితర 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ మొత్తం 22 రకాల ఉద్యోగాలను సర్కారు భర్తీచేస్తుంది. మూడు ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా.. కాగా, ఆయా ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి అన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు gramasachivalayam. ap. gov. in, vsws. ap. gov. in, wardsachivalayam. ap. gov. in అనే మూడు ప్రత్యేక వెబ్సైట్లను సిద్ధంచేశారు. శనివారం ఉ.11 గంటల నుంచి ఇవి దరఖాస్తుదారులకు అందుబాటులోకి వస్తాయని పంచాయతీరాజ్, పట్టణాభివృద్ది శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు ఫారం, 22 రకాల ఉద్యోగాలకు వేర్వేరుగా ఏ ఉద్యోగానికి ఏయే విద్యార్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి వివరాలను ఆయా వెబ్సైట్లలోనే అందుబాటులో ఉంచుతారు. రెండంచెల పరీక్ష విధానం.. అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి రెండంచెల పరీక్ష విధానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేయడం కోసం భర్తీచేసే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, వేల్పేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 75 మార్కులకు జనరల్ నాలెడ్జిలో, సాయంత్రం 75 మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. అలాగే, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజీ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజీ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 50 మార్కులకు జనరల్ నాలెడ్జిపై.. సాయంత్రం వంద మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీతో పాటు ఆయా ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై పరీక్ష ఉంటుంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ కాగా, ఇప్పటికే ఆయా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది. 9,359 లైన్మెన్ పోస్టుల భర్తీ కూడా. ఇదిలా ఉంటే.. 9,359 ఎనర్జీ అసిస్టెంట్ (లైన్మెన్) ఉద్యోగాల భర్తీకి కూడా వేరుగా నోటిఫికేషన్ రానుంది. విద్యుత్ డిస్కంలు దీనిని జారీచేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు 5,573 గ్రామ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 3,786 వార్డు ఎనర్జీ సెక్రటరీ పోస్టులను డిస్కంలు వేరుగా భర్తీచేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామక నిబంధనలకు, డిస్కం ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల తీరు వేర్వేరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నోటిఫికేషన్ కూడా ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల సంఖ్య పెంపునకు ప్రతిపాదన మొదట 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయాలని సర్కారు నిర్ణయించగా.. తాజాగా ఆ సంఖ్యను 11,158కు పెంచాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలో మొదట ప్రతిపాదించిన వాటి కన్నా కొన్ని అదనంగా గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. -
‘మహా’ ప్రభుత్వానికి బాంబే హైకోర్టు చీవాట్లు
ముంబై: ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు ఉన్నాయంటూ పత్రికల్లో ప్రకటనలు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ అంశానికి సంబంధించి పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్నా కూడా ఎలా జారీ చేస్తారని తీవ్రంగా మందలించింది. ఇలాంటి బాధ్యతా రాహిత్యమైన చర్యలు మానుకోవాలని, పిటిషన్లను పరిష్కరించేందుకు కోర్టుకు కాస్త సమయం ఇవ్వాలని మండిపడింది. మరాఠాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ ఉందని తెలిసి కూడా ఆదరాబాదరగా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరేశ్ పాటిల్, న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ కర్ణిక్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతూ బాంబే హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) ఇటీవల దాఖలయ్యాయి. మరాఠాలకు రిజర్వేషన్లపై మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలు జారీ చేసిందని పిల్ దాఖలు చేసిన న్యాయ వాది గుణరతన్ సదావర్తి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మరాఠాల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిని ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వీఏ థొరాట్ వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు మాత్రమే ఆహ్వానించామని, పరీక్ష 2019 జూలైలో ఉంటుందని వివరించారు. అయితే ప్రకటన ఇవ్వాల్సిన తొందరేం వచ్చిందని, ఇందుకు కొద్ది రోజులు ఆగి ఉండాల్సిందంటూ కోర్టు మందలించింది. సాంకేతికంగా ప్రభుత్వానిది తప్పు కాదని, అయితే ఈ సమస్య తీ వ్రత దృష్ట్యా ప్రభుత్వం వేచి చూడాల్సి ఉందన్నారు. పిల్ వేసిన న్యాయవాదిపై దాడి.. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది గుణరతన్ సదావర్తిపై హైకోర్టు వెలుపల దాడి జరిగింది. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. మరాఠా వర్గానికి చెందిన ఓ వ్యక్తి గుంపులో నుంచి ముందుకు దూసుకొచ్చి ‘ఒక్క మరాఠా లక్షమంది మరాఠాలు’అని నినాదాలు చేస్తూ న్యాయవాదిని కత్తితో పొడిచాడని వివరించారు. అయితే అక్కడున్న న్యాయవాదులు, పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జల్నా జిల్లాకు చెందిన వైజయంత్ పాటిల్‌గా గుర్తించారు. -
వేరే రాష్ట్రంలో కోటా వర్తించదు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల వర్గాలకు చెందిన ఒక వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలోను అదే వర్గంగా గుర్తిస్తే తప్ప ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్ల లబ్ధి పొందలేరంటూ సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏ శంతన గౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. అదే సమయంలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం అమలు చేయవచ్చని స్పష్టం చేసింది. ‘ఒక రాష్ట్రంలో ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఉద్యోగం, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన అంశాల్లో ఆ రాష్ట్రంలో అతనిని ఎస్సీ, ఎస్టీగా పరిగణించకూడదు. దాని వల్ల సొంత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు వారికోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల ప్రయోజనాలు కోల్పోతారు’ అని ధర్మాసనం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలో అదే వర్గంగా గుర్తించని పక్షంలో అతను ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ కోరవచ్చా? అని దాఖలైన 8 పిటిషన్లను విచారించిన అనంతరం సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలుగా గుర్తింపు పొందితే వారికి వేరే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో తప్పనిసరిగా అదే హోదా ఉండాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక కులం లేదా తెగను ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చేందుకు అర్హతను ఆ ప్రాంత పరిస్థితులు, ప్రతికూలతలు, ఆ వర్గం ఎదుర్కొంటున్న సామాజిక ఇబ్బందులపై ఆధారపడి పరిగణనలోకి తీసుకుంటారని ధర్మాసనం వెల్లడించింది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి మహారాష్ట్రలో రిజర్వేషన్ లబ్ధి పొందితే మహారాష్ట్రలోని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఆ రాష్ట్రం కేటాయించిన రిజర్వేషన్ ఫలాన్ని దక్కకుండా చేయడమే’ అని పేర్కొంది. అయితే వేరే రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ విషయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని నలుగురు న్యాయమూర్తులు స్పష్టం చేయగా జస్టిస్ భానుమతి వారితో విభేదించారు. ‘కేంద్ర పాలిత ప్రాంతంలోని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కిందకు వచ్చినప్పటికీ అవన్నీ కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉంటాయి. యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉండవు’ అని తన తీర్పులో జస్టిస్ భానుమతి అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లకు వెనుకబాటు గీటురాయి కాదు ఉద్యోగ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అంశంలో వెనుకబాటుతనాన్ని కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిథ్యం లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు షరతులు విధిస్తూ 2006లో సుప్రీం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవరించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన రాజ్యాంగ బెంచ్ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 2006 నాటి తీర్పును సమీక్షించండి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలకు సంబంధించి అవసరమైన సమాచారం సమర్పించాలని 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును పునః సమీక్షించాలని కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను కోరాయి. -
ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష.. అందరూ ఫెయిల్!
పనాజి : అకౌంటెంట్ పోస్టుల నియామకాల కోసం గోవా ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఒక్కరు కూడా అర్హత సాధించకపోవడం ప్రస్తుతం చర్చనీయాశంమైంది. సుమారు 8వేల మంది గ్రాడ్యుయేట్లు ఈ పరీక్ష రాయగా.. వీరిలో ఏ ఒక్కరికి 100కు కనీసం 50 మార్కులు రాలేదు. ఈ ఏడాది జనవరి 7న నిర్వహించిన ఈ పరీక్షలో ఒక్కరు కూడా కనీస మార్కులు సాధించలేదని డైరెక్టరేట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో 80 పోస్టులు నియమాకాల కోసం ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసింది. ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అకౌంట్స్ సంబంధిత ప్రశ్నలతో 100 మార్కులకు ఐదు గంటల సమయంతో జనవరిలో పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి మౌఖిక ఇంటర్వ్యూల ద్వారా తుది జాబితాను ఎంపికచేస్తామని నోటీఫికేషన్లో పేర్కొంది. కానీ ఏ ఒక్కరు అర్హత సాధించకపోవడంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. ఇక ఫలితాలను ఆలస్యం చేయడాన్ని గోవా ఆమ్ఆద్మీ పార్టీ నేత ప్రదీప్ పద్గోనకర్ తప్పుబట్టారు. 8000 మంది అభ్యర్థుల్లో ఏ ఒక్కరు అర్హత సాధించకపోవడం రాష్ట్రంలోని పతానవస్థలో ఉన్న విద్యావిధానానికి అద్దం పడుతోందని విమర్శించారు. -
ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్‌కు ఓ పాలసీ ఉందా?
-
టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలి
గద్వాల: మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రభుత్వానికి, టీఆర్ఎస్ నాయకులకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎస్వీ ఈవెంట్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ గట్టు మండల కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన సీఎం కేసీఆర్, ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య తదితర హామీలకే దిక్కులేదని విమర్శించారు. ఇవి చాలవన్నట్టు తాజాగా గద్వాల ప్రజలను మోసిగించే విధంగా హామీలు గుప్పించారని మండిపడ్డారు. గద్వాల అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఒక్క రోజులోనే విడుదల చేస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టు దగ్గర బృందావన్ గార్డెన్, గుర్రంగడ్డ బ్రిడ్జి రెండు నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించి గద్వాల ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గట్టు లిఫ్టు డిజైన్ మార్పు పేరుతో సీఎం కేసీఆర్ మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపడితే ఎమ్మెల్యేకు పేరొస్తుందనే ఉద్దేశంతోనే రూ.వెయ్యి కోట్లు అదనంగా ఖర్చుపెట్టయినా కృష్ణానది నుంచి కాల్వల ద్వారా నేరుగా నీటిని తీసుకురావడానికి ప్రయత్ని స్తున్నారని ఆరోపించారు. ఆయకట్టు పెంచకుండా రూ.కోట్లు దండుకునే కుట్ర ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రజలకు మోసపూరితమైన తాయిళాలు ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి, మాఫియా పాలన సాగుతోందని విమర్శించారు. మిషన్ భగీరథ, ప్రాజెక్టుల పేరిట రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. గద్వాలలో టీఆర్ఎస్ అంటేనే ఇసుక, బియ్యం, మట్టి మాఫియగా మారిపోయిందని ధ్వజమెత్తారు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న గద్వాల టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బూత్‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ప్రకాష్‌రావు, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, రాముడు, శివారెడ్డి, వెంకటస్వామిగౌడ్, హన్మంతరెడ్డి, రాజప్ప, సంధ్య, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
బంగ్లాదేశ్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
-
బంగ్లాలో ప్రభుత్వ కొలువుల్లో రిజర్వేషన్లు రద్దు
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు తేవాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఢాకా ఆందోళనలతో అట్టుడికింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పార్లమెంట్లో ఈమేరకు ప్రకటన చేశారు. డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగించటం తగదన్నారు. ఢాకా వర్సిటీ వైస్ఛాన్సెలర్పై దాడిని ఆమె ఖండించారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ విధానం ప్రకారం.. 56% ప్రభుత్వ ఉద్యోగాలను స్వాతంత్య్ర సమర యోధుల పిల్లలు, మహిళలు, మైనారిటీలు, వికలాంగులు, వెనుకబడిన జిల్లాల వారికి కేటాయిస్తున్నారు. -
సైన్యంలో పని చేయాల్సిందే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైనా చేరాలంటే సైన్యంలో ఐదేళ్లు పనిచేయాలనే నిబంధన విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫాస్సు చేసిన నేపథ్యంలో నిర్బంధ సైనిక శిక్షణ, సేవపై దేశంలో చర్చ ఆరంభమైంది. ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మొత్తం59, 531 అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్రివిధ బలగాల్లో సిపాయి వంటి పునాది స్థాయి ఉద్యోగాల్లో సిబ్బంది తగినంత సంఖ్యలో ఉన్నారు. ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య అవసరమైన ఆఫీసర్ ఉద్యోగాల్లోనే సైనికోద్యోగుల కొరత ఎక్కువ ఉందని ఇండియా డిఫెన్స్ రివ్యూ అనే పత్రికలో రాసిన వ్యాసంలో బ్రిగేడియన్ అమత్ కపూర్ వెల్లడించారు. అధికారుల ఉద్యోగాలతోపాటు ఆఫీసర్ కింది ర్యాంకు ఉద్యోగాలు(పీబీఓఆర్) కూడా పూర్తిగా భర్తీకావడం లేదు. ఆధునిక నైపుణ్యం సంపాదించిన ఉన్నత విద్యావంతులకు మార్కెట్లో మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉండడంతో సైనిక దళాల్లో అధికారుల ఉద్యోగాల్లో చేరడానికి వారు ముందుకు రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ పట్టభద్రులను సైన్యంలోకి ఆకర్షించడానికి దినపత్రికల్లో ‘మీలో ఈ సత్తా ఉందా?’ అంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. అయినా సాంకేతిక విద్య అభ్యసించిన యువతీయువకులు తగినంత మంది సైనికదళాల్లో చేరడం లేదు. ఈ సమస్యను పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం దీని పరిష్కారానికి ఎవరూ ఊహించని రీతిలో పై సిఫార్సు చేసింది. ఫ్రెంచి విప్లవం నాటి నుంచే నిర్బంధ సైనిక సేవ! దాదాపు ఈడొచ్చిన యువకులందరికీ నిర్బంధ సైనిక శిక్షణ–సేవ అనే విధానం 1790ల్లో ఫ్రెంచి విప్లవం కాలంలోనే మొదటిసారి అమల్లోకి వచ్చింది. తర్వాత అనేక ఐరోపా దేశాలు ఈ విధానం అనుసరించాయి. అర్హతలున్న యువకులందరూ ఒకటి నుంచి మూడేళ్లు సైన్యంలో శిక్షణ తీసుకుని పనిచేశాక వారిని రిజర్వ్ దళానికి పంపించడం ఆనవాయితీగా మారింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఎక్కువగా జరిగిన 19, 20వ శతాబ్దాల్లో సైన్యంలో పనిచేయడం తప్పనిసరి చేసిన దేశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడూ కాకున్నా యుద్ధాల సమయంలో నిర్బంధ సైనిక సేవ ఉండేది. 21వ శతాబ్దంలో అత్యధిక దేశాలు నిర్బంధ సైనిక శిక్షణ–సేవ పద్ధతికి స్వస్తి పలికాయి. అమెరికాలో కూడా ఈ విధానం ఎన్నో ఏళ్లు అమల్లో ఉంది. అమెరికాలో 1973లో నిర్బంధ సైనిక సేవను రద్దుచేశారు. స్వచ్ఛంద సైనిక శిక్షణ అమల్లోకి వచ్చింది. 32 దేశాల్లో అమలు! ప్రపంచంలోని అనేక దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానం 21 దశాబ్దంలో చాలా వరకు రద్దయింది. ఇంకా 32 దేశాల్లో 18 ఏళ్లు నిండిన యువకులు సైనిక దళాల్లో చేరడానికి పేర్లు నమోదు చేయించుకుని, శిక్షణ పొందే పద్ధతి అమల్లో ఉంది. అయితే, ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఈ విధానం అనుసరిస్తున్నారు. కొన్ని దేశాల్లో యువతీయువకులందరూ తప్పని సరిగా సైన్యంలో చేరాలనే నిబంధన ఉంది. మరి కొన్ని దేశాల్లో మహిళలను దీని నుంచి మినహాయించారు. కొన్ని దేశాల్లో యుద్ధ సమయాల్లో మాత్రమే యువకులందరూ సైన్యంలో చేరాలనే నియమం పాటిస్తున్నారు. అమెరికా, కొలంబియా, కువాయిట్, సింగపూర్‌లో నిర్బంధ, స్వచ్ఛంద విధానాలు రెండూ అమల్లో ఉన్నాయి. కాని, ఎక్కడా ముందు సైన్యంలో ఇన్నేళ్లు పనిచేస్తేనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరొచ్చనే నిబంధన అమల్లో లేదు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వైద్య విద్యలో 2,018 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడి పరిధిలో ఖాళీగా ఉన్న 2,018 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. భర్తీలో స్థానికత, రిజర్వేషన్ రోస్టర్ అంశాలను పరిగణన లోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలు... 10 అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు, 9 ఆడియో విజువల్ టెక్నీషియన్, 2 బయో మెడికల్ ఇంజనీర్, 2 బయో మెడికల్ టెక్నీషియన్, 9 చైల్డ్ సైకాలజిస్టు, 4 సీటీ స్కాన్ టెక్నీషియన్, 26 డార్క్‌రూం అసిస్టెంట్, 4 డెంటల్ టెక్నీషియన్, 2 ఎర్లీ ఇంటర్వెంటినిస్టు, 5 ఈఈజీ టెక్నీషియన్, 6 ఈసీజీ టెక్నీషియన్, 1 ఎలక్ట్రిక్ ఇంజనీర్, 2 ఎఫిడమాలజిస్ట్, 30 జూనియర్ అసిస్టెంట్, 1 జూనియర్ బయోస్టాటిస్టిక్స్ ఆఫీసర్, 1 జూనియర్ ఇంజనీర్, 3 జూనియర్ స్టెనో, 39 ల్యాబ్ టెక్నీషియన్, 4 మెడికల్ రికార్డర్ క్లర్క్, 15 మెటర్నిటీ అసిస్టెంట్, 58 ఫార్మాసిస్ట్ గ్రేడ్(2), 1 ఫొటోగ్రాఫర్, 3 ఫిజియోథెరపిస్ట్, 18 రేడియోగ్రాఫర్, 9 రేడియోగ్రఫీ టెక్నీషియన్, 3 రెఫ్రాక్షనిస్ట్/ఆప్టీషియన్, 2 రిహాబిలిటేషన్ అసిస్టెంట్, 5 స్పీచ్ థెరపిస్ట్, 1,603 స్టాఫ్ నర్సు, 3 స్టాటిస్టీషియన్, 1 స్టెరిలైజేషన్ టెక్నీషియన్, 54 స్టోర్ కీపర్/రికార్డు క్లర్కు/కంప్యూటర్ ఆపరేటర్, 2 సిస్టమ్ ఆపరేటర్, 110 టెక్నికల్ అసిస్టెంట్, 61 టెక్నీషియన్ పోస్టులు. -
తెలంగాణ అసెంబ్లీలో రగడ..!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ అంశం అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. నిరుద్యోగ అంశంపై చర్చకు పట్టుబడుతూ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ఉద్యోగాల భర్తీపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు కోరగా.. స్పీకర్ ఇందుకు అనుమతించలేదు. ఈ అంశంపై అధికార-ప్రతిపక్షాల వాగ్వాదంతో గందరగోళం నెలకొంది. నిరుద్యోగ అంశంపై నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పీకర్‌ను కోరారు. సభ నడిచేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం నుంచి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయమై సభలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఈ గందరగోళం నడుమ తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేవైఎం కార్యకర్తల అరెస్టు నిరసనగా బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనపై సీఎం కేసీఆర్ స్పందించారు. పబ్లిసిటీ కోసం సభలో హంగామ చేయడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. నిరుద్యోగ సమస్యపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
భర్తీ లేదా.. బ్రదర్!
-
భర్తీ లేదా.. బ్రదర్!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు ► నోటిఫికేషన్లు జారీ అవుతున్నా ముందుకు సాగని భర్తీ ప్రక్రియ ► అర్హతలు, నియామక పరీక్షల్లో వరుస తప్పిదాలు ► విపరీత నిబంధనలతో గందరగోళం ► అభ్యర్థుల వ్యతిరేకత, కోర్టు కేసులతో నిలిచిపోతున్న వైనం ► గ్రూప్–2 ఉద్యోగాలకు వైట్నర్ దెబ్బ ► విపరీత నిబంధనలతో గురుకుల పోస్టులకు గండం ► మార్గదర్శకాలు పాటించక లక్ష మంది ‘టెట్’కు దూరం సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతున్నా భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనలో కూరుకుపోతున్నారు. అర్హతలు, నిబంధనలు మొదలుకుని సిబ్బంది తప్పిదాలు, కోర్టు కేసుల దాకా ఎన్నో అడ్డంకులతో పోస్టుల భర్తీ జరగక ఆవేదన చెందుతున్నారు. గ్రూప్–2, గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు ఏడాదిన్నర కిందటే నోటిఫికేషన్లు జారీ అయినా ఇప్పట్లో ఉద్యోగ నియామకాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో నిబంధనలతో దాదాపు లక్ష మంది పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి అనుమతినిచ్చి ఏడాది దాటుతున్నా.. మార్గదర్శకాల్లో అస్పష్టత కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. పలు శాఖలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమని విమర్శలు వస్తున్నాయి. గ్రూప్–2కు వైట్నర్ దెబ్బ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్, 2016 మార్చిలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టులకు 7,89,437 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2016 నవంబర్ 11, 13 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించగా.. 4,97,961 మంది హాజరయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ సమయంలో దాదాపు 50 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలు మారిపోయాయి. కాసేపటికి ఈ తప్పును గుర్తించిన పరీక్షల సిబ్బంది.. ఎవరి జవాబు పత్రాలను వారికి ఇచ్చారు. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది. కొందరు అభ్యర్థులు ఓఎంఆర్ జవాబు పత్రాల్లో తమ వివరాలను రాసేశారు. మరికొందరు జవాబులు కూడా రాశారు (బబ్లింగ్ చేశారు). దీంతో పరీక్షల సిబ్బంది వైట్నర్ పెట్టి పరీక్ష రాయాలని సూచించగా.. అభ్యర్థులు అలాగే రాశారు. వాస్తవానికి టీఎస్పీఎస్సీ నిబంధనలు, గ్రూప్–2 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం.. వైట్నర్ ఉపయోగిస్తే ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయరు. ఈ నిబంధన తెలిసిన కొందరు అభ్యర్థులు పరీక్షల సిబ్బంది తప్పిదం కారణంగా వైట్నర్ ఉపయోగించామని, తమను పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిబంధనల ప్రకారం అది వీలుకాదని టీఎస్పీఎస్సీ కోర్టుకు వివరించింది. కోర్టు కూడా అభ్యర్థుల వాదనను తోసిపుచ్చింది. కానీ ఆ తర్వాత టీఎస్పీఎస్సీ మాట మార్చింది. అంతర్గత పరిశీలనలో 50 వేల మందికిపైగా అభ్యర్థులు వైట్నర్ ఉపయోగించినట్లు గుర్తించింది. ఓ కమిటీ వేసి.. ఆ కమిటీ సిఫారసు అంటూ వైట్నర్ ఉపయోగించిన వారిని కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపిక చేసింది. దీంతో మిగతా నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించగా.. పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. టెట్‌కు నిబంధనల కష్టం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో విపరీత నిబంధనల కారణంగా లక్ష„ý మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. 2010లో అమల్లోకి వచ్చిన ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఇంటర్, డిగ్రీలలో 50 శాతం మార్కులుండి, ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు టెట్ రాసేందుకు అర్హులు. అయితే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే నాటికంటే ముందే ఇంటర్, డిగ్రీ పూర్తిచేసుకున్న వారికి మాత్రం 45 శాతం మార్కులు వచ్చినా అర్హులేననే మినహాయింపు ఉంది. కానీ విద్యా శాఖ మొత్తంగా 50 శాతం మార్కుల నిబంధనను అమలు చేయడంతో.. వేలాది మంది టెట్ రాసే అవకాశం కోల్పోయారు. ఇక డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) పూర్తిచేసి, తర్వాత డిగ్రీ (డీఎడ్+డిగ్రీ) చేసినవారు టెట్ పేపర్–2 రాసేందుకు అర్హులని ఎన్సీటీఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు నిర్వహించిన టెట్‌లలోనూ వారికి అవకాశం కల్పించారు. కానీ టెట్–2017లో విద్యా శాఖ వారికి అవకాశం కల్పించకపోవడంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. ఇక విద్యా హక్కు చట్టం ప్రకారం.. ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకూ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. కానీ ఇంటర్, డిగ్రీల్లో 50 శాతం మార్కులు లేవంటూ టెట్‌కు దూరం చేయడంతో... చాలా మంది అభ్యర్థులు ప్రైవేటు స్కూళ్లలో పనిచేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. గురుకుల పోస్టులకు ‘అర్హత’గండం! దాదాపు 2.5 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న గురుకుల పోస్టుల భర్తీ కూడా గందరగోళంగా మారింది. గురుకుల స్కూళ్లలో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) తదితర 7,306 పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని సంక్షేమ శాఖలు నిబంధనలు విధించాయి. వాస్తవానికి ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం... ఈ పోస్టులకు 2010 ఆగస్టు తర్వాత డిగ్రీ, పీజీలు పూర్తి చేసుకున్న వారికి 50 శాతం మార్కులు.. అంతకుముందు ఉత్తీర్ణులైన వారికి 45 శాతం మార్కులు ఉంటే చాలు. కానీ సంక్షేమ శాఖలు 60 శాతం మార్కుల నిబంధన విధించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా కల్పించుకుని ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేయించారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే అర్హత నిర్ణయించాలని ఆదేశించారు. అయినా పరిస్థితి మారలేదు. విద్యార్హతలను ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే నిర్ణయించినా.. రిజర్వేషన్ విషయంలో తప్పిదం చేశారు. అత్యధిక పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు. జూన్ 1న 2,437 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. మహిళా కాలేజీల్లో పోస్టులను మహిళలతోనే భర్తీ చేయాలన్న నిబంధన ఎక్కడా లేకున్నా... డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులను 100 శాతం మహిళా అభ్యర్థులకే రిజర్వు చేశారు. దీనిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో.. ఈ పరీక్షలు కూడా ఆగిపోయాయి. వైద్యపోస్టుల భర్తీలో దిద్దుబాట! వైద్యారోగ్య శాఖ పరిధిలో 2,118 పోస్టుల భర్తీ ప్రక్రియ అంతులేకుండా సాగుతూనే ఉంది. ఈ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గతేడాది జూలై 13న అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో పోస్టులు భర్తీ చేయాలని.. అర్హతలు, నిబంధనలను వైద్య శాఖ రూపొందించాలని పేర్కొంది. దీనిపై వైద్యారోగ్య శాఖ దాదాపు ఏడాది పాటు జాప్యం చేసింది. చివరికి ఈ ఏడాది మేలో మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ వాటిలో స్పష్టత లేకపోవడంతో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ పలుసార్లు వైద్య శాఖకు సూచించింది. జూలై 5న టీఎస్పీఎస్సీ, ప్రభుత్వానికి లేఖలు సైతం రాసింది. ట్యూటర్ పోస్టుల భర్తీలో భారత వైద్య మండలి నిబంధనలు, రిజర్వేషన్ల వర్తింపు అంశాలపై స్పష్టత కోరింది. వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, లెక్చరర్, రేడియోలాజికల్, ఫిజిక్స్, ఫిజిసిస్ట్ పోస్టులకు... వైద్య విధాన పరిషత్ పరిధిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో పాటించే నిబంధనలపై స్పష్టత కోరింది. దీంతో చివరికి వైద్యారోగ్య శాఖ స్పందించి ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం పలు అంశాలపై స్పష్టతనిస్తూ మంగళవారమే టీఎస్పీఎస్సీకి, ప్రభుత్వానికి వివరాలు పంపింది. ఇప్పటికైనా భర్తీ ప్రక్రియ ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
ఔరా అభిమన్యూ.. ఎంత పని చేశావురా!
► నిరుద్యోగులకు టోకరా! ► మాయగాడిని చుట్టుముట్టిన బాధితులు ► రూ. కోటికిపైగా కుచ్చుటోపీ.. రాజాం : అతడిది ఈ ఊరు కాదు.. కనీసం ఇక్కడేదో ఉద్యోగం, వ్యాపారం వెలగబెడుతున్నాడంటే అదీ లేదు. అలా అని పెద్ద వ్యక్తి కూడా కాదు.. అయినప్పటికీ ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది వరకు నిరుద్యోగులు అతని మాయలో పడ్డారు. రూ. కోటికిపైగా ముడుపులు చెల్లించారు. తీరా ఉద్యోగం రాకపోవడంతో అతడి ఇంటికి చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం బయటకు రావడంతో నిందితుని బంధువులు రాజాం చేరుకొని బాధితులతో మంతనాలు జరుపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాజాంలోని నాగావళి ఐటీఐ సమీపంలో నివాసం ఉంటున్న అభిమన్యు అనే యువకుడు షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తుంటాడు. ఇతని సొంత ఊరు కూడా ఎక్కడనేది తెలియదు. షార్ట్‌ఫిల్మ్‌లతో యువతకు దగ్గరయ్యాడు. తనకు పెద్దలతో పరిచయం ఉందని నమ్మబలికాడు. ఉద్యోగాలు కూడా వేయిస్తుంటానని చెప్పాడు. ఫలితంగా రాజాం, పాలకొండ, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల నిరుద్యోగులతోపాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన పలువురు ఈయన మాయలో పడ్డారు. ప్రధానంగా రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటించడంతో.. రైల్వే పరీక్షలు రాసిన నిరుద్యోగులు కూడా అతని వద్దకు క్యూ కట్టారు. ఒకరికి తెలియకుండా ఒకరు రూ.లక్షల్లో ముడుపులు చెల్లించారు. 50 మందికిపైగా బాధితులు రూ. కోటికిపైగా చెల్లింపులు జరిపినట్లు సమాచారం. అయితే గడువు దాటినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం, మరోవైపు వీరితోపాటు పరీక్షలు రాసిన కొంతమందికి ఉద్యోగాలు రావడంతో ముడుపులు చెల్లించిన వారికి అనుమానాలు అధికమయ్యాయి. ఈ నిరుద్యోగులకు చెందిన కొంతమంది తల్లిదండ్రులు పొలం పుట్రా తాకట్టుపెట్టి రూ.లక్షల్లో చెల్లింపులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వీరంతా ఉద్యోగాలు రాకపోవడంతో తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇమ్మని అభిమన్యుపై ఒత్తిడి తీసుకువచ్చారు. తాను తీసుకున్న డబ్బు వేరే వ్యక్తికి ఇచ్చే వాడినని, తనకు కూడా ఏమీ తెలియదని, రెండు రోజులు గడువు కావాలని చెప్పుకుంటూ రోజులు నెట్టుకొచ్చాడు. చివరికి విసుగు చెందిన నిరుద్యోగ బాధితులతోపాటు వారి బంధువులు కొంతమంది బుధవారం రాజాం చేరుకొని అభిమన్యు నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది పెద్ద మనుషులు అభిమన్యుతో మాట్లాడినప్పటికీ.. తన వద్ద పైసా కూడా లేదని, ఏమీ చేయలేనని చేతులెత్తేశాడు. ఆందోళనలో బాధితులు..: ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు వచ్చి.. మీడియాకు చేరింది. రాజాంకు చెందిన పలువురు మీడియా ప్రతినిధులు అభిమన్యు నివాసం వద్దకు చేరుకోగా.. బాధితులు కాస్తంత ఆందోళనకు గురయ్యారు. మీడియా దృష్టిలో పెట్టినప్పటికీ తమకు ఫలితం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగం ఎలాగూ ఇప్పించలేడని, కనీసం నష్టపోయిన మొత్తాన్ని అయినా తిరిగి చెల్లించే వరకు మీడియా సహకరించాలని కోరారు. నట్టేట ముంచాడు..: ఉద్యోగాలు ఇస్తామన్న అభిమన్యు వలలో చాలా మంది నిరుపేదలు పడ్డారు. ఉద్యోగం ఇవ్వలేకుంటే తాము ఇచ్చిన డబ్బుకు వడ్డీ ఇస్తామని, డబ్బులకు బాండ్లు కూడా ఇస్తామని అభిమన్యు నమ్మబలకడమే కాకుండా.. బాండ్లు రాసివ్వడంతో అధికంగా నిరుద్యోగులు ఈయన మాయలో చిక్కుకున్నారు. చివరకు ఆ బాండ్లు కూడా పట్టించుకోకుండా బాధితులను నట్టేట ముంచాడు. తనకేమీ తెలియదని అభిమన్యు తప్పించుకోవడంతో ప్రస్తుతం బాధితులతోపాటు వారి బంధువులు కూడా దిగాలు చెందుతున్నారు. ఇంత చదువు చదివి ఇలాంటి మాయలో పడ్డామేమిటని నిరుద్యోగులు వాపోతున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులకు బుధవారం సాయంత్రం వరకు ఎటువంటి సమాచారమూ లేకపోవడం విశేషం. -
వారసులకు పది రోజుల్లో ఉద్యోగం
కారుణ్య నియామకాలపై సర్కారు స్పష్టత సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి వారసులకు ఉద్యోగమిచ్చే కారుణ్య నియామక పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలపై మరోసారి స్పష్టతనిచ్చింది. మరణించిన ఉద్యోగుల వారసులు దరఖాస్తు చేసు కున్న 10 రోజుల్లో ఈ నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు తేదీ నుంచి పది పనిదినాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. వివిధ శాఖల పరిధిలో ఉన్న ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కుటుంబ దిక్కును కోల్పోయి దుఃఖంలో ఉండే బాధితులకు తక్షణ సాయం అందేందుకు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేశారు. -
గ్రూప్-2 పరీక్షకు 6.5 లక్షల మంది దరఖాస్తు
► అత్యధికంగా విశాఖ నుంచి 74,369 దరఖాస్తులు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని 982 గ్రూప్-2 పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌కు కమిషన్ ఆశించిన స్థాయిలోనే దరఖాస్తులు అందాయి. ఆదివారం అర్థరాత్రితో గడువు ముగిసే సమయానికి ఈ పోస్టులకు 6,55,729 మంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ పేమెంట్‌కు సంబంధించి బ్యాంకుల నుంచి సమాచారం వస్తే ఈ సంఖ్య మరో వెయ్యి వరకూ పెరుగుతుందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 52,893 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరంతా నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి వచ్చిన ఆన్లైన్ దరఖాస్తుల పరిస్థితిని పరిశీలిస్తే విశాఖపట్టణం జిల్లాలో అత్యధిక శాతం మంది ఈ పరీక్షలకు పోటీపడుతున్నారు. విశాఖపట్టణం నుంచి అత్యధికంగా 74,369 మంది దరఖాస్తు చేశారు. -
డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తాం.. కఠిన చర్యలు!
హైదరాబాద్: డబ్బుకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దని టీఎస్పీఎస్సీ సెక్రటరీ సూచించారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బుకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చిత్తశుద్ధితో నియామాలు చేపడుతోందని ఆయన వెల్లడించారు. డబ్బులు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. కాగా, మోసాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు vigilance@tspsc.gov.in వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయితే ఉద్యోగాల విషయంలో అభ్యుర్థులు కూడా అవకతవకలకు పాల్పడితే భవిష్యుత్ పరీక్షలకు అనర్హులు' అని టీఎస్పీఎస్సీ సెక్రటరీ హెచ్చరించారు. -
ఉమెన్ పవర్
ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఓ, ఏపీఎం, వైద్యాధికారి.. వీరందరూ ఆత్మకూర్(ఎం) మండలానికి సంబంధించిన మహిళా అధికారులు. సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తూ తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పాలనలో పరస్పరం సహకరించుకుంటూ, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న మహిళా‘మణు’లపై సాక్షి ప్రత్యేక కథనం. జిల్లాలో ఆత్మకూరు(ఎం) మండలానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రభుత్వ శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారందరూ మహిళలే కావడం విశేషం. సమర్థంగా విధులు నిర్వర్తించడంలో వారికి వారే సాటి. మహిళలే అయినప్పటికీ పాలనాపరంగా చక్కగా రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. ఒకరి నొకరు సహకరించుకుంటూ మండలాభివృద్ధికి దోహదపడుతున్నారు మండల పరిషత్ అధ్యక్షురాలు కాంబోజు భాగ్యశ్రీతో పాటు, తహసీల్దార్ లక్క అలివేలు, ఎంపీడీఓ గోరింతల అంబబాయి, ఏఓ ఎస్. లావణ్య, ఏపీఎం టి.శోభారాణి, వైధ్యాధికారి బి.సుకృతారెడ్డి వరకు అంతా మహిళా అధికారులే. చాలా గర్వంగా ఉంది ఆత్మకూరు(ఎం) మండలంలో తహసీల్దార్‌గా పని చేయడం చాలా గర్వంగా ఉంది. తోటి మహిళా అధికారుల సహకారం మరువలేనిది. తాను ఇంటర్ తర్వాత టీటీసీ ద్వారా టీచర్‌ను అయ్యాను. తర్వాత గ్రూప్స్ రాసి తహసీల్దార్‌గా సెలక్టయ్యూను. మొదటి పోస్టింగ్ 2005 పెన్‌పహాడ్ మండలం. -లక్క అలివేలు. తహసీల్దార్ మొదటి పోస్టింగ్ ఆత్మకూరు(ఎం)లోనే.. 2012లో ఏఓగా అపాయింట్మెంట్ అయ్యాను. మొదటి పోస్టిం గ్లో ఆత్మకూరు(ఎం) వచ్చాను. ఇక్కడ నాలుగేళ్ల నుంచి పని చేస్తున్న. రైతులందరితో మం చి పరిచయాలు ఉన్నాయి. విధు లు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నా. - ఎస్.లావణ్య, ఏఓ గృహిణి నుంచి ఎంపీపీ అయ్యూను గృహిణి నుంచి ఎంపీపీ స్థాయికి వచ్చాను. ఎంపీపీగా 2014లో భాద్యతలు స్వీకరించాను. ప్రతి రోజూ మండల పరిషత్ కార్యాలయానికి వస్తాను. రోజుకు రెండు మూడు గ్రామాలు తిరుగుతాను. మండల అభివృద్ధికి కృ షి చేస్తున్నా. ఒకప్పుడు సాధార ణ గృహిణిగా ఉన్న నేను ఎంపీపీగా ఎంపికవడం మరువలేను. - కాంబోజు భాగ్యశ్రీ, ఎంపీపీ రోగులకు చిత్తశుద్ధితో సేవలందిస్తున్నాం చిత్తశుద్ధితో పని చేస్తూ రోగులకు చక్కటి సేవలందిస్తున్నాం. సి బ్బంది కూడా మంచిగా సహకరి స్తున్నారు. నేను 2014లో వైద్యాధికారిగా అపాయింట్మెంట్ అయ్యాను. ఆత్మకూరు(ఎం)లో మొదటి పోస్టింగ్. - బి. సుకృతారెడ్డి, వైధ్యాదికారి -
ప్రభుత్వ ఉద్యోగాలకు గండి
సాక్షి, హైదరాబాద్: ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు సర్కారు ఎంతకీ అనుమతివ్వడం లేదు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న వేల పోస్టులను భర్తీ చేయడానికి ఆ శాఖ అధికారులు ఆరేడు నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదికలు అందజేస్తున్నప్పటికీ ఆయన నుంచి స్పందన కరువైంది. ఈ శాఖలో ఒక్క పంచాయతీ కార్యదర్శుల పోస్టులే దాదాపు 2,442వరకు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ.. రెండు, మూడు చిన్న పంచాయతీలకు ఒక్కటే కార్యదర్శి పోస్టు మంజూరు చేయడంతో 8,742 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకే ప్రభుత్వ అనుమతి ఉంది. వీటిల్లోనూ ఇప్పుడు 2,442 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి అనుమతి తెలపాలంటూ అధికారులు ఆరు నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు అందజేస్తూనే ఉన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేని చంద్రబాబు.. ఖాళీగా ఉన్న పోస్టులను ఇతర శాఖలో అదనంగా ఉన్న ఉద్యోగులతో భర్తీ చేయాలంటూ సమీక్ష సమావేశాలలో అధికారులకు మౌఖిక సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీడీవో, ఈవోపీఆర్డీ పోస్టులకు మంగళం పంచాయతీరాజ్ శాఖలోనే 128 ఎంపీడీవో, 160 ఈవోపీఆర్డీ పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే మాయం చేసింది. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాల్సి ఉండగా.. ఆ పోస్టులన్నింటినీ శాఖలో కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చే సింది. ఉమ్మడి రాష్ట్రంలో 2012 సంవత్సరంలో ఎంపీడీవో పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయి, పరీక్ష కూడా నిర్వహించిన తర్వాత కోర్టు తీర్పు కారణంగా ఆ పరీక్షను రద్దు చేశారు. ఆ పోస్టులను ప్రభుత్వం ప్రమోషన్ల పద్ధతిన భర్తీ చేసింది. ఉపాధ్యాయులతో కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రస్తుతం ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను విద్యా శాఖలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అతి తక్కువమంది పిల్లలు ఉన్న స్కూళ్లను వాటికి సమీపంలోని మరొక స్కూలులో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు ఆ శాఖలో అదనంగా ఉన్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇలా అదనంగా ఉన్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసి, ఉపాధ్యాయ పోస్టులో ఉండే జీతంతోనే వారందరికీ పంచాయతీ కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తోంది. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు అధికారుల సమీక్ష సమావేశంలో ఈ విషయంపై ఉన్నతాధికారుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి తనకు ఒక నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. -
ప్రైవేటు కొలువుకు సెలవు!
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ ఇంజనీర్లే కాదు.. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వేల మంది ఇంజనీర్లు సైతం సర్కారీ కొలువును ఒడిసిపట్టుకునేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యోగాల నియామకాల కోసం జరిగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వేల మంది ఇంజనీర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టేసి మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇంజనీరింగ్ విద్యను మరోమారు మూలాల నుంచి ఔపోసన పడుతున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ ఉద్యోగావకాశాన్ని ఒడిసి పట్టుకునేందుకు ప్రైవేటు ఇంజనీర్లు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) 931 ఏఈఈ (సివిల్) పోస్టులతో పాటు 1058 ఏఈ (సివిల్/మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. ఏఈఈ (సివిల్) పోస్టుల కోసమే 30,783 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి వేల మంది ఇంజనీర్లు సెలవులోకి పోవడంతో ఒక్కసారిగా నిర్మాణ రంగం స్తంభించిపోయింది. మెట్రో రైలు లాంటి ముఖ్యమైన ప్రాజెక్టుల పనులు నెమ్మదించాయి. మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ కంపెనీలు, ఏపీలోని స్థిరాస్తివ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న 15 వేల మందికి పైగా సివిల్ ఇంజనీర్లు సెలవులోకిపోవడం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులకు అనుభవజ్ఞులైన ఇంజనీర్ల కొరత ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. ఇక విద్యుత్ సంస్థల్లో 2,681 అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్ల భర్తీకి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ పోస్టుల కోసం హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లో పనిచేస్తున్న 2 వేల మంది తెలంగాణ ఇంజనీర్లు ఇప్పటికే సెలవులు పెట్టేసి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. అదేవిధంగా తెలంగాణ, ఏపీల్లోని ప్రైవేటు విద్యుత్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు కలిపి మొత్తం 5 వేల మందికి పైగా ప్రైవేటు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు సెలవుల బాటపట్టినట్లు అంచనా. ఈ ఉద్యోగ నియామకాల సీజన్ ముగిసే వరకు ప్రైవేటు నిర్మాణ సంస్థలు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సెలవుల ఫీవర్ తప్పదనే చర్చ జరుగుతోంది. -
‘నో అబ్జెక్షన్’ తిప్పలు
మురళీనగర్ చెందిన ఓ యువకుడికి ఇటీవల ఎల్అండ్టీ కంపెనీలో సూపర్వైజర్ ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులందరూ సంబరపడ్డారు. కంపెనీవారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురమ్మన్నారు. రెండు నెలలుగా మీసేవ, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా నిరాశ ఎదురైంది. దీంతో ఉద్యోగం పోయింది. తాటిచెట్లపాలేనికి చెందిన యువకుడు ఐటీఐ పూర్తి చేశాడు. ఇటీవల ఉపాధి శిక్షణకు ఎంపికయ్యాడు. ఆరు నెలల కోర్సు. శిక్షణ అనంతరం వారే ఉద్యోగం కల్పిస్తారు. ఎంతో సంతోషపడిన అతడికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ రూపంలో నిరాశ ఎదురైంది. మీసేవ, పోలీస్‌స్టేషన్, స్పెషల్ బ్రాంచి పోలీసులను కలిసినా ప్రయోజనం లేకపోయింది నేడు యువతను పీడిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఎప్పుడో తీసే ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీత మైన పోటీ. దీంతో చిన్నో పెద్దో ప్రైైవేట్ ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్రెంటిస్, ప్రైవేట్ పరిశ్రమలు, సంస్థల్లో స్టయిఫండ్‌తో కూడిన శిక్షణ, చిన్న తరహా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. అ యితే అప్రెంటిస్, ఉపాధి లభించిన వారికి భంగపాటు తప్పడం లేదు. అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) లేదా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పక సమర్పించాలని ఆంక్షలు విధించడంతో ఖంగుతింటున్నారు. పోలీస్స్టేషన్లలో సర్టిఫికెట్లు లభ్యం కాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. నిలిచిన సేవలు గతంలో పోలీస్‌స్టేషన్ హౌస్ అధికారి సంతకంతో క్లియరెన్స్ సర్టిఫికెట్ మంజూరు చేసేవారు. గతేడాది ఆగస్టు నుంచి సర్టిఫికెట్ మం జూరులో ఆంక్షలు విధించారు. సేవలు మీ-సేవకు అప్పగించారు. మీ-సేవ నుంచి చేరిన దరఖాస్తులు కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం పరిశీలించేది. అక్కడి నుంచి అభ్యర్థి వివరాల పరిశీలన కోసం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందేది. దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు వాస్తవం అని తేలితే సర్టిఫికెట్ మంజూరయ్యేది. గతేడాది డిసెంబర్ నుంచి మీ-సేవలో ఈ సేవలకు బ్రేకులు పడ్డాయి. సర్టిఫికెట్ల బాధ్యత స్పెషల్ బ్రాంచి పోలీసులకు అప్పగించారు. జనవరి నుంచి స్పెషల్ బ్రాంచి ద్వారా సేవలు లభించడం లేదు. కమిషనర్ చొరవ చూపాలి క్లియరెన్స్ సర్టిఫికెట్ల విషయంలో నగర పోలీస్ కమిషనర్ చొరవ చూపాలని నిరుద్యోగులు కోరుతున్నారు. చేతికి అందివచ్చిన ఉపాధి అవకాశాలు చేజారిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. పోలీస్ సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగాల్లో చేర్చుకోవడం లేదని వాపోతున్నారు. రోజు పదుల సంఖ్యలో నిరుద్యోగులు సర్టిఫికెట్ కోసం స్థానిక పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కమిషనర్ ఆదేశాలు లేకుండా సర్టిఫికెట్ ఇచ్చే అధికారం తమకు లేదని ఓ పోలీస్ అధికారి చెప్పారు. -
ఉద్యోగాలు హుష్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపడంతో ఇక రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయిలో ఫుల్‌స్టాఫ్ పడింది. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు, ప్రభుత్వంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏళ్ల తరబడి శిక్షణ పొందుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న దాదాపు 20 లక్షల మంది మంది నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే పరిస్థితి లేకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. వేలకు వేలు పోసి పరీక్షలకు సిద్ధమైనా ఫలితం లేకుండాపోవడంతో ఉసూరుమంటున్నారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో శిక్షణలు పొందుతున్న నిరుద్యోగులు చేసేదేమీ లేక ఇంటిదారి పట్టారు. గడిచిన నాలుగు నెలల్లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 63,518 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీపీఎస్సీ కూడా నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణకు తేదీలు ఖరారు చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయలా? వద్దా? అని ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ లేఖ రాసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ముఖ్యమంత్రే కాదు.. ఉన్నతాధికారులు కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. మరో నాలుగైదు నెలల్లో రాష్ట్రం విడిపోనున్న నేపథ్యంలో ఇంత భారీ సంఖ్యలో పోస్టులను ఇప్పటికిప్పుడు భర్తీ చేయడం సరికాదని, విభజన తర్వాతే ఆయా రాష్ట్రాల్లో నియామకాలు చేపట్టే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఖాళీల భర్తీకి అనుమతిచ్చినా.. రాష్ట్రంలో 63,518 ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చినా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్రస్థాయి, మల్టీ జోన్, జోనల్ పోస్టుల భర్తీకి అవకాశమే లేకపోగా.. ఆందోళనలు, ఉద్యోగుల సమ్మెతో జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు జారీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏప్రిల్ 28న వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల్లో కలిపి 63,621 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ సమావేశంలో తేల్చారు. వాటిల్లో ఆర్థికశాఖ ఇప్పటి వరకు 63,518 పోస్టుల భర్తీకి దశల వారీగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జూన్ 3న 33,738 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ప్రధానంగా ఏపీపీఎస్సీ ద్వారా 11,250 పోస్టులు (గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4, లెక్చరర్ తదితర అన్ని కేటగిరీలు), పోలీసు శాఖలో 11,623 కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు, డిపార్ట్మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 10,865 పోస్టులను భర్తీ చేసుకోవచ్చని అందులో పేర్కొంది. ఇక జూలై 2న 20,508 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి, ఏపీపీఎస్సీ ద్వారా మరో 1,127 పోస్టుల భర్తీకి, డిపార్ట్మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 2,443 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందే 2,677 గ్రామ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. తాజాగా సెప్టెంబరు 30న కూడా మరో 3,025 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత మూడు రోజులకే తెలంగాణ నోట్‌కు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలుపడం.. సీమాంధ్రలో ఆందోళనలు మిన్నంటడంతో నోటిఫికేషన్ల జారీపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినప్పుడే నోటిఫికేషన్లు జారీ చేయాలా? వద్దా? అని ఏపీపీఎస్సీ కోరినా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇకపై నోటిఫికేషన్ల జారీకి ఓకే చెప్పే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే ఏపీపీఎస్సీ మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే సిద్ధంగా ఉండేందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన అన్ని పోస్టులకు రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల వారీ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే నోటిఫికేషన్లను జారీ చేస్తామని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. కొత్త పనులకు బ్రేక్.. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొత్త పనులకు బ్రేక్ పడింది. ఇప్పటికే కొనసాగుతున్న పనులకు మాత్రం నిధులు విడుదల చేస్తారని, బడ్జెట్లో నిధులున్నప్పటికీ ఏ ప్రాంతానికి కూడా కొత్తగా పనులను మంజూరు చేయరని అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థికపరమైన అంశాలతో కూడిన ఎలాంటి పనులను కొత్తగా చేపట్టరని అధికారులు తెలిపారు. కొత్త పనులకు ప్రభుత్వం శంకుస్థాపనలు కూడా చేయబోదని పేర్కొన్నారు. కొత్తగా విద్యాలయాలు, ఆసుపత్రులు, సాగునీటి ప్రాజెక్టులు, మంచినీటి ప్రాజెక్టులు, రహదారులు, భవనాల నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయరని అధికార వర్గాలు వివరించాయి. శుక్రవారం చిత్తూరు మంచినీటి పథకానికి రూ.4,300 కోట్లతో పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా ఈ మంచినీటి పథకానికి శంకుస్థాపన చేయాలని అనుకున్నప్పటికీ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.