రాంచీ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై జార్ఖండ్ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని ఆదేశించింది. అలా చేయకపోతే అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ప్రతిభ ఆధారంగా కొలువులు కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు 2008లో ఎస్సై నియామకాలపై దాఖలైన కేసులో రాంచీ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జార్ఖండ్‌లో 2008లో ఎస్సై ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయగా తుది ఫలితాల అనంతరం 382 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే తమకు మెరిట్ ఉన్నప్పటికీ తుది జాబితాలో పేర్లు లేవని 43 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది.
విచారణ చేసిన ఆ కమిటీ తుది ఫలితాల్లో తప్పిదాలను గుర్తించి 43 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని సూచించింది. ఈక్రమంలో కమిటీ నిర్ణయం ద్వారా ఉద్యోగం దక్కని మిగతావారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన హైకోర్టు తొలుత ప్రకటించిన 382 మందికే ఉద్యోగాలు ఇవ్వాలని, కమిటీ సూచించిన ఆ 43 మంది పేర్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరలా ఆ 43 మంది హైకోర్టు తలుపు తట్టగా.. జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, ఇందిరా బెనర్జీతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ మేరకు ఎస్సై నియమాలకు సంబంధించి 43 మంది మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేసింది. మెరిట్ ఉన్నప్పటికీ పోస్టు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం కిందకు వస్తుందని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నియామకాల్లో పొరపాట్లకు పాలక సంస్థలదే బాధ్యత అని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment