ఆరు కౌంటింగ్ మిషన్లు... పదుల కొద్దీ సిబ్బంది... 12 గంటల పైగా లెక్కింపు... 32 కోట్లకు పైగా విలువైన నగదు... దాదాపు అన్నీ అయిదొందల నోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని గాడీఖానా చౌక్‌లోని ఆ చిన్న రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌లో అంత పెద్ద మొత్తం, పెద్ద పెద్ద సంచీల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయని ఎవరూ ఊహించరు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పేరుకుపోయిన అవినీతికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాటి సోదాల్లో ఎదురైన దృశ్యాలే కళ్ళుచెదిరే సాక్ష్యాలు. సదరు శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంట, ఆ కార్యదర్శికి పనివాడి ఫ్లాట్‌లో, ఇతరుల వద్ద సోదాల్లో మొత్తం కలిపి రూ. 35 కోట్ల పైనే బయటపడేసరికి అంతా అవాక్కయ్యారు.
అంతలేసి ధనం లెక్కాపత్రం లేకుండా ఎవరింట్లోనైనా ఉందంటే, అది అక్రమధనం కాక మరేమిటి? ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్‌ఏ) కింద వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక, మంగ ళవారం రాంచీలో మరో 5 చోట్ల సోదాలు జరిపితే, ఓ కాంట్రాక్టర్ వద్ద 1.5 కోట్లు దొరికాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్... ఇలా ప్రాంతాలు, ప్రభుత్వాలు ఏవైనా సోదా చేస్తే చాలు... నల్లధనం విశ్వరూపం గుట్టల కొద్దీ కట్టల రూపంలో సాక్షాత్కరిస్తున్న తీరు ఆందోళనకరం.
జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పై నుంచి కింద దాకా సమస్తం అవినీతిమయమేనని ఈడీ మాట. తీగ లాగితే డొంకంతా కదలడానికి తాజా కేసు ఉదాహరణ. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర∙గ్రామీణాభివృద్ధి శాఖలో ఛీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కేవలం పదివేల రూపాయల లంచం తీసుకున్నందుకు జరిగిన ఆ అరెస్టు కథ చివరకు అనూహ్యంగా ఇంత పెద్ద కరెన్సీ గుట్టు విప్పింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చిన్నస్థాయిలోనే ఉన్నప్పటికీ, అవినీతి పరులైన ఉద్యోగులు నిఘా సంస్థల కంటబడకుండా తమ అక్రమార్జనను ఎలా తరలిస్తున్నదీ వీరేంద్రరామ్ విచారణలో తెలిసింది.
సంక్లిష్టమైన అవినీతి వ్యవస్థలో తాను, తన లాంటి అధికారుల కోటరీ ఎలా భాగమైనదీ, టెండర్ల ప్రక్రియ సందర్భంగా లంచం సొమ్మును వివిధ మార్గాల్లో తరలించే పద్ధతీ ఆయన బయటపెట్టారు. ఆ వివరాలకు తగ్గట్లే... గ్రామీణాభివృద్ధి శాఖలో విస్తృతంగా అవినీతి సాగుతోందని గ్రహించిన ఈడీ తగిన చర్య చేపట్టాల్సిందిగా గత ఏడాది మేలోనే రాష్ట్ర సర్కారుకు గోప్యంగా లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్దగా స్పందించలేదు. పైగా, నిఘా నీడలోని అవినీతి అధికారుల చేతిలోనే ఆ లేఖ పడడం విడ్డూరం.
తిరుగులేని సాక్ష్యాధారాలు లభించడంతో గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్ సహా పలువురు కీలక అనుమానితులపై ఈ సోమవారం ఈడీ దాడులు జరిపింది. కాంట్రాక్టులు ఇస్తూ అవినీతి ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ, లాల్ కోట్లు కూడ బెట్టారట. లాల్ పనివాడి ఇంట్లో ఏకంగా రూ. 32 కోట్ల పైగా డబ్బు గుట్టలుగా దొరకడంతో వ్యవహారం సంచలనమైంది. ఇదికాక, మరో వ్యక్తి ఇంట్లో మరో 3 కోట్లు దొరికిందంటే, అక్కడి ప్రభుత్వ శాఖలో ఏ స్థాయిలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోంది.
ఈడీ దాడుల్లో లభించిన దస్తావేజులను బట్టి ముందుగా ఊహించిట్టే ఇందులో మంత్రి గారి హస్తం ఉండనే ఉందని రుజువవుతోంది. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది. జార్ఖండ్‌లోని పాకూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డెబ్భై ఏళ్ళ ఈ సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ ప్రశ్నించడమే ఇక బాకీ. పనివాడినీ, అతని ఇంటిని అవినీతి సొమ్ముకు గిడ్డంగిగా మార్చిన వ్యక్తిగత కార్యదర్శినీ అరెస్ట్ చేసినా అమాత్యవర్యులు అదరక, బెదరక అమాయకత్వం ప్రకటిస్తుండడం విడ్డూరం.
జార్ఖండ్‌లోని చంపాయ్ సోరెన్ ప్రభుత్వంపై పడ్డ ఈ అవినీతి మచ్చ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి బాగా అంది వస్తోంది. కాంగ్రెస్‌కు పెద్దదిక్కయిన గాంధీ కుటుంబానికి సన్నిహితులైన వారి ఇళ్ళల్లోనే గతంలోనూ, మళ్ళీ ఇప్పుడూ... ఇంత భారీగా అక్రమ ధనం లభించడాన్ని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావిస్తున్నారు. అవినీతిని ఆపడానికి తాను ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమను విమర్శిస్తున్నాయని ఆయన వాదన. కాగా, ఇదంతా ప్రత్యర్థులే లక్ష్యంగా మోదీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తు సంస్థల దుర్వినియోగమని ప్రతిపక్ష కూటమి ఆరోపణ.
గత డిసెంబర్‌లో జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన ఒడిశా మద్యం డిస్టిలరీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపితే, కనివిని ఎరుగని రీతిలో రూ. 350 కోట్ల పైగా మొత్తం దొరికిన సంగతి తెలిసిందే. పరస్పర ఆరోపణలెలా ఉన్నా, ఈ ఘటనలన్నీ ప్రమాదకరమైన పరిణామాన్ని సూచిస్తు న్నాయి. అక్రమధనంపై దీర్ఘకాలంగా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతూనే ఉంది. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అయినా సమస్య తీరకపోగా, కొత్తవి బయటపడడం పెను సవాలు.
అవినీతిని అంతం చేసి, అక్రమధనాన్ని అందరికీ పంచిపెడతామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు గత పదేళ్ళుగా గద్దె మీదే ఉన్నారు. అవినీతి, కుటుంబ పాలనపై పోరాటమని చెబుతూనే వస్తున్నారు. ఫలితం శూన్యం. పెద్దనోట్ల రద్దు లాంటివి ఎంత విఫలయత్నాలో అర్థమవుతూనే ఉంది. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో నిందితులైన నేతలు సైతం జెండా మార్చి, కాషాయం కప్పుకుంటే పరమ పునీతులైపోతున్న పరిస్థితులూ చూస్తున్నాం.
ఏలికల చేతుల్లో ఏజెన్సీలు, పీఎంఎల్‌ఏ లాంటి అసమంజస కఠిన చట్టాలున్నా సమస్య తీరకపోవడానికి కారణమేమిటో ఆలోచించాలి. ఇవాళ వ్యాపారం, రాజకీయాలు, సమాజం ఏ స్థితికి చేరాయో గ్రహించాలి. నేతలు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ఒకరి కోసం ఒకరు నడిచే తీరు దేశానికి క్షేమం కాదు. ఎన్నికల వేళ ఈ అక్రమధనం పెనుసమస్య. దాని పర్యవసానాలు ఎన్నికలపైనే కాదు, ఆ తర్వాతా ఉంటాయని విస్మరించరాదు.
గుట్టలుగా... అవినీతి కట్టలు
Published Wed, May 8 2024 3:59 AM | Last Updated on Wed, May 8 2024 3:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment