జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈడీ సోదాల్లో గుర్తింపు
ఇప్పటి వరకు తేలిన సొత్తు రూ.35.23 కోట్లు
నోట్ల లెక్కింపు కొనసాగుతోందన్న అధికారులు
తనకు సమాచారం లేదంటున్న మంత్రి ఆలంగీర్ ఆలం
రాంచీ: కాంగ్రెస్ నేత, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) పనిమనిషి ఇంట్లో బ్యాగుల కొద్దీ నోట్ల కట్టలు బయటపడటం సంచలనం రేపుతోంది. సోమవారం రాంచీలోని గడీఖానా చౌక్‌లోని పనిమనిషి జహంగీర్ ఆలం ఫ్లాట్‌లో సోదాలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బయటపెట్టారు.
మంత్రి ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారని చెబుతున్నారు. దాదాపుగా అన్నీ రూ.500 నోట్ల కట్టలు కాగా, కొన్ని ఆభరణాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు 17 గంటలపాటు లెక్కించిన సొమ్ము రూ.35.23 కోట్లుగా తేలిందన్నారు. ఆరు యంత్రాలతో లెక్కింపు కొనసాగుతోందని చెప్పారు.
మొత్తం ఆరు చోట్ల సోదాలు జరపగా మరో చోట రూ.3 కోట్ల నగదు బయటపడినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామంపై కాంగ్రెస్‌కు చెందిన మంత్రి ఆలం స్పందిస్తూ.. ప్రభుత్వం నాకు సమకూర్చిన ప్రైవేట్ కార్యదర్శికి చెందిన ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు టీవీల్లో చూశానన్నారు.
దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. గత ఏడాది అరెస్ట్ చేసిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ రిటైర్డు చీఫ్ ఇంజినీర్ వీరేంద్రకుమార్ రామ్‌పై ఉన్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా దాడులు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో రామ్‌కు చెందిన రూ.39 కోట్ల ఆస్తులను సైతం అటాచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment