Rural Development Minister
-
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
రాంచీ: కాంగ్రెస్ నేత, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) పనిమనిషి ఇంట్లో బ్యాగుల కొద్దీ నోట్ల కట్టలు బయటపడటం సంచలనం రేపుతోంది. సోమవారం రాంచీలోని గడీఖానా చౌక్‌లోని పనిమనిషి జహంగీర్ ఆలం ఫ్లాట్‌లో సోదాలు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బయటపెట్టారు. మంత్రి ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారని చెబుతున్నారు. దాదాపుగా అన్నీ రూ.500 నోట్ల కట్టలు కాగా, కొన్ని ఆభరణాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు 17 గంటలపాటు లెక్కించిన సొమ్ము రూ.35.23 కోట్లుగా తేలిందన్నారు. ఆరు యంత్రాలతో లెక్కింపు కొనసాగుతోందని చెప్పారు. మొత్తం ఆరు చోట్ల సోదాలు జరపగా మరో చోట రూ.3 కోట్ల నగదు బయటపడినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామంపై కాంగ్రెస్‌కు చెందిన మంత్రి ఆలం స్పందిస్తూ.. ప్రభుత్వం నాకు సమకూర్చిన ప్రైవేట్ కార్యదర్శికి చెందిన ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు టీవీల్లో చూశానన్నారు. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. గత ఏడాది అరెస్ట్ చేసిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ రిటైర్డు చీఫ్ ఇంజినీర్ వీరేంద్రకుమార్ రామ్‌పై ఉన్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా దాడులు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో రామ్‌కు చెందిన రూ.39 కోట్ల ఆస్తులను సైతం అటాచ్ చేసింది. -
కర్ణాటక సీఎంపై గవర్నర్‌కు మంత్రి ఫిర్యాదు
బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తీరుపై బుధవారం గవర్నర్ వజూభాయ్ వాలాకు ఫిర్యాదు చేశారు. తన శాఖ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఐదు పేజీల ఫిర్యాదు పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. తన శాఖకు సంబంధించిన పలు పరిపాలనా సంబంధమైన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈశ్వరప్ప చెప్పారు. తనకు తెలియకుండానే తన శాఖ నుంచి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. యడియూరప్పకు సన్నిహితుడిగా ఈశ్వరప్ప పేరు పొందారు. ఇటీవల ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. -
'దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్'
చీపురుపల్లి (విజయనగరం) : 'డాక్టర్లూ.. ఏమిటి మీ సమస్య? నా వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) మీతో మాట్లాడితే తప్పేంటి? నేను రాష్ట్ర మంత్రిని. రాష్ట్రంలో అందరితోనూ మాట్లాడలేను కదా...! మీకు ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోండి... దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదు' రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ప్రభుత్వ వైద్యులతో అన్న మాటలు ఇవి. మంత్రి పీఎస్ రామకృష్ణ తమను వేధిస్తున్నారంటూ వైద్యులు, ప్రజాప్రతినిధులు, డీఎంహెచ్ఓ వద్ద మొరపెట్టుకున్న విషయాలపై ఈ నెల 10న 'సాక్షి' మెయిన్ ఎడిషన్‌లో 'ఆయనకో దండం' శీర్షికన కథనం వెలువడిన సంగతి తెలిసిందే. శుక్రవారం చీపురుపల్లి వెళ్లిన మంత్రి మృణాళిని స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను పిలిపించి మరీ వారిపై మండిపడ్డారు. వైద్యులంతా రోజూ ఎందుకు విధులకు రావడం లేదని ప్రశ్నించారు. సెలవులు పెట్టకుండా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి క్యాంపులకు వెళ్లిపోతే ఎవరూ అడగకూడదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే రాసిచ్చేయాలని.. దాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని హెచ్చరించారు. -
మృణాళిని ఆకస్మిక తనిఖీలు
విజయనగరం: విజయనగరం జిల్లా చీపురపల్లిలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యురాలు కిమిడి మృణాళిని మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా స్థానిక బాలుర పాఠశాలను ఆమె సందర్శించారు. విధులు సక్రమంగా నిర్వహించని ఉపాధ్యాయులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన 14 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేయాలని మృణాళిని ఉన్నతాధికారులను ఆదేశించారు. పాఠశాలలో సౌకర్యాలపై ఆమె ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సౌకర్యాలను మెరుగుపరచాలని మృణాళిని ఆధికారులకు సూచించారు. -
లక్ష్యం కోసం శ్రమించాలి
విజయనగరం అర్బన్ : లక్ష్యం కోసం శ్రమించాలని అప్పుడే లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలను అందుకోగల మని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. ఇక్కడ క్షత్రియ కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన బడి పిలుస్తోంది .. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. తొలుత కోట వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడకుండా ఏదీ సాధించలేమని.. లక్ష్యాన్ని చేరుకోడానికి కష్టపడాలన్నారు. ఎన్నికలతోనే రాజకీయూలు పోయూయని, వ్యవస్థను నడిపించేందుకు అందరూ కలిసి పని చేయూలన్నారు. పిల్లల దగ్గరకు వెళ్తే సమస్యలు తెలుస్తాయని.. వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. బడి బయట ఉన్న వారందరినీ బడిలో చేర్పించేందుకు ఉద్దేశించిన బడి పిలుస్తోందిరా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. నీతి కథలకో పీరియడ్... ప్రస్తుత సమాజంలో పిల్లలకు నీతి కథలు బోధించాల్సిన అవసరం ఉందని, అందుకో పీరియడ్ కేటారుుంచాలని మృణాళిని అన్నారు. చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉండాలని, ఇందుకు నీతికథలు దోహదపడతాయని చెప్పారు. ఈ తరానికి నీతిని బోధించేందుకు తప్పనిసరిగా ఒక పీరియడ్ ఉండాలని అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో విద్యతో పాటు బహిరంగ మల విసర్జనపై అవగాహన కల్పించాలన్నారు. దీనికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో అన్ని టాయ్లెట్లు పని చేసేలా చూడాలని, నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలసి సూచించారు. కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ జిల్లా సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు అంద రం కలిసి పని చేయూలని పిలుపునిచ్చారు. ఎంఈఓలు, ఎంపీడీఓలు గ్రామాల్లో తిరిగి బడి బయట ఉన్న వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి పంపించేందుకు ఒప్పించాలన్నారు. బడి బయట ఉన్న వారిని, బాల కార్మికులుగా పని చేస్తున్న వారిని గుర్తించి బడిలో చేర్పించాలని కోరారు. కేజీబీవీల్లో సుమారు 600 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆడ పిల్లలందరినీ చేర్పించాలని సూచించారు. ఇందులో భాగంగా మంత్రి చేతుల మీదుగా నీడ్ స్వచ్ఛంద సంస్థ ముద్రించిన విద్యాహక్కు చట్టంపై అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్డీఓ వెంకటరావు, డీఈఓ కృష్ణారావు, పీఓ శారద, డిప్యూటీ ఈఓ నాగమణి, డైట్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు!
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఆయన మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్లు అధికం కావడంతో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తు అంశంపై మోడీ త్వరలో తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనిపై ప్రజలకు ఏమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజానేతగా గుర్తింపు ఉన్న ముండే మృతి మాత్రం పార్టీకి తీరని లోటేనన్నారు. తొలిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు ముండే మంగళవారం ఉదయం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముంబై వెళ్లడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ముండే తన కారులో (మారుతి సుజుకి ఎస్ఎక్స్4) వెళ్తుండగా పృథ్వీరాజ్ రోడ్డు-తుగ్లక్ రోడ్డు సర్కిల్ వద్ద 6:20 గంటలకు మరో కారు (టాటా ఇండికా) పక్క వైపు నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. -
గోపీనాథ్ ముండే దుర్మరణం...
ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి కన్నుమూత ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఘటన ఆయన కారును ఢీకొట్టిన మరో కారు షాక్‌కు గురవడంతో తీవ్ర గుండెపోటు అంతర్గత అవయవాలకూ గాయాలు హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించినా దక్కని ప్రాణం నేడు అధికార లాంఛనాలతో మహారాష్ట్రలోని పర్లీలో అంత్యక్రియలు న్యూఢిల్లీ: వారం కిందటే తొలిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు గోపీనాథ్ ముండే (64) మంగళవారం ఉదయం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. గ్రామీణాభివృద్ధిశాఖ సహా మూడు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న ముండే మరణంతో కొత్త కేబినెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన స్వరాష్ట్రంతోపాటు దేశమంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ముంబై వెళ్లడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ముండే తన కారులో (మారుతి సుజుకి ఎస్ఎక్స్4) వెళ్తుండగా పృథ్వీరాజ్ రోడ్డు-తుగ్లక్ రోడ్డు సర్కిల్ వద్ద 6:20 గంటలకు మరో కారు (టాటా ఇండికా) పక్క వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ముండే కూర్చున్న వైపు (వెనక సీటు) నుంచి కారు ఢీకొనడంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలవడంతోపాటు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోనే ఉన్న ఆయన పీఏ ఎస్. నాయర్, కారు డ్రైవర్లు హుటాహుటిన ముండేను సమీపంలోని ఎయిమ్స్ అత్యవసర చికిత్సా విభాగానికి 6.30 గంటల సమయంలో తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆయనలో చలనం లేదు. శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం ఆగిపోయాయి. బీపీ, పల్స్‌రేటు కూడా కనిపించలేదు. అయినా వైద్యులు ఆయన్ను బ్రతికించేందుకు విశ్వప్రయత్నం చేశారు. గుండె తిరిగికొట్టుకునేలా 15 నిమిషాలపాటు ప్రయత్నించినా లాభంలేకపోయింది. దీంతో ఆయన మృతిచెందినట్లు ఉదయం 7.20 గంటలకు ఎయిమ్స్ అత్యవసర చికిత్సా విభాగం చీఫ్ డాక్టర్ అమిత్ గుప్తా ప్రకటించారు. డ్రైవర్ అరెస్ట్...బెయిల్‌పై విడుదల ముండే కారును ఢీకొట్టే క్రమంలో ఇండికా కారు అరబిందో చౌక్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ను ఉల్లంఘించిందని పోలీసులు తెలిపారు. ఆ కారు డ్రైవర్ గుర్విందర్సింగ్ను అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి రూ. 30 వేల చొప్పున రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసిందన్నారు. ప్రమాద ఘటనపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో ఇంటలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దర్యాప్తు చేపట్టనున్నాయన్నారు. ఈ ప్రమాదంలో ముండే ముక్కుకు స్వల్ప గాయమైందని, ఆ సమయంలో ఆయన మంచినీరు కావాలని అడిగారని...తనను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పినట్లు వివరించారు. చిట్లిన కాలేయం...: పోస్టుమార్టం నివేదికలో వెల్లడి ప్రమాదం తీవ్రతకు ముండే కాలయం చిట్లిపోయి అంతర్గత రక్తస్రావమైనట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. అదే సమయంలో షాక్‌కు గురికావడం వల్ల తీవ్రమైన గుండెపోటు రావడం కూడా ఆయన మృతికి కారణమైందని పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్ వైద్య బృందం పేర్కొంది. కాగా, మెడ వెనకాల ఆయన వెన్నెముక రెండు చోట్ల విరిగిందని...అందువల్ల మెదడు, ఊపిరితిత్తులకు రక్తసరఫరా నిలిచిపోవడం కూడా ఆయన మరణానికి దారితీసిందని స్వయంగా ఈఎన్టీ సర్జన్ అయిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆ తర్వాత విలేకరులకు తెలిపారు. ముండే కాలేయంలో రెండు, మూడు చోట్ల పగుళ్లు కనిపించాయని, గాయం కారణంగా ఉదరంలో 1.5 లీటర్ల రక్తం చేరిందన్నారు. కేంద్ర కేబినెట్ సంతాపం ముండే హఠాన్మరణం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమై ముండే ఆకస్మిక మరణంపట్ల సంతాప తీర్మానం చేసింది. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడింది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మాస్ నాయకుడిగా పేరుతెచ్చుకున్న ముండే మరణంతో దేశం ఓ దార్శనికుడిని కోల్పోయిందని పేర్కొంది. యావత్ దేశం తరఫున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. మంగళవారం జాతీయ సంతాప దినంగా పాటించింది. నేడు అంత్యక్రియలు గోపీనాథ్ ముండే అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్న పార్లీలో బుధవారం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. కాగా, అంతకుముందు ముండే మృతికి గౌరవసూచికంగా దేశ రాజధాని ఢిల్లీ సహా, అన్ని రాష్ట్రాల రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను మంగళవారం అవనతం చేశారు.