గోపీనాథ్ ముండే దుర్మరణం...
-
ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి కన్నుమూత
-
ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఘటన
-
ఆయన కారును ఢీకొట్టిన మరో కారు
-
షాక్‌కు గురవడంతో తీవ్ర గుండెపోటు
-
అంతర్గత అవయవాలకూ గాయాలు
-
హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించినా దక్కని ప్రాణం
-
నేడు అధికార లాంఛనాలతో మహారాష్ట్రలోని పర్లీలో అంత్యక్రియలు
న్యూఢిల్లీ: వారం కిందటే తొలిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు గోపీనాథ్ ముండే (64) మంగళవారం ఉదయం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. గ్రామీణాభివృద్ధిశాఖ సహా మూడు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న ముండే మరణంతో కొత్త కేబినెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన స్వరాష్ట్రంతోపాటు దేశమంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ముంబై వెళ్లడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ముండే తన కారులో (మారుతి సుజుకి ఎస్‌ఎక్స్4) వెళ్తుండగా పృథ్వీరాజ్ రోడ్డు-తుగ్లక్ రోడ్డు సర్కిల్ వద్ద 6:20 గంటలకు మరో కారు (టాటా ఇండికా) పక్క వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ముండే కూర్చున్న వైపు (వెనక సీటు) నుంచి కారు ఢీకొనడంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలవడంతోపాటు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.
ప్రమాదం జరిగిన వెంటనే కారులోనే ఉన్న ఆయన పీఏ ఎస్. నాయర్, కారు డ్రైవర్‌లు హుటాహుటిన ముండేను సమీపంలోని ఎయిమ్స్ అత్యవసర చికిత్సా విభాగానికి 6.30 గంటల సమయంలో తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆయనలో చలనం లేదు. శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం ఆగిపోయాయి. బీపీ, పల్స్‌రేటు కూడా కనిపించలేదు. అయినా వైద్యులు ఆయన్ను బ్రతికించేందుకు విశ్వప్రయత్నం చేశారు. గుండె తిరిగికొట్టుకునేలా 15 నిమిషాలపాటు ప్రయత్నించినా లాభంలేకపోయింది. దీంతో ఆయన మృతిచెందినట్లు ఉదయం 7.20 గంటలకు ఎయిమ్స్ అత్యవసర చికిత్సా విభాగం చీఫ్ డాక్టర్ అమిత్ గుప్తా ప్రకటించారు.
డ్రైవర్ అరెస్ట్...బెయిల్‌పై విడుదల
ముండే కారును ఢీకొట్టే క్రమంలో ఇండికా కారు అరబిందో చౌక్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ను ఉల్లంఘించిందని పోలీసులు తెలిపారు. ఆ కారు డ్రైవర్ గుర్విందర్‌సింగ్‌ను అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి రూ. 30 వేల చొప్పున రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసిందన్నారు. ప్రమాద ఘటనపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో ఇంటలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దర్యాప్తు చేపట్టనున్నాయన్నారు. ఈ ప్రమాదంలో ముండే ముక్కుకు స్వల్ప గాయమైందని, ఆ సమయంలో ఆయన మంచినీరు కావాలని అడిగారని...తనను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పినట్లు వివరించారు.
చిట్లిన కాలేయం...: పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ప్రమాదం తీవ్రతకు ముండే కాలయం చిట్లిపోయి అంతర్గత రక్తస్రావమైనట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. అదే సమయంలో షాక్‌కు గురికావడం వల్ల తీవ్రమైన గుండెపోటు రావడం కూడా ఆయన మృతికి కారణమైందని పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్ వైద్య బృందం పేర్కొంది. కాగా, మెడ వెనకాల ఆయన వెన్నెముక రెండు చోట్ల విరిగిందని...అందువల్ల మెదడు, ఊపిరితిత్తులకు రక్తసరఫరా నిలిచిపోవడం కూడా ఆయన మరణానికి దారితీసిందని స్వయంగా ఈఎన్‌టీ సర్జన్ అయిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆ తర్వాత విలేకరులకు తెలిపారు. ముండే కాలేయంలో రెండు, మూడు చోట్ల పగుళ్లు కనిపించాయని, గాయం కారణంగా ఉదరంలో 1.5 లీటర్ల రక్తం చేరిందన్నారు.
కేంద్ర కేబినెట్ సంతాపం
ముండే హఠాన్మరణం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమై ముండే ఆకస్మిక మరణంపట్ల సంతాప తీర్మానం చేసింది. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడింది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మాస్ నాయకుడిగా పేరుతెచ్చుకున్న ముండే మరణంతో దేశం ఓ దార్శనికుడిని కోల్పోయిందని పేర్కొంది. యావత్ దేశం తరఫున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. మంగళవారం జాతీయ సంతాప దినంగా పాటించింది.
నేడు అంత్యక్రియలు
గోపీనాథ్ ముండే అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్న పార్లీలో బుధవారం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. కాగా, అంతకుముందు ముండే మృతికి గౌరవసూచికంగా దేశ రాజధాని ఢిల్లీ సహా, అన్ని రాష్ట్రాల రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను మంగళవారం అవనతం చేశారు.