సర్టిఫికెట్ల పరిశీలనకు దూరమై ఉద్యోగాన్ని వదులుకున్న మరో 13 మంది
674 మంది ఏఈఈలకు విధుల్లో చేరింది 310 మందే
హైదరాబాద్‌లో పోస్టింగ్ పొందిన 10 మందిలో విధుల్లో చేరింది 9 మంది
సాక్షి, హైదరాబాద్: సర్కారీ ఉద్యోగం వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కొందరు అభ్యర్థులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. టీజీపీఎస్సీ ద్వారా రాష్ట్ర నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా 687 మంది ఎంపిక కాగా, 674 మంది మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన 13 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు దూరంగా ఉండటం ద్వారా ఉద్యోగావకాశాన్ని వదులుకున్నారు.
నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఈ నెల 25 నాటికి పోస్టింగ్ పొందిన చోట రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా, మంగళవారం నాటికి కేవలం 310 మంది మాత్రమే రిపోర్టు చేశారు. గత నెల 26న నియామక పత్రాలు అందజేయగా, రిపోర్టు చేయడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలున్నాయి. యువ ఇంజనీర్లకు తొలి పోస్టింగ్‌ను గ్రామీణ ప్రాంతాల్లోనే ఇస్తామని, ఎలాంటి ఒత్తిళ్లను తీసుకురావద్దని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారికి పోస్టింగ్ ఇచ్చే సమయంలో స్పష్టం చేశారు.
హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ పరిధిలో 10 మంది ఏఈఈలకు పోస్టింగ్ ఇస్తే ఇప్పటికి 9 మంది రిపోర్టు చేశారు. మహబూబ్‌నగర్ సీఈకి 48 మందిని కేటాయిస్తే కేవలం 8 మంది, నల్లగొండ సీఈకి 76 మందిని కేటాయిస్తే 49 మంది, సూర్యాపేట సీఈకి 32 మందిని కేటాయిస్తే కేవలం ఇద్దరు, ఆదిలాబాద్ సీఈకి 24 మందిని కేటాయిస్తే 15 మంది, వనపర్తి సీఈకి 53 మందిని కేటాయిస్తే 16 మంది, వరంగల్ సీఈకి 30 మందిని కేటాయిస్తే ఏడుగురు, గజ్వేల్ సీఈకి 72 మందిని కేటాయిస్తే 12 మంది, కరీంనగర్ సీఈకి 45 మందిని కేటాయిస్తే 14 మంది మాత్రమే ఇప్పటి వరకు విధుల్లో చేరారు.
చదవండి: మొక్కుబడిగా వాహనాల స్క్రాప్ పాలసీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ సారూ!
నియామక పత్రాలు పొందిన 674 మందిలో 10 మంది ఐఐటీ డిగ్రీ, 21 మంది ఐఐటీ పీజీ, 50 మంది ఎన్‌ఐటీ డిగ్రీ, 33 మంది ఎన్‌ఐటీ పీజీ చేసిన వారున్నారు. మొత్తం 114 మంది ఐఐటీ, ఎన్‌ఐటీ ఇంజనీర్లు ఉండగా, వీరిలో అధిక శాతం సర్కారీ కొలువుల్లో చేరేందుకు ఆసక్తి చూపకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment