assistant engineer
-
పల్లెల్లో సర్కారీ కొలువులపై అనాసక్తి.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: సర్కారీ ఉద్యోగం వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కొందరు అభ్యర్థులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. టీజీపీఎస్సీ ద్వారా రాష్ట్ర నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా 687 మంది ఎంపిక కాగా, 674 మంది మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన 13 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు దూరంగా ఉండటం ద్వారా ఉద్యోగావకాశాన్ని వదులుకున్నారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఈ నెల 25 నాటికి పోస్టింగ్ పొందిన చోట రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా, మంగళవారం నాటికి కేవలం 310 మంది మాత్రమే రిపోర్టు చేశారు. గత నెల 26న నియామక పత్రాలు అందజేయగా, రిపోర్టు చేయడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలున్నాయి. యువ ఇంజనీర్లకు తొలి పోస్టింగ్‌ను గ్రామీణ ప్రాంతాల్లోనే ఇస్తామని, ఎలాంటి ఒత్తిళ్లను తీసుకురావద్దని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారికి పోస్టింగ్ ఇచ్చే సమయంలో స్పష్టం చేశారు. హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ పరిధిలో 10 మంది ఏఈఈలకు పోస్టింగ్ ఇస్తే ఇప్పటికి 9 మంది రిపోర్టు చేశారు. మహబూబ్‌నగర్ సీఈకి 48 మందిని కేటాయిస్తే కేవలం 8 మంది, నల్లగొండ సీఈకి 76 మందిని కేటాయిస్తే 49 మంది, సూర్యాపేట సీఈకి 32 మందిని కేటాయిస్తే కేవలం ఇద్దరు, ఆదిలాబాద్ సీఈకి 24 మందిని కేటాయిస్తే 15 మంది, వనపర్తి సీఈకి 53 మందిని కేటాయిస్తే 16 మంది, వరంగల్ సీఈకి 30 మందిని కేటాయిస్తే ఏడుగురు, గజ్వేల్ సీఈకి 72 మందిని కేటాయిస్తే 12 మంది, కరీంనగర్ సీఈకి 45 మందిని కేటాయిస్తే 14 మంది మాత్రమే ఇప్పటి వరకు విధుల్లో చేరారు.చదవండి: మొక్కుబడిగా వాహనాల స్క్రాప్ పాలసీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ సారూ!నియామక పత్రాలు పొందిన 674 మందిలో 10 మంది ఐఐటీ డిగ్రీ, 21 మంది ఐఐటీ పీజీ, 50 మంది ఎన్ఐటీ డిగ్రీ, 33 మంది ఎన్ఐటీ పీజీ చేసిన వారున్నారు. మొత్తం 114 మంది ఐఐటీ, ఎన్ఐటీ ఇంజనీర్లు ఉండగా, వీరిలో అధిక శాతం సర్కారీ కొలువుల్లో చేరేందుకు ఆసక్తి చూపకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1,661 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,553 జూనియర్ లైన్‌మన్ పోస్టుల భర్తీకి గురువారం సమగ్ర నియామక ప్రకటనలు జారీ అయ్యాయి. ఏఈ పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 15వరకు.. జేఎల్ఎం పోస్టులకు వచ్చే నెల 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రెండు పరీక్షలకు కూడా ఏప్రిల్ 24 నుంచి ఆన్లైన్లో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30న రాతపరీక్ష నిర్వహించనున్నారు. గరిష్ట వయోపరిమితి జేఎల్ఎం పోస్టులకు 35 ఏళ్లు, ఏఈ పోస్టులకు 44 ఏళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు అర్హులు. జూనియర్ లైన్‌మన్ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్మన్ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్సైట్ (https://tssouthernpower.cgg.gov.in) ను సందర్శించవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రకటించింది. -
టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,601 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 48 అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి గురువారం వేర్వేరు నియామక ప్రకటనలు జారీ చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల స్వీకరణ తదితర వివరాలతో ఈ నెల 15 లేదా ఆ తర్వాత పూర్తి స్థాయి నియామక ప్రకటనను సంస్థ వెబ్సైట్ల(www.tssouthernpower.com లేదా tssouthern-power.cgg.gov.in)) లో పొందుపరచనున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టులకు అర్హులు కానున్నారు. జూనియర్ లైన్మెన్ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి. గతేడాది 1,000 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్టు గుర్తించడంతో ఆ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దుచేశారు. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు పోస్టుల సంఖ్యను 1,553కి పెంచి తాజాగా సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. -
టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,661 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న 1,553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు కలిపి మొత్తం 1,661 పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాపై మంగళవారం ఆయన మింట్ కాంపౌండ్ లోని తన కార్యాలయంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డితో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏడాదికేడాది విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోందని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 6,666 మెగావాట్లు ఉన్న గరిష్ట విద్యుత్ డిమాండ్ గతేడాది యాసంగిలో 14,160 మెగావాట్లకు పెరిగిందన్నారు. వచ్చే వేసవిలో 15,500 మెగావాట్లకు మించనుందని, అందుకు తగ్గట్టు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎండీలను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, గృహ వినియోగదారుల పెరుగుదల, వ్యవ సాయ రంగానికి ఉచితవిద్యుత్ సరఫరాతో డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు. -
నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎంత ధైర్యం రా.. నాకే నోటీసు ఇస్తావా.. నువ్వు ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా...’ అంటూ టీడీపీ నాయకుడు కూన రవి సోదరుడు, కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఓ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉద్యోగిపై రెచ్చిపోయారు. అంతటితో ఆగలేదు.. ఏకంగా కొట్టేసేంతలా చెయ్యి ఎత్తి బెదిరించారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. రాయలేని భాషలో పరుష పదజాలంతో వీరంగం సృష్టించారు. తాను కాంట్రాక్ట్ తీసుకున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ కేసీహెచ్ మహంతిపైనే దౌర్జన్యానికి దిగారు. ఈనెల 10న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ‘సాక్షి’ ఆరా తీయగా అసలు విషయాలు తెలిశాయి. అలవాటు ప్రకారమే.. టీడీపీ నేతల రౌడీయిజం ఆగలేదు. పదవులు పోయి మూడేళ్లయినా అధికార దర్పం దిగలేదు. సామాన్య ప్రజలను తిట్టినట్టు అధికారులపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్పటికే అనేక మార్లు అధికారులకు బెదిరింపులు, దాడులు చేసిన ఘటనలు ప్రజలకు తెలుసు. కేసులు నమోదై, అరెస్టుల వరకు వెళ్లాయి. అయినా వారి పంథా మారడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా కూన రవికుమార్ మాదిరిగా ఆయన సోదరుడు కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ దౌర్జన్య కాండకు దిగారు. శ్రీకాకుళంలోని పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయంలో బరితెగించి వ్యవహరించారు. తాను వేస్తున్న రోడ్డు పనుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, నాణ్యతా లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినందుకు అసిస్టెంట్ ఇంజినీర్ మహంతిని కొట్టేంత పనిచేశారు. కార్యాలయంలో అందరి ఉద్యోగుల ముందే అసిస్టెంట్ ఇంజినీర్ మీదకొచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా చెయ్యి ఎత్తి తన అహంకారాన్ని ప్రదర్శించారు. దౌర్జన్యానికి మారుపేరైన కూన రవికుమార్.. సోదరుడు కావడంతో తోటి సిబ్బంది కూడా చోద్యం చూశారే తప్ప తప్పు అని చెప్పలేకపోయారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేక, పై అధికారులు ముందుకు రాక అసిస్టెంట్ ఇంజినీర్ మహంతి కుంగిపోతున్నారు. యూనియన్ లీడరైన తనకే ఇలా జరిగితే.. మిగతా ఉద్యోగుల మాటేంటని బాధపడుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం.. శ్రీకాకుళం మండలం ఎన్‌హెచ్–16 (శాస్త్రుల పేట) నుంచి సానివాడ మీదుగా వప్పంగి వరకు రూ.2.69 కోట్ల పీఎంజీఎస్‌వై నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి గత ఏడాది మే 24న అగ్రిమెంట్ కుదిరింది. ఈ ప్రకారం ఏడాదిలోగా పనులను పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణతో పీఆర్ పీఐయూ విభాగం అగ్రిమెంట్ అయ్యింది. అయితే కాలపరిమితి పూర్తయినప్పటికీ ఏడాది కాలంలో ఒక్క రాయి కూడా వేయలేదు. తీరా ఇంజినీరింగ్ అధికారులు గట్టిగా అడిగితే.. కోవిడ్ కారణంగా రోడ్డు నిర్మాణం ప్రారంభించలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌కు వెసలు బాటు కల్పించారు. దీంతో మే నెల నుంచి రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ.. నిబంధనలకు పూర్తిగా పాతరేశాడు. దీంతో ఏఈ మహంతి నిర్మాణ పనులపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అలార్మింగ్ లెటర్(లోటుపాట్లు సరిచేసుకోండని చెప్పే పత్రం) ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ విషయం తెలుసుకున్న కూన సత్యనారాయణ ఈ నెల 10న పీఆర్ డివిజనల్ కార్యాలయానికి వచ్చి వీరంగం వేశారు. ఏఈ మహంతిపై దురుసుగా ప్రవర్తించాడు. తొలుత అసిస్టెంట్ ఇంజినీర్‌తో వాగ్వాదం చేసి.. ఆ తర్వాత పళ్లు బిగించి కళ్లు ఎర్రజేసి, కొట్టడానికి చెయ్యెత్తారు. నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి, పాతేస్తానంటూ బెదిరించి దౌర్జన్యానికి దిగారు. అసిస్టెంట్ ఇంజినీర్ చేసేదేమి లేక ‘కొట్టేయండి సార్.. కొట్టేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది కదా’ అని నిస్సహాయంగా స్పందించారు. అయినా కూన వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో పీఏ టు ఈఈ, మరో ముగ్గురు నా కేడర్ ఏఈలు, క్లరికల్ స్టాఫ్ అంతా ఉన్నారు. కానీ కూనకు భయపడి ఎవరూ ఏమీ అనలేకపోయారు. దీంతో ఆ అసిస్టెంట్ ఇంజినీర్ తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని కుమిలిపోతున్నారు. (క్లిక్ చేయండి: అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అచ్చెన్న అనుచరుడు!) -
833 ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి 833 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీల్లోఖాళీలున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈనెల 23న టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ కార్యదర్శి తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28 నుంచి వచ్చేనెల 21వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
విద్యుత్ ఏఈ రాత పరీక్ష ఫలితాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 70 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి జూలై 17న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను గురువారం సంస్థ యాజమాన్యం ప్రకటించింది. వివరాల కోసం సంస్థ వెబ్సైట్ (https:// www.tssouthernpower.com)ను చూడాలని అభ్యర్థులకు సూచించింది. -
జెన్కోలో 250 ఏఈ పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నుంచి త్వరలో సుమారు 250 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తికాకపోవడంతో పోస్టుల సంఖ్యపై స్పష్టత రాలేదు. దాదాపు 150 ఏఈ(ఎలక్ట్రికల్), 88 ఏఈ (సివిల్) పోస్టులు ఉండనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. మిగిలిన పోస్టులు మెకానికల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ జారీకి కనీసం నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జెన్కో స్వయంగా నోటిఫికేషన్ జారీ చేయనుండగా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ జరగనుంది. రాతపరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్రంలోని ఏదైనా యూనివర్సిటీకి అప్పగించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్వహణ అవసరాల కోసం ఏఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఏఈలను భర్తీ చేయాలని భావిస్తే.. మరో 130 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. త్వరలో నియామకాలపై జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకోనుంది. -
మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు
విశాఖపట్నం/చోడవరం టౌన్: మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి బాధిస్తున్న ఎలక్ట్రికల్ ఏఈకి బుద్ధి చెప్పారు. విశాఖ జిల్లా చోడవరం ఎలక్ట్రికల్ కార్యాలయంలో సబ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఒక దళిత మహిళను రెండు నెలలుగా అదే కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న రామలింగేశ్వరరావు లైంగికంగా వేధిస్తున్నాడు. ఇది పద్ధతి కాదని నచ్చచెప్పినా ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులకు సమస్యను తెలిపింది. దీంతో మంగళవారం మహిళా ఉద్యోగి భర్త, కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు చీడికాడ రోడ్డులోవున్న ఎలక్ట్రికల్ కార్యాలయానికి వచ్చి ఏఈ రామలింగేశ్వరరావుతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఏఈ వారికి క్షమాపణలు చెప్పారు. అనంతరం బాధిత ఉద్యోగి బంధువులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులతో చర్చలు జరిపి కేసును రాజీ చేశారు. దీనిపై ఎస్సై విభూషణరావును వివరణ కోరగా ఈ కేసుపై బాధిత ఉద్యోగి నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్: డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు శుభవార్త...
ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు శుభ వార్త. రాష్ట్రంలో ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది! దీనిద్వారా పలు శాఖల్లో 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులు ఏఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే చక్కటి ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. గత కొద్ది రోజులుగా వరుస నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగార్థుల్లో ఆశలు నింపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నోటిఫికేషన్‌తో ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో.. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. చదవండి: ఆర్ఆర్సీ– ఎన్సీఆర్లో భారీగా అప్రెంటిస్ ఖాళీలు మొత్తం పోస్టులు 190 ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది విభాగాల్లో 190 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్‌లలో 155 తాజా పోస్ట్‌లు కాగా, 35 పోస్ట్‌లను క్యారీ ఫార్వర్డ్ పోస్ట్‌లు(గత నోటిఫికేషన్లో భర్తీ కానివి)గా పేర్కొన్నారు. ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460–రూ.84,970 లభిస్తుంది. అర్హతలు ► ఏపీ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోని ఈ ఏఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు డిప్లొమా, బీఈ/బీటెక్ అభ్యర్థులు అర్హులు. ► దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌ను అనుసరించి ఆయా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. ► వయోపరిమితి: జూలై 1,2021 నాటికి 18–42ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. చదవండి: ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగాలు ఎంపిక విధానం రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌లు, అందుబాటులో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. తుది విజేతల జాబితా విడుదల చేసి.. నియామకాలు ఖరారు చేస్తారు. రాత పరీక్ష ఇలా రాత పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ప్రశ్నపత్రం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 150 150ని 2 సివిల్/మెకానికల్ 150 150 150ని 3 ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్/ సివిల్ 150 150 150ని ► పేపర్–3 పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో ఎన్విరాన్మెంట్/సివిల్ ఏఈ పోస్ట్‌లకు మాత్రమే (పోస్ట్ కోడ్–3) నిర్వహిస్తారు. ► పేపర్ 2 అన్ని శాఖల్లోని సివిల్/మెకానికల్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది. ఈ ప్రశ్న పత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది. ► నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా అమలు చేయనున్నారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు. విజయానికి మార్గం ఇదిగో పేపర్–1 ఇలా ► పేపర్–1 జనరల్ స్టడీస్‌లో.. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ సమకాలీన అంశాలు, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ; ఏపీ, ఇండియా హిస్టరీ; పాలిటీ, గవర్నెన్స్; ఏపీలో అమలవుతున్న ఈ–గవర్నెన్స్ విధానాలు; ఆర్థికాభివృద్ధి అంశాలు, ఏపీలో ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న చర్యలు; డిజాస్టర్ మేనేజ్మెంట్; ఏపీ, ఇండియా ఫిజికల్ జాగ్రఫీ అంశాలపై దృష్టి పెట్టాలి. ► అదేవిధంగా లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్లను ప్రాక్టీస్ చేయాలి. ► డేటా అనాలిసిస్ విషయంలో డేటా విశదీకరణ, విశ్లేషణ, డేటా రూపకల్పన తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పేపర్–2లో ఉమ్మడిగా సివిల్, మెకానికల్ ఏఈ పోస్ట్‌లకు ఉమ్మడిగా నిర్వహించే పేపర్ ఇది. ఇందులో విజయానికి అభ్యర్థులు సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్‌లోని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. డిప్లొమా స్థాయిలో ప్రశ్నలు ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలకు సంబంధించి డిప్లొమా లేదా బీటెక్ పుస్తకాలను చదవడం మేలు చేస్తుంది. అదే విధంగా ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన ఏఈ ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. పేపర్–3లో రాణించాలంటే ► పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో.. ఎన్విరాన్మెంట్ ఏఈ పోస్ట్‌లకు మాత్రమే నిర్వహించే ఈ పేపర్లో ఎన్విరాన్మెంటల్/సివిల్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వాటర్ సప్లయి ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, వాయు, శబ్ద కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్,డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్,బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ విభాగాల్లోని ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి. ► ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కోసం దేశంలో అమలవుతున్న విధానాలు,చేపడుతున్న చర్యలు,పర్యావరణ పరిరక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. సిలబస్ క్షుణ్నంగా అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌లు, వాటికి సంబంధించి రాత పరీక్షలో పేర్కొన్న సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. దాని ఆధారంగా తాము కొత్తగా చదవాల్సిన అంశాలతోపాటు, ఇప్పటికే అవగాహన ఉన్న టాపిక్స్‌పై స్పష్టత లభిస్తుంది. ఫలితంగా ప్రిపరేషన్లో ఏ అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలో ముందే నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగా సమయ పాలనతో ముందుకు సాగాలి. అకడమిక్ పుస్తకాలు ► సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకున్నాక..ఆయా అంశాలకు సంబంధించి బీటెక్ లేదా డిప్లొమా స్థాయిలోని అకడమిక్ పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్లో అప్లికేషన్ అప్రోచ్‌ను అనుసరించాలి. దీనివల్ల ప్రాక్టికల్ థింకింగ్ అలవడి, ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుంది. ► మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్‌లు రాయడం పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది. అదే విధంగా ఆయా బ్రాంచ్‌లకు సంబంధించి ఈసెట్, పీజీఈసెట్ తదితర ఇంజనీరింగ్ సెట్ల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ► పేపర్–2లోని ప్రశ్నలు డిప్లొమా స్థాయిలోనే ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాని అభ్యర్థులు బీటెక్ స్థాయిలోని అంశాలపైనా దృష్టిపెడితే విజయావకాశాలు మరింత మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. -
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్.. అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: అసిస్టెంట్ ఇంజనీర్స్ ► మొత్తం పోస్టుల సంఖ్య: 190 ► విభాగాలు: సివిల్, ఈఎన్‌వీ, మెకానికల్. ► సర్వీస్‌లు: ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, పీహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పంచాయతీరాజ్ అండ్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీస్‌లు, ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీస్. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ /బీటెక్, ఎల్సీఈ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు:01.07.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. దీన్ని మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 21.10.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.11.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in -
యూపీఎస్సీ ఉద్యోగాలు.. ఆన్లైన్లో దరఖాస్తులు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 59 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఇంజనీర్–12, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్–02, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్–09, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్–01, అసిస్టెంట్ సర్వే ఆఫీసర్–04, స్టోర్స్ ఆఫీసర్–01,అసిస్టెంట్ డైరెక్టర్–30. ► విభాగాలు: నావల్ క్వాలిటీ అష్యూరెన్స్, నేవీ, జియోలాజికల్ సర్వే, ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 30ఏళ్లు, 35ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 14.10.2021 ► వెబ్సైట్: upsconline.nic.in శాయ్‌లో 12 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్).. అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► అర్హత: 2019లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు అర్హులు. ► వయసు: 01.08.2019 నాటికి 32ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: యూపీఎస్సీ మార్కులు, క్రీడా విజయాలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.10.2021 ► వెబ్సైట్: sportsauthorityofindia.nic.in -
ఎస్వీయూ ఏఈ నివాసంలో ఏసీబీ సోదాలు
సాక్షి, తిరుపతి : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అసిస్టెంట్ ఇంజినీర్ రుద్రకుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. తిరుపతిలో ఆయన నివాసంతో పాటు, ఎస్వీ వర్సిటీ, నెల్లూరులోని ఏఈ సోదరుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 6 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'జెన్కో' కొలువు జయించానిలా..
పబ్లిక్ పరీక్షలైనా.. పోటీ పరీక్షలైనా.. మౌఖిక పరీక్షలైనా.. మరే ఎగ్జామ్ అయినా.. సిలబస్‌లోని సబ్జెక్టులపై పట్టుంటే విజయం నల్లేరుపై నడకే! లక్ష్య సాధన లాంఛనమే!! భీమవరానికి చెందిన మేడూరి కల్యాణ్ దీనికి చక్కని ఉదాహరణ. అకడమిక్ పరీక్షల తోపాటు పోటీ పరీక్షల్లోనూ ఆయన ఇదే సూత్రం ఆధారంగా అత్యుత్తమ మార్కులు పొందాడు. ఇప్పుడు ‘ఏపీ జెన్కో ఏఈ ఎగ్జామ్–2017’లో ఏకంగా స్టేట్ సెకండ్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తన చదువు కోసం అడిగినవన్నీ సమకూర్చిన తండ్రి (కార్పెంటర్) నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. సర్కారు నౌకరీ సాధించి ఆయనకు గర్వకారణంగా నిలిచాడు. లక్షల్లో వేతనం వచ్చే ప్రైవేట్ జాబ్ కన్నా ఆత్మసంతృప్తినిచ్చే ప్రభుత్వ ఉద్యోగమే మిన్న అనే భావనతో అనుకున్నది సాధించాడు. ఏపీ జెన్కో ఏఈ ఎగ్జామ్ –2017’లో ఏకంగా స్టేట్ సెకండ్ ర్యాంకు కల్యాణ్ సక్సెస్ స్టోరీ తన మాటల్లోనే... స్టార్ట్ 1.. 2.. 3 ఆంధ్రప్రదేశ్ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజెన్కో)లో.. అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి ప్రకటన (ఈ ఏడాది మార్చిలో) జారీ అవుతుందని తెలిసి.. నెల రోజుల ముందుగా ప్రిపరేషన్ మొదలుపెట్టాను. టాప్ లెవలే టార్గెట్: ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించి టాప్ ర్యాంక్ సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉద్యోగం పొందాలంటే టాప్‌లో నిలవాలని నిర్ణయించుకున్నా. ‘వ్యూ’హం ఇదీ..: పరీక్షను 100 మార్కులకు నిర్వహించారు. ఇందులో టెక్నికల్ అంశాలకు 70 మార్కులు; ఆప్టిట్యూడ్‌కు 30 మార్కులు కేటాయించారు. టెక్నికల్ విభాగం కోసం నోటిఫికేషన్‌లోని సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలనూ క్షుణ్నంగా చదివా. ‘సాక్షి’ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఏపీజెన్కో ప్రీవియస్ పేపర్లను విశ్లేషించాను. వాటిలో థియరీ ప్రశ్నలు ఎక్కువ వచ్చినట్లు గమనించి.. ప్రతి సబ్జెక్టునూ పరిపూర్ణంగా అధ్యయనం చేశా. తర్వాత గేట్, ఐఈఎస్, ఇస్రో థియరీ ప్రశ్నలను సాధన చేశాను. ఈ వ్యూహం ఫలించింది. వీడియోలతో సందేహాల నివృత్తి ఆప్టిట్యూడ్ విభాగం కోసం తొలుత ‘ఏపీజెన్కో’తోపాటు టీఎస్జెన్కో ప్రీవియస్ పేపర్లనూ పరిశీలించాను. వాటిలోని ప్రశ్నలకు సంబంధించిన టాపిక్లనే ప్రధానంగా ప్రిపేర్ అయ్యాను. రోజూ వివిధ దినపత్రికల్లో వచ్చిన మాదిరి ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు సమాధానాలను సాధన చేశాను. ఏదైనా అంశం అర్థంకాకపోతే దాన్ని యూట్యూబ్ వీడియోల సాయంతో అవగాహన చేసుకున్నాను. ప్రిపరేషన్లో భాగంగా ఎస్సెస్సీ–జేఈ, సీఐఎల్ ప్రీవియస్ పేపర్లు కూడా ప్రాక్టీస్ చేశాను. మాక్ టెస్టులతో మెళకువలు ఎన్నో మాక్ టెస్టులకు హాజరయ్యాను. తద్వారా పరీక్షల్లో టైమ్ మేనేజ్మెంట్ ప్రాముఖ్యత తెలిసొచ్చింది. కచ్చితత్వమూ అలవడింది. కొత్త టాపిక్‌లు, ట్రిక్స్ తెలిశాయి. ఒక టాపిక్/సబ్జెక్టు చదవడం పూర్తయిన తర్వాత టెస్ట్ సిరీస్‌లు అటెంప్ట్ చేశాను. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సాధ్యమైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయాలి. ప్రకటన నుంచి పరీక్ష వరకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎగ్జామ్ నిర్వహించే రోజు వరకూ.. అందుబాటులో ఉండే సమయం ఎంతో విలువైంది. అందువల్ల దాన్ని ప్రణాళికాబద్దంగా సద్వినియోగం చేసుకున్నాను. రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు గంట సేపు వివిధ దినపత్రికల్లో వచ్చిన ఆప్టిట్యూడ్ ప్రశ్నలను సాధన చేశాను. తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు టెక్నికల్ సబ్జెక్టులు చదవడం; టెస్ట్ సిరీస్‌లు అటెంప్ట్ చేయడం; ముఖ్య పాయింట్లు, ఫార్ములాలు నోట్స్ రూపంలో రాసుకోవడం; గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపించే సూత్రాలను కాగితంపై రాసుకొని గోడకు అంటించి క్రమంతప్పకుండా మననం చేసుకోవడం ద్వారా పరీక్షకు పక్కాగా సంసిద్ధమయ్యాను. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రీవియస్ టెక్నికల్ పేపర్లను సాల్వ్ చేసేవాణ్ని. రెండు వారాల ముందు పరీక్షకు రెండు వారాల సమయం ఉందనగా వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులకు హాజరయ్యాను. చివరి వారంలో.. అప్పటిదాకా చదివిన అంశాలన్నింటినీ రివైజ్ చేసుకున్నాను. రిఫరెన్స్ బుక్స్ ఇస్రో ప్రీవియస్ పేపర్లు; సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లోని ఏపీ, టీఎస్ జెన్కో ప్రీవియస్ పేపర్లు. చిన్న పొరపాటుతో ఫస్ట్ ర్యాంక్ కోల్పోయా పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు తేడాతో అవకాశం తారుమారవుతుంది. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు సిలబస్‌లోని అన్ని సబ్జెక్టులనూ ఆమూలాగ్రం చదవాలి. చిన్న పొరపాటు కూడా దొర్లకుండా చూసుకోవాలి. ఓఎంఆర్ షీట్లో ఆన్సర్లు బబ్లింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఒక ప్రశ్నకు నాకు సమాధానం తెలిసినా.. అనుకోకుండా వేరే ఆప్షన్‌ను బబుల్ చేశాను. దీంతో ఫస్ట్ ర్యాంక్ మిస్సైంది. మిత్రులతో చర్చించండి ఈ పరీక్షలో ఎక్కువ శాతం థియరీ ప్రశ్నలకే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అందువల్ల వాటిని కచ్చితంగా, షార్ట్ కట్లో రాసేందుకు వీలున్న పద్ధతులపై మీలాగే పరీక్షకు ప్రిపేర్ అయ్యే స్నేహితులతో చర్చించాలి. తద్వారా కొత్త మెథడ్స్, ట్రిక్స్ తెలుసుకోవచ్చు. ఎగ్జామ్ హాల్లో ఆందోళన వద్దు పరీక్షలో తొలుత నిమిషం లోపు వ్యవధిలో సమాధానం గుర్తించగల ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి. తర్వాత.. నిమిషం వ్యవధిలో; అనంతరం ఒకటీ రెండు నిమిషాల వ్యవధిలో ఆన్సర్ చేయగల ప్రశ్నలు పరిశీలించాలి. చివరికి సమస్యాత్మక ప్రశ్నల జోలికి వెళ్లాలి. తద్వారా అనవసర ఆందోళనలకు గురయ్యే ఆస్కారం ఉండదు. పరీక్షను ప్రశాంతంగా పూర్తి చేయొచ్చు. ప్రొఫైల్ తండ్రి: మేడూరి వీవీఎస్ఎన్ మూర్తి (కార్పెంటర్); తల్లి: ఎంఎల్ ప్రసన్న(గృహిణి). అకడమిక్ ప్రొఫైల్: ఎస్సెస్సీలో 526/600 మార్కులు ఇంటర్లో 957/1000 మార్కులు; బీటెక్‌లో9.1/10; ఎంటెక్ (మెకానికల్) 9.61/10 (ఐఐటీ గువాహటి). అచీవ్మెంట్లు: బీటెక్ ఫస్టియర్‌లో ఫస్ట్ ర్యాంక్; ‘గేట్’లో 1473 ర్యాంక్; ఎంటెక్‌లో ఉండగా ‘ఆప్టిమైజేషన్ ఆఫ్ బేరింగ్స్’పై జర్నల్ పేపర్ పబ్లిష్ అయింది. ఏపీ జెన్కో పరీక్షలో 100 కు 84 మార్కులతో సెకండ్ ర్యాంక్. -
ఇద్దరు విద్యుత్ ఏఈలకు మెమోలు జారీ
కర్నూలు(రాజ్‌విహార్) : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్ శాఖ ఏపీఎస్పీడీసీఎల్ ఏఈలకు ఆపరేషన్స్ ఎస్ఈ భార్గవరాముడు శనివారం సాయంత్రం మెమోలు జారీ చేశారు. కర్నూలు మండల ఏఈగా పనిచేస్తున్న నాగేంద్ర ప్రసాద్ అందుబాటులో ఉండటం లేదని వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో ఎస్ఈ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో కార్యాలయంలో లేకపోవడంతో ఆయనకు వివరణ కోరారు. ఏఈ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో మెమో జారీ చేశారు. మద్దికెరలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారించగా ఏఈగా పనిచేస్తున్న నారాయణ స్వామి నాయక్ పైఅధికారులు ఏడీఈ, డీఈలకు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైనట్లు తేలడంతో ఎస్ఈ మెమో జారీ చేశారు. -
ఏఎంవీఐ పోస్టులకు నేడు ఆన్లైన్ పరీక్ష
-
ఏఎంవీఐ పోస్టులకు నేడు ఆన్లైన్ పరీక్ష
కమాండ్ సెంటర్‌కు రానున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ పరీక్ష తీరును పరిశీలించనున్న కర్ణాటక బృందం సాక్షి, హైదరాబాద్ : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆదివారం ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుంది. హెచ్ఎండీఏ పరిధిలో ఏర్పాటుచేసిన 15 కేంద్రాల్లో మొత్తం 6,053 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ఆన్లైన్ సీఆర్‌బీటీ పరీక్షల విధానాన్ని అధ్యయనం చేసేందుకు శనివారం కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆరుగురు సభ్యుల బృందం హైదరాబాద్‌కు వచ్చింది. టీఎస్పీఎస్సీ భవన్లో సుమారు 2గంటల పాటు ఆన్లైన్ పరీక్ష విధానాన్ని పరిశీలించిన కర్ణాటక బృందం, ఆదివారం జరగనున్న ఏఎం వీఐ పరీక్ష నిర్వహణనూ పలు కేంద్రాలకు వెళ్లి పరిశీలించనుంది. కర్ణాటక నుంచి వచ్చిన బృందంలో ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు డాక్టర్ మహదేవ, హెచ్డీ పాటిల్, నాగభాయ్, రఘునందన్, గోవిం దయ్య, మైఖేల్ సైమన్ ఉన్నారు. అలాగే, ఆదివారం జరగనున్న ఆన్లైన్ పరీక్షా విధానాన్ని పరిశీలించేందుకు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ టీఎస్పీఎస్సీ భవన్‌కు వస్తున్నారని, టీఎస్పీఎస్సీ భవన్లో ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్‌ను ఆయన సందర్శిస్తారని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. ఏఈ రాత పరీక్షకు 64 శాతం హాజరు వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకోసం శనివారం టీఎస్పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షకు 64 శాతం మంది హాజరైనట్లు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. ఐదు జిల్లాల్లో 101 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. పరీక్షకు మొత్తం 63 వేలమంది దరఖాస్తు చేసుకోగా, అధికంగా హైదరాబాద్/రంగారెడ్డి నుంచి 82 శాతం, కరీంనగర్ నుంచి 71.36 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. -
జెన్కో... అసిస్టెంట్ ఇంజనీర్!
ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించిన సిలబస్‌లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్, మెసర్మెంట్స్, అనలాగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్; ఎలక్ట్రికల్ ఎం/సీ, పవర్ ఎలక్ట్రానిక్స్, డివెసైస్, పవర్ సిస్టమ్, స్విచ్ గేర్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఉంటాయి.గతంతో పోల్చుకుంటే ఈసారి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అంశాలను సిలబస్‌లో కొత్తగా చేర్చేందుకు అవకాశముంది. ప్రశ్నపత్రంలో పవర్ సిస్టమ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో విద్యార్థులు అనలాగ్, డిజిటల్ అంశాలపై అంతగా దృష్టిసారించరు. అయితే ఈ అంశాలు సబ్జెక్టులో కీలకంగా మారనున్నాయి. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్ సబ్జెక్టు బేసిక్ సబ్జెక్టు. దీన్నుంచి సమస్యలు (8-10) ఎక్కువగా వస్తాయి. ఇవికూడా సాధారణ సూత్రాల ఆధారంగానే ఉంటాయి. కంట్రోల్ సిస్టమ్ నుంచి ప్రామాణికమైన ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి ఆరేడు ప్రశ్నలు రావొచ్చు. మెసర్మెంట్స్ నుంచి థియరీ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రామాణికమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.అనలాగ్, డిజిటల్ అంశాలు కీలకమైనవి. అనలాగ్ నుంచి 3 లేదా 4; డిజిటల్ నుంచి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. నేర్చుకోవాలి. ఎలక్ట్రికల్ మెషీన్స్ విభాగం నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. పవర్ ఎలక్ట్రానిక్స్‌లో డివెసైస్ ను బాగా అధ్యయనం చేయాలి. రిఫరెన్స్: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ (ఒ.ఆ. ఎఠఞ్ట్చ); Galgotia publications. మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, థియరీ ఆఫ్ మెషీన్స్, థర్మల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తదితర అంశాలుంటాయి.థర్మల్ ఇంజనీరింగ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఈ సబ్జెక్టులో టర్బైన్స్, ఐసీ ఇంజన్స్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ అంశాల నుంచి థియరీ, సమస్యల ఆధారిత ప్రశ్నలు 15 నుంచి 20 వస్తాయి.ఎస్ఎం అండ్ ఎఫ్ఎం బేసిక్ అంశాలు కాబట్టి ఫార్ములాలు, కాన్స్టెంట్స్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ నుంచి వచ్చే ప్రశ్నలు ఎక్కువగా థియరీ ఆధారంగా ఉంటాయి.సిలబస్‌లో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు అంశాలను చేర్చేందుకు అవకాశముంది కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు దీనిపై దృష్టిసారించాలి.ఫరెన్స్ బుక్స్: మెకానికల్ ఆబ్జెక్టివ్ పుస్తకాలు- ఆర్.కె.బన్సల్, ఆర్.ఎస్.ఖుర్మి. సివిల్ ఇంజనీరింగ్ ఎస్ఎం, టీఎస్, ఆర్సీసీ, స్టీల్ స్ట్రక్చర్స్, ఎఫ్ఎం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, హైడ్రాలజీ, వాటర్ మేనేజ్మెంట్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-పవర్ ప్లాంట్ తదితర అంశాలుంటాయి.ఎస్ఎం, ఎఫ్ఎం అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఇటీవల టీఎస్పీఎస్సీ-ఏఈఈ పరీక్షలో ఈ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.హైడ్రాలజీ, వాటర్ మేనేజ్మెంట్ అంశం కూడా ముఖ్యమైంది. దీనికి కనీసం 15 మార్కులు కేటాయించే అవకాశముంది. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంశాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రిఫరెన్స్: ఆర్.ఎస్.ఖుర్మి, బీ.ఎల్.గుప్తా, రంగాచారి. ఎలక్ట్రానిక్స్ బేసిక్ సర్క్యూట్, మెసర్మెంట్స్, ఈడీసీ, డిజిటల్, ఎస్ఎస్, కమ్యూనికేషన్, కంట్రోల్ సిస్టమ్స్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంటేషన్ తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి.ఇన్స్ట్రుమెంటేషన్ అంశంపై ఎక్కువ దృష్టిసారించాలి. మెసర్మెంట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి 20-25 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్, టెలికం స్విచింగ్ సిస్టమ్, నెట్వర్క్స్ కూడా మంచి వెయిటేజీ ఉన్న సబ్జెక్టులు.ఎలక్ట్రానిక్ డివెసైస్ అండ్ సర్క్యూట్లు బేసిక్ సబ్జెక్టు కాబట్టి ఎక్కువగా దృష్టిసారించాలి. వీటి నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. డిజిటల్ నుంచి ఆరేడు ప్రశ్నలు వస్తాయి. అన్ని బ్రాంచ్‌ల వారి తరహాలోనే వీరు కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. గతంలో వచ్చిన గేట్, ఐఈఎస్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. రిఫరెన్స్: Galgotia Publications, Rajput. -
క్షమించేది లేదు
జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ గురువారం మున్సిపల్ కార్యాలయం సిబ్బంది మొద్దు నిద్దర పోగొట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది... దుమ్ముకొట్టుకుని అపరిశుభ్రంగా మారిన రోడ్ల తీరుపై ఆగ్రహించారు. ఉదయం ఆరు గంటలకు మున్సిపాలిటీలో ప్రత్యక్షమైన ఆయన... అసిస్టెంట్ ఇంజనీరుతో పాటు మరో ముగ్గురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేశారు. వారంలో కార్యాలయాన్ని సమూలంగా మారుస్తానని... ఉద్యోగుల్లో ఆవహించిన నిర్లక్ష్యాన్ని వదలగొడతానని చెప్పారు. - మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం - అసిస్టెంట్ ఇంజనీర్, మరో ముగ్గిరిపై వేటు - సిబ్బంది స్థానికంగా ఉండాల్సిందేనని ఆదేశం అడిగేవారే లేరన్న ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో షాకిచ్చారు. ఉద్యోగమంటే కాలక్షేపం కాదని... బాధ్యతగా పనిచేయాలని హితవు పలికారు. గ్రూప్‌ల వారీగా పారిశుధ్య కార్మికులను పేరుపేరునా అడిగి ఇబ్బందులు తెలుసుకున్నారు. వారికి జాకెట్స్ ఇవ్వకపోవడంపై కమిషనర్‌ను ప్రశ్నిం చారు. ప్రస్తుతం ఉన్న జాకెట్స్ నాసిరకంగా ఉన్నాయని, వెంటనే కొత్తవి తెప్పించాలని ఆదేశించారు. ఈ సమయంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు మహేష్‌రాజు అక్కడ లేరు. ఎక్కడని కలెక్టర్ అడగ్గా... ఇంకా రాలేదని కమిషనర్ చెప్పారు. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని సూచించారు. అనంతరం టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఉద్యోగుల వివరాలు అడిగారు. ఇద్దరు టీపీఎస్ల్లో ఒకరు హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు కమిషనర్ చెప్పడంతో ఆగ్రహించిన కలెక్టర్... జిల్లా కేంద్రంలో పనిచేస్తూ హైదరాబాద్ నుంచి రావడమేంటని ప్రశ్నించారు. ఇష్టం లేకుంటే పనిచేయవద్దని, ఉద్యోగులు కచ్చితంగా స్థానికంగానే ఉండాలని హితవు పలికారు. అందుకు సర్కులర్ జారీ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. రెగ్యులర్ సిబ్బందిలో ఆంజనేయులు బుధవారం చెప్పకుండా విధులకు డుమ్మా కొట్టడంపై అడగ్గా... తనకు అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లానని అతను బదులిచ్చాడు. ‘ఏ ఆసుపత్రి? డాక్టర్ ఎవరు?’ అని కలెక్టర్ ప్రశ్నించగా... ప్రభుత్వాసుపత్రని, డాక్టర్ పేరు మల్లేశం అని ఆంజనేయులు బదులిచ్చాడు. అసలా పేరుతో అక్కడ డాక్టరే లేరని, తప్పుడు కారణాలు చెప్పడం తగదంటూ అతన్ని సస్పెండ్ చేశారు. అతనితో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారిశుధ్య కార్మికులు కృష్ణ, అరుణలను సస్పెండ్ చేశారు. కమిషనర్లు భయపడుతున్నారు... పారిశుధ్య కార్మికులు.. చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఇళ్లలో పనిచేస్తున్నారని శానిటేషన్ సూపర్వైజర్ తెలిపారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ చైర్మన్ ఇంట్లో తప్ప మరెవరి ఇళ్లలో పనిచేయడానికి వీల్లేదన్నారు. ఇక్కడ పనిచేయడానికి కమిషనర్లు భయపడుతున్నారని, ఎందుకని ఆరా తీస్తే... సిబ్బంది సరిగ్గా పనిచేయరని తేలిందన్నారు. వారంగా తానే ఈ విషయాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు. సిబ్బంది పూర్తి బద్దకంగా తయారయ్యారని, వారం రోజుల్లో పూర్తిగా మార్చేస్తానని, నిర్లక్ష్యం వహించేవారిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఏమిటీ రోడ్లు? ‘నేను జిల్లాకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా... ప్రధాన రహదారిపై ఈ దుమ్మేమిటి? శుభ్రం చేయడంలేదా?’ అని కలెక్టర్ శానిటేషన్ ఇన్చార్జి కుమార్‌ను అడిగారు. రెండు రోజుల్లో మొత్తం క్లీన్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఉద్యోగులందరికీ గుర్తింపు కార్డులివ్వాలని కమిషనర్‌కు సూచించారు. అలాగే పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనె ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్ ఇంతవరకు సరఫరా చేయలేదని కమిషనర్ చెప్పగా... వెంటనే అతని కాంట్రాక్టు రద్దు చేయాలని సూచించారు. ఇంటింటికీ తిరిగే చెత్త సేకరణ కార్మికులు... తమకు ప్రస్తుతం ఇస్తున్న రూ.20 సరిపోవడంలేదన్నారు. దాన్ని రూ.50కి పెంచేందుకు ప్రయత్నిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
ఏఈ, సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ వ్యూహాలు
తెలంగాణ రాష్ట్రంలో జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. దీని ద్వారా 1948 ఏఈ ఉద్యోగాలు, 733 సబ్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశముంది. ఉద్యోగ ప్రకటనల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఇప్పటి నుంచి సరైన ప్రణాళికతో సిద్ధమైతే ఉద్యోగ సాధన తేలికే! ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో బీటెక్ పూర్తిచేసిన వారు ఏఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలక్ట్రికల్ బ్రాంచ్ వారికి 70 శాతం ఉద్యోగాలు, మిగిలిన బ్రాంచ్‌ల కూడా వారికి 30 శాతం ఉద్యోగాలు అందుబాటులో ఉండొచ్చు. ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్ధులు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్ష: 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. నెగిటివ్ మార్కులు ఉండవు. కాన్సెప్టులు, విశ్లేషణ ఆధారిత ప్రశ్నలు: ఇంజనీరింగ్ సిలబస్‌లోని కాన్సెప్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధిస్తేనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఉదా: Ferranti effect in power system is due to? 1) Inductance 2) Capacitance 3) both Induction and Capacitance 4) Resistance, Inductance and Capacitance Ans: 3 అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు: ఇంజనీరింగ్ కాన్సెప్టులను.. ఎక్కడ, ఎందుకు అనువర్తిస్తారు (అఞఞడ) అనే విషయాలపై అవగాహన ఏర్పరుచుకుంటే ఈ తరహా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చు. ఉదా: Which of the following motor is used in Com-puter printers? 1) DC series motor 2) Universal motor 3) Stepper motor 4) Compound motor Ans: 3 Trouble shooting, error corrections ప్రశ్నలు.. అప్లికేషన్స్‌లో.. ఏ ట్రబుల్స్ వస్తాయి? వాటిని ఎలా రికవరీ చేయాలి? లోపాలను ఎలా సరిచేయాలి? తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. ఉదా: If DC Shunt generator is failure to build up voltage then the reason is..... 1) Presence of Residual Magnetism 2) Reversily the field terminals 3) Speed is less than critical speed 4) either 2 or 3 Ans: 4 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో: ఎలక్ట్రికల్ సర్క్యూట్లు, ఎలక్ట్రికల్ మెషీన్లు, పవర్ సిస్టమ్స్, అనలాగ్ సర్క్యూట్లు, కంట్రోల్ సిస్టమ్ వంటి అంశాలు ముఖ్యమైనవి. వీటిపై ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. జనరల్ ఆప్టిట్యూడ్పైనా ప్రశ్నలుంటాయి కాబట్టి న్యూ మరికల్ ఎబిలిటీ,రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రిపరేషన్‌కు ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, ఆబ్జెక్టివ్ స్టడీ మెటీరియల్, పాత ప్రశ్నపత్రాలను ఉపయోగించుకోవాలి. సిలబస్ ఆధారంగా రోజువారీ ప్రణాళికను సిద్ధం చేసుకొని, దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టుపై ఎంత పట్టు సాధించినా ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధనను ప్రాక్టీస్ చేయకపోతే ఫలితం ఉండదు. ఒక సబ్జెక్టును చదివిన తర్వాత, దానికి సంబంధించిన సూత్రాలను విడిగా రాసుకోవాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 500 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ నుంచి 25 శాతం, ఎలక్ట్రికల్ మెషీన్స్ నుంచి 25 శాతం, బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ల నుంచి 15 శాతం, మిగిలిన సిలబస్ నుంచి 35 శాతం మార్కులు రావొచ్చు.గత ఐఈఎస్, గేట్ ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను అధ్యయనం చేయాలి. నాలుగైదు సబ్జెక్టులను చదివితే సరిపోతుందని అనుకోకుండా అన్ని సబ్జెక్టులపైనా అవగాహన పెంపొందించుకోవాలి. రిఫరెన్స్: Network Theory: Van valkenburg, Hyte Kimberly. Power Systems: Stevenson, C.L.Wadhwa. Electrical Machine: P.S.Bimbra, Nagrath and Kotari. Control Systems: I.J.Nagrath, Gopal Power Electronics: Rashid Electrical measurements: A.K.Sawhney. -జి.రమణ, డెరైక్టర్, సాయిమేధ, హైదరాబాద్. -
ఏసీబీ వలలో ఏఈ
కడప అర్బన్, న్యూస్‌లైన్ : అవినీతి శాఖ అధికారుల వలలో మరో చేప చిక్కింది. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ రాజారావు నేతృత్వంలో రూరల్ వాటర్ సప్లయ్ స్కీమ్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న టి.విజయకుమార్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. చింతకొమ్మదిన్నె మండలం రసూల్పల్లెకు చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాసుల రెడ్డి రూరల్ వాటర్ సప్లయ్ స్కీమ్ కింద రూ. 1.20 లక్షల విలువైన పనులు చేశాడు . బిల్లు మంజూరు కోసం ఎంబుక్‌ను కూడా తయారు చేశారు. రూ. 5 వేలు ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఏఈ విజయకుమార్ మెలిక పెట్టాడు. దీంతో శ్రీనివాసులురెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏఈ విజయకుమార్‌కు శ్రీనివాసులరెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు లంచం ఇస్తుండగా డీఎస్పీ రాజారావు ఆధ్వర్యంలో అవినీతి శాఖ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వివరాలను డీఎస్పీ మీడియాకు తెలియజేశారు. దాడి చేసిన వారిలో డీఎస్పీతోపాటు సీఐలు పార్థసారథిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకిశోర్రెడ్డి ఉన్నారు. ఏఈ విజయకుమార్‌పై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.