పీఆర్ అసిస్టెంట్ ఇంజినీర్‌పై దాడికి యత్నించిన కూన రవికుమార్ సోదరుడు కూన వెంకట సత్యనారాయణ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎంత ధైర్యం రా.. నాకే నోటీసు ఇస్తావా.. నువ్వు ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా...’ అంటూ టీడీపీ నాయకుడు కూన రవి సోదరుడు, కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఓ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉద్యోగిపై రెచ్చిపోయారు. అంతటితో ఆగలేదు.. ఏకంగా కొట్టేసేంతలా చెయ్యి ఎత్తి బెదిరించారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. రాయలేని భాషలో పరుష పదజాలంతో వీరంగం సృష్టించారు. తాను కాంట్రాక్ట్ తీసుకున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ కేసీహెచ్ మహంతిపైనే దౌర్జన్యానికి దిగారు. ఈనెల 10న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ‘సాక్షి’ ఆరా తీయగా అసలు విషయాలు తెలిశాయి.
అలవాటు ప్రకారమే..
టీడీపీ నేతల రౌడీయిజం ఆగలేదు. పదవులు పోయి మూడేళ్లయినా అధికార దర్పం దిగలేదు. సామాన్య ప్రజలను తిట్టినట్టు అధికారులపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్పటికే అనేక మార్లు అధికారులకు బెదిరింపులు, దాడులు చేసిన ఘటనలు ప్రజలకు తెలుసు. కేసులు నమోదై, అరెస్టుల వరకు వెళ్లాయి. అయినా వారి పంథా మారడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా కూన రవికుమార్ మాదిరిగా ఆయన సోదరుడు కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ దౌర్జన్య కాండకు దిగారు. శ్రీకాకుళంలోని పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయంలో బరితెగించి వ్యవహరించారు.
తాను వేస్తున్న రోడ్డు పనుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, నాణ్యతా లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినందుకు అసిస్టెంట్ ఇంజినీర్ మహంతిని కొట్టేంత పనిచేశారు. కార్యాలయంలో అందరి ఉద్యోగుల ముందే అసిస్టెంట్ ఇంజినీర్ మీదకొచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా చెయ్యి ఎత్తి తన అహంకారాన్ని ప్రదర్శించారు. దౌర్జన్యానికి మారుపేరైన కూన రవికుమార్.. సోదరుడు కావడంతో తోటి సిబ్బంది కూడా చోద్యం చూశారే తప్ప తప్పు అని చెప్పలేకపోయారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేక, పై అధికారులు ముందుకు రాక అసిస్టెంట్ ఇంజినీర్ మహంతి కుంగిపోతున్నారు. యూనియన్ లీడరైన తనకే ఇలా జరిగితే.. మిగతా ఉద్యోగుల మాటేంటని బాధపడుతున్నారు.
పనుల్లో నిర్లక్ష్యం..
శ్రీకాకుళం మండలం ఎన్‌హెచ్–16 (శాస్త్రుల పేట) నుంచి సానివాడ మీదుగా వప్పంగి వరకు రూ.2.69 కోట్ల పీఎంజీఎస్‌వై నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి గత ఏడాది మే 24న అగ్రిమెంట్ కుదిరింది. ఈ ప్రకారం ఏడాదిలోగా పనులను పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణతో పీఆర్ పీఐయూ విభాగం అగ్రిమెంట్ అయ్యింది. అయితే కాలపరిమితి పూర్తయినప్పటికీ ఏడాది కాలంలో ఒక్క రాయి కూడా వేయలేదు. తీరా ఇంజినీరింగ్ అధికారులు గట్టిగా అడిగితే.. కోవిడ్ కారణంగా రోడ్డు నిర్మాణం ప్రారంభించలేదంటూ చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది నవంబర్ నెలాఖరు వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌కు వెసలు బాటు కల్పించారు. దీంతో మే నెల నుంచి రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ.. నిబంధనలకు పూర్తిగా పాతరేశాడు. దీంతో ఏఈ మహంతి నిర్మాణ పనులపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అలార్మింగ్ లెటర్(లోటుపాట్లు సరిచేసుకోండని చెప్పే పత్రం) ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ విషయం తెలుసుకున్న కూన సత్యనారాయణ ఈ నెల 10న పీఆర్ డివిజనల్ కార్యాలయానికి వచ్చి వీరంగం వేశారు. ఏఈ మహంతిపై దురుసుగా ప్రవర్తించాడు. తొలుత అసిస్టెంట్ ఇంజినీర్‌తో వాగ్వాదం చేసి.. ఆ తర్వాత పళ్లు బిగించి కళ్లు ఎర్రజేసి, కొట్టడానికి చెయ్యెత్తారు. నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి, పాతేస్తానంటూ బెదిరించి దౌర్జన్యానికి దిగారు.
అసిస్టెంట్ ఇంజినీర్ చేసేదేమి లేక ‘కొట్టేయండి సార్.. కొట్టేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది కదా’ అని నిస్సహాయంగా స్పందించారు. అయినా కూన వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో పీఏ టు ఈఈ, మరో ముగ్గురు నా కేడర్ ఏఈలు, క్లరికల్ స్టాఫ్ అంతా ఉన్నారు. కానీ కూనకు భయపడి ఎవరూ ఏమీ అనలేకపోయారు. దీంతో ఆ అసిస్టెంట్ ఇంజినీర్ తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని కుమిలిపోతున్నారు. (క్లిక్ చేయండి: అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అచ్చెన్న అనుచరుడు!)
Comments
Please login to add a commentAdd a comment