srikakulam mla
-
నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎంత ధైర్యం రా.. నాకే నోటీసు ఇస్తావా.. నువ్వు ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా...’ అంటూ టీడీపీ నాయకుడు కూన రవి సోదరుడు, కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఓ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉద్యోగిపై రెచ్చిపోయారు. అంతటితో ఆగలేదు.. ఏకంగా కొట్టేసేంతలా చెయ్యి ఎత్తి బెదిరించారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. రాయలేని భాషలో పరుష పదజాలంతో వీరంగం సృష్టించారు. తాను కాంట్రాక్ట్ తీసుకున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ కేసీహెచ్ మహంతిపైనే దౌర్జన్యానికి దిగారు. ఈనెల 10న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ‘సాక్షి’ ఆరా తీయగా అసలు విషయాలు తెలిశాయి. అలవాటు ప్రకారమే.. టీడీపీ నేతల రౌడీయిజం ఆగలేదు. పదవులు పోయి మూడేళ్లయినా అధికార దర్పం దిగలేదు. సామాన్య ప్రజలను తిట్టినట్టు అధికారులపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్పటికే అనేక మార్లు అధికారులకు బెదిరింపులు, దాడులు చేసిన ఘటనలు ప్రజలకు తెలుసు. కేసులు నమోదై, అరెస్టుల వరకు వెళ్లాయి. అయినా వారి పంథా మారడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా కూన రవికుమార్ మాదిరిగా ఆయన సోదరుడు కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ దౌర్జన్య కాండకు దిగారు. శ్రీకాకుళంలోని పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయంలో బరితెగించి వ్యవహరించారు. తాను వేస్తున్న రోడ్డు పనుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, నాణ్యతా లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినందుకు అసిస్టెంట్ ఇంజినీర్ మహంతిని కొట్టేంత పనిచేశారు. కార్యాలయంలో అందరి ఉద్యోగుల ముందే అసిస్టెంట్ ఇంజినీర్ మీదకొచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా చెయ్యి ఎత్తి తన అహంకారాన్ని ప్రదర్శించారు. దౌర్జన్యానికి మారుపేరైన కూన రవికుమార్.. సోదరుడు కావడంతో తోటి సిబ్బంది కూడా చోద్యం చూశారే తప్ప తప్పు అని చెప్పలేకపోయారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేక, పై అధికారులు ముందుకు రాక అసిస్టెంట్ ఇంజినీర్ మహంతి కుంగిపోతున్నారు. యూనియన్ లీడరైన తనకే ఇలా జరిగితే.. మిగతా ఉద్యోగుల మాటేంటని బాధపడుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం.. శ్రీకాకుళం మండలం ఎన్‌హెచ్–16 (శాస్త్రుల పేట) నుంచి సానివాడ మీదుగా వప్పంగి వరకు రూ.2.69 కోట్ల పీఎంజీఎస్‌వై నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి గత ఏడాది మే 24న అగ్రిమెంట్ కుదిరింది. ఈ ప్రకారం ఏడాదిలోగా పనులను పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణతో పీఆర్ పీఐయూ విభాగం అగ్రిమెంట్ అయ్యింది. అయితే కాలపరిమితి పూర్తయినప్పటికీ ఏడాది కాలంలో ఒక్క రాయి కూడా వేయలేదు. తీరా ఇంజినీరింగ్ అధికారులు గట్టిగా అడిగితే.. కోవిడ్ కారణంగా రోడ్డు నిర్మాణం ప్రారంభించలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌కు వెసలు బాటు కల్పించారు. దీంతో మే నెల నుంచి రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ.. నిబంధనలకు పూర్తిగా పాతరేశాడు. దీంతో ఏఈ మహంతి నిర్మాణ పనులపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అలార్మింగ్ లెటర్(లోటుపాట్లు సరిచేసుకోండని చెప్పే పత్రం) ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ విషయం తెలుసుకున్న కూన సత్యనారాయణ ఈ నెల 10న పీఆర్ డివిజనల్ కార్యాలయానికి వచ్చి వీరంగం వేశారు. ఏఈ మహంతిపై దురుసుగా ప్రవర్తించాడు. తొలుత అసిస్టెంట్ ఇంజినీర్‌తో వాగ్వాదం చేసి.. ఆ తర్వాత పళ్లు బిగించి కళ్లు ఎర్రజేసి, కొట్టడానికి చెయ్యెత్తారు. నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి, పాతేస్తానంటూ బెదిరించి దౌర్జన్యానికి దిగారు. అసిస్టెంట్ ఇంజినీర్ చేసేదేమి లేక ‘కొట్టేయండి సార్.. కొట్టేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది కదా’ అని నిస్సహాయంగా స్పందించారు. అయినా కూన వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో పీఏ టు ఈఈ, మరో ముగ్గురు నా కేడర్ ఏఈలు, క్లరికల్ స్టాఫ్ అంతా ఉన్నారు. కానీ కూనకు భయపడి ఎవరూ ఏమీ అనలేకపోయారు. దీంతో ఆ అసిస్టెంట్ ఇంజినీర్ తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని కుమిలిపోతున్నారు. (క్లిక్ చేయండి: అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అచ్చెన్న అనుచరుడు!) -
ఈఎస్ఐ స్కాంతో సంబంధం లేదని చెప్పగలరా ?
సాక్షి, శ్రీకాకుళం : మాజీమంత్రి అచ్చెన్నాయుడుకి ఈఎస్ఐ కుంభకోణంతో సంబంధం లేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన..బాబాయ్ అచ్చెన్నాయుడి అక్రమాలు టీడీపీ ఎంపి రామ్మోహన్కి కూడా తెలుసని అన్నారు. 35 లక్షలమంది కార్మిక కుటుంబాల డబ్బును అక్రమంగా తరలించారని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమాలు, అవినీతి ఎవరూ అడగకూడదన్నట్లు నారా లోకేష్ మాట్లాడటం హస్యాస్పదం అన్నారు. అంతేకాకుండా అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై మొట్టమొదటిసారి స్పందించింది సీఎం వైఎస్ జగన్ అని గుర్తుచేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. వైద్య బృందం నివేదిక ప్రకారమే ఆయనను జైలుకి తరలించారని అప్పలరాజు పేర్కొన్నారు. కాగా, ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. (టీడీపీ 108, 104లను నిద్రావస్థలో ఉంచింది: పిల్లి ) -
రాజకీయాల నుంచి తప్పుకుంటా: ధర్మాన ప్రసాదరావు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎంతోకాలంగా రాజకీయాల్లో ఉన్నాను. చాలా పదవులు అనుభవించా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాకు అన్యాయం చేయబోతున్నది. ఇన్నేళ్లు పార్టీ కోసం పనిచేశాను. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇవ్వదన్న సమాచారం బాధిస్తున్నది. అందుకే రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిదని భావి స్తున్నా..’ అని మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తన సన్నిహితులతో చెప్పారు. శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని పెద్దపాడులో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, తన సన్నిహితులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, అనుచరులు, శ్రేయోభిలాషులను శ్రీకాకుళంలోని తన ఇంటికి రావాల్సిందిగా సమాచారం పంపారు. భవిష్యత్ రాజకీయాలపై చర్చించేందుకు, మీ సూచనలు తీసుకునేందుకు పిలిపిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో ముఖ్యనేతలు, అనుచరులు, ధర్మాన ద్వారా లబ్ధి పొందిన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన కొందరు సన్నిహితులు కూడా పాల్గొన్నారు. అందరూ వచ్చాక తన రాజకీయ భవిష్యత్, ఆలోచనల గురించి ధర్మాన వివరించారు. ఎంతో కాలంగా కాంగ్రెస్‌లో ఉన్నానని, పార్టీలో నిర్మాణాత్మక పాత్ర పోషించానని గుర్తుచేశారు. ఇప్పుడు నేరచరితుల జాబితాలో తనను చేర్చడం ఎంతో బాధగా ఉందని, అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. మీ సేవలు అవసరమన్న నేతలు ఈ సందర్భంగా పలువురు నేతలు, అనుచరులు మాట్లాడుతూ జిల్లా రాజకీయాల్లో పార్టీలకు అతీతమైన నాయకులుగా ధర్మాన ప్రసాదరావు, కింజరాపు ఎర్రన్నాయుడులను ప్రజలు గుర్తించారని చెప్పారు. ఎర్రన్నాయుడు చనిపోయినందున జిల్లా రాజకీయాల్లో మీ సేవలు చాలా అవసరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే జెండా మారుద్దామని చెప్పారు. అంతేతప్ప రాజకీయాల నుంచి విరమించుకోవటం సరి కాదని, రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటే మీ అనుయాయులమంతా ఇబ్బంది పడతామని పేర్కొన్నారు. అయితే తానింకా తుది నిర్ణయం తీసుకోలేదని.. కార్యకర్తలు, అభిమానుల మనోభావాలు దెబ్బ తినకుండా వ్యవహరిస్తానని ప్రసాదరావు భరోసా ఇచ్చారు. త్వరలో ఏఐసీసీ నాయకులను కలిసే ఆలోచనలో ఉన్నానని, వారికి తన వాదన వినిపిస్తానని చెప్పినట్లు సమాచారం.