రాజకీయాల నుంచి తప్పుకుంటా: ధర్మాన ప్రసాదరావు
Published Fri, Sep 27 2013 3:17 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎంతోకాలంగా రాజకీయాల్లో ఉన్నాను. చాలా పదవులు అనుభవించా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాకు అన్యాయం చేయబోతున్నది. ఇన్నేళ్లు పార్టీ కోసం పనిచేశాను. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇవ్వదన్న సమాచారం బాధిస్తున్నది. అందుకే రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిదని భావి స్తున్నా..’ అని మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తన సన్నిహితులతో చెప్పారు. శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని పెద్దపాడులో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, తన సన్నిహితులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, అనుచరులు, శ్రేయోభిలాషులను శ్రీకాకుళంలోని తన ఇంటికి రావాల్సిందిగా సమాచారం పంపారు. భవిష్యత్ రాజకీయాలపై చర్చించేందుకు, మీ సూచనలు తీసుకునేందుకు పిలిపిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో ముఖ్యనేతలు, అనుచరులు, ధర్మాన ద్వారా లబ్ధి పొందిన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన కొందరు సన్నిహితులు కూడా పాల్గొన్నారు. అందరూ వచ్చాక తన రాజకీయ భవిష్యత్, ఆలోచనల గురించి ధర్మాన వివరించారు. ఎంతో కాలంగా కాంగ్రెస్‌లో ఉన్నానని, పార్టీలో నిర్మాణాత్మక పాత్ర పోషించానని గుర్తుచేశారు. ఇప్పుడు నేరచరితుల జాబితాలో తనను చేర్చడం ఎంతో బాధగా ఉందని, అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
మీ సేవలు అవసరమన్న నేతలు
ఈ సందర్భంగా పలువురు నేతలు, అనుచరులు మాట్లాడుతూ జిల్లా రాజకీయాల్లో పార్టీలకు అతీతమైన నాయకులుగా ధర్మాన ప్రసాదరావు, కింజరాపు ఎర్రన్నాయుడులను ప్రజలు గుర్తించారని చెప్పారు. ఎర్రన్నాయుడు చనిపోయినందున జిల్లా రాజకీయాల్లో మీ సేవలు చాలా అవసరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే జెండా మారుద్దామని చెప్పారు. అంతేతప్ప రాజకీయాల నుంచి విరమించుకోవటం సరి కాదని, రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటే మీ అనుయాయులమంతా ఇబ్బంది పడతామని పేర్కొన్నారు. అయితే తానింకా తుది నిర్ణయం తీసుకోలేదని.. కార్యకర్తలు, అభిమానుల మనోభావాలు దెబ్బ తినకుండా వ్యవహరిస్తానని ప్రసాదరావు భరోసా ఇచ్చారు. త్వరలో ఏఐసీసీ నాయకులను కలిసే ఆలోచనలో ఉన్నానని, వారికి తన వాదన వినిపిస్తానని చెప్పినట్లు సమాచారం.
Advertisement