అదే గమ్యం! | dharmana prasada rao joining to ysr congress party on 23th january | Sakshi
Sakshi News home page

అదే గమ్యం!

Published Tue, Jan 7 2014 3:43 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

అదే గమ్యం! - Sakshi

అదే గమ్యం!

మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు.. నిన్నటి వరకు జిల్లాలో కాంగ్రెస్ అంటే ఆయనే.. ఆయనంటే కాంగ్రెసే.. అటువంటి నేత రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో విభేదించారు. పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏ పార్టీలో చేరాలి?.. వైఎస్‌ఆర్‌సీపీయా.. టీడీపీనా!!.. ఈ విషయమై ఆయన కొన్నాళ్లుగా తన అభిమానులు, అనుచరులు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. ఎక్కువ మంది వైఎస్‌ఆర్‌సీపీకే ఓటు వేశారు. తన మనసూ అటువైపే ఉండటంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మనసులోని మాట చెప్పారు. అనుమతి తీసుకున్నారు. కానీ సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అభూత కల్పనలు సృష్టించారు. తప్పుడు వార్తలతో జనంలో గందరగోళం రేపారు. వీటన్నింటికీ చెంప పెట్టులా వైఎస్‌ఆర్‌సీపీయే తన గమ్యస్థానమని ధర్మాన స్పష్టం చేశారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళ : మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు వైఎస్‌ఆర్‌సీపీలో చేరడం ఖాయమైంది. దీనికి ముహూర్తం కూడా దాదాపు ఖరారైంది. ఈ నెల 23 తర్వాత ఏరోజైనా ఆయన పార్టీలో చేరవచ్చు. ఈ దిశగా ఆయన సన్నిహితులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై అభిప్రాయ సేకరణ, పార్టీ అధినేత నుంచి అనుమతి తీసుకోవడంలో జరిగిన జాప్యం భిన్న కథనాలకు, విస్తృత చర్చలకు తావిచ్చింది. దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రత్యర్థులు ప్రజలను, ధర్మాన అభిమానులను గందరగోళంలోకి నెట్టేందుకు తప్పుడు ప్రచారాలతో రెచ్చిపోయారు. చివరికి నాలుగు రోజుల క్రితం వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో ధర్మాన భేటీపై కూడా తప్పుడు ప్రచారం జరిగింది. ధర్మాన హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వచ్చి అనుచరులకు జరిగింది వివరించడంతో అసలు విషయం వెల్లడైంది. వాస్తవానికి జగన్‌మోహన్‌రెడ్డితో సుమారు 40 నిమిషాల పాటు సమావేశమైన ధర్మాన జిల్లా రాజకీయ పరిస్థితులపై కూలంకుషంగా చర్చించారు. 
 
 కాంగ్రెస్‌ను ఎందుకు వీడుతున్నారంటే..
 జగన్‌ను ఆయన నివాసంలో కలిసిన ధర్మాన సుదీర్ఘంగా చర్చించారు. మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్న తను పార్టీకి ఎలా అవసరమైతే అలా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ను ఎందుకు వీడుతున్నదీ.. వైఎస్‌ఆర్‌సీపీలోనే ఎందుకు చేరాలనుకుంటున్నదీ వివరించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయంతో సీమాంధ్రలో ఆ పార్టీ దాదాపు ఉనికి కోల్పోయింది. పైగా సీనియర్ నాయకుడినైన తనను సీబీఐ కేసుల విషయంలో నిర్లక్ష్యం చేసింది. ఈ విషయాలను పలు సభలు, సమావేశాల్లో ఇంతకుముందే చెప్పానని ధర్మాన వివరించారు. మనుగడ లేని ఆ పార్టీ నుంచి బయటపడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వాస్తవానికి ఎప్పుడో చేరాల్సిందని.. అయితే తన సోదరుడు ఇప్పటికే పార్టీలో ఉన్నందున.. తాను కొంత సమయం తీసుకున్నానని జగన్‌కు వివరించారు. దివంగత రాజశేఖరరెడ్డికి నేను అత్యంత సన్నిహితుడనని మీకు తెలుసు.. ఆయన తనయుడైన మీరు ఏర్పాటు చేసిన పార్టీలోకి ఎప్పటికైనా రావాలన్నదే తన ఉద్దేశమని’ ధర్మాన చెప్పుకొచ్చారు.
 
 టీడీపీకి తిరస్కారమే..
 ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయని ఈ భేటీ సందర్భంగా ధర్మాన జగన్‌కు చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ నాయకత్వంలో జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను తొమ్మిదింటిని గెలుచుకున్నాం. ఇచ్చాపురం మాత్రమే టీడీపీకి దక్కింది. అక్కడి ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఆ పార్టీలో ఇమడలేక పదవికిని సైతం త్యజించి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన విషయాన్ని గుర్తుకు తెస్తూ.. జిల్లాలో గత ఆరు నెలలుగా టీడీపీ పరిస్థితిపై వివిధ వర్గాల నుంచి తాను సేకరించిన సమాచారం ప్రకారం.. ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిందని వివరించారు. ప్రధానంగా రాష్ట్ర విభజన విషయంలో కేంద్రానికి చంద్రబాబు నిరభ్యంతర లేఖ ఇవ్వడం, ఇప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరకపోవడం, సమన్యాయం గురించి మాట్లాడుతున్నా.. అది ఏ విధంగా ఉండాలన్నదానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజలు ఆయనపైనా, టీడీపీపైనా నమ్మకం కోల్పోయి, ఆగ్రహం పెంచుకున్నారని ధర్మాన చెప్పారు. దీన్ని గమనించే పలువురు టీడీపీ నేతలు, ముఖ్యంగా పలు గ్రామాల సర్పంచులు తనతోపాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు జగన్‌తో చెప్పారు.
 
 సాదర ఆహ్వానం
 ధర్మాన చెప్పిన విషయాలను సావకాశంగా విన్న జగన్ పార్టీలోకి ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ధర్మాన కుటుంబంతో తమ కుటుంబానికున్న సాన్నిహిత్యం, ధర్మాన కృష్ణదాస్ మొదటి నుంచీ తమతోపాటు ఉన్న విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్లు తెలసింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిన వెంటనే పార్టీలో చేరే కార్యక్రమం పెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు సీటులోనూ పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని జగన్ సూచించగా.. తాను అందుకు సిద్ధంగానే ఉన్నానని ధర్మాన స్పష్టం చేశారు. జగన్‌తో భేటీపై పూర్తిగా సంతృప్తి చెందిన ధర్మాన తన వెంట వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చే ప్రజాప్రతినిధులు, నాయకుల జాబితా తయారు చేయాలని తన అనుచరులకు సూచించడంతో వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. అలాగే జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో జగన్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలోనే వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించి, అందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారు.
 
 పెరిగిన వైఎస్‌ఆర్‌సీపీ బలం 
 ఇప్పటికే జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ బలం పుంజుకుంది. ఇటీవల టీడీపీకి చెందిన పలువురు సర్పంచ్‌లు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. ధర్మాన ప్రసాదరావు చేరికతో భారీ వలసలతో పార్టీ మరింత బలోపేతం కానుంది. ఇటీవల ధర్మాన అనుచరులు జిల్లాలో నిర్వహించిన సర్వేలో సాధారణ జనంలో వైఎస్‌ఆర్‌సీపీకి 55 శాతం మద్దతు ఉన్నట్లు స్పష్టమైంది. ధర్మాన, ఆయన వర్గం చేరికతో మరో 25 శాతం బలం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
 
 ఖాళీ కానున్న కాంగ్రెస్
 డీసీసీ అధ్యక్షునితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరనుండటంతో జిల్లాలో కాంగ్రెస్ దాదాపు ఖాళీ కానుంది. ధర్మాన నిర్వహించిన పలు సమావేశాలు నాయకులు ఈ విషయం ఇప్పటికే స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీనే సరైన పార్టీ అని, అందులో చేరడం వల్ల వైఎస్‌ఆర్ ఆశయాలు నేరవేర్చి, ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు వీలవుతుందని వారు భావిస్తున్నారు. తాజా పరిణామాలతో ఇప్పటికే ఇందిర విజ్ఞాన భవన్ (డీసీసీ కార్యాలయం) బోసిపోయింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు వచ్చినప్పుడు.. అది కూడా వారు పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పుడు తప్ప, మిగతా సమయాల్లో నాయకులు, కార్యకర్తలు దాని ముఖం చూడటం లేదు.  
 
 ధర్మాన వెంటే మేమంతా: కాంగ్రెస్ నేతల స్పష్టీకరణ
 శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాధరావు వెంటే తామంతా ఉంటామని కాం గ్రెస్ పార్టీ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ తీర్మానం చేసిన నేపథ్యంలో ప్రజలంతా ఉవ్వెత్తున సమైక్యాంధ్ర కోసం ఉద్యమిం చినప్పటికీ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా విభజనకే మొగ్గుచూపడం బాధాకరమన్నారు. జిల్లా ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్న ధర్మాన రాజకీయ పరంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.అభిమానులు, కార్యకర్తల ఆకాంక్ష మేరకే భవిష్యత్ రాజకీయాన్ని రూపొందించుకునే పనిలో ధర్మాన నిమగ్నమయ్యారన్నా రు. ఈ నేపథ్యంలో ఆయనపై తప్పుడు కథనాలు వెలువడడం శోచనీయమన్నారు. ప్రసాదరావు తీసుకున్న నిర్ణయానికే తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.   ధర్మాన శనివారం వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డిని కలిశారని, ఏం జరిగిందనేది ఆయనే స్వయంగా వెల్లడిస్తారన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో  మున్సిపల్ మాజీ చైర్‌పర్మన్ ఎం.వి.పద్మావతి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మామిడి శ్రీకాంత్, పార్టీ నాయకులు కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్ ఉన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement