రంగుమారిన రాజకీయం !
Published Mon, Dec 30 2013 2:09 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
రాజకీయం రంగుమారింది. ఉన్న పార్టీకి స్వస్తి చెప్పి కొత్తదారులు వెతుక్కున్నారు కొంతమంది నాయకులు. జిల్లాలోని ఏకైక టీడీపీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్‌ఆర్ సీపీలోకి దూకారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజీడ్రామాలాడారు. మంత్రిగా వెలుగు వెలిగిన ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టేయత్నంలో ఉన్నారనే గుసగుసలు వచ్చాయి. చాలా పార్టీల నాయకులు ప్రజలను పట్టించుకోలేదనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల 3,122 కిలోమీటర్ల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపునకు సిక్కోలు జిల్లా వేదికైంది. 2013వ సంవత్సరానికి వీడ్కోలు చెప్పేందుకు కొన్ని గంటలే మిగిలి ఉన్న సందర్భంగా ఈ ఏడాదిలో శ్రీకాకుళం రాజకీయ చిత్రపటాన్ని ఓసారి అవలోకనం చేసుకుందాం.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఈ సంవత్సరం రాజకీయ పార్టీల నాయకులు జిల్లా ప్రజలు పట్టించుకోలేదు. ఎవరికి వారు ఉద్యమాలు చే స్తున్నట్లు నటించారే తప్పా జనం కోసం పాటు పడిన సందర్భం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పదవులు కాపాడుకోవడానికే ఎక్కువ సమయం హెచ్చించారు. వర్గపోరు, ఆదిపత్య పోరు షరా మామూలే. టీడీపీ నాయకులు స్తబ్ధతగా ఉండిపోయారు. ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే సాయిరాజ్ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరడంతో ఆ పార్టీ మరింత దిగజారింది.
కాంగ్రెస్‌కు దూరంగా ధర్మాన!
సంవత్సరం ప్రారంభంలో కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. వారు చెప్పిందే వేదంగా నడిచింది. ఆ తరువాత వారిద్దరి మధ్య ఆదిపత్య పోరు ప్రారంభమైంది. ధర్మాన స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. ఆయన అనుకుస్థాయిలో మద్దతుదారులు విజయం సాధించకపోయినా..యువ రక్తాన్ని గెలిపించడంలో సఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అన్నీ తానై పార్టీని నడిపించిన ధర్మాన ప్రస్తుతం ఆ పారీకి దూరంగా ఉన్నారు. పలు సమావేశాలు, సభలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్చడంతో ఆగస్టు 14న మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత కొంతకాలం మంత్రిగా కార్యక్రమాలకు హాజరు కాలేదు. అప్పటిలో రాజీనామాను ఆమోదించని సీఎం ఆ తరువాత పిలిపించి రాజీనామా తీసుకొని ఆమోదించారు. సోనియాను కలిసేందుకు ప్రసాదరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కళంకిత మంత్రులకు రానున్న ఎన్నికల్లో సీట్లు వచ్చే అవకాశం లేదని చెబుతుండటంతో చేసేది లేక పార్టీని వదులుకున్నారు. పార్టీని నడిపించే వ్యూహకర్తల్లో ఒకరుగా ఈయనను చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయనతో పాటు ఉండే క్యాడర్ ఆయనతోనే బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీలో చేరాలనే విషయంలో సందిగ్ధం నెలకొంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కోండ్రు మురళీమోహన్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై విమర్శలు చేసి జనంలో ఆయన నమ్మకాన్ని కోల్పోయారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు కారణమైన వైఎస్‌ఆర్‌ను విమర్శించినందుకు ఆయతోపాటు ఉన్న కొందరు ముఖ్య నాయకులు కూడా ఆయనను వదిలేశారు. శత్రుచర్ల అనారోగ్య కారణాలతో పాతపట్నం నియోజకవర్గానికే పరిమితమయ్యాడు. మొత్తంగా అధికార పార్టీ నుంచి ఒరిగిందేమీ లేదనేది ప్రజల మాట. ముఖ్యమంత్రి రెండుసార్లు జిల్లాకు వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల కోసం చెప్పుకోదగిన హామీలు ఇవ్వలేదు.
వైఎస్‌ఆర్‌సీపీకి పెరిగిన ఆదరణ
సాధారణ జనంలో వైఎస్‌ఆర్‌సీపీకి ఈ సంవత్సరం అభిమానులు పెరిగారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు జనం వద్దకు తీసుకుపోయే పనిలో సమన్వయకర్తలు, నాయకులు సఫలమయ్యారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రజల్లో ఆదరణను పెంచింది. 3,112 కిలోమీటర్లు నడిచిన షర్మిల పాతయాత్ర ఇచ్ఛాపురంలో ఆగస్టు నాలుగో తేదీన ముగిసింది. వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు రెండు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, కొబ్బరి రైతులు, వరి రైతులకు పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జనంలో లేని బీజేపీ
ఈ పార్టీ ఉన్నా లేనట్లుగానే చెప్పవచ్చు. సంవత్సరం మొత్తం ప్రజలను ప్రభావితం చేసే ఒక్క ఉద్యమాన్ని కూడా నిర్వహించలేదు. పైగా పేరు కూడా జనం మరిచిపోయే పరిస్థితిని జిల్లా నాయకులు తీసుకొచ్చారు. ఏ విషయంలో కూడా బీజేపీ జాడ మచ్చుకైనా కనిపించలేదు.
తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో విఫలమైన పార్టీలు
తుపాను బాధితులను ఆదుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఘోరం గా విఫలమైంది. రెండుసార్లు బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొబ్బరి రైతులకు కనీస హామీ కూడా ఇవ్వలేదు. వరి రైతులకు ఇచ్చిన భరోసా కూడా నెరవేరలేదు. సీఎం హోదాలోనే ఆదుకోలేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పోరాటాలకు దూరమైన వామపక్షాలు !
వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు జనం కోసం నిరంతర పోరాటాలు నిర్వహించలేదు. ప్రజా ఉద్యమాల నిర్మాణంలో విఫలమయ్యారు. విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆయా నియోజకవర్గాల్లోని జనం నుంచి ఉద్యమం వచ్చిన తరువాత దానిని అందిపుచ్చుకొని ఉద్యమంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఎవరైతే ఉద్యమంలో ముందుండాలో వారు పట్టించుకోకపోవడం గమనార్హం.
సమైక్య ఉద్యమంలో పార్టీలు
సమైక్య ఉద్యమంలో వైఎస్‌ఆర్‌సీపీ ముందుండగా టీడీపీ, కాంగ్రెస్‌లు కూడా కొంతమేర పని చేయగలిగాయి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ వారి ఆందోళనలను జనం తిరస్కరించారు. ఒకరు రాష్ట్రాన్ని విభజించిన వారు కాగా, రెండో పార్టీ వారు విభజనకు పూర్తిస్థాయిలో సహకరించారని, అటువంటప్పుడు మీకు సమైక్య ఉద్యమంలో పాల్గొనే అర్హత లేదని పలుచోట్ల జనం నిలదీశారు. ఇక సీపీఎం వారు కూడా ఈ ఉద్యమంలోకి రాలేదు. సాధారణ జనం చూపిన చొరవ, తెగువ రాజకీయ పార్టీల వారు చూపలేదు.
పత్తా లేని లోక్‌సత్తా !
అవినీతికి వ్యతిరేకంగా ఉద్భవించిన లోక్‌సత్తా ఆ మేరకు పనిచేయలేదు. జిల్లా కార్యవర్గం ఉందోలేదో కూడా తెలియని పరిస్థితి. ఏ రోజూ ఒక్క ఉద్యమంలో తమదైన ముద్ర చూపిన దాఖలు లేవు.
సామాన్యుడికి భరోసా ఇవ్వలేని టీడీపీ
తెలుగుదేశం పార్టీ సామాన్యుడికి భరోసా ఇవ్వడంలో విఫలమైంది. జిల్లాలో అన్నీ తానై పార్టీని నడిపించిన కింజరాపు ఎర్రన్నాయుడు మృతితో ఆ పార్టీలో స్తబ్ధత నెలకొంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తెరవెనుక రాజకీయాలు చేసేందుకే పనికొస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇది నిజమని నిరూపణ అయింది. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పరిస్థితి కూడా అంతే. ఆమె కూడా నియోజవర్గానికే పరిమితమయ్యారు. ఈ సంవత్సరంలో పార్టీలోని నాయకులందరూ ఒకే వేదికపై మాట్లాడిన సందర్భం లేదు. పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ, ఇచ్ఛాపురం నుంచి సాయిరాజ్, మాజీమంత్రి తమ్మినేని సీతారాంలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. గత సంవత్సరంలో ఉన్న గ్రాఫ్ పూర్తిస్థాయిలో కిందికి పడిపోయింది. పాతపట్నం, పాలకొండ, ఇచ్ఛాపురం, పలాస నియోకవర్గాల్లో వారి కార్యక్రమాలు లేవు. టెక్కలి కూడా అలాగే ఉందని చెప్పవచ్చు. అచ్చెన్నాయుడికి సామాజిక వర్గాల సెగ తగిలింది. ఈ పార్టీలోకి కొత్తగా ఒక్క నాయకుడు కూడా రాలేదు. ప్రజా పోరాటాలకు దిగిన సందర్భం కూడా లేదు.
Advertisement
Advertisement