ఏడీ నాయకుడు!
ఏడీ నాయకుడు!
Published Fri, Dec 27 2013 3:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లాలో పార్టీని నడిపించే నాయకుడి కోసం కాంగ్రెస్ నాయకత్వం వెతుకులాట ప్రారంభించింది. రోజురోజుకూ వర్గ విభేదాలు పెరిగిపోతుండటం, నాయకత్వ బాధ్యతను మోసేందుకు నేతలెవరూ ముందుకురాకపోవటంతో ఆందోళన చెందుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిర్ణయించుకోవటం.. ఆయనతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు, పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు వెళ్లిపోనుండటం.. ఇప్పటికే చాలామంది నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ఈ గడ్డు పరిస్థితి వచ్చింది. పార్టీ పూర్తిగా కుదేలవటంతో ఫలానా నేత డీసీసీ అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని చెప్పే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు.
పార్టీ దుస్థితికి కారణాలివీ..
సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం దారుణంగా విఫలమవడం, రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయం, నమ్ముకున్న నాయకులను బలిపశువులను చేయడం వంటి అంశాలు కాంగ్రెస్ పట్ల అంతటా వ్యతిరేకతను పెంచాయి. కేంద్ర మంత్రి కృపారాణి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వర్గాల మధ్య సుదీర్ఘకాలం కొనసాగిన ఆధిపత్య పోరు జిల్లా కాంగ్రెస్‌ను మరింత కుంగదీసింది. సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్న ప్రజలకు అండగా ఉంటానంటూ ధర్మాన ప్రసాదరావు పార్టీకి దూరమవటం క్యాడర్‌ను నిరాశపరిచింది.
కృపారాణి వెనకడుగు
డీసీసీ అధ్యక్ష పదవికి శిమ్మ రాజశేఖర్ పేరును తొలుత ప్రతిపాదించిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తర్వాత వెనకడుగు వేశారు. రాజశేఖర్ అభ్యర్థిత్వాన్ని పలువురు వ్యతిరేకించటమే దీనికి కారణం. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు చూసుకుంటారని చెప్పి ఆమె తప్పుకున్నారు. తనకు అనుకూలుడైన ఎస్.వి.రమణకు డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని మంత్రి కోండ్రు మురళి ప్రతిపాదించారు. లక్ష్మీపేట ఘటన తర్వాత కాంగ్రెస్‌పై తూర్పు కాపులు కోపంతో ఉన్నారని, వారిని ప్రసన్నం చేసుకునేందుకు రమణకు అవకాశం ఇస్తే బాగుంటుందని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే దీనిని కూడా పలువురు వ్యతిరేకించారు. వృద్ధుడైన ఎస్.వి.రమణ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడిపించలేరని స్పష్టం చే యటంతో కోండ్రు కూడా వెనక్కి తగ్గారు. ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్ అగర్వాలా(లల్లూ) పేరు కూడా పరిశీలనకొచ్చినా చాలామంది వ్యతిరేకించడంతో పక్కనబెట్టేశారు.
డోల జగనే దిక్కు!
ఈ పరిస్థితుల్లో డీసీసీబీ చైర్మన్ డోల జగన్ పేరు వెలుగులోకి వచ్చింది. డీసీసీ పదవి చేపట్టేందుకు ఆయన కూడా ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే ఆయన పీఆర్‌పీ నుంచి వచ్చారని, ఇప్పటికే ఒక పదవి ఉందని, అలాంటి వ్యక్తికి జిల్లా పార్టీ పగ్గాలు ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచీ ఉన్న కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా జగన్‌కు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని రాష్ట్ర మంత్రి, పీపీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీని ఏకతాటిపై నడిపించే సత్తా ఆయనకు ఉందా? అనే విషయమై మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement