ఏ నిమిషానికి ఏమి జరుగునో?! | What is happening at any minute :Dr. Killi Kruparani | Sakshi
Sakshi News home page

ఏ నిమిషానికి ఏమి జరుగునో?!

Published Thu, Dec 26 2013 4:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఏ నిమిషానికి ఏమి జరుగునో?! - Sakshi

ఏ నిమిషానికి ఏమి జరుగునో?!

 * రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు!
 * వచ్చే ఎన్నికల్లో ధర్మాన నాకు వ్యతిరేకంగా ఓటు వేయవచ్చు
*  సమైక్య ఉద్యమం నేతల ఊహకు అందలేదు
 * అధిష్టానానికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు
 * డీసీసీ అధ్యక్షుని ఎంపిక రాష్ట్ర మంత్రుల ఇష్టం
 * ఇద్దరు ఎమ్మెల్యేలు ధర్మాన బాటలో ఉన్నారు
*  జిల్లాలో కుల రాజకీయాలకు ప్రాధాన్యత
 
ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి, ఈరోజు కలిసి ఉన్నవారే.. రేపు కత్తులు నూరుకోవచ్చు.. ఇదే నేటి రాజకీయం.. అందువల్ల రేపు ఏమవుతుందో చెప్పలేం. ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగవచ్చు. అన్నిటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. ఇదీ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అంతరంగం. తన రాజకీయ ప్రవేశం, ధర్మానతో అనుబంధం మొదలుకొని.. సమైక్యాంధ్ర ఉద్యమం.. జిల్లాలో పార్టీ పరిస్థితి.. రాజకీయ పరిణామాలపై ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృపారాణి మనసు విప్పి మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. గతంలో కాంగ్రెస్ భావజాలం అంటే ఏమిటో? ఆ పార్టీలోనే ఎందుకు ఉండాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మా అందరికీ చెప్పారు. కృపారాణికి ఓటు వేయకుండా.. నాకు ఓటు వేయద్దని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు స్పష్టంగా చెప్పారు. ఆయన ఆశీస్సులతోనే గెలుపొందాను. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో నాకు ఓటు వేయవద్దని వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. 
 
 అందుకే అంటున్నా.. రాజకీయాల్లో వచ్చే మార్పులు అనూహ్యమైనవి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని కేంద్ర ఐటీ, కమ్యునికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌ను వీడాలని భావిస్తున్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు గతంలో ధర్మాన తన వద్ద చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు నమోదు చేయడాన్ని ప్రస్తావిస్తూ ధర్మాన పలుమార్లు మనస్తాపం చెందారు. పార్టీకి నేను చేసిన సేవలకు వారు ఇచ్చిన బహుమతి ఇదేనా?’ అనే భావన ధర్మానలో ఉన్నట్లు కృపారాణి చెప్పారు. అయితే ఇంకా చాలా మంది పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయనే విషయాన్ని అప్పట్లో తాను ఆయనకు గుర్తు చేశానన్నారు.
 
  రాష్ట్ర విభజనకు సీపీఎం మినహా అన్ని పార్టీలు అంగీకరించాయి. ఈ మేరకు కొన్ని పార్టీల వారు లేఖలు కూడా ఇచ్చారు. దీంతో కేంద్రం విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. అయితే జనం మనసులో ఏముందో తెలుసుకోవడంలో ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు ఆయా పార్టీల నాయకులు కూడా విఫలమయ్యారన్నారు. అందుకే  ప్రజా ఉద్యమం ఈ స్థాయిలో వ చ్చిందన్నారు. నేతల ఊహలకు అందని రీతిలో ఉద్యమం ఉరకలెత్తడంతో ఏం చేయాలో.. ఎలా కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ధర్మాన బాటలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని కృపారాణి అంగీకరించారు. కాంగ్రెస్‌కు చెం దిన ఎమ్మెల్యేలు జుత్తు జగన్నాయకులు, కొర్ల భారతిలు ధర్మాన ప్రసాదరావుతో పాటే వెళుతున్నారని తనకు కూడా తెలిసిందన్నారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కూడా వెళుతున్నారట కదా? అన్న ప్రశ్నకు.. అలా జరిగే అవకాశం లేదన్నారు. 
 
   డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ ధర్మాన వెంట వెళ్లనున్న విషయాన్ని ప్రస్తావించగా, ఆ దృష్టితోనే అధ్యక్షుని మార్పు విషయమై పార్టీ నాయకులతో చర్చించినట్లు చెప్పారు. అయితే తాను జోక్యం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.  రాష్ట్ర మంత్రులు ఉన్నారు.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఉన్నందున దీనిపై వారే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. శ్రీకాకుళం పట్టణ కాంగ్రెస్ నాయకుడు శిమ్మ రాజశేఖర్‌ను డీసీసీ అధ్యక్షునిగా కృపారాణి ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తల గురించి ప్రస్తావించగా.. గతంలో తాను సూచించిన విషయం వాస్తవమేనని, అయితే ప్రస్తుతం పరిణామాలు మారుతుండటంతో రాష్ట్ర మంత్రులకే ఈ విషయం అప్పజెప్పినట్లు చెప్పారు. 
 
   జిల్లాలో కుల రాజకీయాలకు ప్రాధాన్యత ఉందని కేంద్ర మంత్రి అన్నారు. కాళింగ, వెలమ సామాజిక వర్గాలదే రాజకీయాల్లో ప్రధాన పాత్ర అని, గతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన ప్రసాదరావు, ఎర్రన్నాయుడు కాంగ్రెస్, టీడీపీలకు నాయకత్వం వహించేవారని, వారిదే పైచేయిగా ఉండేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎర్రన్నాయుడు లేకపోవడం, ధర్మాన కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకోవడంతో కుల సమీకరణల్లో మార్పులు సంభవించే అవకాశం ఉందన్నారు.  ధర్మాన ప్రసాదరావుతో పాటు కాంగ్రెస్ క్యాడర్ పూర్తిస్థాయిలో బయటకు వెళుతుందనే ప్రశ్నకు.. అలా జరిగితే పార్టీకి నష్టం ఉంటుందనే విషయాన్ని అంగీకరించారు. అయితే ఆయనతో పాటు అందరూ వెళ్లే అవకాశం లేదన్నారు. పార్టీ ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడేందుకు ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement