'జెన్‌కో' కొలువు జయించానిలా..
పబ్లిక్ పరీక్షలైనా.. పోటీ పరీక్షలైనా.. మౌఖిక పరీక్షలైనా.. మరే ఎగ్జామ్ అయినా.. సిలబస్‌లోని సబ్జెక్టులపై పట్టుంటే విజయం నల్లేరుపై నడకే! లక్ష్య సాధన లాంఛనమే!! భీమవరానికి చెందిన మేడూరి కల్యాణ్ దీనికి చక్కని ఉదాహరణ. అకడమిక్ పరీక్షల తోపాటు పోటీ పరీక్షల్లోనూ ఆయన ఇదే సూత్రం ఆధారంగా అత్యుత్తమ మార్కులు పొందాడు. ఇప్పుడు ‘ఏపీ జెన్‌కో ఏఈ ఎగ్జామ్–2017’లో ఏకంగా స్టేట్ సెకండ్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తన చదువు కోసం అడిగినవన్నీ సమకూర్చిన తండ్రి (కార్పెంటర్) నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. సర్కారు నౌకరీ సాధించి ఆయనకు గర్వకారణంగా నిలిచాడు. లక్షల్లో వేతనం వచ్చే ప్రైవేట్ జాబ్ కన్నా ఆత్మసంతృప్తినిచ్చే ప్రభుత్వ ఉద్యోగమే మిన్న అనే భావనతో అనుకున్నది సాధించాడు. ఏపీ జెన్‌కో ఏఈ ఎగ్జామ్ –2017’లో ఏకంగా స్టేట్ సెకండ్ ర్యాంకు కల్యాణ్ సక్సెస్ స్టోరీ తన మాటల్లోనే...
స్టార్ట్ 1.. 2.. 3
ఆంధ్రప్రదేశ్ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజెన్‌కో)లో.. అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి ప్రకటన (ఈ ఏడాది మార్చిలో) జారీ అవుతుందని తెలిసి.. నెల రోజుల ముందుగా ప్రిపరేషన్ మొదలుపెట్టాను.
టాప్ లెవలే టార్గెట్:
ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించి టాప్ ర్యాంక్ సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉద్యోగం పొందాలంటే టాప్‌లో నిలవాలని నిర్ణయించుకున్నా.
‘వ్యూ’హం ఇదీ..:
పరీక్షను 100 మార్కులకు నిర్వహించారు. ఇందులో టెక్నికల్ అంశాలకు 70 మార్కులు; ఆప్టిట్యూడ్‌కు 30 మార్కులు కేటాయించారు. టెక్నికల్ విభాగం కోసం నోటిఫికేషన్‌లోని సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలనూ క్షుణ్నంగా చదివా. ‘సాక్షి’ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఏపీజెన్‌కో ప్రీవియస్ పేపర్లను విశ్లేషించాను. వాటిలో థియరీ ప్రశ్నలు ఎక్కువ వచ్చినట్లు గమనించి.. ప్రతి సబ్జెక్టునూ పరిపూర్ణంగా అధ్యయనం చేశా. తర్వాత గేట్, ఐఈఎస్, ఇస్రో థియరీ ప్రశ్నలను సాధన చేశాను. ఈ వ్యూహం ఫలించింది.
వీడియోలతో సందేహాల నివృత్తి
ఆప్టిట్యూడ్ విభాగం కోసం తొలుత ‘ఏపీజెన్‌కో’తోపాటు టీఎస్‌జెన్‌కో ప్రీవియస్ పేపర్లనూ పరిశీలించాను. వాటిలోని ప్రశ్నలకు సంబంధించిన టాపిక్‌లనే ప్రధానంగా ప్రిపేర్ అయ్యాను. రోజూ వివిధ దినపత్రికల్లో వచ్చిన మాదిరి ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు సమాధానాలను సాధన చేశాను. ఏదైనా అంశం అర్థంకాకపోతే దాన్ని యూట్యూబ్ వీడియోల సాయంతో అవగాహన చేసుకున్నాను. ప్రిపరేషన్‌లో భాగంగా ఎస్సెస్సీ–జేఈ, సీఐఎల్ ప్రీవియస్ పేపర్లు కూడా ప్రాక్టీస్ చేశాను.
మాక్ టెస్టులతో మెళకువలు
ఎన్నో మాక్ టెస్టులకు హాజరయ్యాను. తద్వారా పరీక్షల్లో టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాముఖ్యత తెలిసొచ్చింది. కచ్చితత్వమూ అలవడింది. కొత్త టాపిక్‌లు, ట్రిక్స్ తెలిశాయి. ఒక టాపిక్/సబ్జెక్టు చదవడం పూర్తయిన తర్వాత టెస్ట్ సిరీస్‌లు అటెంప్ట్ చేశాను. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సాధ్యమైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయాలి.
ప్రకటన నుంచి పరీక్ష వరకు
నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎగ్జామ్ నిర్వహించే రోజు వరకూ.. అందుబాటులో ఉండే సమయం ఎంతో విలువైంది. అందువల్ల దాన్ని ప్రణాళికాబద్దంగా సద్వినియోగం చేసుకున్నాను. రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు గంట సేపు వివిధ దినపత్రికల్లో వచ్చిన ఆప్టిట్యూడ్ ప్రశ్నలను సాధన చేశాను. తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు టెక్నికల్ సబ్జెక్టులు చదవడం; టెస్ట్ సిరీస్‌లు అటెంప్ట్ చేయడం; ముఖ్య పాయింట్లు, ఫార్ములాలు నోట్స్ రూపంలో రాసుకోవడం; గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపించే సూత్రాలను కాగితంపై రాసుకొని గోడకు అంటించి క్రమంతప్పకుండా మననం చేసుకోవడం ద్వారా పరీక్షకు పక్కాగా సంసిద్ధమయ్యాను. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రీవియస్ టెక్నికల్ పేపర్లను సాల్వ్ చేసేవాణ్ని.
రెండు వారాల ముందు
పరీక్షకు రెండు వారాల సమయం ఉందనగా వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులకు హాజరయ్యాను. చివరి వారంలో.. అప్పటిదాకా చదివిన అంశాలన్నింటినీ రివైజ్ చేసుకున్నాను.
రిఫరెన్స్ బుక్స్
ఇస్రో ప్రీవియస్ పేపర్లు; సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లోని ఏపీ, టీఎస్ జెన్‌కో ప్రీవియస్ పేపర్లు.
చిన్న పొరపాటుతో ఫస్ట్ ర్యాంక్ కోల్పోయా పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు తేడాతో అవకాశం తారుమారవుతుంది. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు సిలబస్‌లోని అన్ని సబ్జెక్టులనూ ఆమూలాగ్రం చదవాలి. చిన్న పొరపాటు కూడా దొర్లకుండా చూసుకోవాలి. ఓఎంఆర్ షీట్‌లో ఆన్సర్లు బబ్లింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఒక ప్రశ్నకు నాకు సమాధానం తెలిసినా.. అనుకోకుండా వేరే ఆప్షన్‌ను బబుల్ చేశాను. దీంతో ఫస్ట్ ర్యాంక్ మిస్సైంది.
మిత్రులతో చర్చించండి
ఈ పరీక్షలో ఎక్కువ శాతం థియరీ ప్రశ్నలకే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అందువల్ల వాటిని కచ్చితంగా, షార్ట్ కట్‌లో రాసేందుకు వీలున్న పద్ధతులపై మీలాగే పరీక్షకు ప్రిపేర్ అయ్యే స్నేహితులతో చర్చించాలి. తద్వారా కొత్త మెథడ్స్, ట్రిక్స్ తెలుసుకోవచ్చు.
ఎగ్జామ్ హాల్లో ఆందోళన వద్దు
పరీక్షలో తొలుత నిమిషం లోపు వ్యవధిలో సమాధానం గుర్తించగల ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి. తర్వాత.. నిమిషం వ్యవధిలో; అనంతరం ఒకటీ రెండు నిమిషాల వ్యవధిలో ఆన్సర్ చేయగల ప్రశ్నలు పరిశీలించాలి. చివరికి సమస్యాత్మక ప్రశ్నల జోలికి వెళ్లాలి. తద్వారా అనవసర ఆందోళనలకు గురయ్యే ఆస్కారం ఉండదు. పరీక్షను ప్రశాంతంగా పూర్తి చేయొచ్చు.
ప్రొఫైల్
తండ్రి: మేడూరి వీవీఎస్‌ఎన్ మూర్తి
(కార్పెంటర్); తల్లి: ఎంఎల్ ప్రసన్న(గృహిణి).
అకడమిక్ ప్రొఫైల్: ఎస్సెస్సీలో 526/600 మార్కులు ఇంటర్‌లో 957/1000 మార్కులు;
బీటెక్‌లో9.1/10; ఎంటెక్ (మెకానికల్) 9.61/10
(ఐఐటీ గువాహటి).
అచీవ్‌మెంట్లు: బీటెక్ ఫస్టియర్‌లో ఫస్ట్ ర్యాంక్;
‘గేట్’లో 1473 ర్యాంక్; ఎంటెక్‌లో ఉండగా
‘ఆప్టిమైజేషన్ ఆఫ్ బేరింగ్స్’పై జర్నల్ పేపర్ పబ్లిష్ అయింది. ఏపీ జెన్‌కో పరీక్షలో 100 కు 84 మార్కులతో సెకండ్ ర్యాంక్.