- కమాండ్ సెంటర్‌కు రానున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ
- పరీక్ష తీరును పరిశీలించనున్న కర్ణాటక బృందం
సాక్షి, హైదరాబాద్ : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ఆదివారం ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఏర్పాటుచేసిన 15 కేంద్రాల్లో మొత్తం 6,053 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్‌సీ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ సీఆర్‌బీటీ పరీక్షల విధానాన్ని అధ్యయనం చేసేందుకు శనివారం కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆరుగురు సభ్యుల బృందం హైదరాబాద్‌కు వచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ భవన్‌లో సుమారు 2గంటల పాటు ఆన్‌లైన్ పరీక్ష విధానాన్ని పరిశీలించిన కర్ణాటక బృందం, ఆదివారం జరగనున్న ఏఎం వీఐ పరీక్ష నిర్వహణనూ పలు కేంద్రాలకు వెళ్లి పరిశీలించనుంది.
కర్ణాటక నుంచి వచ్చిన బృందంలో ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు డాక్టర్ మహదేవ, హెచ్‌డీ పాటిల్, నాగభాయ్, రఘునందన్, గోవిం దయ్య, మైఖేల్ సైమన్ ఉన్నారు. అలాగే, ఆదివారం జరగనున్న ఆన్‌లైన్ పరీక్షా విధానాన్ని పరిశీలించేందుకు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ టీఎస్‌పీఎస్‌సీ భవన్‌కు వస్తున్నారని, టీఎస్‌పీఎస్‌సీ భవన్లో ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్‌ను ఆయన సందర్శిస్తారని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు.
ఏఈ రాత పరీక్షకు 64 శాతం హాజరు
వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకోసం శనివారం టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన రాతపరీక్షకు 64 శాతం మంది హాజరైనట్లు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. ఐదు జిల్లాల్లో 101 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. పరీక్షకు మొత్తం 63 వేలమంది దరఖాస్తు చేసుకోగా, అధికంగా హైదరాబాద్/రంగారెడ్డి నుంచి 82 శాతం, కరీంనగర్ నుంచి 71.36 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు.