చోరీకి గురైన వాటిపైనా స్పష్టతనివ్వని స్క్రాప్ పాలసీ
ఆర్టీఏ రికార్డుల్లో వాహనం ఉన్నా వినియోగంలో లేనివే ఎక్కువ
అలాంటి వాటిపైన 2 శాతం అదనపు పన్ను వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ కొత్తగా రూపొందించిన వాహనాల స్క్రాప్ పాలసీ గందరగోళంగా ఉంది. వాహనాల తుక్కు ప్రక్రియలో స్పష్టత కొరవడింది. ఆర్టీఏ అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 18 లక్షల వరకు కాలపరిమితి ముగిసిన వాహనాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని వాటి యజమానులు రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించుకొని వినియోగిస్తున్నారు. మరికొన్ని వాహనాలు వినియోగానికి పనికి రాకుండా మూలనపడ్డాయి. ఆర్టీఏ ప్రమేయం లేకుండానే తుక్కు కింద మారాయి. మరోవైపు లక్షలాది వాహనాలు గల్లంతయ్యాయి. చోరీకి గురైన వాహనాల జాడ లేదు. ఇలా వివిధ రకాలుగా వినియోగంలో లేని వాహనాలపైన తాజా స్క్రాప్ పాలసీలో ఎలాంటి స్పష్టత లేదని వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త పాలసీ వల్ల కనిపించని ప్రయోజనం
రవాణాశాఖ లెక్కల్లో మాత్రమే కనిపించే ఈ వినియోగంలో లేని వాహనాలపైన వాహనదారులు పెద్దమొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొత్త బండి కొనుగోలు చేసే సమయంలో రెండో వాహనంగా పరిగణించి 2 శాతం పన్నును అదనంగా విధిస్తున్నారు. దీంతో కార్లు, తదితర నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేసే వారు రూ.వేలల్లో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు రెండో బండి కింద ద్విచక్ర వాహనాల కొనుగోలుపై కూడా భారం మోపుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. వినియోగంలో లేని వాహనాలను తుక్కుగా పరిగణించకుండానే రూపొందించిన కొత్త పాలసీ వల్ల వాహనదారులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు.
పాత వాహనాలపై ఫిర్యాదుల వెల్లువ..
మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కాలపరిమితి ముగిసినవిగా పరిగణిస్తారు. తాజా నిబంధనల మేరకు వాటిని తుక్కు చేయాల్సి ఉంటుంది. ఇక వ్యక్తగత వాహనాల కేటగిరీలోకి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. వద్దనుకుంటే స్వచ్ఛందంగా తుక్కు చేసి కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. పాతబండి స్క్రాబ్ చేయడం వల్ల 2 శాతం అదనపు పన్ను నుంచి ఊరట లభిస్తుంది. అలాగే కొత్త వాహనం జీవితకాల పన్నులోనూ రాయితీ ఇస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వినియోగంలో లేని వాహనాల సంగతేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కాలపరిమితి ముగిసి వినియోగానికి పనికి రాకుండా ఉన్నవి ఆటోమేటిక్‌గానే తుక్కుగా మారాయి. పెద్ద సంఖ్యలో చోరీకి గురయ్యాయి. అలాంటి వాటిపైన పోలీస్‌స్టేషన్‌లలో, ఆర్టీఏ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదై ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ ఫిర్యాదులు పరిష్కారానికి నోచడం లేదు.
ఊరించి ఉస్సూరుమనిపించారు..
కాలపరిమితి ముగిసిన వాటిలో ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, లారీలు, డీసీఎంలు, లారీలు, టాటాఏస్‌లు వంటి వివిధ కేటగిరీలకు చెందిన రవాణా వాహనాల కంటే వ్యక్తిగత వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. రవాణా వాహనాలకు 15 ఏళ్లు కాలపరిమితి కాగా, వ్యక్తిగత వాహనాలకు నిర్దిష్టమైన పరిమితి లేదు. 15 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించుకోవచ్చు. దీంతో ఈ కేటరికీ చెందినవి ఎక్కువ. అదే సమయంలో వినియోగంలో లేనివి కూడా వ్యక్తిగత వాహనాల కేటగిరీలోనే అత్యధికంగా ఉన్నాయి. అలాంటి వాటిపైన ఈ పాలసీ ఊరించి ఉస్సూరుమనిపించింది.
చదవండి: 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికం
అపహరణకు గురైనప్పటికీ..
పోగొట్టుకున్న వాహనాలు లభించకపోవడంతో కొత్తవి కొనుగోలు చేసే సమయంలో 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అపహరణకు గురైనప్పటికీ ఆ వాహనం సదరు యజమాని పేరిట నమోదై ఉందనే సాకుతో రవాణా అధికారులు అదనపు భారం మోపుతున్నారు. వినియోగంలో లేకపోయినా పన్ను చెల్లించాల్సి రావడం అన్యాయమని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా రూపొందించిన స్క్రాప్ పాలసీలో తమకు ఊరట లభించవచ్చని చాలామంది భావించారు. కానీ వాటిపైన ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. వాహనదారులు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయవచ్చని మాత్రం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment