- ఆర్టీఏలో కాలం చెల్లిన వాహనాల తుక్కు ప్రక్రియ ప్రారంభం
- రెండు చోట్ల తుక్కు కేంద్రాలకు అనుమతినిచ్చిన రవాణాశాఖ
- తూప్రాన్, కొత్తూరులో ఏర్పాటు
- తుక్కుచేయడంతోపాటు ధ్రువీకరణ పత్రాల జారీ
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): కాలం చెల్లిన వాహనాలను తుక్కు చేసి ధ్రువీకరణ పత్రాలను అందజేసే సమగ్ర స్క్రాపింగ్ సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. నగర శివార్లలోని కొత్తూరు, తూప్రాన్‌లలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం లాంఛనంగా ఆమోదం తెలపడంతో నగరంలో కాలం చెల్లిన వాహనాల తుక్కు ప్రక్రియ మొదలైంది. రవాణాశాఖ పర్యవేక్షణలో జరిగే స్క్రాపింగ్‌లో 15 ఏళ్ల కాల పరిమితి ముగిసిన వాహనాలను తుక్కు చేయడంతో పాటు వాటి రిజి్రస్టేషన్‌లను రద్దు చేస్తారు.
ఈ మేరకు స్క్రాపింగ్ సెంటర్ల నిర్వాహకులే ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. దీంతో వాహనదారులకు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం రెండో వాహనంపై 2 శాతం చొప్పున జీవితకాల పన్ను విధిస్తుండగా, కొత్తగా అమల్లోకి వచ్చిన స్క్రాప్ పాలసీతో ఈ ఇబ్బంది తొలగనుంది. అలాగే కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై 10 శాతం వరకు పన్ను రాయితీ లభించనుంది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే వాహనదారులకు కొత్త వాటిపై ద్విచక్ర వాహనాలపై కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు, కార్లపై కనిష్టంగా రూ.5000 నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు పన్ను రాయితీ ఉంటుంది. వాహనదారులు తమ వాహనాలను స్క్రాప్ చేయాలని కోరితే సదరు స్క్రాప్ కేంద్రాల నిర్వాహకులే స్వయంగా వచ్చి టోయింగ్ ద్వారా వాహనాలను తరలించి స్క్రాప్ చేస్తారు.
గ్రేటర్‌లో 18 లక్షల పాత వాహనాలు...
ఆర్టీఏ అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 18 లక్షల వరకు కాలపరిమితి ముగిసిన వాహనాలు ఉన్నాయి. మోటారు వాహన నిబంధనల మేరకు 15 ఏళ్లు దాటిన వాహనాలను తిరిగి వినియోగించుకునేందుకు రవాణాశాఖ వాటి అనుమతులను ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందజేస్తున్న నేపథ్యంలో కాలం చెల్లిన వాహనాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం ఇది స్వచ్ఛందంగా కొనసాగే ప్రక్రియే అయినప్పటికీ ఆందోళన కలిగిస్తున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తమ పాత వాహనాలను వదిలించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో కొన్నింటిని యజమానులు రిజి్రస్టేషన్‌లను పునరుద్ధరించుకొని వినియోగిస్తున్నారు. మరికొన్ని వినియోగానికి పనికి రాకుండా మూలన పడ్డాయి. ఆర్టీఏ ప్రమేయం లేకుండానే తుక్కు కింద మారాయి. మరోవైపు కొన్ని వాహనాలు రవాణాశాఖ లెక్కల్లో మాత్రమే కనిపిస్తూ వినియోగంలో లేకుండా ఉన్నాయి.
స్పష్టత లేని స్క్రాప్...
ఇలాంటి వాహనాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే ప్రభుత్వం తాజాగా స్క్రాప్ పాలసీని అమలు చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఉనికిలో లేని వాహనాలను కూడా తుక్కుగా మార్చినట్లు ధ్రువీకరించి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అప్పుడు మాత్రమే స్క్రాప్ విధానం సమగ్రంగా అమలవుతుందని పేర్కొంటున్నారు.
గల్లంతైన వాటి సంగతేంటి....
మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కాలపరిమితి ముగిసినవిగా పరిగణిస్తారు. తాజా నిబంధనల మేరకు వాటిని తుక్కు చేయవలసి ఉంటుంది. ఇక వ్యక్తిగత వాహనాల కేటగిరీలోకి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. వద్దనుకుంటే స్వచ్ఛందంగా తుక్కు చేసి కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. పాతబండి స్క్రాప్ చేయడం వల్ల 2 శాతం అదనపు పన్ను నుంచి ఊరట లభిస్తుంది. అలాగే కొత్త వాహనం జీవిత కాలపన్నులోనూ రాయితీ ఇస్తారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ వినియోగంలో లేని వాహనాల సంగతేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కాలపరిమితి ముగిసి వినియోగానికి పనికి రాకుండా ఉన్నవి ఆటోమేటిక్‌గానే తుక్కుగా మారాయి. పెద్ద సంఖ్యలో చోరీకి గురయ్యాయి. అలాంటి వాటిపై పోలీస్‌స్టేషన్లు, ఆర్టీఏ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదై ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పోగొట్టుకున్న వాహనాలు లభించకపోవడంతో కొత్తవి కొనుగోలు చేసే సమయంలో 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తోంది. అపహరణకు గురైనప్పటికీ ఆ వాహనం సదరు యజమాని పేరిట నమోదై ఉందనే సాకుతో రవాణా అధికారులు అదనపు భారం మోపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment