
‘పీఎం ప్రయారిటీ లిస్టు’లో చోటు ఫలితం
అటవీ, పర్యావరణ అనుమతులు జారీ... త్వరలో టెండర్లు
మూడేళ్లలో నాలుగు వరుసల రోడ్డు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎన్నోఏళ్లుగా ఎదురుచూపులకే పరిమితమైన ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల హైవేకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ప్రధానమంత్రి కార్యాలయ సూచన మేరకు ఆ రోడ్డు నిర్మాణానికి వీలుగా అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఇక టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించటమే తరువాయి. మూడేళ్లలో ఈ రోడ్డు అందుబాటులోకి రానుంది. దేశంలోనే కీలక జాతీయ రహదారిగా ఉన్న ఎన్‌హెచ్ 63ను కేంద్రం నాలుగు వరుసలుగా విస్తరిస్తోంది.
ఇది మహారాష్ట్రలోని దౌండ్ వద్ద మొదలై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా 1,065 కి.మీ. కొనసాగి ఒడిశాలోని కోరాపుట్‌లో ముగుస్తుంది. తెలంగాణలో బోధన్–నిజామాబాద్–ఆర్మూరు–మెట్‌పల్లి–కోరుట్ల–జగిత్యాల–లక్సెట్టిపేట–ధర్మపురి–మంచిర్యాల–చెన్నూరు మీదుగా సాగుతుంది. ఇందులో నిజామాబాద్ నుంచి ఆర్మూరు శివారులోని ఎన్‌హెచ్ 44 వరకు, తిరిగి మంచిర్యాల దాటిన తర్వాత ఉండే ఎన్‌హెచ్ 363 నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు చెన్నూరు వరకు రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరిస్తోంది. ఆ పనులు దాదాపు పూర్తయ్యాయి.
ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు కీలక నిర్మాణం అయినందున దాన్ని ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించారు. ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు పట్ణణాలు, గ్రామాల మీదుగా కొనసాగుతున్నందున, దాన్ని గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ఇందుకు భారీగా ప్రైవేట్ భూములు సేకరించాల్సి రావటంతో రైతులు ఎదురుతిరిగారు. దీంతో ఊళ్లున్న ప్రాంతాల్లో బైపాస్‌లు నిర్మించి మిగతా పాత రోడ్డును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. మధ్యలో ఓ పర్యాయం టెండర్లు పిలిచినా.. చివరకు సాంకేతిక కారణాలతో రద్దు చేసుకున్నారు.
ప్రధాని కార్యాలయ దృష్టికి రావటంతో..
మూడోసారి అధికారంలోకి వచి్చన మోదీ ప్రభుత్వం, దేశవ్యాప్తంగా జాప్యం జరుగుతూ వస్తున్న కీలక రహదారులను వేగంగా పూర్తి చేసేలా జాబితాను రూపొందించింది. మొత్తం 3 వేల కి.మీ. నిడివి ఉండే రోడ్లను ఇందులో చేర్చారు. తెలంగాణ నుంచి జగిత్యాల–కరీంనగర్, ఆర్మూరు–మంచిర్యాల రోడ్లను చేర్చారు. వీటిని స్వయంగా ప్రధాని కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు ఈ రోడ్లకు లైన్‌క్లియర్ అయ్యింది.
యాక్సెస్ కంట్రోల్డా...కాదా?
ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు రోడ్డు నిడివి 131.8 కి.మీ. ఇందులో పలు పట్టణాలు, పెద్ద గ్రామాలున్నందున చాలా ప్రాంతాల్లో బైపాస్‌లను నిర్మించనున్నారు. ఆర్మూరు, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల పట్టణాల వద్ద 6 కి.మీ. నుంచి 12 కి.మీ. మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మరో ఎనిమిది ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లు నిర్మిస్తారు. మొత్తంలో 105 కి.మీ. బైపాస్‌లే ఉండటంతో గ్రీన్‌ఫీల్డ్ హైవేగానే ఉండనుంది. దీన్ని యాక్సెస్ కంట్రోల్డ్ తరహాలో నిర్మించాలని ప్రతిపాదించినా, కేంద్రం ఇంకా దానికి అనుమతి ఇవ్వలేదు.
ఈ రోడ్డుమీద టోల్‌బూత్‌లు ఉంటాయి. వాహనాల సంఖ్య అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా లేదు. యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో అయితే, నిర్ధారిత ప్రాంతాలలో మినహా మధ్యలో ఎక్కడా వేరే వాహనాలు ఈ రోడ్డు మీదకు చేరే వీలుండదు. దీంతో టోల్ ఆదాయం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. బైపాస్‌ల కోసం 500 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇందుకే రూ.900 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇక వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇది 45 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. మధ్యలో సెంట్రల్ మీడియన్, రెండువైపులా పేవ్డ్ షోల్డర్స్ దారి ఉంటుంది. ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 61లను అనుసంధానిస్తుంది.
మంచిర్యాల శివారు శ్రీరాంపూర్ వద్ద ఎన్‌హెచ్ 63లో నిర్మించిన ఈ ఇంటర్‌ఛేంజ్‌తో ప్రతిపాదిత రోడ్డు అనుసంధానమవుతుంది
ప్యాకేజీ1: ఆర్మూరు నుంచి మెట్‌పల్లి 35.9 కి.మీ
ప్యాకేజీ2: మెట్‌పల్లి నుంచి జగిత్యాల 28.7 కి.మీ.
ప్యాకేజీ3: జగిత్యాల నుంచి రాయపట్నం 31.9 కి.మీ.
ప్యాకేజీ4: రాయపట్నం నుంచి మంచిర్యాల 35.39 కి.మీ.