స్వచ్ఛత, గ్రీనరీలో ఆదర్శంగా వరంగల్ జిల్లా గ్రామం
ఇంటింటా పచ్చని చెట్లు.. వీధులన్నీ వనాలు
గీసుకొండ: ఒకప్పుడు పల్లెలు పచ్చదనానికి పట్టుగొమ్మలు, ఇప్పుడంతా మారిపోయిందని అంటూ ఉంటారు. కానీ వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం మాత్రం ఇప్పటికీ పచ్చదనంతో కళకళలాడుతోంది. ఏ ఇంటి ఆవరణ చూసినా, ఏ వీధిలో తిరిగినా పచ్చటి చెట్లు, మొక్కలు కనువిందు చేస్తున్నాయి. 2019 నుంచి ఇటీవలి వరకు సర్పంచ్‌గా పనిచేసిన అల్లం బాలిరెడ్డి చొరవే దీనికి కారణం.
ఆయన సొంత ఖర్చుతో నర్సరీల నుంచి మొక్కలు తెప్పించారు. గ్రామంలోనూ నర్సరీ ఏర్పాటు చేయించారు. వివిధ పండ్లు, పూలు, కూరగాయల మొక్కలను ఇంటింటికి అందించారు. మొక్కలు నాటి సంరక్షించిన వారికి బహుమతులు ఇచ్చారు. నిండా పచ్చదనంతో, కాలుష్యానికి దూరంగా ఉండే ఈ గ్రామానికి ఇప్పటికే జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు వచ్చి0ది. ఇటీవల రాష్ట్ర స్థాయి పర్యావరణ పరిరక్షణ అవార్డు ఇచ్చారు.
ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు.. సోలార్ ఉత్పత్తిలోనూ..
గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికీ సర్పంచ్ కృషి చేశారు. గ్రామంలో ఇంటింటికీ జనపనార, క్లాత్ సంచులను అందించారు. తనకు వచ్చే గౌరవ వేతనాన్ని మßహిళా సంఘాలకు ఇచ్చి.. వారితో వారంలో ఒకరోజు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనులు చేయించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి విక్రయించి, ఆ సొమ్మును గ్రామ అభివృద్ధికి ఖర్చు చేశారు. ఇక గ్రామంలో 20 మంది తమ ఇళ్లపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం సర్పంచ్ తన వంతుగా రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. గత ఐదేళ్లలో గ్రామంలో పుట్టిన 29 మంది బాలికలకు రూ.10వేల చొప్పున సాయం అందించారు.
గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి..
‘‘ప్రజలు, ప్రభుత్వ అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం. అన్ని గ్రామాలు స్వయం సమృద్ధి చెందితే దేశం మరింత ప్రగతి సాధిస్తుంది.’’ – మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment