
పౌరసరఫరాల శాఖకు సభ్యుల తొలగింపులకే ఆప్షన్...
కొత్త సభ్యుల ఆమోదం, పాత సభ్యుల పునరుద్ధరణకు నో ఆప్షన్..
8 ఏళ్లుగా ఇదే పరిస్థితి..ఇక ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చేంతవరకు ఆగాల్సిందే..
అప్పటివరకు రేషన్ కోటా కట్..గగ్గోలు పెడుతున్న పేద కుటుంబాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్ కార్డు మంజూరు దేవుడెరుగు..పాత కార్డులోని పేర్ల తొలగింపుతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో ఒకరి పేరు బదులు మరొకరి పేర్లు తొలగింపునకు గురవుతోంది. మరికొందరికి కొత్త రేషన్ కార్డు కోసం పేరు తొలగిస్తే ..కొత్తది రాకపోగా పాతదాంట్లోనూ కోటా కట్ అవుతోంది. కొత్త కార్డులో పేర్ల నమోదు కోసం పాత వాటిలో తొలగింపునకు దరఖాస్తు తప్పడం లేదు. దరఖాస్తును సరిగ్గా పరిశీలించని పౌరసరఫరాల శాఖ సిబ్బంది తొలగించాల్సిన యూనిట్‌కు బదులు దరఖాస్తుదారుల పేర్లు తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది.
వివాహ బంధాలతో కొత్తగా ఏర్పాటైన కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తల్లిదండ్రుల కుటుంబం కార్డుల్లో పేర్లు రద్దయితే కానీ, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. కుటుంబం రేషన్ కార్డుల నుంచి తమ పేర్లను తొలగించుకునేందుకు పౌరసరఫరాల శాఖ సర్కిల్ ఆఫీస్‌లకు క్యూ కట్టి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించుకుంటున్నారు. దీంతో సంబంధిత సిబ్బంది ఒక సభ్యుడికి బదులు మరో సభ్యుడి పేరు తొలగిస్తుండటంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.
రెండుశాతం వరకు ..
గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల నుంచి రేషన్‌కార్డులో పేర్ల తొలగింపునకు సంబంధించి సుమారు రెండు లక్షలపైగా ఆఫ్‌లైన్ దరఖాస్తులు వచి్చనట్లు తెలుస్తోంది. అందులో రెండు శాతం వరకు సభ్యుల పేర్ల తొలగింపులో తికమక జరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. గ్రేటర్ మొత్తం మీద సుమారు పన్నెండు అర్భన్ సర్కిళ్ల పరిధిలో 12,34,873 కార్డులు అందులో 42,72,820 మంది లబ్ధిదారులు ఉన్నారు.
గ్రామీణ ప్రాంతంలో మరో ఐదు లక్షల కార్డులు, 17 లక్షల మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు. అందులో మొత్తం మీద సుమారు 10 శాతం కుటుంబాల్లోని సభ్యులు పెళ్లిల్లు చేసుకోవడంతో కొత్త కుటుంబాలు ఏర్పాటయ్యాయి. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండంతో కొత్త కుటుంబాలకు ఆసక్తి పెరిగింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు పాత కార్డులోని తమ పేర్లను తొలగించాలని దరఖాస్తు చేస్తున్నారు. కానీ వీటి తొలగింపు గందరగోళంగా తయారైంది.
ఎదురు చూపులే..
పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులకు ఎదురు చూపులు తప్పడం లేదు. గత ఎనిమిదేళ్లుగా రేషన్‌కార్డులోని సభ్యులు (యూనిట్లు) వివిధ సాకులతో తొలగింపునకు గురవుతున్నా..కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులకు మాత్రం మోక్షం లభించడం లేదు. ఈ వ్యవధిలో ఉమ్మడి కుటుంబాలు రెండు, మూడుగా ఏర్పడగా, మరోవైపు కుటుంబంలో మరి కొందరు కొత్త సభ్యులుగా చేరారు. పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల ప్రక్రియ పెండింగ్‌లో మగ్గుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు మూడు లక్షల కుటుంబాలు తొమ్మిది లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆన్ లైన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులు కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తూనే..ఆమోదించే ఆప్షన్‌ను మాత్రం ప్రభుత్వం నిలిపివేసింది. రేషన్ కార్డులోని సభ్యుల తొలగింపు నిరంతరం ప్రక్రియగా సాగుతోంది. అమోదం లేక పోవడంతో నిరుపేద కుటుంబాలు మీ సేవ, సివిల్ సప్‌లై ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఆమోదించే ఆప్షన్ ఇచ్చేంతవరకు ఆగాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో పేర్ల తొలగింపునకు గురైన యూనిట్ల నెలవారి కోటా కట్ కావడంతో పేద కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి.