Ration Card: రెండు కుటుంబాల సమస్య కాదు..! | Ration Card More than three lakh applications are pending | Sakshi
Sakshi News home page

Ration Card: రెండు కుటుంబాల సమస్య కాదు..!

Published Wed, Feb 26 2025 1:05 PM | Last Updated on Wed, Feb 26 2025 2:03 PM

Ration Card More than three lakh applications are pending

పెండింగ్‌లో మూడు లక్షలకుపైగా దరఖాస్తులు 

వీటికి మోక్షం లభిస్తేనే కొత్త అర్జీలకు అవకాశం

మాదన్నపేటకు చెందిన వెంకట్‌కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. కొత్తగా కాపురానికి వచ్చిన భార్య పేరును కుటుంబం తెల్ల రేషన్‌ కార్డులో చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త సభ్యుల ఆమోదానికి మోక్షం లభించలేదు. తాజాగా ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడ్డారు. కొత్త రేషన్‌ కార్డు(Ration Card) దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించగా.. ఇప్పటికే దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో కనిపించింది. పెండింగ్‌ దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణ జరిగితే  కానీ కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండాపోయింది.

పదేళ్ల క్రితం సికింద్రాబాద్‌కు చెందిన సత్యనారాయణ కుటుంబానికి రేషన్‌ కార్డు(Ration Card) మంజూరైంది. అందులో భార్య భర్తతో పాటు కుమారుడు లబ్ధిదారుడుగా ఉన్నారు. రేషన్‌ కార్డులో మరో కుమారుడి పేరును చేర్పించేందుకు 2017లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. ఆ తర్వాత ఇద్దరు ఆడ పిల్లలు జన్మంచారు. ప్రస్తుతం వారి వయసు ఐదేళ్లు దాటింది. తాజాగా రేషన్‌ కార్డులో వారి పేర్లను నమోదు చేయించేందుకు మీ సేవ కేంద్ర  ద్వారా ప్రయత్నించారు. ఇప్పటికే దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న కారణంగా క్లియర్‌ అయ్యేవరకు కొత్త  దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు లేకుండా పోయింది. రెండు కుటుంబాల సమస్య కాదు ఇది. నగరంలోని చాలా కుటుంబాలు ఎదుర్కొంటున్నదే.

సాక్షి, హైదరాబాద్‌: పాత రేషన్‌ కార్డుల్లో(Ration Card) పెండెన్సీ దరఖాస్తులు కొత్త సమస్య తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే చేర్పులు.. మార్పుల కోసం చేసుకున్న దరఖాస్తులు క్లియర్‌ అయితే తప్ప కొత్తగా అర్జీలు పెట్టుకునేందుకు వెసులుబాటు లేకుండా పోయింది.  ఎనిమిదేళ్లుగా  రేషన్‌కార్డులోని సభ్యులు (యూనిట్లు) వివిధ సాకులతో  తొలగింపునకు గురవుతున్నా.. కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులకు మాత్రం మోక్షం లభించడం లేదు. ఈ వ్యవధిలో ఉమ్మడి కుటుంబాలు  రెండు, మూడుగా ఏర్పడగా.. మరోవైపు కుటుంబంలో మరికొందరు కొత్త సభ్యులుగా చేరారు. కనీసం వీరికి  కొత్తగా రేషన్‌ కార్డు కోసం,  చేర్పులు మార్పులు కోసం దరఖాస్తు  చేసుకునే వీలు లేక ఆందోళనకు గురవుతున్నారు. 

రేషన్‌ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల ప్రక్రియ పెండింగ్‌లో మగ్గుతోంది. గ్రేటర్‌ పరిధిలో సుమారు 17,21,603  రేషన్‌ కార్డులు ఉండగా, అందులో  59,00,584 సభ్యులు ఉన్నారు. అందులో సుమారు మూడు లక్షల  కుటుంబాలు తొమ్మిది లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆన్‌లైన్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రేషన్‌ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులు కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తూనే... ఆమోదించే ఆప్షన్‌ను మాత్రం ప్రభుత్వం నిలిపివేసింది. అయితే.. రేషన్‌ కార్డులోని సభ్యుల తొలగింపు నిరంతరం ప్రక్రియగా సాగుతోంది. ఆమోదం లేక పోవడంతో నిరుపేద కుటుంబాలు మీ సేవ, సివిల్‌ సప్లయ్‌ ఆఫీసుల చుట్టూ 
ప్రదక్షిణ చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement