అర్జీ.. సర్కార్‌కు ఎలర్జీ!
సచివాలయంలో పేరుకున్న అర్జీల గుట్టలు వేళాపాళా పాటించని ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ.. కొత్త ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా సాకారమైన కొత్త రాష్ట్రం. కొత్త ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టి ఏడాది గడిచింది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆశగా సర్కార్ వైపు చూస్తున్నారు. అందులో భాగంగా పలు అర్జీలను ఆయా శాఖలకు పెట్టుకున్నారు. కాని పట్టించుకునే దిక్కులేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల విజ్ఞప్తులను చిన్నచూపు చూస్తోంది. ఫిర్యాదులను పక్కన పడేస్తోంది. దీంతో సచివాలయంలోని ఫిర్యాదుల విభాగంలో లెక్కకు మిక్కిలిగా అర్జీలు, ఫిర్యాదులు పేరుకుపోతున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 31,281 అర్జీలు పెండింగ్‌లో ఉంటే.. అందులో అత్యధికంగా, మూడో వంతుకు పైగా రెవెన్యూశాఖకు చెందినవే. ఈ ఒక్క విభాగంలోనే 12,941 ఫైళ్లు అపరిష్కృతంగా ఉన్నాయి.
ప్రతి రోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి వంద నుంచి రెండు వందల అర్జీలు అందుతున్నాయి. పబ్లిక్ మానిటరింగ్ సెల్‌లో వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖకు, ఆయా కార్యాలయాలకు పంపిస్తారు. క్షేత్రస్థాయి అధికారులు వీటిని పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. సీఎంవో ఆదేశించినా వాటికి అతీగతీలేదు. తమ అర్జీలకు మోక్షమెప్పుడు లభిస్తుందా.. అని బాధితులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కొత్త రాష్ట్రంలో అవసరమైతే ఎక్కువ సమయం పని చేస్తామంటూ పీఆర్‌సీ అమలు, తెలంగాణ ఇంక్రిమెంట్ అందుకునే సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి భరోసా ఇచ్చారు. సచివాలయంలోనే ఉద్యోగులు వేళాపాళా పాటించటం లేదని, ఆలస్యంగా ఆఫీసులకు వస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గత నెలలో హెచ్‌వోడీ కార్యాలయాలన్నింటికీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్రం లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 2,986 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు.
రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ మంగళవారం వరకు...
అందిన అర్జీలు 33,814
పెండింగ్‌లో ఉన్నవి 31,281
పరిష్కారమైనవి 1,818
పురోగతిలో ఉన్నవి 566
తిరస్కరించినవి 149
జిల్లాల వారీగా అర్జీలు పరిష్కారమైనవి
రంగారెడ్డి 2,986 0
హైదరాబాద్ 2,957 1111
కరీంనగర్ 1,807 6
వరంగల్ 1,373 1
మహబూబ్‌నగర్ 1,233 220
నల్లగొండ 1,091 301
ఖమ్మం 1,012 18
మెదక్ 904 58
ఆదిలాబాద్ 722 49
నిజామాబాద్ 699 66