మోర్తాడ్: విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)లను తక్షణమే జారీ చేయడానికి హైదరాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మూడు రోజుల ముచ్చటగానే మిగిలాయి. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతుండడంతో విచారణ, పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో వారం వ్యవధిలో పీసీసీలను జారీ చేసేవారు. కరోనా భయాలు తొలగిపోవడంతో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి సంఖ్య పెరిగింది.
కొత్త పాస్‌పోర్టులు, రెన్యువల్‌తోపాటు పీసీసీల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం పరిధిలోని ఐదు సెంటర్లలో రోజుకు ఐదు వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇందులో ఎక్కువగా కొత్త పాస్‌పోర్టులకు సంబంధించినవే ఉంటున్నాయి. గతంలో రోజుకు 2 వేల స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఇచ్చేవారు. ఈ సంఖ్యను ప్రస్తుతం ఐదు వేలకు పెంచారు. అయినా క్యూ తగ్గకపోవడంతో పీసీసీల కోసం గత నెలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినా ఆలస్యమవుతున్నాయి.
పోస్టాఫీసులకు సేవలు విస్తరించినా..
గతంలో పీసీసీలు పూర్తిగా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారానే జారీ చేసేవారు. తర్వాత పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా హెడ్ పోస్టాఫీసుల ద్వారా కొత్త పాస్‌పోర్టులకు దరఖాస్తులు స్వీకరించారు. పీసీసీలను వేగంగా జారీ చేయడం కోసం ప్రధాన తపాలా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తులను అందించేందుకు సెప్టెంబర్ చివరివారంలో అవకాశం ఇచ్చారు. పోస్టాఫీసులకు సేవలను విస్తరించడం వల్ల పీసీసీల జారీ సులభతరం అవుతుందని భావించారు. అయితే ఈ కార్యాలయాల్లోనూ రద్దీ పెరిగింది.
పీసీసీల స్లాట్ బుకింగ్‌కే మూడు వారాల సమయం పడుతోంది. పీసీసీల జారీకి నెల రోజులకంటే ఎక్కువ సమయం పడుతోంది. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించిన విచారణ త్వరగా పూర్తి అవుతుండగా పోస్టాఫీసుల్లో కోసం దరఖాస్తు చేసుకున్నవారి విచారణలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పీసీసీల జారీ కోసం విదేశాంగ శాఖ వేగవంతమైన శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. (క్లిక్: ముగిసిన జోసా కౌన్సెలింగ్.. ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ)
Comments
Please login to add a commentAdd a comment