మలక్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్ మస్తాన్ తన ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం కోసం షాదీముబారక్ పథకం కింద ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు సదరు దరఖాస్తుపై విచారణ జరగలేదు. సంబందిత తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నా సరైన సమాధానం మాత్రం లభించడం లేదు. ఇది ఒక్క మస్తాన్ సమస్య కాదు.. నగరంలో వందలాది మంది నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య.
సాక్షి, హైదరాబాద్: దేవుడు వరం ఇచ్చినా... పూజారి కరుణించని చందంగా తయారైంది షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల పరిస్థితి. ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరితో నిరుపేద ఆడబిడ్డల ఆర్థిక చేయూతకు గ్రహణం పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు సాయంపై గంపెడాశతో అప్పో సప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిల్లు చేస్తున్న పేద కుటుంబాలు మరింత ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఏడాది గడిస్తే కానీ ఆర్థిక సాయం అందే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ యంత్రాంగానికి గుదిబండగా తయారైంది.
ఒకవైపు వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేయడం, మరోవైపు డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ఏల ఆందోళన... సిబ్బంది కొరత కారణంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధ్రువీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉండగా... ఇప్పటికే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయినా మిగితా ప్రక్రియ కూడా నత్తకు నడక నేర్పిస్తోందనడం నిర్వివాదంశం.
వెంటాడుతున్న నిధుల కొరత
ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను గ్రీన్ చానల్ కింద ప్రకటించినా నిధుల కొరత వెంటాడుతోంది. బడ్జెట్‌లో పథకాలకు కేటాయింపులు ఘనంగా ఉన్నా.. ఆమలులో మాత్రం పథకం చుక్కలు చూపిస్తోంది. క్షేత్ర స్థాయి విచారణ అనంతం ఆర్థిక సాయం మంజూరైనా... ట్రెజరీ బిల్లుల పెండింగ్‌లో పడిపోతున్నాయి. ప్రభుత్వ సాయం అందితే పెళ్లికి చేసిన అప్పులు తీర్చాలని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. పేదింటి బిడ్డలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వం 2014లో శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వధువులకు రూ. 1,00,116 సాయంగా అందజేస్తున్నారు.
కార్యాలయాల చూట్టూ...
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు సంబంధిత తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సాయం అందలేదని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దరఖాస్తులు తమ వద్ద పెండింగ్‌లో లేవని అధికారులు పేర్కొంటుండటంతో స్థానిక ఎమ్మెల్యేల వద్దకు పరుగులు చేస్తున్నారు.
పరిస్థితి ఇలా...
హైదరాబాద్ జిల్లాలో 14 వేల పైగా షాదీముబారక్ దరఖాస్తులు 2 వేలపైగా కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విషయంలో కనీస విచారణ జరగకపోవడం కొసమెరుపు. (క్లిక్ చేయండి: మునుగోడు ఎన్నికల బరిలో ఉంటాం)
Comments
Please login to add a commentAdd a comment