Shaadi Mubarak scheme
-
పెండింగ్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు.. ఎందుకిలా?
మలక్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్ మస్తాన్ తన ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం కోసం షాదీముబారక్ పథకం కింద ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు సదరు దరఖాస్తుపై విచారణ జరగలేదు. సంబందిత తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నా సరైన సమాధానం మాత్రం లభించడం లేదు. ఇది ఒక్క మస్తాన్ సమస్య కాదు.. నగరంలో వందలాది మంది నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య. సాక్షి, హైదరాబాద్: దేవుడు వరం ఇచ్చినా... పూజారి కరుణించని చందంగా తయారైంది షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల పరిస్థితి. ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరితో నిరుపేద ఆడబిడ్డల ఆర్థిక చేయూతకు గ్రహణం పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు సాయంపై గంపెడాశతో అప్పో సప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిల్లు చేస్తున్న పేద కుటుంబాలు మరింత ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఏడాది గడిస్తే కానీ ఆర్థిక సాయం అందే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ యంత్రాంగానికి గుదిబండగా తయారైంది. ఒకవైపు వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేయడం, మరోవైపు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏల ఆందోళన... సిబ్బంది కొరత కారణంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధ్రువీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉండగా... ఇప్పటికే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయినా మిగితా ప్రక్రియ కూడా నత్తకు నడక నేర్పిస్తోందనడం నిర్వివాదంశం. వెంటాడుతున్న నిధుల కొరత ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను గ్రీన్ చానల్ కింద ప్రకటించినా నిధుల కొరత వెంటాడుతోంది. బడ్జెట్లో పథకాలకు కేటాయింపులు ఘనంగా ఉన్నా.. ఆమలులో మాత్రం పథకం చుక్కలు చూపిస్తోంది. క్షేత్ర స్థాయి విచారణ అనంతం ఆర్థిక సాయం మంజూరైనా... ట్రెజరీ బిల్లుల పెండింగ్‌లో పడిపోతున్నాయి. ప్రభుత్వ సాయం అందితే పెళ్లికి చేసిన అప్పులు తీర్చాలని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. పేదింటి బిడ్డలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వం 2014లో శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వధువులకు రూ. 1,00,116 సాయంగా అందజేస్తున్నారు. కార్యాలయాల చూట్టూ... కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు సంబంధిత తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సాయం అందలేదని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దరఖాస్తులు తమ వద్ద పెండింగ్‌లో లేవని అధికారులు పేర్కొంటుండటంతో స్థానిక ఎమ్మెల్యేల వద్దకు పరుగులు చేస్తున్నారు. పరిస్థితి ఇలా... హైదరాబాద్ జిల్లాలో 14 వేల పైగా షాదీముబారక్ దరఖాస్తులు 2 వేలపైగా కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విషయంలో కనీస విచారణ జరగకపోవడం కొసమెరుపు. (క్లిక్ చేయండి: మునుగోడు ఎన్నికల బరిలో ఉంటాం) -
జరిగిందంతా తూచ్.. ఈ కేసు కథ కంచికి చేరినట్లేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: రెవెన్యూశాఖను కుదిపేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అక్రమాల కేసు అటకెక్కినట్లేనా? ఈ కేసులో సుమారు నెల రోజులపాటు విచారణ జరిపి సమర్పించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదిక బుట్టదాఖలైనట్లేనా? విచారణలో పలువురిపై చర్యలకు రాష్ట్రస్థాయి అధికారులు చేసిన సిఫారసులు ‘షోకాజ్’లతో సరిపుచ్చారా?... అంటే రెవెన్యూ వర్గాలనుంచి అవుననే సమాధానం వస్తోంది. పేదల కోసం ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో కొందరు తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. చెక్కుల పంపిణీ కోసం భారీగా వసూళ్లకు పాల్పడిన పలువురిపై సీరియస్‌గా స్పందించిన ఉన్నతాధికారులు మొదట చర్యలకు సిఫారసు చేశారు. విచారణ నివేదికల ఆధారంగా షోకాజ్‌లు జారీ చేసి కీలక పోస్టుల నుంచి తప్పించారు. ఓ వైపు విచారణ జరుగుతుండగా.. ఇవే కేసుల్లో తప్పించబడిన పలువురికి మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. విజిలెన్స్ నివేదికలు అటకెక్కినట్లేనా.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు నగదు చెల్లించడం, అర్హులనుంచి వసూళ్లకు పాల్పడ్డారన్న వివాదంలో రాష్ట్రవ్యాప్తంగా 55 మంది తహసీల్దార్లు, ఇతర ఉద్యోగులుంటే.. ఉమ్మడి వరంగల్ నుంచి 16 మంది వరకు వివిధ స్థాయి అధికారులు ఉన్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ తహసీల్దార్ ఆఫీసు కేంద్రంగా జరిగిన వాటికి బాధ్యులుగా అప్పటి తహసీల్దార్ రాజును, మరో ఇద్దరిని జనవరి 24న అక్కడి నుంచి తప్పించారు. పరకాల ఆర్డీఓ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయాలపైన ఇచ్చిన నివేదికల ప్రకారం అందరికీ షోకాజ్‌లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇంకా విచారణ జరుగుతున్న సమయంలో పరకాల ఆర్డీఓ కార్యాలయానికి అటాచ్డ్ చేసిన రాజును రెండు నెలలైనా కాకముందే శాయంపేట తహసీల్దార్‌గా బదిలీ చేశారు. శాయంపేట తహసీల్దార్ కార్యాలయంపైనా స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారిస్తుండగా, అక్కడి తహసీల్దార్ పోరిక హరికృష్ణను బదిలీ చేయడం ఇప్పుడు రెవెన్యూశాఖలో చర్చనీయాంశంగా మారింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్లలో అదుపుతప్పిన అవినీతిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్వయంగా క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దింపారు. దీంతో ధర్మసాగర్, శాయంపేట తహసీల్దార్ కార్యాలయంతో పాటు పరకాల, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, మహబూబాబాద్, గూడూ రు, కేసముద్రం, మహబూబాబాద్ తదితర తహసీల్దారు కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి, ములుగులో రెవెన్యూ సిబ్బందికి తోడు కంప్యూటర్ ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. క్షేత్రస్థాయిలో వివిధ పార్టీల లీడర్లు, వారి అనుచరులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మరికొందరు దళారులు కలిసి అక్రమాలకు పాల్పడినట్లుగా 2021 డిసెంబర్లో నిఘావర్గాలు వెల్లడించిన నివేదిక ఆధారంగా జనవరిలో చర్యలు ప్రారంభించారు. ఇంకా విచారణ పూర్తికాకపోగా, మరికొందరిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో చర్యల్లో భాగంగా లూప్లైన్లకు పంపిన వారికి మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తున్న నేపథ్యంలో కల్యాణలక్ష్మి అక్రమాల కథ కంచికి చేరినట్లేనన్న చర్చ జోరందుకుంది. -
కల్యాణ‘లబ్ధి’ ఒక్కసారే...!
సాక్షి, హైదరాబాద్: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఒక్కసారే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో మొదటి పెళ్లి, రెండో పెళ్లి అనే అంశాలు అప్రస్తుతమని తేల్చి చెప్పింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన సోదరి రెండో వివా హం నేపథ్యంలో కల్యాణలక్ష్మి లబ్ధి పొందవచ్చా అని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం లోతుగా పరిశీలించి ఈ ఆదేశాలు జారీ చేసింది. -
పెళ్లి సాయం పెరిగింది!
సాక్షి, కామారెడ్డి: ఆడపిల్లల పెళ్లిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా అందజేస్తున్న సాయాన్ని రూ.1,00,116 కు పెంచింది. సోమవారం శాసన సభలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పుడు కేవలం ఎస్సీ, ఎస్టీలకు వారికి రూ.51,116 అందజేసేవారు. తరువాత దీన్ని మైనారిటీలకు షాదీముబారక్ పేరుతో వర్తింపజేసి తరువాత అన్ని వర్గాల పేద కుటుంబాలకు వర్తింపజేయడంతో పాటు ఆర్థికసాయం మొత్తాన్ని రూ.రూ.75,116కు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ మొత్తాన్ని రూ.1,00,116 కు పెంచుతూ సీఎం ప్రకటన చేయడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మందికిపైగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రయోజనం పొందారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 18 ఏళ్లు పైబడిన వారికి వివాహ కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా సాయం అందిస్తారు. అయితే పథకం అమలులో అక్కడక్కడా అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని లింగంపేట మండలంలో రెండు, మూడు అక్రమాలు జరగగా, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. -
‘షాదీ’ పైసల్ స్వాహా
♦ షాదీ ముబారక్‌లో అక్రమాలు ♦ 36 జంటల పేరిట రూ.18 లక్షలు కాజేసిన మహిళ ♦ నిజామాబాద్ జిల్లాలో ఘటన ఆర్మూర్: పేద ముస్లిం ఆడబిడ్డల పెళ్లి.. వారి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ పథకం సొమ్మును అక్రమార్కులు కాజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఓ మహిళ 36 జంటల పేరిట దరఖాస్తు చేసుకుని రూ. 18.36 లక్షలు కాజేసింది. ఆర్మూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ అర్షియా అంజుమ్ చేసిన ఈ భారీ కుంభకోణం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుపేదలైన ముస్లిం వధువుకు రూ. 51 వేలను వివాహ కానుకగా అందిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 3,756 మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు. అయితే ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ గల్లీకి చెందిన అర్షియా అంజుమ్ 2014 నవంబర్ 11న నిజామాబాద్‌లోని ఆటోనగర్‌కు చెందిన మహ్మద్ అజారుద్దీన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వివాహం హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో జరిగింది. ఆమె జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకుంది. అయితే ప్రేమ వివాహం చేసుకున్నవారు షాదీ ముబారక్ పథకానికి అనర్హులని అధికారులు చెప్పారు. దీంతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రెండోసారి దరఖాస్తు చేసుకొని రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని పొందింది. ఆ తర్వాత ఆర్మూర్ పట్టణానికే చెందిన ఆమె బాబాయి కూతురు పేరిట 2015 జనవరి 19న షాదీ ముబారక్ పథకంలో దరఖాస్తు సమర్పించింది. దరఖాస్తుపై ఎలాంటి విచారణ జరపకుండానే వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ శ్రీధర్ ఆమె సమర్పించిన పత్రాలను ధ్రువీకరిస్తూ సంతకాలు చేశారు. దీంతో మైనారిటీ సంక్షేమశాఖ అర్షియా అంజుమ్ చెల్లెలికి సైతం రూ.51 వేల ఆర్థిక సహాయం అందించింది. దాన్ని అర్షియా సొమ్ము చేసుకుంది. ఇంకేముంది.. అధికారుల నిర్లక్ష్య ధోరణిని ఆసరాగా చేసుకొని ఏడాదిలో 36 జంటల పేరిట నకిలీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసి అక్షరాలా రూ. 18 లక్షల 36 వేలను కాజేసింది. ఈ విషయంపై జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఆఫీస్ సూపరింటెండెంట్ మహ్మద్ యావర్ హుస్సేన్ సూఫీ ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి అర్షియా అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 36 జంటలకు నకిలీ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేయడం అర్షియా ఒక్కరివల్ల అయ్యే పనికాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆమెకు సహకరించిన వారు ఇంకెవరెవరు ఉన్నారు? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. -
షాదీముబారక్‌పై విచారణ
వర్ధన్నపేట టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ పథకంలో జరిగిన అవకతవకలను గుర్తించేందుకు మండలంలో విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరాజు, సాంబయ్య తెలిపారు. శనివారం మండలంలోని వర్ధన్నపేట, ఇల్లంద, కట్య్రాల, పున్నేలు తదితర గ్రామాల్లో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఇటీవల వివాహమైన ఎండీ రబ్బానీ, వజీర్, జలాల్ కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారికి షాదీముబారక్ పథకానికి సంబంధించి లబ్ధి చేకూరిందా అని వాకబు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన విచారణలో భాగంగా వర్ధన్నపేట మండలంలో పలు గ్రామాల్లో విచారణ చేశామన్నారు. కట్య్రాలలో ఓ కుటుం బంలో పెళ్లికూతురు పేరుపై పథకం రావడంతో ఆ డబ్బును అతడి అల్లుడే తీసుకున్నట్లు గుర్తించమన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటివి ఏమైన జరిగితే తమకు సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నేరుగా అధికారులను కలిసి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాయపర్తిలో.. మండలకేంద్రంతోపాటు, మండలంలోని మైలారం గ్రామంలో షాదీముబారక్ లబ్ధిదారులను ఏసీబీ అధికారులు విచారించా రు. లబ్ధిదారులు దళారులతో మోసపోతున్నారనే సమాచారం మేరకు విచారణ చేపట్టినట్లు ఏసీబీ సీఐలు శ్రీనివాసరావు, సాంబయ్య తెలి పారు. మండల కేంద్రంతోపాటు, గ్రామాల్లో 17 మంది షాదీముబారక్ లబ్ధిదారులున్నట్లు తెలిపారు. -
‘షాదీ ముబారక్’పై ఏసీబీ ఆరా..
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ పథకం అమలు తీరుపై ఏసీబీ అధికారులు శనివారం దృష్టి సారించారు. పథకం అమల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయంటూ అందిన ఫిర్యాదులపై ఏసీబీ స్పందించింది. నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో ఈ పథకం కింద సాయం అందుకున్న లబ్ధిదారుల వివరాల రికార్డులను పరిశీలిస్తోంది. గతంలో పెళ్లయిన వారు కూడా తాజాగా వివాహం చేసుకున్నట్లు చూపించి లబ్ధి పొందారని పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పేదింటి ముస్లిం మైనారిటీ యువతికి వివాహం సందర్భంగా రూ.51 వేలు అందజేయటానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఎస్టీ, ఎస్సీలకు కల్యాణలక్ష్మీ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. -
పెళ్లి సింగిల్... మనీ డబుల్
సాక్షి, సిటీబ్యూరో: షాదీ ముబారక్ పథకం అమలులో జరిగిన తప్పిదాన్ని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు సరిదిద్దుతున్నారు. రెండు విభాగాల సమన్వయలోపం కారణంగా ఒక్కో లబ్ధిదారునికి రెండుమార్లు డబ్బులు జమకావడం తెలిసిందే. ఈ తప్పిదంపై ఇటీవల ‘డబుల్ ముబారక్’ పేరిట సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై మైనార్టీ శాఖ అధికారులు స్పందించారు. హైదరాబాద్ నగరంలోని 142 మంది వధువుల బ్యాంక్ ఖాతాలో రెండుమార్లు డబ్బులు జమ అయిన ఘటనపై విచారించారు. వీరి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి నిధుల చెల్లింపులు నిలిపివేశారు. బ్యాంకర్లకు లేఖ రాసి లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న సుమారు రూ.54 లక్షలను రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ఇక లబ్ధిదారులు ఇప్పటికే డ్రా చేసుకున్న రూ.17.42 లక్షలు రికవరీ చేసే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు కొందరు లబ్ధిదారులు మొండికేస్తుండగా, మరికొందరు తిరిగి చెల్లింపుల కోసం కొంత గడువు కోరుతున్నట్లు తెలుస్తోంది. తప్పిదం ఎవరిది? రెండుమార్లు డబ్బులు జమ చేసిన తప్పిదంపై చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం కింద దరఖాస్తు చేసుకున్న నగరానికి చెందిన 142 మంది లబ్ధిదారుల వివాహాలకు రూ.51 వేల చొప్పున ఆర్ధిక చేయూతకు మంజూరు ఇచ్చిన మైనార్టీ శాఖ అధికారులు ఈ- పాస్ ద్వారా మూడు బిల్లులతో కూడిన లబ్ధిదారుల జాబితాను ట్రెజరీకి రెండు సార్లు సబ్మిట్ చేశారు. ట్రెజరీ అధికారులు కూడా ఆఫ్‌లైన్‌లో చేసిన చెల్లింపులను గుర్తించకుండా నగదు విడుదల చేయడం తో లబ్ధిదారుల ఖాతాలో రెండుసార్లు నగదు జమ అయింది. అయితే ఇరు శాఖల అధికారులు దీన్ని సాంకేతిక తప్పిదంగా పేర్కొంటున్నారు. సీజీజీ రూపొం దిం చిన సాఫ్ట్వేర్ అనుసంధానంలో కొంత వ్యత్యాసమే సాంకేతిక తప్పిదానికి కారణమైందని వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తి స్థాయిలో రికవరీ చేస్తాం షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు రెండుసార్లు జమ అయిన మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తున్నాం. ఇప్పటికే బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి దాదాపు 72 శాతం రికవరీ చేశామని... లబ్ధిదారులు సహకరిస్తున్నారని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. -
డబుల్ ‘ముబారక్’!
షాదీ ముబారక్ పథకం అమలులో తప్పిదం లబ్దిదారుల ఖాతాలో రెండుసార్లు డబ్బులు జమ పొరపాటుపై మైనార్టీ, {sెజరీ శాఖల్లో ఆరా... సిటీబ్యూరో: షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 142 మంది లబ్దిదారులకు ‘డబుల్’ ముబారక్ లభించింది. అధికారుల తప్పిదం కారణంగా ఒక్కొక్కరిక ఖాతాల్లో రెండు పర్యాయాలు రూ.51 వేల చొప్పున మొత్తం లక్షా 2 వేల రూపాయలు జమ అయ్యాయి. ఈ తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే...2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను షాదీ ముబారక్ పథకం కింద నగరానికి చెందిన 142 మంది ముస్లిం యువతుల వివాహాలకు రూ.51వేల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు మైనార్టీ శాఖ మంజూరు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మైనార్టీ శాఖ అధికారులు ఈ- పాస్ ద్వారా రూ.72.42 లక్షల నిధుల విడుదల కోసం మూడు బిల్లులతో కూడిన లబ్ధిదారుల జాబితాను ట్రెజరీకి పంపించారు. సంబంధిత ట్రెజరీ అధికారులు వారి సాఫ్ట్వేర్ ఆధారంగా లబ్దిదారులకు నిధులు విడుదల చేసి బ్యాంకులో జమ చేశారు. కాగా, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఈ-పాస్‌లో లబ్దిదారుల జాబితా అలాగే కనిపించడంతో తిరిగి ట్రెజరీకి రీ సబ్మిట్ చేశారు. అప్పటికే నిధులు విడుదల చేసిన విషయాన్ని మరిచి ట్రెజరీ అధికారులు మరోమారు చెల్లింపులను ఆమోదించారు. వాస్తవంగా సీజీజీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు, ట్రెజరీ పే అండ్ అకౌంట్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ కావడంలో కొంత వ్యత్యాసం ఉండటంతో పొరపాటు జరిగిపోయింది. మైనార్టీ సంక్షేమ శాఖ ఈ-పాస్ ద్వారా బిల్లులు సమర్పిస్తే వాటిని ఆన్లైన్లో కాకుండా రిజక్ట్ ఆప్షన్లో పెట్టి ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేసి బ్యాంక్ ఖాతాకు అనుసంధానించారు. అయితే ఆఫ్‌లైన్ చెల్లింపులు గుర్తించని మైనార్టీ సంక్షేమ శాఖ మరోమారు మంజూరుకు బిల్లులు సబ్మిట్ చేయడం గందరగోళానికి దారితీసింది. రికవరీ కోసం తిప్పలు... రెండుసార్లు నిధుల మంజూరును గుర్తించిన సంబంధిత అధికారులు తక్షణమే లబ్దిదారుల ఖాతాల సీజ్‌కు బ్యాంకర్లను ఆదేశించారు. అప్పటికే కొన్ని ఖాతాల నుంచి డబ్బుల చెల్లింపులు జరిగిపోయాయి. కాగా, మూడు బిల్లులకు చెందిన లబ్దిదారుల ఖాతాలు పూర్తి స్థాయిలో సీజ్ కావడంతో అసలు ఆర్థిక చేయూత కూడా డ్రా చేయడానికి వీలులేకుండా పోయింది. దీంతో లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రెండుసార్లు డబ్బులు డ్రా చేసుకున్న వారిని ఫోన్ల ద్వారా సంప్రదించి తక్షణమే చెల్లించాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలపై మజ్లిస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సంబంధిత అధికారిని మందలించినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ ఎంజే అక్బర్‌ను సంప్రదించగా...రెండుమార్లు ఆర్థిక సహాయం మంజూరైన మాట వాస్తవమేనని, అయితే దీనికి తమ శాఖకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ట్రెజరీ పే అండ్ అకౌంట్ అధికారులను సంప్రదించాలని సూచించారు. -
పేద క్రిస్టియన్లకు ‘షాదీ ముబారక్’
హైదరాబాద్: తెలంగాణలోని నిరుపేద క్రిస్టియన్ యువతుల వివాహాలకు షాదీ ముబారక్ పథకం కింద రూ.51 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎం.డి. డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.రెండు లక్షలకు మించని 18 ఏళ్ల వయస్సుపైబడిన పేద యువతులు అర్హులని పేర్కొన్నారు. 2014 అక్టోబర్ 2వ తేదీ తర్వాత వివాహాలు చేసుకున్నవారు సైతం పథకానికి అర్హులని తెలిపారు. షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 040-2339 1067లో సంప్రదించాలని సూచించారు. -
షాదీ..‘ముబారక్’ ఏదీ?
భారీగా దరఖాస్తులు సకాలంలో అందని సాయం తల్లిదండ్రులకు అప్పులే దిక్కు పాతబస్తీలోని యాకుత్‌పురాకు చెందిన సబా సుల్తానా (19) తల్లి చిన్నప్పుడే చనిపోగా, తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. దీంతో అమ్మమ్మ, మామయ్యల వద్ద ఉంటోంది. ఆమెకు పెళ్లి కుదరడంతో ‘షాదీ ముబారక్’ పథకం కింద ఆర్థిక సాయానికి ప్రభుత్వానికి బంధువులు దరఖాస్తు చేసుకున్నారు. పెళ్లి (నిఖా)కి ముహుర్తం పెట్టుకున్నారు. సమయానికి డబ్బులు అందనప్పటికీ అప్పోసప్పో చేసి 2014 అక్టోబర్ 20న పెళ్లి జరిపించారు. మూడు నెలలు గడిచినా ఇంతవరకూ ఆర్థిక సాయం అందలేదు. కనీసం విచారణకైనా అధికారులు రాలేదు. కానీ అప్పులిచ్చిన వారు మాత్రం రోజూ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది ఒక్క సబా సుల్తానా కుటుంబమే కాదు.. షాదీ ముబారక్ పథకాన్ని నమ్ముకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న అనేక కుటుంబాలది ఇదే పరిస్థితి. వారంతా అప్పుల పాలై.. ఆర్థిక సాయానికి ఎదురు చూస్తున్నారు. సిటీబ్యూరో: నిరుపేద ముస్లిం యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక తోడ్పాటు అందించేందుందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీముబారక్ పథకం బాలారిష్టాలు దాటడం లేదు. రాష్ట్ర బడ్జెట్లో పథకానికి రూ.100 కోట్లు కేటాయించారు. జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున విడుదల చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు కలిపి రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుందున్న ఆశతో ఆడబిడ్డల పెళ్లిళ్లకు తేదీలు ఖరారు చేసుకుంటున్న తల్లిదండ్రులు ఆర్థిక సమస్యల్లో మునిగిపోతున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఉదాసీన వైఖరి, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం... వెరసి ఈ దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. మరోవైపు నిధులు మంజూరైనాట్రెజరీ శాఖ ప్రతి నెలా 5 నుంచి 17వ తేదీ వరకు మాత్రమే బిల్లులకు పాస్ చేస్తుండటంతో సకాలంలో లబ్ధిదారులకు సాయం అందడం లేదు. దీంతో నిరుపేద కుటుంబాలకు అప్పులు తప్పడం లేదు. ఈ ఏడాది మార్చి 31 నాటికి సుమారు 20 వేల పేద యువతుల వివాహాలు జరిపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఈ దిశగా సరిగా అడుగులు పడడం లేదు. ఇదీ పరిస్థితి... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తోంది. కానీ పథకం అమలు వేగవంతం కావడం లేదు. షాదీముబారక్ పథకం కింద సాయానికి ఇప్పటి వరకు 711 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో ఇప్పటి వరకు 313 దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. వీటిలో 291 దరఖాస్తులను ఆమోదిస్తూ ట్రెజరీ శాఖకు బిల్లులు పంపించారు. వాటిలో 43 బిల్లులకే గ్రీన్ సిగ్నల్ లభించింది. మిగిలిన 247 బిల్లులు ట్రెజరీలో పెండింగ్‌లో మగ్గుతున్నాయి. సుమారు 387 దరఖాస్తులు అసలు విచారణకు నొచుకోలేదు.11 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. సిబ్బంది కొరత రాష్ర్టంలో ‘షాదీ ముబారక్’ పథకాన్ని అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ శాఖలో సరిపడే సిబ్బంది లేకపోవడంతో దరఖాస్తుల పరిశీలన బాధ్యత ను రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఆ శాఖ సిబ్బంది ఆసరా, ఆహార భద్రత, ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన పెండింగ్‌లో పడింది. వాస్తవంగా వివాహానికి నెల రోజుల ముందు ఆహ్వాన పత్రికతో దరఖాస్తు చేసుకుంటే... ఆ యువతి పెళ్లికి ముందే బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాలి. కానీ వివాహాలు జరిగి నెలలు దాటుతున్నా సాయం అందడం లేదు. అప్పుల్లో మునిగిపోయాం షాదీ ముబారక్పథకాన్ని నమ్ముకొని అప్పులు చేసి పెళ్లి జరిపించాం. ఇంతవరకూ ఆర్థిక సాయం అందలేదు. అధికారులు, నేతలు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. అక్క బిడ్డను ఆదుకుందామని అప్పులు చేస్తే.. ఇప్పుడు అప్పుల వాళ్లు సతాయిస్తున్నారు. ఎలా తీర్చాలో తెలియడం లేదు. - పర్వీన్ సుల్తానా, యాకుత్‌పురా, హైదరాబాద్ -
పేద యువతులకు ‘షాదీ ముబారక్’
హెల్ప్ లైన్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ సుల్తాన్‌బజార్: పేద యువతులకు ‘షాదీ ముబారక్’ పథకం వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం అబిడ్స్ తిలక్‌రోడ్‌లోని బీమాభవన్‌లో ఉన్న కమిషనర్ మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో షాదీ ముబారక్ మద్దత్ హెల్ప్‌లైన్ (040-246760452)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహామూద్‌అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ మైనారిటీ, బౌద్ధ తదితర మైనార్టీలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. పెళ్లికి నెల రోజుల ముందు మీసేవ, ఆన్లైన్ ద్వారా- epasswebsite.cgg.gov.in వెబ్సైట్లో షాదీ ముబారక్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. యువతులు జోరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరుచుకోవాల్సి ఉంటుందని వివరించారు. అక్టోబర్ 2 తర్వాత పెళ్లి అయిన వారు పెళ్లి సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ డెరైక్టర్ ఎంజె. అక్బర్, డిప్యూటీ డెరైక్టర్ సుభాష్ చందర్‌గౌడ్, నవీన్ నికోలేస్( క్రిస్టియాన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్), శుకూర్( మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్)తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.