సాక్షిప్రతినిధి, వరంగల్: రెవెన్యూశాఖను కుదిపేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అక్రమాల కేసు అటకెక్కినట్లేనా? ఈ కేసులో సుమారు నెల రోజులపాటు విచారణ జరిపి సమర్పించిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక బుట్టదాఖలైనట్లేనా? విచారణలో పలువురిపై చర్యలకు రాష్ట్రస్థాయి అధికారులు చేసిన సిఫారసులు ‘షోకాజ్’లతో సరిపుచ్చారా?... అంటే రెవెన్యూ వర్గాలనుంచి అవుననే సమాధానం వస్తోంది.
పేదల కోసం ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో కొందరు తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. చెక్కుల పంపిణీ కోసం భారీగా వసూళ్లకు పాల్పడిన పలువురిపై సీరియస్‌గా స్పందించిన ఉన్నతాధికారులు మొదట చర్యలకు సిఫారసు చేశారు. విచారణ నివేదికల ఆధారంగా షోకాజ్‌లు జారీ చేసి కీలక పోస్టుల నుంచి తప్పించారు. ఓ వైపు విచారణ జరుగుతుండగా.. ఇవే కేసుల్లో తప్పించబడిన పలువురికి మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది.
విజిలెన్స్ నివేదికలు అటకెక్కినట్లేనా..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు నగదు చెల్లించడం, అర్హులనుంచి వసూళ్లకు పాల్పడ్డారన్న వివాదంలో రాష్ట్రవ్యాప్తంగా 55 మంది తహసీల్దార్లు, ఇతర ఉద్యోగులుంటే.. ఉమ్మడి వరంగల్ నుంచి 16 మంది వరకు వివిధ స్థాయి అధికారులు ఉన్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ తహసీల్దార్ ఆఫీసు కేంద్రంగా జరిగిన వాటికి బాధ్యులుగా అప్పటి తహసీల్దార్ రాజును, మరో ఇద్దరిని జనవరి 24న అక్కడి నుంచి తప్పించారు. పరకాల ఆర్డీఓ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయాలపైన ఇచ్చిన నివేదికల ప్రకారం అందరికీ షోకాజ్‌లు ఇచ్చారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇంకా విచారణ జరుగుతున్న సమయంలో పరకాల ఆర్డీఓ కార్యాలయానికి అటాచ్డ్ చేసిన రాజును రెండు నెలలైనా కాకముందే శాయంపేట తహసీల్దార్‌గా బదిలీ చేశారు. శాయంపేట తహసీల్దార్ కార్యాలయంపైనా స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారిస్తుండగా, అక్కడి తహసీల్దార్ పోరిక హరికృష్ణను బదిలీ చేయడం ఇప్పుడు రెవెన్యూశాఖలో చర్చనీయాంశంగా మారింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లలో అదుపుతప్పిన అవినీతిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్వయంగా క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు.
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దింపారు. దీంతో ధర్మసాగర్, శాయంపేట తహసీల్దార్ కార్యాలయంతో పాటు పరకాల, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, మహబూబాబాద్, గూడూ రు, కేసముద్రం, మహబూబాబాద్ తదితర తహసీల్దారు కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి, ములుగులో రెవెన్యూ సిబ్బందికి తోడు కంప్యూటర్ ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. క్షేత్రస్థాయిలో వివిధ పార్టీల లీడర్లు, వారి అనుచరులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మరికొందరు దళారులు కలిసి అక్రమాలకు పాల్పడినట్లుగా 2021 డిసెంబర్‌లో నిఘావర్గాలు వెల్లడించిన నివేదిక ఆధారంగా జనవరిలో చర్యలు ప్రారంభించారు. ఇంకా విచారణ పూర్తికాకపోగా, మరికొందరిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో చర్యల్లో భాగంగా లూప్‌లైన్లకు పంపిన వారికి మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తున్న నేపథ్యంలో కల్యాణలక్ష్మి అక్రమాల కథ కంచికి చేరినట్లేనన్న చర్చ జోరందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment