షాదీ..‘ముబారక్’ ఏదీ?
భారీగా దరఖాస్తులు
సకాలంలో అందని సాయం
తల్లిదండ్రులకు అప్పులే దిక్కు
పాతబస్తీలోని యాకుత్‌పురాకు చెందిన సబా సుల్తానా (19) తల్లి చిన్నప్పుడే చనిపోగా, తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. దీంతో అమ్మమ్మ, మామయ్యల వద్ద ఉంటోంది. ఆమెకు పెళ్లి కుదరడంతో ‘షాదీ ముబారక్’ పథకం కింద ఆర్థిక సాయానికి ప్రభుత్వానికి బంధువులు దరఖాస్తు చేసుకున్నారు. పెళ్లి (నిఖా)కి ముహుర్తం పెట్టుకున్నారు. సమయానికి డబ్బులు అందనప్పటికీ అప్పోసప్పో చేసి 2014 అక్టోబర్ 20న పెళ్లి జరిపించారు. మూడు నెలలు గడిచినా ఇంతవరకూ ఆర్థిక సాయం అందలేదు. కనీసం విచారణకైనా అధికారులు రాలేదు. కానీ అప్పులిచ్చిన వారు మాత్రం రోజూ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది ఒక్క సబా సుల్తానా కుటుంబమే కాదు.. షాదీ ముబారక్ పథకాన్ని నమ్ముకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న అనేక కుటుంబాలది ఇదే పరిస్థితి. వారంతా అప్పుల పాలై.. ఆర్థిక సాయానికి ఎదురు చూస్తున్నారు.
సిటీబ్యూరో: నిరుపేద ముస్లిం యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక తోడ్పాటు అందించేందుందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీముబారక్ పథకం బాలారిష్టాలు దాటడం లేదు. రాష్ట్ర బడ్జెట్‌లో పథకానికి రూ.100 కోట్లు కేటాయించారు. జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున విడుదల చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు కలిపి రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుందున్న ఆశతో ఆడబిడ్డల పెళ్లిళ్లకు తేదీలు ఖరారు చేసుకుంటున్న తల్లిదండ్రులు ఆర్థిక సమస్యల్లో మునిగిపోతున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఉదాసీన వైఖరి, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం... వెరసి ఈ దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. మరోవైపు నిధులు మంజూరైనాట్రెజరీ శాఖ ప్రతి నెలా 5 నుంచి 17వ తేదీ వరకు మాత్రమే బిల్లులకు పాస్ చేస్తుండటంతో సకాలంలో లబ్ధిదారులకు సాయం అందడం లేదు. దీంతో నిరుపేద కుటుంబాలకు అప్పులు తప్పడం లేదు. ఈ ఏడాది మార్చి 31 నాటికి సుమారు 20 వేల పేద యువతుల వివాహాలు జరిపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఈ దిశగా సరిగా అడుగులు పడడం లేదు.
ఇదీ పరిస్థితి...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తోంది. కానీ పథకం అమలు వేగవంతం కావడం లేదు. షాదీముబారక్ పథకం కింద సాయానికి ఇప్పటి వరకు 711 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో ఇప్పటి వరకు 313 దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. వీటిలో 291 దరఖాస్తులను ఆమోదిస్తూ ట్రెజరీ శాఖకు బిల్లులు పంపించారు. వాటిలో 43 బిల్లులకే గ్రీన్ సిగ్నల్ లభించింది. మిగిలిన 247 బిల్లులు ట్రెజరీలో పెండింగ్‌లో మగ్గుతున్నాయి. సుమారు 387 దరఖాస్తులు అసలు విచారణకు నొచుకోలేదు.11 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు.
సిబ్బంది కొరత
రాష్ర్టంలో ‘షాదీ ముబారక్’ పథకాన్ని అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ శాఖలో సరిపడే సిబ్బంది లేకపోవడంతో దరఖాస్తుల పరిశీలన బాధ్యత ను రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఆ శాఖ సిబ్బంది ఆసరా, ఆహార భద్రత, ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన పెండింగ్‌లో పడింది. వాస్తవంగా వివాహానికి నెల రోజుల ముందు ఆహ్వాన పత్రికతో దరఖాస్తు చేసుకుంటే... ఆ యువతి పెళ్లికి ముందే బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాలి. కానీ వివాహాలు జరిగి నెలలు దాటుతున్నా సాయం అందడం లేదు.
అప్పుల్లో మునిగిపోయాం
షాదీ ముబారక్‌పథకాన్ని నమ్ముకొని అప్పులు చేసి పెళ్లి జరిపించాం. ఇంతవరకూ ఆర్థిక సాయం అందలేదు. అధికారులు, నేతలు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. అక్క బిడ్డను ఆదుకుందామని అప్పులు చేస్తే.. ఇప్పుడు అప్పుల వాళ్లు సతాయిస్తున్నారు. ఎలా తీర్చాలో తెలియడం లేదు.
- పర్వీన్ సుల్తానా, యాకుత్‌పురా, హైదరాబాద్