డబుల్ ‘ముబారక్’!
షాదీ ముబారక్ పథకం అమలులో తప్పిదం
లబ్దిదారుల ఖాతాలో రెండుసార్లు డబ్బులు జమ
పొరపాటుపై మైనార్టీ, {sెజరీ శాఖల్లో ఆరా...
సిటీబ్యూరో: షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 142 మంది లబ్దిదారులకు ‘డబుల్’ ముబారక్ లభించింది. అధికారుల తప్పిదం కారణంగా ఒక్కొక్కరిక ఖాతాల్లో రెండు పర్యాయాలు రూ.51 వేల చొప్పున మొత్తం లక్షా 2 వేల రూపాయలు జమ అయ్యాయి. ఈ తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే...2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను షాదీ ముబారక్ పథకం కింద నగరానికి చెందిన 142 మంది ముస్లిం యువతుల వివాహాలకు రూ.51వేల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు మైనార్టీ శాఖ మంజూరు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మైనార్టీ శాఖ అధికారులు ఈ- పాస్ ద్వారా రూ.72.42 లక్షల నిధుల విడుదల కోసం మూడు బిల్లులతో కూడిన లబ్ధిదారుల జాబితాను ట్రెజరీకి పంపించారు. సంబంధిత ట్రెజరీ అధికారులు వారి సాఫ్ట్‌వేర్ ఆధారంగా లబ్దిదారులకు నిధులు విడుదల చేసి బ్యాంకులో జమ చేశారు. కాగా, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఈ-పాస్‌లో లబ్దిదారుల జాబితా అలాగే కనిపించడంతో తిరిగి ట్రెజరీకి రీ సబ్‌మిట్ చేశారు. అప్పటికే నిధులు విడుదల చేసిన విషయాన్ని మరిచి ట్రెజరీ అధికారులు మరోమారు చెల్లింపులను ఆమోదించారు. వాస్తవంగా సీజీజీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు, ట్రెజరీ పే అండ్ అకౌంట్ సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేట్ కావడంలో కొంత వ్యత్యాసం ఉండటంతో పొరపాటు జరిగిపోయింది. మైనార్టీ సంక్షేమ శాఖ ఈ-పాస్ ద్వారా బిల్లులు సమర్పిస్తే వాటిని ఆన్‌లైన్‌లో కాకుండా రిజక్ట్ ఆప్షన్‌లో పెట్టి ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేసి బ్యాంక్ ఖాతాకు అనుసంధానించారు. అయితే ఆఫ్‌లైన్ చెల్లింపులు గుర్తించని మైనార్టీ సంక్షేమ శాఖ మరోమారు మంజూరుకు బిల్లులు సబ్‌మిట్ చేయడం గందరగోళానికి దారితీసింది.
రికవరీ కోసం తిప్పలు...
రెండుసార్లు నిధుల మంజూరును గుర్తించిన సంబంధిత అధికారులు తక్షణమే లబ్దిదారుల ఖాతాల సీజ్‌కు బ్యాంకర్లను ఆదేశించారు. అప్పటికే కొన్ని ఖాతాల నుంచి డబ్బుల చెల్లింపులు జరిగిపోయాయి. కాగా, మూడు బిల్లులకు చెందిన లబ్దిదారుల ఖాతాలు పూర్తి స్థాయిలో సీజ్ కావడంతో అసలు ఆర్థిక చేయూత కూడా డ్రా చేయడానికి వీలులేకుండా పోయింది. దీంతో లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రెండుసార్లు డబ్బులు డ్రా చేసుకున్న వారిని ఫోన్ల ద్వారా సంప్రదించి తక్షణమే చెల్లించాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలపై మజ్లిస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సంబంధిత అధికారిని మందలించినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ ఎంజే అక్బర్‌ను సంప్రదించగా...రెండుమార్లు ఆర్థిక సహాయం మంజూరైన మాట వాస్తవమేనని, అయితే దీనికి తమ శాఖకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ట్రెజరీ పే అండ్ అకౌంట్ అధికారులను సంప్రదించాలని సూచించారు.