
సాక్షి, అమరావతి: కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన ఇద్దరిలో ఓ పిటిషనర్ హత్యకు గురవడంతో రెండో పిటిషనర్‌గా ఉన్న 70 ఏళ్ల షేక్ ఫరీద్‌కు తగిన భద్రత కల్పించాలని పల్నాడు జిల్లా ఎస్పీని హైకోర్టు బుధవారం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఈ భద్రతను కొనసాగించాలని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని తక్షణమే జిల్లా ఎస్పీకి వాట్సాప్, ఈమెయిల్ ద్వారా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.
పల్నాడు జిల్లా, నర్సరావుపేట శ్రీరాంపురంలోని జామా మసీదు నిర్వహణను అధీనంలోకి తీసుకునేందుకు మైనారిటీ శాఖ ప్రయత్నిస్తోందని, మసీదు ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరమవకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ షేక్ ఇబ్రహీం, షేక్ ఫరీద్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది టి.అనూప్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే హతమారుస్తామంటూ కొందరు వ్యక్తులు పిటిషనర్లను బెదిరించారని చెప్పారు. మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నర్సరావుపేట రామిరెడ్డి పేట వద్ద మొదటి పిటిషనర్ షేక్ ఇబ్రహీంను దారుణంగా హత్య చేశారని తెలిపారు.
రెండో పిటిషనర్ షేక్ ఫరీద్‌కు సైతం ప్రాణహాని ఉన్నందున, ఆయనకు తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని, షేక్ ఫరీద్‌కు తగిన భద్రత కల్పించాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించారు. తదుపరి విచారణను 28కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment