సీఎం ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించడమేమిటి?
జన్మభూమి కమిటీలను, వలంటీర్లతో పోల్చి మాట్లాడటం తప్పెలా అవుతుంది?
వలంటీర్లు పథకాలను ప్రజలకు చేరువ చేయడం మంచి పనే కదా
మంచి చేస్తున్న వారిని సన్మానించకూడదా?
ఓటర్లు తెలివి గల వాళ్లు.. వారి గురించి చింతించాల్సిన పని లేదు
వలంటీర్ల ఎన్నికల విధులపై తేల్చాల్సింది ఎన్నికల సంఘమేనన్న హైకోర్టు
వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశాలిచ్చామన్న ఈసీ
అలా అయితే విచారించేందుకు ఏమీ లేదన్న ధర్మాసనం.. పిల్ కొట్టివేత
సాక్షి, అమరావతి : పల్నాడు జిల్లాలో ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు వలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించడం ఏమిటంటూ హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలను, ప్రస్తుతం తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను పోల్చారని, దీనిని తామెలా తప్పుపట్టగలమని ప్రశ్నించింది.
అలా పోలిక తేవడానికి వీల్లేదంటారా అంటూ నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజలకు వలంటీర్లు మంచి పని చేయడంలేదా? మంచి చేసిన వాళ్లను సన్మానించకూడదా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి ఖర్చు చేసిన మొత్తాన్ని ముఖ్యమంత్రి నుంచి వసూలు చేయాలని ఎలా కోరతారు అంటూ ప్రశ్నించింది. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనాలా? వద్దా? అన్నది నిర్ణయించాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే తప్ప, తాము కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అందులో జోక్యం చేసుకోలేమంది.
వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని సీఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. పోలింగ్ ఏజెంట్లుగా కూడా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పామని, ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. వలంటీర్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందున, ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పిల్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్ర«దాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ పిల్
ఎన్నికల్లో వలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా అన్నంభొట్లవారి పాళెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల్లోకి వలంటీర్లు వెళ్లకుండా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. పల్నాడు జిల్లాలో జరిగిన గ్రామ, వార్డు వలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కూడా సింగయ్య కోర్టును అభ్యర్థించారు.
ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకర్‌రావు వాదనలు వినిపిస్తూ.. వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వ విజయం కోసం వలంటీర్లు కృషి చేయాలని, ప్రతిపక్షంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేలా వలంటీర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ముఖ్యమంత్రి ప్రసంగంలో జన్మభూమి కమిటీల ప్రస్తావన వచ్చిందని, ఆ కమిటీలు ఏమిటని ప్రశ్నించింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలని సుధాకర్‌రావు చెప్పారు.
అలా అయితే ముఖ్యమంత్రి ప్రసంగంలో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. గత ప్రభుత్వం తీసుకొచి్చన జన్మభూమి కమిటీలు, ప్రస్తుతం ఉన్న వలంటీర్ల వ్యవస్థను పోల్చుతూ మాట్లాడారని, దానిని చట్ట విరుద్ధంగా ప్రకటించమంటే ఎలా అంటూ నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజలకు వలంటీర్లు మంచి పని చేయడంలేదా అని ప్రశ్నించింది. మంచి చేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రి చెప్పిన విధంగా వలంటీర్లు పని చేస్తే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని సుధాకర్‌రావు తెలిపారు.
అందుకే వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరుతున్నామన్నారు. అది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదని ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పుడు పిటిషనర్‌కు ఇంకా కావాల్సింది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది.
ఓటర్లు చాలాతెలివి గల వాళ్లు
ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం న్యాయవాది అవినాష్ దేశాయ్ జోక్యం చేసుకుంటూ.. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మాత్రమే ఎన్నికల విధుల్లో పాల్గొంటారని, వలంటీర్లకు, ఈ ఉద్యోగులకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ సమయంలో సుధాకర్‌రావు ఏదో చెప్పబోగా.. ధర్మాసనం ఆయన్ని వారించింది.
ఓటర్లు చాలా తెలివి గల వారని, వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఓటర్లు ఎంత తెలివి గల వాళ్లో న్యాయవ్యవస్థలో ఉన్న మనందరికీ బాగా తెలుసునంటూ న్యాయవాద సంఘాల ఎన్నికల గురించి ధర్మాసనం ప్రస్తావించింది. న్యాయవాద సంఘాల ఎన్నికలప్పుడు ఓటర్లు ఓ వర్గం ఇచ్చే విందులో పాల్గొని, మరో వర్గానికి ఓటు వేస్తుంటారని నవ్వుతూ వ్యాఖ్యానించింది. ఓటర్ల గురంచి చింతించాల్సిన అవసరం లేదంది. పిల్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment