‘షాదీ’ పైసల్ స్వాహా
♦ షాదీ ముబారక్‌లో అక్రమాలు
♦ 36 జంటల పేరిట రూ.18 లక్షలు కాజేసిన మహిళ
♦ నిజామాబాద్ జిల్లాలో ఘటన
ఆర్మూర్: పేద ముస్లిం ఆడబిడ్డల పెళ్లి.. వారి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ పథకం సొమ్మును అక్రమార్కులు కాజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఓ మహిళ 36 జంటల పేరిట దరఖాస్తు చేసుకుని రూ. 18.36 లక్షలు కాజేసింది. ఆర్మూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ అర్షియా అంజుమ్ చేసిన ఈ భారీ కుంభకోణం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
నిరుపేదలైన ముస్లిం వధువుకు రూ. 51 వేలను వివాహ కానుకగా అందిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 3,756 మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు. అయితే ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ గల్లీకి చెందిన అర్షియా అంజుమ్ 2014 నవంబర్ 11న నిజామాబాద్‌లోని ఆటోనగర్‌కు చెందిన మహ్మద్ అజారుద్దీన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వివాహం హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో జరిగింది. ఆమె జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకుంది. అయితే ప్రేమ వివాహం చేసుకున్నవారు షాదీ ముబారక్ పథకానికి అనర్హులని అధికారులు చెప్పారు. దీంతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రెండోసారి దరఖాస్తు చేసుకొని రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని పొందింది.
ఆ తర్వాత ఆర్మూర్ పట్టణానికే చెందిన ఆమె బాబాయి కూతురు పేరిట 2015 జనవరి 19న షాదీ ముబారక్ పథకంలో దరఖాస్తు సమర్పించింది. దరఖాస్తుపై ఎలాంటి విచారణ జరపకుండానే వీఆర్‌వో, ఆర్‌ఐ, తహసీల్దార్ శ్రీధర్ ఆమె సమర్పించిన పత్రాలను ధ్రువీకరిస్తూ సంతకాలు చేశారు. దీంతో మైనారిటీ సంక్షేమశాఖ అర్షియా అంజుమ్ చెల్లెలికి సైతం రూ.51 వేల ఆర్థిక సహాయం అందించింది. దాన్ని అర్షియా సొమ్ము చేసుకుంది. ఇంకేముంది.. అధికారుల నిర్లక్ష్య ధోరణిని ఆసరాగా చేసుకొని ఏడాదిలో 36 జంటల పేరిట నకిలీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసి అక్షరాలా రూ. 18 లక్షల 36 వేలను కాజేసింది.
ఈ విషయంపై జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఆఫీస్ సూపరింటెండెంట్ మహ్మద్ యావర్ హుస్సేన్ సూఫీ ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి అర్షియా అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 36 జంటలకు నకిలీ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేయడం అర్షియా ఒక్కరివల్ల అయ్యే పనికాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆమెకు సహకరించిన వారు ఇంకెవరెవరు ఉన్నారు? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.