తుక్కు కేంద్రాల నిర్వహణకు దరఖాస్తు చేసిన నాలుగు సంస్థలు
ఆ తర్వాత ఆసక్తి చూపని ఓ బడా సంస్థ.. మూడింటి తనిఖీ పూర్తి చేసిన అధికారులు.. వారం పదిరోజుల్లో అనుమతి
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ నవంబరు మొదటివారంలో ప్రారంభం కానుంది. వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహన తుక్కు విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాహనాలను తుక్కుగా మార్చే కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకోసం ప్రైవేటు కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలను తుక్కుగా (స్వచ్ఛంద విధానం) మార్చాల్సి ఉంటుంది. ఇందుకోసం రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఈ విధానం కింద తెలంగాణకు మూడు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. ప్రస్తుతానికి నాలుగు ప్రైవేట్ సంస్థలు దరఖాస్తు చేశాయి. ఆయా కేంద్రాలు కేంద్ర నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు ఇటీవల అధికారులు వాటిని తనిఖీ చేశారు. మరో పది రోజుల్లో వాటిల్లో అనుకూలమైన కేంద్రాలకు పచ్చజెండా ఊపనున్నారు. ఆ వెంటనే వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ మొదలవుతుంది.
కేవలం ఐదుగురు వాహనదారులే ముందుకు..
కేంద్ర ప్రభుత్వం 2021లో చట్ట సవరణ చేయగా, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో స్క్రాపింగ్ విధానం అమలవుతోంది. తుక్కు విధానం ప్రకటించిన ఈ వారం రోజుల్లో తెలంగాణలో కేవలం ఐదుగురు వాహనదారులు మాత్రమే తమ 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఆసక్తి చూపారు.
చదవండి: 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికం
నిర్బంధం కాకపోవటంతో.. పదిహేనేళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ చేయించి గ్రీన్ ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకొనే విధానం అమలవుతోంది. గ్రీన్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో చాలా రాష్ట్రాలు స్క్రాపింగ్ విధానంలో దాన్ని కొనసాగిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసిన తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్నే అనుసరించాలని నిర్ణయించి పాలసీలో పొందుపరిచింది. దీంతో కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చటం కంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లించి ఐదేళ్లు చొప్పున రెండు దఫాలు అనుమతి పొంది నడుపుకొనేందుకే ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఈ విధానం తెచ్చిన తర్వాత (ఢిల్లీ మినహా) దేశవ్యాప్తంగా కేవలం 44,900 వాహనాలను మాత్రమే తుక్కుగా మార్చారు.
అధికారులు అడిగినా స్పందించని ఓ సెంటర్
ఓ బడా వాహన తయారీ సంస్థకు నగర శివారులో స్క్రాపింగ్ సెంటర్ ఉంది. వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసింది. కానీ ఆ తర్వాత స్పందించటం మానేసింది. దీంతో దరఖాస్తు చేసిన మరో మూడు కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడి వసతులను తనిఖీ చేసి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment