స్క్రాప్‌ స్వచ్ఛందమే: మంత్రి పొన్నం | Minister Ponnam Prabhakar Comments On Vehicles Scrapping | Sakshi
Sakshi News home page

స్క్రాప్‌ స్వచ్ఛందమే: మంత్రి పొన్నం

Published Wed, Oct 9 2024 5:14 AM | Last Updated on Wed, Oct 9 2024 5:14 AM

Minister Ponnam Prabhakar Comments On Vehicles Scrapping

15 ఏళ్లు దాటిన వాహనాలకు వలంటరీ వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీ అమల్లోకి 

తుక్కుగా మారిస్తే కొత్త వాహనంపై పన్ను రాయితీ... కొత్త వాహనం ధరను బట్టి రాయితీ మొత్తం నిర్ధారణ 

గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లించి నడుపుకొనే ప్రస్తుత విధానం కొనసాగింపు... భద్రతపై దృష్టి సారించాం: మంత్రి పొన్నం 

ప్రభుత్వ వాహనాలకు మాత్రం తప్పనిసరిగా తుక్కు విధానం అమలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదిహేనేళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వలంటరీ వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. వాహనాన్ని తుక్కుగా మార్చాలా, వద్దా అన్నదానిపై యజమానులే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకుని, గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లించి మరో ఐదేళ్లపాటు వినియోగించుకునే ప్రస్తుత విధానం కొనసాగుతుందని ప్రకటించింది. 

అయితే ఎవరైనా తమ వాహనాన్ని తుక్కుగా మార్చి, అదే కోవకు చెందిన కొత్త వాహనాన్ని కొంటే.. జీవితకాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌)లో కొంతమొత్తం రాయితీగా ఇస్తామని తెలిపింది. కొన్నినెలల పాటు వివిధ రాష్ట్రాల్లోని వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీలను అధ్యయనం చేశాక.. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మిళితం చేసి అధికారులు ఈ విధానాన్ని రూపొందించారు. మంగళవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆ శాఖ అధికారులతో కలసి ఈ వివరాలను వెల్లడించారు. 

ఏ వాహనాలకు ఏ విధానం? 
ఎవరైనా 15 ఏళ్లు దాటిన తమ వాహనాన్ని తుక్కుగా మార్చాలని భావిస్తే.. దీనిపై రవాణా శాఖకు సమాచారమిచ్చి, అదీకృత తుక్కు కేంద్రానికి వెళ్లి స్క్రాప్‌ చేయించుకోవాలి. ఆ కేంద్రం సంబంధిత వాహనానికి నిర్ధారిత స్క్రాప్‌ విలువను చెల్లిస్తుంది. ఈ మేరకు సర్టిఫికెట్‌ ఇస్తుంది. యజమానులు అదే కేటగిరీకి చెందిన కొత్త వాహనం కొన్నప్పుడు.. ఈ సర్టిఫికెట్‌ చూపితే కొత్త వాహనానికి సంబంధించిన జీవితకాల పన్నులో నిర్ధారిత మొత్తాన్ని రాయితీగా తగ్గిస్తారు.

రవాణా వాహనాలను ఎనిమిదేళ్లకే స్క్రాప్‌కు ఇవ్వవచ్చు. వీటికి సంబంధించి ఎంపీ ట్యాక్స్‌లో 10% రాయితీ ఉంటుంది. మిగతా నిబంధనలు నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాల తరహాలోనే వర్తిస్తాయి. 

– ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం నిర్బంధ స్క్రాప్‌ విధానమే వర్తిస్తుంది. పదిహేనేళ్లు దాటిన ప్రతి ప్రభుత్వ వాహనాన్ని ఈ–ఆక్షన్‌ పద్ధతిలో తుక్కు కింద తొలగించాల్సిందే. అవి రోడ్డెక్కడానికి వీలు లేదు. 

– ఏ కేటగిరీ వాహనాన్ని స్క్రాప్‌గా మారిస్తే.. అదే కేటగిరీ కొత్త వాహనంపై మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ద్విచక్రవాహనాన్ని తుక్కుగా మారిస్తే.. మళ్లీ ద్విచక్రవాహనం కొంటేనే రాయితీ వర్తిస్తుంది. అంతేకాదు వాహనాన్ని తుక్కుగా మార్చిన రెండేళ్లలోపే ఈ రాయితీ పొందాల్సి ఉంటుంది. 

కేంద్రం చట్టం చేసిన మూడేళ్ల తర్వాత.. 
దేశవ్యాప్తంగా వాహన కాలుష్యం పెరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేసింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలన్న విధాన నిర్ణయం తీసుకుంది. దీనిపై 2021లో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చట్టం అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. చాలా రాష్ట్రాలు దశలవారీగా దీని అమలు ప్రారంభించాయి. కానీ నిర్బంధంగా తుక్కు చేయకుండా.. స్వచ్ఛంద విధానానికే మొగ్గు చూపాయి. తెలంగాణలో మూడేళ్ల తర్వాత ఇప్పుడు పాలసీని అమల్లోకి తెచ్చారు. 

– ‘రిజిస్టర్డ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ ఫెసిలిటీ (ఆర్‌వీఎ‹స్‌ఎఫ్‌)’ కేంద్రాల్లో వాహనాలను తుక్కుగా మారుస్తారు. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్‌ జారీ చేయగా.. మహీంద్రా కంపెనీ సహా నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కేంద్రాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా, లేదా అన్నది పరిశీలించి అనుమతిస్తారు. యజమానులు ఈ కేంద్రాల్లోనే వాహనాలను అప్పగించి, సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 

వాహనాల ‘ఫిట్‌నెస్‌’ పక్కాగా తేల్చేందుకు... 
15 ఏళ్లు దాటిన వాహనాలను మరికొంతకాలం నడుపుకొనేందుకు ఫిట్‌నెస్‌ తనిఖీ తప్పనిసరి. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గానే టెస్ట్‌ చేసి సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. ఇది సరిగా జరగడం లేదని, అవినీతి చోటుచేసుకుంటోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆటోమేటెడ్‌ స్టేషన్‌లలో కంప్యూటరైజ్డ్‌ పద్ధతిలో ఫిట్‌నెస్‌ టెస్టులు చేయించాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

వీటి ఏర్పాటుకు రూ.293 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.133 కోట్లను భరించనుంది. ఇక వాహనాల విక్రయానికి సంబంధించిన ఎన్‌ఓసీలు, లైసెన్సులు ఇతర సేవలను అన్ని రాష్ట్రాలతో అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం వాహన్, సారథి పోర్టల్‌లను ఏర్పాటు చేసింది. చాలా రాష్ట్రాలు వీటితో అనుసంధానమయ్యాయి. తాజాగా తెలంగాణ కూడా అందులో చేరుతున్నట్టు ప్రకటించింది. దీనిని తొలుత సికింద్రాబాద్‌ రవాణాశాఖ కార్యాలయంలో ప్రారంభిస్తున్నారు. 

భద్రతపై దృష్టి సారించాం 
దేశవ్యాప్తంగా ఏటా 1.6 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. తెలంగాణలో కూడా ఆ సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై దృష్టి సారించాం. నిబంధనల విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించాం. రవాణా శాఖకు సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు వాహనాల తుక్కు విధానం లేదు. 

దాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించి మంచి విధానాన్ని తెచ్చాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో రవాణాశాఖకు సంబంధించిన సమాచార మార్పిడికి వీలుగా సారథి, వాహన్‌ పోర్టల్‌లో తెలంగాణ చేరాలని నిర్ణయించింది. ఏడాదిలో అన్ని విభాగాలను అనుసంధానం చేస్తాం. 
– రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ 

గ్రీన్‌ట్యాక్స్‌ మాఫీ..
15 ఏళ్లుదాటిన వాహనాలు ఇంకా ఫిట్‌గా ఉన్నాయని భావిస్తే, వాటిని ఇక ముందు కూడా నడుపుకోవచ్చు. రూ.5 వేల గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లించి తదుపరి ఐదేళ్లు, ఆ తర్వాత రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడు పుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఇప్ప టికే 15ఏళ్లు దాటేసిన వాహనాలను తుక్కుగా మార్పిస్తే.. వాటికి గ్రీన్‌ట్యాక్స్‌ బకాయి ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. దీంతో కొత్త పాలసీలో ఆ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్క్రాప్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదే వాణిజ్య వాహనాలకు త్రైమాసిక పన్ను వంటి బకాయిలు ఉంటే.. ఆ బకాయిలపై పెనాల్టిని మాఫీ చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement