సాక్షి, అమరావతి: కాలం చెల్లిన వాహనాలకు సెలవు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనాల తుక్కు విధానం’ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం జిల్లాస్థాయిలో ‘వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు’ నెలకొల్పనుంది. దాంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ వెహికల్ స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని తాజాగా నిర్ణయించింది.
అందుకోసం ఔత్సాహిక వ్యాపారులకు అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర విధానం ప్రకారం 15 ఏళ్ల జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టంగా నిర్దేశించింది.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో వాహనాల స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ రిజిస్టర్ అథారిటీగా నిర్ణయించారు. అంటే స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేసే అధికారం రవాణా శాఖ కమిషనర్‌కు అప్పగించారు. ఇక అప్పిలేట్ అథారిటీగా రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. రవాణా శాఖ కమిషనర్ దరఖాస్తును తిరస్కరిస్తే ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు అప్పిలేట్ అథారిటీని సంప్రదించవచ్చు.
కాల పరిమితి దాటిన వాహనాలు 2 లక్షలు
రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల వాహనాలు ఉన్నాయి. వాటిలో 1.20 కోట్లు వ్యక్తిగతవి కాగా.. 30 లక్షలు వాణిజ్య వాహనాలు. 15 ఏళ్లు జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలు కలిపి దాదాపు 2 లక్షల వాహనాలు ఉంటాయని అంచనా. వాటిని తుక్కుగా మార్చాల్సి ఉందని గుర్తించారు.
తరువాత ఏటా జీవిత కాలం ముగిసే వాహనాలను తుక్కు కింద మారుస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాల్లోనే దాదాపు 3,500 వాహనాలకు జీవితకాలం ముగిసిందని ఇటీవల నిర్ధారించారు. మొదట ఆ వాహనాలను తుక్కుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అన్ని శాఖలకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుంది.
జిల్లాకు రెండు యూనిట్లు
జిల్లాకు కనీసం రెండు చొప్పున వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అందుకు తగిన స్థలం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహిస్తారు. వాహనాల ఫిట్‌నెస్‌ను పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా నిర్ధారించేందుకు ఆటోమేటెడ్ వెహికిల్ చెకింగ్ యూనిట్లను నెలకొల్పాలి. అలా వాహనాల ఫిట్‌నెస్‌ను నిర్ధారించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
మరమ్మతులు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేందుకు కూడా పనికిరావు అని నిర్ధారించే వాహనాలను తుక్కు కింద మార్చాల్సి ఉంది. వాటితోపాటు జీవితకాలం పూర్తయిన వాహనాలను కూడా యజమానులు తుక్కు కింద మార్చవచ్చు. తుక్కు కింద ఇచ్చే కార్లు, బస్సులు, లారీలు, ఆటోలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు సాŠక్రపింగ్ యూనిట్లు చెల్లిస్తాయి. స్క్రాపింగ్ యూనిట్లు జారీ చేసే సర్టిఫికెట్‌ను సమర్పిస్తే కొత్త వాహనం కొనుగోలుపై వాహనాల కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తాయి.
ఆ మేరకు వాహన తయారీ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. స్క్రాపింగ్ యూనిట్లలో వాహనాల తుక్కును ఆ కంపెనీలకు విక్రయిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ సమర్పిస్తే కొత్త వాహనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తుంది. దాంతో కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చి, కొత్త వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
రోడ్లపై తిరుగుతున్న కాలం చెల్లిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఆ వాహనాల యజమానులపై జరిమానాలు విధిస్తారు. దాంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవడంతోపాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రవాణా శాఖ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment