government vehicles
-
స్క్రాప్ స్వచ్ఛందమే: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదిహేనేళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. వాహనాన్ని తుక్కుగా మార్చాలా, వద్దా అన్నదానిపై యజమానులే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని, గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లపాటు వినియోగించుకునే ప్రస్తుత విధానం కొనసాగుతుందని ప్రకటించింది. అయితే ఎవరైనా తమ వాహనాన్ని తుక్కుగా మార్చి, అదే కోవకు చెందిన కొత్త వాహనాన్ని కొంటే.. జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)లో కొంతమొత్తం రాయితీగా ఇస్తామని తెలిపింది. కొన్నినెలల పాటు వివిధ రాష్ట్రాల్లోని వెహికల్ స్క్రాపింగ్ పాలసీలను అధ్యయనం చేశాక.. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మిళితం చేసి అధికారులు ఈ విధానాన్ని రూపొందించారు. మంగళవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖ అధికారులతో కలసి ఈ వివరాలను వెల్లడించారు. ఏ వాహనాలకు ఏ విధానం? ఎవరైనా 15 ఏళ్లు దాటిన తమ వాహనాన్ని తుక్కుగా మార్చాలని భావిస్తే.. దీనిపై రవాణా శాఖకు సమాచారమిచ్చి, అదీకృత తుక్కు కేంద్రానికి వెళ్లి స్క్రాప్ చేయించుకోవాలి. ఆ కేంద్రం సంబంధిత వాహనానికి నిర్ధారిత స్క్రాప్ విలువను చెల్లిస్తుంది. ఈ మేరకు సర్టిఫికెట్ ఇస్తుంది. యజమానులు అదే కేటగిరీకి చెందిన కొత్త వాహనం కొన్నప్పుడు.. ఈ సర్టిఫికెట్ చూపితే కొత్త వాహనానికి సంబంధించిన జీవితకాల పన్నులో నిర్ధారిత మొత్తాన్ని రాయితీగా తగ్గిస్తారు.రవాణా వాహనాలను ఎనిమిదేళ్లకే స్క్రాప్‌కు ఇవ్వవచ్చు. వీటికి సంబంధించి ఎంపీ ట్యాక్స్‌లో 10% రాయితీ ఉంటుంది. మిగతా నిబంధనలు నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల తరహాలోనే వర్తిస్తాయి. – ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం నిర్బంధ స్క్రాప్ విధానమే వర్తిస్తుంది. పదిహేనేళ్లు దాటిన ప్రతి ప్రభుత్వ వాహనాన్ని ఈ–ఆక్షన్ పద్ధతిలో తుక్కు కింద తొలగించాల్సిందే. అవి రోడ్డెక్కడానికి వీలు లేదు. – ఏ కేటగిరీ వాహనాన్ని స్క్రాప్‌గా మారిస్తే.. అదే కేటగిరీ కొత్త వాహనంపై మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ద్విచక్రవాహనాన్ని తుక్కుగా మారిస్తే.. మళ్లీ ద్విచక్రవాహనం కొంటేనే రాయితీ వర్తిస్తుంది. అంతేకాదు వాహనాన్ని తుక్కుగా మార్చిన రెండేళ్లలోపే ఈ రాయితీ పొందాల్సి ఉంటుంది. కేంద్రం చట్టం చేసిన మూడేళ్ల తర్వాత.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యం పెరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేసింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలన్న విధాన నిర్ణయం తీసుకుంది. దీనిపై 2021లో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చట్టం అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. చాలా రాష్ట్రాలు దశలవారీగా దీని అమలు ప్రారంభించాయి. కానీ నిర్బంధంగా తుక్కు చేయకుండా.. స్వచ్ఛంద విధానానికే మొగ్గు చూపాయి. తెలంగాణలో మూడేళ్ల తర్వాత ఇప్పుడు పాలసీని అమల్లోకి తెచ్చారు. – ‘రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎ‹స్ఎఫ్)’ కేంద్రాల్లో వాహనాలను తుక్కుగా మారుస్తారు. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేయగా.. మహీంద్రా కంపెనీ సహా నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కేంద్రాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా, లేదా అన్నది పరిశీలించి అనుమతిస్తారు. యజమానులు ఈ కేంద్రాల్లోనే వాహనాలను అప్పగించి, సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాల ‘ఫిట్నెస్’ పక్కాగా తేల్చేందుకు... 15 ఏళ్లు దాటిన వాహనాలను మరికొంతకాలం నడుపుకొనేందుకు ఫిట్నెస్ తనిఖీ తప్పనిసరి. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గానే టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది సరిగా జరగడం లేదని, అవినీతి చోటుచేసుకుంటోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆటోమేటెడ్ స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ పద్ధతిలో ఫిట్నెస్ టెస్టులు చేయించాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు రూ.293 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.133 కోట్లను భరించనుంది. ఇక వాహనాల విక్రయానికి సంబంధించిన ఎన్ఓసీలు, లైసెన్సులు ఇతర సేవలను అన్ని రాష్ట్రాలతో అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం వాహన్, సారథి పోర్టల్‌లను ఏర్పాటు చేసింది. చాలా రాష్ట్రాలు వీటితో అనుసంధానమయ్యాయి. తాజాగా తెలంగాణ కూడా అందులో చేరుతున్నట్టు ప్రకటించింది. దీనిని తొలుత సికింద్రాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ప్రారంభిస్తున్నారు. భద్రతపై దృష్టి సారించాం దేశవ్యాప్తంగా ఏటా 1.6 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. తెలంగాణలో కూడా ఆ సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై దృష్టి సారించాం. నిబంధనల విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించాం. రవాణా శాఖకు సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు వాహనాల తుక్కు విధానం లేదు. దాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించి మంచి విధానాన్ని తెచ్చాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో రవాణాశాఖకు సంబంధించిన సమాచార మార్పిడికి వీలుగా సారథి, వాహన్ పోర్టల్‌లో తెలంగాణ చేరాలని నిర్ణయించింది. ఏడాదిలో అన్ని విభాగాలను అనుసంధానం చేస్తాం. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్‌ట్యాక్స్ మాఫీ..15 ఏళ్లుదాటిన వాహనాలు ఇంకా ఫిట్‌గా ఉన్నాయని భావిస్తే, వాటిని ఇక ముందు కూడా నడుపుకోవచ్చు. రూ.5 వేల గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి తదుపరి ఐదేళ్లు, ఆ తర్వాత రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడు పుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఇప్ప టికే 15ఏళ్లు దాటేసిన వాహనాలను తుక్కుగా మార్పిస్తే.. వాటికి గ్రీన్‌ట్యాక్స్ బకాయి ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. దీంతో కొత్త పాలసీలో ఆ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్క్రాప్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదే వాణిజ్య వాహనాలకు త్రైమాసిక పన్ను వంటి బకాయిలు ఉంటే.. ఆ బకాయిలపై పెనాల్టిని మాఫీ చేస్తారు. -
మా సార్ బయటికి వచ్చేటప్పటికి కారును చల్లగా ఉంచాలి
హన్మకొండ అర్బన్: కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎర్త్ డేకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించి ప్రకృతి పరిరక్షణ గురించి చెబుతున్న సందర్భం.. అదే సమయంలో కలెక్టరేట్ ఆవరణలో ఓ ప్రభుత్వ వాహనం మూడు గంటలుగా ఆన్‌లోనే ఉంచి.. డ్రైవర్ ఏసీ వేసుకుని ఉన్నాడు.. ఇదేమిటి.. ఇన్ని గంటలు కారును ఆన్‌లోనే ఉంచావు అని అడిగితే ‘మా సార్ బయటికి వచ్చేటప్పటికి కారును చల్లగా ఉంచాలి’ అని సమాధానం. ఇంతకు ఆ కారు ఎవరిదంటే.. బల్దియా ఎస్ఈ అధికారిక వాహనం. గ్రీవెన్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. కార్యక్రమం ముగిసి బయటికి వచ్చేంతవరకు కారును ఇలా ఆన్‌లోనే ఉంచడం గమనార్హం. ఇదేనేమో ఇంధన పొదుపు.. పర్యావరణ పరిరక్షణ అంటే.. !! -
మంత్రుల పర్యటనలకు ప్రభుత్వ వాహనాలొద్దు
సాక్షి, అమరావతి : పార్టీయేతర ప్రాతిపదికన జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రులెవరూ పల్లెల్లో పర్యటించే సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప ఇతర ప్రభుత్వోద్యోగులెవరినీ వెంట తీసుకెళ్లకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. అలాంటి సమయాల్లో ప్రభుత్వ వాహనాలతో సహా ఇతరత్రా ఏ ప్రభుత్వ సదుపాయాలను వారు వినియోగించకూడదని శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కోడ్ అమలులో ఉందని.. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమానికైనా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ వాహనాలను సమకూర్చవద్దని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అలాగే, మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఏ ఇతర ప్రభుత్వ సౌకర్యాలను పొందకూడదని స్పష్టంచేశారు. అంతేకాక.. కేబినెట్ ర్యాంకు హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా ఉండే వారు పార్టీ కార్యాలయాలకు వెళ్లి రావడానికి కూడా ప్రభుత్వ వాహనాలు వినియోగించుకోకూడదని.. ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ పార్టీకి సంబంధించిన ప్రెస్మీట్లలోనూ పాల్గొనడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని నిమ్మగడ్డ ఆ లేఖలో సీఎస్‌కు వివరించారు. -
సర్కారీ వాహనాల వాడకంపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు అనధికార కార్యక్రమాల కోసం ప్రభుత్వ వాహనాలను వినియోగించొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ కోరారు. పత్రికలు, టీవీ చానళ్లలో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల వెబ్సైట్ల నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల ఫొటోల ను తొలగించాలని ఐటీ శాఖను కోరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు రోజువారీగా తీసుకుంటున్న చర్యల వివరాలను మంగళవారం ఇక్కడ వెల్లడించారు. 48 గంటల్లోగా 4,098 చోట్ల గోడలపై రాతలు, 29,526 పోస్టర్లు, 975 కటౌట్లు, 11,485 బ్యానర్లు, 3,498 జెండాలు, 7,308 ఇతర సామగ్రిని తొలగించామని వెల్లడించారు. లెక్కలు తెలపని రూ.90.50 లక్షల నగదును నగర పోలీసులు జప్తు చేశారని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం 1950 కాల్ సెంటర్ నిరంతరం పని చేస్తోందని తెలిపారు. 62 మందిపై అనర్హత వేటు ! ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్రానికి చెందిన 62 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణీత కాలం మేరకు నిషేధాన్ని విధించింది. గతంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ వ్యక్తులు నిబంధనల మేరకు ఎన్నికల సంఘానికి ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించడంలో విఫలమయ్యారు. దీంతో వీరిలో కొందరిపై 2020, మరి కొందరిపై 2021, ఇంకొందరిపై 2022 వరకు నిషే దం విధించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ 62 మంది పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించింది. -
ఎర్రబుగ్గలు ఔట్.. కొత్త సీఎం డేరింగ్ నిర్ణయం!
చండీగఢ్: వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత వాహనాలపై ఎర్రబుగ్గలను ఉంచే సంస్కృతికి ఆయన చరమగీతం పాడారు. అంతేకాకుండా రెండేళ్లపాటు మంత్రులు, ఎమ్మెల్యేల విదేశీ ప్రయాణాలకు చెక్ పెట్టారు. ప్రభుత్వ ఖర్చుతో విందులు, వినోదాలు నిర్వహించడాన్ని నిషేధించారు. రాష్ట్ర ఖజానాపై దుబారా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు సీఎం అమరీందర్ సింగ్ తన తొలి కేబినెట్ సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఇక ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తుల వాహనాలపై మాత్రమే ఎర్రబుగ్గలు దర్శనమివ్వనున్నాయి. వీఐపీ సంస్కృతికి చమరగీతం పాడేందుకే ప్రభుత్వ వాహనాలన్నింటికీ ఎర్రబుగ్గల వినియోగాన్ని తొలగించినట్టు అధికారులు తెలిపారు. ఇతర రంగు బుగ్గలను వినియోగాన్ని కూడా పూర్తిగా ఎత్తివేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. -
‘ఆర్టీసీ బస్సులకు టోల్ మినహాయించాలి’
సాక్షి, హైదరాబాద్: టోల్ ప్లాజాల వద్ద పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ వాహనాలను మినహాయించినందున అదే తరహాలో ఆర్టీసీ బస్సులను కూడా పన్ను నుంచి మినహాయించాలని ఆర్టీసీ తెలంగాణ ఎన్ఎంయూ డిమాండ్ చేసింది. గతంలో దీనికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సానుకూలత వ్యక్తంచేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని యూనియన్ నేతలు నాగేశ్వరరావు, మౌలానా, రఘురామ్, లక్ష్మణ్‌లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు నెలల కిందట ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ హామీని వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. -
ప్రభుత్వ వాహనాల్లో ఫ్యామిలీ షికారులు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పరిపాలన సౌలభ్యం కోసం అర్హత గల అధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. క్షేత్రస్థాయి పర్యటనలకు, అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రభుత్వమిచ్చిన వాహనాల్ని వినియోగించాలి. ఈమేరకు ప్రభుత్వం అద్దె వాహనాలు, డీజిల్ కోసం ప్రతీ నెలా లక్షలాది రూపాయల్ని వెచ్చిస్తోంది. కానీ కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, ఇతరత్రా ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు తమ ప్రయాణానికి వాడుకుంటున్నారు. మరికొందరి కుటుంబ సభ్యులు ఆ వాహనాల్లో షికార్లు. సొంత అవసరాలకే ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ వాహనంతో రాకపోకలు సాగించడం వల్ల ఓ వైద్యాధికారి డీజిల్ బిల్లు రూ.8 లక్షలు దాటిన వ్యవహారం ఆ మధ్య వెలుగు చూసింది. తాజాగా తన తండ్రికి ప్రభుత్వం సమకూర్చిన వాహనంలో జల్సా రాయళ్లతో కలిసి నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారకుడైన దత్తిరాజేరు తహశీల్దార్ పేడాడ జనార్దనరావు కుమారుడి వ్యవహారం బయటపడింది. వీరే కాదు జిల్లాలో చాలా మంది ఇదే తరహాలో ప్రభుత్వ వాహనాల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అద్దె వాహనాల కోసమని ప్రభుత్వం రూ.24వేల నుంచి రూ.28వేలు ఇస్తుండటంతో కొందరు అధికారులు వాయిదాల కింద వాహనాలు కొనుగోలు చేసి, దాన్నే అద్దె కింద తీసుకున్నట్టు చూపించి, ప్రభుత్వమిచ్చిన నెలవారీ అద్దె మొత్తాన్ని వాయిదాల కింద చెల్లించుకుంటున్నారు. దీనివల్ల వాహనాల్ని అద్దెకిచ్చి బతికే నిరుద్యోగులంతా ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. నిబంధనలో ఉన్న లొసుగులు సదరు అధికారులకు కలిసి రావడంతో ఎవరేం చేయలేకపోతున్నారు. ఇటువంటి వాహనాలు విధి నిర్వహణలో కాకుండా బయటెక్కడైనా వేరే వ్యక్తులతో కన్పించి పట్టుబడినప్పుడు సొంతదని సమర్ధించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. అసలు అధికారుల టూర్ డైరీని కనీసం పరిశీలించడం లేదు. వారెక్కడికి వెళ్తున్నారు? దేనికోసం వెళ్లారు? అసలు వెళ్లారా? లేదా అనేదానిపై ఆరాతీసే పరిస్థితి కన్పించడం లేదు. క్షుణ్ణంగా పరిశీలన జరగకుండానే డీజిల్ బిల్లులు పెద్ద ఎత్తున డ్రా అయిపోతున్నాయి. బయట వ్యక్తులతో ప్రభుత్వ వాహనం పట్టుబడ్డప్పుడు ఎందుకిలా జరిగిందన్నదానిపై సీరియస్‌గా స్పందించిన దాఖలాలు కన్పించలేదు. దీంతో ప్రభుత్వమిచ్చిన వాహన సౌకర్యాన్ని కొందరు నచ్చినట్టుగా వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా నిఘా పెడితే ప్రభుత్వ వాహనాల్ని దుర్వినియోగం చేస్తున్న ఘనుల్ని పట్టుకోవచ్చు. -
ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం
తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్న కమిషనర్ రాకేశ్ మారియా సాక్షి, ముంబై: పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా స్పష్టం చేశారు. అనేక మంది పోలీసు అధికారులు డిపార్టుమెంట్ వాహనాన్ని సొంత పనుల కోసం ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో మారియా ఈ ప్రకటన చేశారు. నియమాల ప్రకారం వాహనాల వినియోగంపై పోలీసుకు ఎంతమేరకు అధికారాలున్నాయి....? అనే వివరాలను సామాజిక కార్యకర్త అంకుర్ పాటిల్ సమాచార హక్కు చట్టం కింద సేకరించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... పోలీసు అధికారులకు అందజేసిన వాహనాన్ని కేసు దర్యాప్తు పనులకు, సంఘటన స్థలానికి వెళ్లడానికి, శాంతి భద్రతలను కాపాడేందుకు, అత్యవసర సమయంలో తమ పై అధికారుల వద్దకు వెళ్లేందుకు మాత్రమే ప్రభుత్వ వాహనాలను వినియోగించారు. కాని అనేక మంది అధికారులు విధులు పూర్తికాగానే ప్రభుత్వ వాహనాల్లోనే ఇంటికి వెళ్తున్నారు. అంతేకాక కుటుంబ సభ్యుల షాపింగ్‌కు, బంధువుల ఇంటికి వెళ్లేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మరికొందరు అధికారులు వాహనాలను తమ డ్రైవర్లకు అప్పగిస్తున్నారు. ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారు. నగరంలో 93 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. అందులో విధులు నిర్వహించే సీనియర్ అధికారులు ప్రతీ రోజూ కారును ఇంటికి తీసుకెళ్లడం, ఉదయం మళ్లీ తీసుకురావడం వల్ల రోజుకు కొన్ని వేల లీటర్ల ఇందనం, నిర్వహణ ఖర్చు వృథా అవుతోంది. ఇలా ప్రభుత్వ వాహనాలు దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటే ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకోవచ్చని అంకుర్ పాటిల్ అభిప్రాయపడ్డారు. -
ప్రభుత్వ వాహనాలకు నిర్లక్ష్యపు తుప్పు
సాక్షి, ఒంగోలు: అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిర్లక్ష్యంగా నిలుస్తున్నాయి..జిల్లాలోని ప్రభుత్వ వాహనాలు. కొద్దిపాటి మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వచ్చే వందకు పైగా వాహనాలు మూలనపడి అధ్వాన స్థితిలో ఉన్నాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న వాహనాలను ఁన్యూస్లైన్రూ. బృందం ఆదివారం పరిశీలించింది. వాహనాలు ఏళ్ల తరబడి మూలనపెట్టినా..అధికారులు వాటిని వేలం వేసేందుకు అనుసరించాల్సిన చర్యల గురించి మాత్రం నోరెత్తరు. సాధారణ వాహనాలే కాదు..చివరకు అంబులెన్స్‌లు సైతం ఇదే స్థితిలో ఉన్నాయి. ఒంగోలులో.. ఒంగోలులో దాదాపు 50 వాహనాలు పనికిరాకుండా తుప్పుపట్టి ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన తరువాత వాహనాలు వినియోగించవద్దని రవాణాశాఖాధికారులు రెండేళ్ల క్రితం హెచ్చరికలు చేశారు. అయినా ఫలితం శూన్యం. డస్ట్బిన్లను ఏకంగా మెషీన్ సాయంతో ఎత్తి ట్రాక్టర్లలో పోసేందుకు లోడర్లను కొనుగోలు చేశారు. అయితే తరువాత రెండు నెలలకే డస్ట్‌బిన్ ఫ్రీ సిటీగా మారుస్తున్నామంటూ వాటిని మూలనపడేశారు. దీంతో అవి చివరకు తప్పుపడుతున్నాయి. వాటిని అవసరమైతే మరో నగర పంచాయతీకి అయినా బదిలీ చేస్తే అవి ఉపయోగకరంగా ఉంటాయి. వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా కలెక్టరేట్, ప్రగతి భవనం, నగరపాలక సంస్థ ఆవరణ, పబ్లిక్ హెల్త్ కార్యాలయాల వద్ద కొరగాకుండా పోయిన వాహనాలున్నాయి. గిద్దలూరులో.. కంభం, గిద్దలూరు నీటిపారుదల శాఖ కార్యాలయానికి వచ్చిన వాహనాలు, రోలర్లు మూలనపడి తుప్పు పడుతున్నాయి. గిద్దలూరు తహసీల్దారుకు కేటాయించిన జీపు మూడేళ్లుగా మూలనపడింది. వాహనాల్లోని విడిభాగాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కంభం నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో కొన్నేళ్లుగా రోడ్డు రోలర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. రెండు వాహనాలు పూర్తిగా తుప్పు పట్టాయి. విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో విడి భాగాలను దుండగులు ఎత్తుకెళ్లారు. బేస్తవారిపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ వాహనం మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారింది. అర్ధవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జీపు కేటాయించారు. వాహనం చెడిపోవడంతో అక్కడ పనిచేస్తున్న డ్రైవర్‌ను బదిలీ చేశారు. దర్శిలో.. దర్శి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం వలన నాలుగు వాహనాలు తుప్పు పట్టి శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిలో జీపు, టిప్పర్, లారీ, మినీ లారీ ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన జీపు మరమ్మతులకు గురైంది. దీంతో షెడ్లో వేసి తాళం వేశారు. కురిచేడులో.. కురిచేడు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రమే వాహనం ఉంది. అయితే దీన్ని ఎన్నడూ బయటకు తీసిన దాఖలాలు లేవు. కందుకూరులో.. డంపింగ్‌యార్డుకు డంపర్ బిన్లను తరలించేందుకు రూ. 14 లక్షలు ఖర్చుచేసి గతంలో డంపర్ ప్లేసర్ను కొనుగోలు చేశారు. రెండు, మూడు నెలలు మాత్రమే పనిచేసిన వీటిని వదిలేశారు. జీపు కూడా అదే స్థితికి చేరింది. ఈ రెండు వాహనాలు పాత ఇనుప సామాను వాళ్లకు వేసుకునేందుకు తప్ప మరెందుకూ పనికొచ్చేట్లు లేవు. వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి జీపు కూడా మరమ్మతులకు గురవడంతో మూలనపడేశారు. ఉలవపాడు ఎంపీడీఓ కార్యాలయంలోని జీపు అటకెక్కి చాలా కాలమైంది. కనిగిరిలో.. కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో 15 ఏళ్ల నుంచి తహసీల్దార్ జీపు మూలనపడింది. ఇరిగేషన్ కార్యాలయాలకు రెండు టిప్పర్లు, రెండు రోలర్లు, రెండు జీపులు ఉన్నాయి. రోలర్లను వేలంపాటద్వారా అమ్మిన అధికారులు వాహనాలు అమ్మలేదు. దీంతో అవి మూలనపడి తుప్పు పడుతున్నాయి. వెలిగండ్ల ఎంపీడీఓ కార్యాలయానికి చెందిన ప్రభుత్వ వాహనం మూలనపడింది. అద్దంకిలో.. సంతమాగులూరులో సమితికాలం నాటి బీడీఓ వాహనం మూలనపడింది. ప్రాథమిక వైద్యకేంద్రంలో వాహనం డీజిల్‌కు నిధులు లేక నాలుగేళ్లుగా నిరుపయోగంగా మారింది. డ్రైవర్‌ను ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు చెల్లిస్తున్నారు. నాగార్జున సాగర్ కాలువల సంతమాగులూరు సబ్‌డివిజన్ కార్యాలయంలోని డీఈఈకి కేటాయించిన వాహనం తుప్పుపట్టి అందులోని పరికరాలు చోరీకి గురైనా పట్టించుకునే నాథుడే లేడు. అద్దంకిలో తహసీల్దార్‌కు కేటాయించిన వాహనం కూడా మూలనపడేశారు. మార్కాపురంలో.. మార్కాపురంలో సహాయ వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద, తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు జీపులు నిరుపయోగంగా శిథిలావస్థకు చేరాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద ట్రాక్టర్లు, ఆటోలు కొన్ని నిరుపయోగ ంగా ఉన్నాయి. పొదిలిలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఆర్అండ్బీ కార్యాలయాల వద్ద ప్రభుత్వ వాహనాలు మూలనపడ్డాయి. యర్రగొండపాలెంలో.. యర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా రెండు వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. త్రిపురాంతకం మండలంలో ఎన్ఎస్పీకి కేటాయించిన రెండు వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిలో ఒక వామనం పూర్తిగా మూలనపడింది. పెద్దదోర్నాల మండలంలో అటవీశాఖకు చెందిన వాహనం మరమ్మతులకు గురై నిరుపయోగంగా ఉంది. చీరాలలో.. చీరాల మున్సిపల్ కమిషనర్‌కు సంబంధించిన జీపు కొన్నేళ్ల క్రితం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిప్పు పెట్టడంతో దగ్ధమైంది. చెత్తా చెదారాలను డంపింగ్‌యార్డుకు తరలించే ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు మరమ్మతులకు గురై అక్కడే ఉన్నాయి. పర్చూరులో.. మార్టూరు మండలంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఆవరణలో ఎన్నో ఏళ్ల నుంచి కార్యాలయానికి చెందిన జీపు మరమ్మతులకు గురై పూర్తిగా శిథిలావస్థకు చేరింది.