
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు అనధికార కార్యక్రమాల కోసం ప్రభుత్వ వాహనాలను వినియోగించొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ కోరారు. పత్రికలు, టీవీ చానళ్లలో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌ల నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల ఫొటోల ను తొలగించాలని ఐటీ శాఖను కోరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు రోజువారీగా తీసుకుంటున్న చర్యల వివరాలను మంగళవారం ఇక్కడ వెల్లడించారు. 48 గంటల్లోగా 4,098 చోట్ల గోడలపై రాతలు, 29,526 పోస్టర్లు, 975 కటౌట్లు, 11,485 బ్యానర్లు, 3,498 జెండాలు, 7,308 ఇతర సామగ్రిని తొలగించామని వెల్లడించారు. లెక్కలు తెలపని రూ.90.50 లక్షల నగదును నగర పోలీసులు జప్తు చేశారని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం 1950 కాల్ సెంటర్ నిరంతరం పని చేస్తోందని తెలిపారు.
62 మందిపై అనర్హత వేటు !
ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్రానికి చెందిన 62 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణీత కాలం మేరకు నిషేధాన్ని విధించింది. గతంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ వ్యక్తులు నిబంధనల మేరకు ఎన్నికల సంఘానికి ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించడంలో విఫలమయ్యారు. దీంతో వీరిలో కొందరిపై 2020, మరి కొందరిపై 2021, ఇంకొందరిపై 2022 వరకు నిషే దం విధించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ 62 మంది పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించింది.