సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ)’రూపొందించిన నివేదికలో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుంగిన ర్యాఫ్ట్ వద్ద తవ్వకాలు జరిపి పరిశీలన జరిపితేనే అసలు కారణాలు తెలుస్తాయని.. ఎన్డీఎస్‌ఏ వంటి చట్టబద్ధసంస్థ తొందరపాటుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని తప్పుపట్టారు.
ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందంటూ ఎన్డీఎస్‌ఏ సమర్పించిన నివేదికపై శనివారం ఆయన జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్, ఇతర సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్‌ఏ నివేదికలోని చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తమ సమావేశంలో నిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని రజత్‌కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు.
డిజైన్ల ప్రకారమే నిర్మాణం
మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేసి, దానికి విరుద్ధంగా రిజిడ్ స్ట్రక్చర్‌గా నిర్మించారని ఎన్డీఎస్‌ఏ నివేదికలో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని రజత్‌కుమార్ తెలిపారు. ర్యాఫ్ట్, సీకెంట్ పైల్స్ మధ్య జాయింట్ ఉందని.. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు, వ్యయ అంచనాలు, ఆపరేషనల్ వివరాలను గతంలోనే సీడబ్ల్యూసీకి, డైరెక్టరేట్ ఆఫ్ కాస్టింగ్‌కి సమర్పించామన్నారు.
వారు ఎన్నో వివరాలు అడిగాకే ఆమోదించారని.. తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వీటిని ఆమోదించిందని తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఇంజనీరింగ్ అద్భుతంగా కితాబునిచ్చారని గుర్తుచేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 2023 జూన్‌లో డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 పరిధిలోకి వచ్చిందని, కానీ అంతకుముందు సమయానికి సంబంధించి బ్యారేజీ నిర్వహణ నిబంధనలను పాటించలేదని నివేదికలో పేర్కొనడం అర్థ రహితమని విమర్శించారు. వానాకాలం ముగిసిన నేపథ్యంలో నవంబర్ నుంచి తనిఖీలు ప్రారంభిస్తామన్నారు.
తనిఖీ చేయకుండానే ఆరోపణలు ఎలా?
ఎన్డీఎస్‌ఏ నిపుణుల బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయకుండానే వాటికి సైతం ప్రమాదం పొంచి ఉందని నివేదికలో పేర్కొనడాన్ని రజత్‌కుమార్ తప్పుబట్టారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కదలడంతో పైపింగ్, బాయిలింగ్ (బ్యారేజీ గేట్లకు దిగువన సీపేజీ) జరిగాయని చెప్పారు.
ఆప్రాన్ డిజైన్లను సరిదిద్దుతున్నాం
మేడిగడ్డ బ్యారేజీ ఆప్రాన్ డిజైన్లలో ఎన్డీఎస్‌ఏ బృందం కొన్ని లోపాలున్నట్లు తెలిపిందని, తాము దీన్ని గతంలోనే గుర్తించి నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించామని రజత్‌కుమార్ తెలిపారు. 2021 వరదల్లోనే ఆప్రాన్ దెబ్బతిందని, డిజైన్లను సరిదిద్దాక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలోని నిపుణులు 10 డిజైన్లను సిఫారసు చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరంగా లోపాల్లేవని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకొని నిదానంగా కారు నడిపినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, ఇది కూడా అలానే జరిగిందని వ్యాఖ్యానించారు.
అధికారులిచ్చిన డిజైన్ల ప్రకారమే మేడిగడ్డ నిర్మాణం
స్పష్టం చేసిన ఎల్‌అండ్‌టీ సంస్థ
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 23న 7వ బ్లాకు కుంగిపోవడంతో కొంతభాగానికి పగుళ్లు వచ్చాయని పేర్కొంది. నీటిపారుదల శాఖ అధికారులు అందజేసిన డిజైన్ అనుసరించి నాణ్యతను అనుసరిస్తూ బ్యారేజీని నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేసింది.
నాటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు బ్యారేజీ వరదలను తట్టుకుని నిలబడిందని పేర్కొంది. బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ పూర్తైన తర్వాత సత్వరంగా పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్‌ఏ నిపుణుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది.
‘నివేదిక’పై సమగ్రంగా సమాధానం
ఎన్డీఎస్‌ఏ బృందం 20రకాల డాక్యుమెంట్లను కోరగా.. గత నెల 29న 17 రకాల డాక్యుమెంట్లు, ఈ నెల 1న మిగతా 3 డాక్యుమెంట్లను అందజేశామని రజత్‌కుమార్ తెలిపారు. కానీ 11 డాక్యుమెంట్లే ఇచ్చినట్టు నివేదికలో పేర్కొనడం దారుణమన్నారు. మళ్లీ 20రకాల డాక్యుమెంట్లను రిప్లైతో కలిపి పంపిస్తామని చెప్పారు. ఈ మేరకు రజత్‌కుమార్ ఎన్‌డీఎస్‌ఏ నివేదికలోని అంశాలకు వివరణలతో శనివారం రాత్రి ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌కు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment