తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్న కమిషనర్ రాకేశ్ మారియా
సాక్షి, ముంబై: పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా స్పష్టం చేశారు. అనేక మంది పోలీసు అధికారులు డిపార్టుమెంట్ వాహనాన్ని సొంత పనుల కోసం ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో మారియా ఈ ప్రకటన చేశారు.
నియమాల ప్రకారం వాహనాల వినియోగంపై పోలీసుకు ఎంతమేరకు అధికారాలున్నాయి....? అనే వివరాలను సామాజిక కార్యకర్త అంకుర్ పాటిల్ సమాచార హక్కు చట్టం కింద సేకరించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... పోలీసు అధికారులకు అందజేసిన వాహనాన్ని కేసు దర్యాప్తు పనులకు, సంఘటన స్థలానికి వెళ్లడానికి, శాంతి భద్రతలను కాపాడేందుకు, అత్యవసర సమయంలో తమ పై అధికారుల వద్దకు వెళ్లేందుకు మాత్రమే ప్రభుత్వ వాహనాలను వినియోగించారు.
కాని అనేక మంది అధికారులు విధులు పూర్తికాగానే ప్రభుత్వ వాహనాల్లోనే ఇంటికి వెళ్తున్నారు. అంతేకాక కుటుంబ సభ్యుల షాపింగ్‌కు, బంధువుల ఇంటికి వెళ్లేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మరికొందరు అధికారులు వాహనాలను తమ డ్రైవర్లకు అప్పగిస్తున్నారు.
ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారు. నగరంలో 93 పోలీసు స్టేషన్‌లు ఉన్నాయి. అందులో విధులు నిర్వహించే సీనియర్ అధికారులు ప్రతీ రోజూ కారును ఇంటికి తీసుకెళ్లడం, ఉదయం మళ్లీ తీసుకురావడం వల్ల రోజుకు కొన్ని వేల లీటర్ల ఇందనం, నిర్వహణ ఖర్చు వృథా అవుతోంది. ఇలా ప్రభుత్వ వాహనాలు దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటే ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకోవచ్చని అంకుర్ పాటిల్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం
Published Thu, Jun 12 2014 11:18 PM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM
Advertisement