కేసుల్లేవని సర్టిఫికెట్ ఇవ్వండి
తమిళ సినిమా: తనపై ఎలాంటి నేరారోపణలు, కేసులు లేవని సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నై నగర పోలీస్‌కమిషనర్‌ను కోరారు. రజనీకాంత్ ఏమిటీ కేసు లేమిటీ అని ఆశ్చర్యంగా ఉందా? అయితే రండి చూ ద్దాం...మన సూపర్‌స్టార్ తాజాగా నటిస్తున్న రెండు చిత్రాల్లో 2.ఓ(ఎందిరన్-2) ఒకటి, స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. అధిక భాగం షూటింగ్‌ను విదేశాల్లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
ఆయా దేశాల్లో ఒకటి బొలిలియా. అక్కడ షూటింగ్ చేయాలంటే కొన్ని విధివిధాలను కచ్చితంగా పాటించి తీరాలట. వృత్తి రీత్యా ఆ దేశానికి వెళ్లే వాళ్లపై ఎలాంటి కేసులు ఉండరాదట. ఎలాంటి నేరారోపణలు లేవని పోలీసుల నుంచి ధ్రువపత్రం పొంది ఆ దేశ అధికారులకు అందించాలట. అందువల్ల ఆ పోలీస్ ధ్రువపత్రం ఉంటేనే రజనీకాంత్, ఇతర చిత్ర యూనిట్ బొలిలియా దేశంలో అడుగుపెట్టగలరు. అందువల్ల 2.ఓ చిత్ర షూటింగ్ కోసం బొలిలియా వెళ్లనున్న రజనీకాంత్‌కు పోలీస్ ధ్రువపత్రం కోరుతూ ఆయన తరపున నగరపోలీస్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఆయన నుంచి ధ్రువపత్రం వచ్చిన తరువాతనే రజనీకాంత్ బొలిలియా దేశం వెళ్లే షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేయగలరని సమాచారం.