వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్
వరంగల్ క్రైం : వరంగల్ పోలీసు కమిషనరేట్ మార్పులకు వేదికైంది. గతానికి భిన్నంగా పరిపాలనలో కొత్త కొత్త పద్ధతులు పురుడు పోసుకుంటున్నాయి. ప్రజలు కోరుకుంటున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలకు చేరువవుతూనే.. అసాంఘిక కార్యకలపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
నేరం జరిగిన గంటల్లో నిందితులను అరెస్టు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో నేరం చేయాలంటే ఒంట్లో భయం పుట్టే విధంగా నేరస్తుల నేర చరిత్ర అధారంగా పీడీ యాక్టును ప్రయోగిస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ నాలుగు నెలల కాలంలోనే పోలీసింగ్‌లో సమూల మార్పులు తీసుకువస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు.
డీజీపీ అదేశాల మేరకు పోలీసు స్టేషన్లలో మామూళ్లు వసూళ్లపై ఉక్కుపాదం మోపారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలనే లక్ష్యంతో పోలీసు శాఖలో ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ ముందుకు సాగుతున్నారు. కమిషనరేట్ పరిధిలో పాలన, పోలీసు శాఖలో వస్తున్న నూతన మార్పులపై విశ్వనాథ రవీందర్‌థేమంటున్నారో ఆయన మాటల్లోనే..
నేర రహిత కమిషనరేట్ దిశగా..
నేరస్తులు నేరం చేయటానికి భయపడాలి. అప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేరం చేస్తే ఏమవుతుంది.. నాలుగు రోజుల్లో బయటకు వస్తాం.. అనే భావన నేరస్తుల నుంచి పోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కేసుకు సంబంధించి సరైన అధారాలు సేకరించి శిక్ష పడే విధంగా చేస్తున్నాం.
దీంతో పాటు నేరస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వివరాలను కూడా నమోదు చేస్తున్నాం. దీని వల్ల నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. నేరస్తులు ఎవ్వరిని కూడాఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు.
బ్లూకోల్ట్స్‌తో విజుబుల్ పోలీసింగ్..
ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగే విధంగా కమిషనరేట్ పరిధిలోని 12 పోలీసు స్టేషన్లలో బ్లూకోల్ట్స్ ఏర్పాటు చేశాం. ఒక్కో పోలీస్ స్టేషన్‌ను మూడు సెక్టార్లుగా విభజించి... మూడు షిప్ట్‌లలో బృందాలు 24 గంటలు గస్తీ నిర్వహించేలా చర్యలు చేపట్టాం. గతంలో నేరస్తుల వివరాలను సీ డాట్ (క్రిమినల్ డాటా) ద్వారా నమోదు చేయడం జరిగింది.
దీంతో బ్లూకోల్ట్స్ బృందాలు నేరస్తుడి ఇంటి పరిసర ప్రాంతాలకు వెల్లగానే ట్యాబ్‌లో ఇండికేషన్ వస్తుంది. దీంతో నేరస్తుల కదలికపై నిరంతరం నిఘా పెట్టడం జరుగుతుంది. బ్లూకోల్ట్స్ ద్వారా కమ్యూనిటి పోలీసింగ్, విజుబుల్ పోలీసింగ్, బందోబస్తు, ఇంటెలిజెన్స్, క్రిమినల్ సర్వే జరుగుతాయి.
అసాంఘిక కార్యకలాపాలపై ‘టాస్క్’తో ఉక్కుపాదం..
ప్రభుత్వం నిషేధించిన గుట్కా, మట్కా, సట్టా, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్‌ఫోర్స్‌తో ఉక్కుపాదం మోపుతున్నాం. 90 శాతం గుట్కా వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. గుట్కా సరఫరా చేసే వ్యాపారులు ఎక్కడ ఉన్నా కేసులు పెట్టడం జరిగింది. భూకబ్జాదారులు, రౌడీలు ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తే ఊరుకోం. అసాంఘిక కార్యకలపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.
త్వరలో మార్కెట్ ఇంటెలిజెన్స్..
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జరిగే మోసాలను అరికట్టేందుకు కమిషనరేట్ పరిధిలో త్వరలో మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ, సైబర్ నేరాలు, చిట్టీల పేరుతో చేసే మోసాలు తదితర అంశాలపై నిరంతరం నిఘా పెట్టేందుకు మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తుంది.
ట్రాఫిక్ నియంత్రణలో మార్పులు..
హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతుంది. సుమారు 25వేల ఆటోలు, 5 లక్షల ఇతర వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ సహకారంతో ట్రాఫిక్ సిగ్నళ్లను పునరుద్ధరిస్తున్నాం. ట్రాఫిక్ సిబ్బందికి హైదర్‌బాద్ నుంచి నిపుణులను పిలిపించి నిబంధనలపై శిక్షణ ఇప్పించాం.
త్వరలో కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. జంక్షన్లలో వాహనాలు అదుపు చేయడం ఎలా.. వాహనదారులతో ఎలా ప్రవర్తించాలి.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు కౌన్సెలింగ్‌ను ఈ కేంద్రం నుంచి ఇస్తాం. దీంతో పాటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
పద్ధతి మార్చుకోకుంటే వేటే..
కమిషనరేట్ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది చాలా సమర్థవంతులు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అందరు కూడా శిక్షణ పొందిన వారే. ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందరికీ నేను చెప్పే విషయం ఒక్కటే. తప్పు ఎవ్వరు చేసిన క్షమించాను. ఇప్పటివరకు ఎలా ఉన్న ఇప్పుడు పద్ధతి మార్చుకోవాలి. కమిషనరేట్ పరిధిలో యూనిఫాం సర్వీస్ అందాలి. పోలీసులందరూ బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజలకు పోలీసులు ఉన్నారనే నమ్మకం కలగాలి. ఎవ్వరైనా మారకుంటే మారడానికి అవకాశం ఇస్తాను, అయినా పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదు.
షీటీమ్స్ సిబ్బందికి శిక్షణ..
మహిళలు, యువతల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. షీటీమ్స్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు నగరంలోని పోలీసు స్టేషన్లలో 15 వర్టికల్స్, గ్రామీణ ప్రాంతంలో 12 వర్టికల్స్ (విభాగాలు)లలో స్టేషన్‌లో పనిచేసే పోలీసులందరికీ బాధ్యతలను అప్పగించడం జరిగింది. దీని వల్ల వృతి పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించడం జరుగుతుంది. క్రమశిక్షణతో నేరాలను అదుపు చేసే అవకాశం ఉంది.
ప్రజలకు ఎక్కడైనా.. ఎవ్వరైనా ఇబ్బందులకు గురిచేస్తే స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో 626 గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. దీనివల్ల నేరాల సంఖ్య తగ్గుతుంది. దీంతోపాటు ఎక్కడైనా నేరం జరిగిన వెంటనే సీసీ కెమెరాల అధారంగా నేరస్తులను పట్టుకోవడం జరుగుతుంది. నగరంలో రెండు మూడు నెలల్లో అన్ని కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తవుతుంది.
సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట..
కమిషనరేట్ పరిధిలో పనిచేసే సిబ్బంది సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సర్వీస్ పరంగా వారికి అందాల్సిన పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇతర సర్వీసులలో ఎక్కడ జాప్యం జరుగకుండా చూస్తున్నాం. సిబ్బంది, సీపీఓ కార్యాలయ సిబ్బందితో ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాం.
ఎవ్వరికి ఏం ఇబ్బంది ఉన్నా.. ఆ గ్రూప్‌లో పోస్టు చేసిన మూడు రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఈ విషయం కూడా గ్రూప్‌లో పోస్ట్ చేసేలా ఆదేశాలు ఇచ్చాం. కమిషనరేట్ పరిదిలో సుమారు 3 వేల మంది నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ ప్రాంతాల్లో కోచింగ్ ఇస్తున్నాం. పోలీసు స్టేషన్లకు త్వరలో వాహనాలు అందిస్తాం. ఎవ్వరికి ఇబ్బంది ఉన్నా.. సమస్యలు పరిష్కారం కాకున్నా నేరుగా సంప్రదించవచ్చు. నేరస్తులు పద్ధతి మార్చుకోకుంటే శిక్ష పడడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment