క్రిమినల్స్ కాదు.. క్రైమ్ పైనే యుద్ధం
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎటాక్ ఆన్ క్రైమ్... నాట్ ఆన్ క్రిమినల్స్’ (నేరాలపైనే దాడి, నేరస్తులపై కాదు) ఇదే తమ పోలీసింగ్ విధానమని సైబరాబాద్ ఈస్ట్ తొలి పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ అన్నారు. ఆయన శుక్రవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నేరగాళ్లను మాత్రమే టార్గెట్‌గా చేసుకుంటూ వెళ్తే వచ్చే ఫలితాల కన్నా... ఓ వ్యక్తిని నేరగాడిగా మారుస్తున్న పరిస్థితుల్ని అధ్యయనం చేసి, పరిష్కారాలు చూపగలిగితే మేలైన ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఎటాక్ ఆన్ క్రైమ్ విధానంలో పని చేస్తూ తొలిసారి నేరం చేసి అరెస్టయిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, వారిలో మార్పునకు కృషి చేయడం చేస్తామన్నారు. మహేష్ భగవత్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... ‘తొలుత కమిషనరేట్ కార్యాలయంలో కోసం మా పరిధిలో అనువైన స్థలం గుర్తించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న ప్రాంతాలతో పాటు కొత్తగా భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ తదితరాలు కొత్తగా వచ్చి చేరాయి. 3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17 లక్షల జనాభాతో ఉన్న ఈ ప్రాంతంలో గతేడాది 26 వేల కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాం తాల్లో ఉన్న ఇబ్బందులు, సమస్యల్ని పోలీసుస్టేషన్ల వారీగా ప్రజల్ని సంప్రదిస్తూ తెలుసుకుంటాం. వారి భాగస్వామ్యంతోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తాం.
వీలైనంత త్వరగా బాధితులకు సొత్తు...
నేరాల నిరోధం కోసం విజుబుల్ పోలీసింగ్ విధానాలు చేపట్టనున్నాం. అలాగే జరిగిన నేరాలను త్వరగా కొలిక్కి తేవడంతో పాటు సొత్తు సంబంధ నేరాల్లో రికవరీ అయిన బంగారం, నగదును బాధితులకు వీలైంత త్వరగా అందేలా చర్యలు తీసుకుంటాం. పదేపదే నేరాలు చేసే రిపీటెడ్ అఫెండర్స్‌కు చెక్ చెప్పడానికి మాన్యువల్‌గా, సాంకేతికంగా నిఘా కొనసాగిస్తాం. పీడీ యాక్ట్ నమోదు ప్రక్రియ ఇకపైనా పక్కాగా అమలుచేస్తాం.
ప్రస్తుతం గచ్చిబౌలి చుట్టు పక్కలకే పరిమితమైన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను విస్తరించి, ఈస్ట్ ప్రాంతంలోనూ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. అక్కడ పని చేసే ఉద్యోగినుల కోసం ‘షీ-క్యాబ్స్’, ‘షీ-షటిల్స్’ తదితర సేవలను అందుబాటులోకి తెస్తాం. సోషల్ మీడియాలో షికార్లు చేసే పుకార్లను తీవ్రంగా పరిగణిస్తాం. ఇలాంటి చర్యలకు ఉపక్రమించే వారిని గుర్తించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.
మహిళల భద్రతకు పెద్దపీట...
మహిళల భద్రతకు పెద్దపీట వేసే సైబరాబాద్ ఈస్ట్ అధికారులు వారితో పాటు చిన్నారులపై జరిగే నేరాల ను తీవ్రంగా పరిగణిస్తారు. ఇప్పటికే సీఐడీ, ఇతర జిల్లా ల్లో పని చేసిన సందర్భాల్లో మహిళలు/చిన్నారుల అక్ర మ రవాణా అడ్డుకోవడానికి అనేకచర్యలు తీసుకున్నాం. వాటిని కొనసాగిస్తూ వ్యవస్థీకృత ముఠాల మూలాలు కనిపెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. ఈ తరహా కేసుల్లో బాధితులకు అవసరమైన సహాయసహకారాలు అందించాలనే ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేస్తాం.
వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయంగా పని చేసి వారి పునరావాసానికి చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరైనా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చు. నేరుగా, ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా... ఇలా ఏ రూపంలో సహాయం కోరినా తక్షణం స్పందించి వారి మన్ననలు చూరగొంటాం. త్వరలో డివిజన్ల వారీగా ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహేష్ భగవత్ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు.