సాక్షి ప్రతినిధి, విజయనగరం : పరిపాలన సౌలభ్యం కోసం అర్హత గల అధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. క్షేత్రస్థాయి పర్యటనలకు, అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రభుత్వమిచ్చిన వాహనాల్ని వినియోగించాలి. ఈమేరకు ప్రభుత్వం అద్దె వాహనాలు, డీజిల్ కోసం ప్రతీ నెలా లక్షలాది రూపాయల్ని వెచ్చిస్తోంది. కానీ కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, ఇతరత్రా ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు తమ ప్రయాణానికి వాడుకుంటున్నారు. మరికొందరి కుటుంబ సభ్యులు ఆ వాహనాల్లో షికార్లు. సొంత అవసరాలకే ఎక్కువగా వాడుకుంటున్నారు.
ఇలా ప్రభుత్వ వాహనంతో రాకపోకలు సాగించడం వల్ల ఓ వైద్యాధికారి డీజిల్ బిల్లు రూ.8 లక్షలు దాటిన వ్యవహారం ఆ మధ్య వెలుగు చూసింది. తాజాగా తన తండ్రికి ప్రభుత్వం సమకూర్చిన వాహనంలో జల్సా రాయళ్లతో కలిసి నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారకుడైన దత్తిరాజేరు తహశీల్దార్ పేడాడ జనార్దనరావు కుమారుడి వ్యవహారం బయటపడింది. వీరే కాదు జిల్లాలో చాలా మంది ఇదే తరహాలో ప్రభుత్వ వాహనాల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అద్దె వాహనాల కోసమని ప్రభుత్వం రూ.24వేల నుంచి రూ.28వేలు ఇస్తుండటంతో కొందరు అధికారులు వాయిదాల కింద వాహనాలు కొనుగోలు చేసి, దాన్నే అద్దె కింద తీసుకున్నట్టు చూపించి, ప్రభుత్వమిచ్చిన నెలవారీ అద్దె మొత్తాన్ని వాయిదాల కింద చెల్లించుకుంటున్నారు.
దీనివల్ల వాహనాల్ని అద్దెకిచ్చి బతికే నిరుద్యోగులంతా ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. నిబంధనలో ఉన్న లొసుగులు సదరు అధికారులకు కలిసి రావడంతో ఎవరేం చేయలేకపోతున్నారు. ఇటువంటి వాహనాలు విధి నిర్వహణలో కాకుండా బయటెక్కడైనా వేరే వ్యక్తులతో కన్పించి పట్టుబడినప్పుడు సొంతదని సమర్ధించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. అసలు అధికారుల టూర్ డైరీని కనీసం పరిశీలించడం లేదు.
వారెక్కడికి వెళ్తున్నారు? దేనికోసం వెళ్లారు? అసలు వెళ్లారా? లేదా అనేదానిపై ఆరాతీసే పరిస్థితి కన్పించడం లేదు. క్షుణ్ణంగా పరిశీలన జరగకుండానే డీజిల్ బిల్లులు పెద్ద ఎత్తున డ్రా అయిపోతున్నాయి. బయట వ్యక్తులతో ప్రభుత్వ వాహనం పట్టుబడ్డప్పుడు ఎందుకిలా జరిగిందన్నదానిపై సీరియస్‌గా స్పందించిన దాఖలాలు కన్పించలేదు. దీంతో ప్రభుత్వమిచ్చిన వాహన సౌకర్యాన్ని కొందరు నచ్చినట్టుగా వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా నిఘా పెడితే ప్రభుత్వ వాహనాల్ని దుర్వినియోగం చేస్తున్న ఘనుల్ని పట్టుకోవచ్చు.
ప్రభుత్వ వాహనాల్లో ఫ్యామిలీ షికారులు !
Published Sat, Jul 25 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement