సాక్షి, ఒంగోలు: అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిర్లక్ష్యంగా నిలుస్తున్నాయి..జిల్లాలోని ప్రభుత్వ వాహనాలు. కొద్దిపాటి మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వచ్చే వందకు పైగా వాహనాలు మూలనపడి అధ్వాన స్థితిలో ఉన్నాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న వాహనాలను ఁన్యూస్‌లైన్‌రూ. బృందం ఆదివారం పరిశీలించింది. వాహనాలు ఏళ్ల తరబడి మూలనపెట్టినా..అధికారులు వాటిని వేలం వేసేందుకు అనుసరించాల్సిన చర్యల గురించి మాత్రం నోరెత్తరు. సాధారణ వాహనాలే కాదు..చివరకు అంబులెన్స్‌లు సైతం ఇదే స్థితిలో ఉన్నాయి.
ఒంగోలులో..
ఒంగోలులో దాదాపు 50 వాహనాలు పనికిరాకుండా తుప్పుపట్టి ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన తరువాత వాహనాలు వినియోగించవద్దని రవాణాశాఖాధికారులు రెండేళ్ల క్రితం హెచ్చరికలు చేశారు. అయినా ఫలితం శూన్యం. డస్ట్‌బిన్‌లను ఏకంగా మెషీన్ సాయంతో ఎత్తి ట్రాక్టర్లలో పోసేందుకు లోడర్లను కొనుగోలు చేశారు. అయితే తరువాత రెండు నెలలకే డస్ట్‌బిన్ ఫ్రీ సిటీగా మారుస్తున్నామంటూ వాటిని మూలనపడేశారు. దీంతో అవి చివరకు తప్పుపడుతున్నాయి. వాటిని అవసరమైతే మరో నగర పంచాయతీకి అయినా బదిలీ చేస్తే అవి ఉపయోగకరంగా ఉంటాయి. వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా కలెక్టరేట్, ప్రగతి భవనం, నగరపాలక సంస్థ ఆవరణ, పబ్లిక్ హెల్త్ కార్యాలయాల వద్ద కొరగాకుండా పోయిన వాహనాలున్నాయి.
గిద్దలూరులో..
కంభం, గిద్దలూరు నీటిపారుదల శాఖ కార్యాలయానికి వచ్చిన వాహనాలు, రోలర్లు మూలనపడి తుప్పు పడుతున్నాయి. గిద్దలూరు తహసీల్దారుకు కేటాయించిన జీపు మూడేళ్లుగా మూలనపడింది. వాహనాల్లోని విడిభాగాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కంభం నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో కొన్నేళ్లుగా రోడ్డు రోలర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. రెండు వాహనాలు పూర్తిగా తుప్పు పట్టాయి. విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో విడి భాగాలను దుండగులు ఎత్తుకెళ్లారు. బేస్తవారిపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ వాహనం మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారింది. అర్ధవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జీపు కేటాయించారు. వాహనం చెడిపోవడంతో అక్కడ పనిచేస్తున్న డ్రైవర్‌ను బదిలీ చేశారు.
దర్శిలో..
దర్శి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం వలన నాలుగు వాహనాలు తుప్పు పట్టి శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిలో జీపు, టిప్పర్, లారీ, మినీ లారీ ఉన్నాయి.
తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన జీపు మరమ్మతులకు గురైంది. దీంతో షెడ్‌లో వేసి తాళం వేశారు.
కురిచేడులో..
కురిచేడు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రమే వాహనం ఉంది. అయితే దీన్ని ఎన్నడూ బయటకు తీసిన దాఖలాలు లేవు.
కందుకూరులో..
డంపింగ్‌యార్డుకు డంపర్ బిన్లను తరలించేందుకు రూ. 14 లక్షలు ఖర్చుచేసి గతంలో డంపర్ ప్లేసర్‌ను కొనుగోలు చేశారు. రెండు, మూడు నెలలు మాత్రమే పనిచేసిన వీటిని వదిలేశారు. జీపు కూడా అదే స్థితికి చేరింది. ఈ రెండు వాహనాలు పాత ఇనుప సామాను వాళ్లకు వేసుకునేందుకు తప్ప మరెందుకూ పనికొచ్చేట్లు లేవు. వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి జీపు కూడా మరమ్మతులకు గురవడంతో మూలనపడేశారు. ఉలవపాడు ఎంపీడీఓ కార్యాలయంలోని జీపు అటకెక్కి చాలా కాలమైంది.
కనిగిరిలో..
కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో 15 ఏళ్ల నుంచి తహసీల్దార్ జీపు మూలనపడింది. ఇరిగేషన్ కార్యాలయాలకు రెండు టిప్పర్లు, రెండు రోలర్లు, రెండు జీపులు ఉన్నాయి. రోలర్లను వేలంపాటద్వారా అమ్మిన అధికారులు వాహనాలు అమ్మలేదు. దీంతో అవి మూలనపడి తుప్పు పడుతున్నాయి. వెలిగండ్ల ఎంపీడీఓ కార్యాలయానికి చెందిన ప్రభుత్వ వాహనం మూలనపడింది.
అద్దంకిలో..
సంతమాగులూరులో సమితికాలం నాటి బీడీఓ వాహనం మూలనపడింది. ప్రాథమిక వైద్యకేంద్రంలో వాహనం డీజిల్‌కు నిధులు లేక నాలుగేళ్లుగా నిరుపయోగంగా మారింది. డ్రైవర్‌ను ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు చెల్లిస్తున్నారు. నాగార్జున సాగర్ కాలువల సంతమాగులూరు సబ్‌డివిజన్ కార్యాలయంలోని డీఈఈకి కేటాయించిన వాహనం తుప్పుపట్టి అందులోని పరికరాలు చోరీకి గురైనా పట్టించుకునే నాథుడే లేడు. అద్దంకిలో తహసీల్దార్‌కు కేటాయించిన వాహనం కూడా మూలనపడేశారు.
మార్కాపురంలో..
మార్కాపురంలో సహాయ వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద, తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు జీపులు నిరుపయోగంగా శిథిలావస్థకు చేరాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద ట్రాక్టర్లు, ఆటోలు కొన్ని నిరుపయోగ ంగా ఉన్నాయి. పొదిలిలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఆర్‌అండ్‌బీ కార్యాలయాల వద్ద ప్రభుత్వ వాహనాలు మూలనపడ్డాయి.
యర్రగొండపాలెంలో..
యర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా రెండు వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. త్రిపురాంతకం మండలంలో ఎన్‌ఎస్‌పీకి కేటాయించిన రెండు వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిలో ఒక వామనం పూర్తిగా మూలనపడింది. పెద్దదోర్నాల మండలంలో అటవీశాఖకు చెందిన వాహనం మరమ్మతులకు గురై నిరుపయోగంగా ఉంది.
చీరాలలో..
చీరాల మున్సిపల్ కమిషనర్‌కు సంబంధించిన జీపు కొన్నేళ్ల క్రితం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిప్పు పెట్టడంతో దగ్ధమైంది. చెత్తా చెదారాలను డంపింగ్‌యార్డుకు తరలించే ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు మరమ్మతులకు గురై అక్కడే ఉన్నాయి.
పర్చూరులో..
మార్టూరు మండలంలోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం ఆవరణలో ఎన్నో ఏళ్ల నుంచి కార్యాలయానికి చెందిన జీపు మరమ్మతులకు గురై పూర్తిగా శిథిలావస్థకు చేరింది.
ప్రభుత్వ వాహనాలకు నిర్లక్ష్యపు తుప్పు
Published Mon, Jan 13 2014 3:26 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement