'శిక్షణ' కాలం.. సర్కారు కొలువుల కోసం సిద్ధమవుతున్న యువత | Telangana Youth Preparing For Govt Jobs Training In Institutes | Sakshi
Sakshi News home page

'శిక్షణ' కాలం.. సర్కారు కొలువుల కోసం సిద్ధమవుతున్న యువత

Published Thu, Jan 26 2023 8:10 AM | Last Updated on Thu, Jan 26 2023 2:49 PM

Telangana Youth Preparing For Govt Jobs Training In Institutes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా ప్రభుత్వ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు వెలువడటం, మరికొన్ని పోస్టులకూ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోచింగ్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఇటీవలే డిగ్రీ పూర్తిచేసిన వారి నుంచి ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారిదాకా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా జాబ్‌ కొట్టాలన్న లక్ష్యంతో వ్యక్తిగతంగా సిద్ధమవడం కంటే కోచింగ్‌ సెంటర్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో తెరిచిన చిన్నపాటి శిక్షణ కేంద్రాలు మొదలు.. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత కోచింగ్‌ సెంటర్ల దాకా అన్నీ అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. కొందరు నిర్దిష్ట సబ్జెక్టులను ఎంచుకుని శిక్షణ తీసుకుంటుండగా.. మరికొందరు ప్యాకేజీ రూపంలో అన్నిరకాల కోచింగ్‌ పొందుతున్నారు. ఈ అవసరాలను గుర్తిస్తున్న కోచింగ్‌ సెంటర్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. 

ఆదరాబాదరాగా తరగతులు..
చాలాచోట్ల గ్రూప్‌–1 మెయిన్స్‌ శిక్షణ ఇప్పటికే ప్రారంభమైంది. మా ఇన్‌స్టిట్యూట్‌లో దాదాపు 40 శాతం సిలబస్‌ పూర్తిచేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. వాస్తవానికి వేగంగా సిలబస్‌ పూర్తి చేయాలన్న తొందర కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహ కుల్లో కనిపిస్తోంది. ఆదరాబాదరాగా సిలబస్‌ పూర్తి చేస్తున్నట్టు అనిపిస్తోంది. పరీక్షలు ప్రారంభమయ్యే వరకు శిక్షణ ఇస్తామని, రివిజన్‌ కూడా ఉంటుందని అంటున్నారు.
– పి.అనూష,గ్రూప్‌–1 మెయిన్స్‌ అభ్యర్థి

లోతైన అవగాహన అవసరం
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు ప్రత్యేక కోచింగ్‌ ఏమీ తీసుకో లేదు. మెయిన్స్‌ కోసం వారం రోజులుగా శిక్షణ æకేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఫీజు అధికంగా చెప్తుండటంతో కాస్త ఆలోచనలో పడ్డాను. రెండు సబ్జెక్టులకు నిపుణుల వద్ద శిక్షణ తీసుకుంటున్నా.. పూర్తిస్థాయి శిక్షణకు కోచింగ్‌ కేంద్రాల కోసం చూ స్తున్నాను. చాలాచోట్ల లోతైన అవగాహన లేకుండా సాధారణ పద్ధతిలోనే శిక్షణ ఇస్తుండగా.. కొన్నిచోట్ల అంశాలను వివరిస్తూ చదువుకోవాలని సూచిస్తు న్నారు. ఏ విధానం సరైనదో అర్థంగాక గందరగోళంగా ఉంది.
– షెహనాజ్, గ్రూప్‌–1 మెయిన్స్‌ అభ్యర్థి 


ఎక్కువగా గ్రూప్‌–1 అభ్యర్థులు 
ప్రస్తుతం గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌.. మెయిన్స్‌ పరీక్షలకు 25 వేల మందిని ఎంపిక చేసింది. ఈ అభ్యర్థుల్లో 65 శాతం మంది కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నట్టు అంచనా. గ్రూప్‌–1 మెయిన్స్‌ శిక్షణ కోసం కోచింగ్‌ సెంటర్లు సగటున రూ.50 వేల ఫీజు వసూలు చేస్తున్నాయి. ప్రఖ్యాత కోచింగ్‌ సెంటర్లలో ఈ ఫీజు మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అడ్మిషన్లు పూర్తిచేసి శిక్షణ మొదలుపెట్టిన మెజారిటీ కోచింగ్‌ సెంటర్లు.. కొత్తగా అడ్మిషన్లు తీసుకోవడం లేదు. కొన్నిచోట్ల ఇంగ్లిష్‌ మీడియం శిక్షణ ప్రారంభిస్తామని చెప్తున్నప్పటికీ స్పష్టత లేదని అభ్యర్థులు అంటున్నారు. కొన్ని సెంటర్లు ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్‌లైన్‌ శిక్షణకు అనుమతిస్తున్నాయి. 

మెటీరియల్‌ కోసమూ ఖర్చు 
మరోవైపు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా చాలా కోచింగ్‌ సెంటర్లు ఎలాంటి స్టడీ మెటీరియల్‌ ఇవ్వడం లేదు. దీనితో అభ్యర్థులు బయటే కొనుక్కోవాల్సి వస్తోంది. గ్రూప్‌–1 మెయిన్స్‌ మెటీరియల్‌ కోసం ఒక్కో అభ్యర్థి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేస్తుండగా.. గ్రూప్‌–2, ఇతర పరీక్షల మెటీరియల్‌ కోసం రూ.10 వేల నుంచి రూ.18వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదనంగా నోట్స్‌ కోసం మరో రూ.5 వేల వరకు వ్యయం అవుతోంది.

సబ్జెక్టుల వారీ శిక్షణకూ డిమాండ్‌ 
గ్రూప్‌–2, గ్రూప్‌–3 కేటగిరీల్లో 2వేలకుపైగా ఉద్యోగ ఖాళీలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రూప్‌–4 కేటగిరీలో అయితే 8 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో గ్రూప్‌–2కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు గ్రూప్‌–3తో పాటు గ్రూప్‌–4 కొలువులకూ కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఒకే తరహా సిలబస్‌ అన్నింటికీ వర్తించనుండటమే దీనికి కారణం. ప్రధాన శిక్షణ కేంద్రాలు కూడా గ్రూప్‌–2 శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.

గ్రూప్‌–2 శిక్షణలో అన్ని సబ్జెక్టులకు ప్యాకేజీ రూపంలో సగటున రూ.25 వేల మేర ఫీజు వసూలు చేస్తుండగా.. కొన్నిచోట్ల రూ.30–40 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫీజులు ఎక్కువగా ఉండటంతో కొందరు అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా శిక్షణ తీసుకుంటున్నారు. ప్రధాన కేంద్రాలు మినహా మిగతాచోట్ల ఇలా సబ్జెక్టు వారీ శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు.
చదవండి: సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement