ఇస్లామాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూడవద్దని సర్కారీ కొలువులు లేవని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో కీలక మంత్రి ఫవాద్ చౌధరి స్పష్టం చేశారు. పాలక పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఎన్నికల హామీకి విరుద్ధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కోసం ప్రభుత్వం నుంచి ఆశలు పెట్టుకోవద్దని తేల్చిచెప్పారు. ఇంజనీరింగ్ సంస్థల డీన్స్ అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పాక్ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని చేతులెత్తేశారు. పాకిస్తాన్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కుచించుకుపోతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రజలు గ్రహించడం ముఖ్యమని, మనం ఉద్యోగాల కోసం ప్రభుత్వం వైపు చూస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని అన్నారు. 1970 ప్రాంతాల్లో ప్రభుత్వం ఉద్యోగాలు సమకూరుస్తుందనే వైఖరి ఉండేదని, ఇప్పుడు ప్రైవేటు రంగం ఉపాథి అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment