ఏపీలో కొలువుల జాతర... 1,26,728 పోస్టులకు నోటిఫికేషన్లు | 126728 Notifications for Replacement of Posts in Village and Ward Secretariats | Sakshi
Sakshi News home page

1,26,728 గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

Published Sat, Jul 27 2019 4:17 AM | Last Updated on Sat, Jul 27 2019 2:45 PM

126728 Notifications for Replacement of Posts in Village and Ward Secretariats - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్‌ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి. శనివారం ఉ.11 గంటల నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థను కొత్తగా ఏర్పాటుచేసి, ప్రతి సచివాలయంలో పనిచేసేందుకు 10 నుంచి 12 మంది చొప్పున నియమించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేస్తున్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్‌ తదితర 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ మొత్తం 22 రకాల ఉద్యోగాలను సర్కారు భర్తీచేస్తుంది.

మూడు ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా..
కాగా, ఆయా ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి అన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు  gramasachivalayam. ap. gov. in,   vsws. ap. gov. in,  wardsachivalayam. ap. gov. in అనే మూడు ప్రత్యేక వెబ్‌సైట్లను సిద్ధంచేశారు. శనివారం ఉ.11 గంటల నుంచి ఇవి దరఖాస్తుదారులకు అందుబాటులోకి వస్తాయని పంచాయతీరాజ్, పట్టణాభివృద్ది శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారం, 22 రకాల ఉద్యోగాలకు వేర్వేరుగా ఏ ఉద్యోగానికి ఏయే విద్యార్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ వంటి వివరాలను ఆయా వెబ్‌సైట్లలోనే అందుబాటులో ఉంచుతారు. 

రెండంచెల పరీక్ష విధానం..
అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి రెండంచెల పరీక్ష విధానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేయడం కోసం భర్తీచేసే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు, వేల్పేర్‌ మరియు ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఉదయం 75 మార్కులకు జనరల్‌ నాలెడ్జిలో, సాయంత్రం 75 మార్కులకు రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. అలాగే, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్, విలేజీ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, విలేజీ హార్టికల్చర్‌ అసిస్టెంట్, విలేజీ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఉదయం 50 మార్కులకు జనరల్‌ నాలెడ్జిపై.. సాయంత్రం వంద మార్కులకు రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీతో పాటు ఆయా ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై పరీక్ష ఉంటుంది. 

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వెయిటేజీ
కాగా, ఇప్పటికే ఆయా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది.  


9,359 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ కూడా.
ఇదిలా ఉంటే.. 9,359 ఎనర్జీ అసిస్టెంట్‌ (లైన్‌మెన్‌) ఉద్యోగాల భర్తీకి కూడా  వేరుగా నోటిఫికేషన్‌ రానుంది. విద్యుత్‌ డిస్కంలు దీనిని జారీచేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు 5,573 గ్రామ ఎనర్జీ అసిస్టెంట్‌ పోస్టులను, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 3,786 వార్డు ఎనర్జీ సెక్రటరీ పోస్టులను డిస్కంలు వేరుగా భర్తీచేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామక నిబంధనలకు, డిస్కం ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల తీరు వేర్వేరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నోటిఫికేషన్‌ కూడా ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

గ్రామ సచివాలయాల సంఖ్య పెంపునకు ప్రతిపాదన
మొదట 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయాలని సర్కారు నిర్ణయించగా.. తాజాగా ఆ సంఖ్యను 11,158కు పెంచాలని కోరుతూ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ శుక్రవారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప, కర్నూలు జిల్లాలో మొదట ప్రతిపాదించిన వాటి కన్నా కొన్ని అదనంగా గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement